central Commerce Ministry
-
ఔషధ ఎగుమతులు @10 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఔషధ ఎగుమతులకు యూఎస్, యూరప్ కీలక మార్కెట్లుగా నిలుస్తున్నా యి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్ట్) ఫార్ములేషన్స్, బయోలాజికల్స్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 10.8% పెరిగి 9.42 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సర్జికల్ ఉత్పత్తుల ఎగుమతులు 3.3% వృద్ధితో 0.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యా యి. ఈ గణాంకాలను కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఫార్మా మార్కెట్లో విశ్వసనీయమైన సరఫరాదారుగా భారత్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నట్టు ఈ డేటా స్పష్టం చేస్తోంది. ‘‘పా ర్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, బయోలాజికల్ ఉత్పత్తుల్లో అంతర్జాతీయంగా భారత్ స్థానం పటిష్టమవుతోంది. అంతర్జాతీయంగా జనరిక్స్, వినూత్నమైన చికిత్సలకు డిమాండ్ పెరగడంతోపాటు, భారత్‌లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ ఇందుకు మద్దతుగా నిలుస్తోంది’’అని వివరించింది. వివిధ దేశాలకు ఎగుమతులు ఇలా.. → భారత్ నుంచి ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 39% అమెరికాకు వెళ్లా యి. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 3.69 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత కంపెనీలు అమెరికాకు షిప్ చేశాయి. అమెరికాలో జనరిక్స్, ప్రాణాలను రక్షించే ఔషధాలకు డిమాండ్ పెరుగుతుండడం కలిసొస్తోంది. → అమెరికా తర్వాత యూకేకు అత్యధికంగా 316.2 మిలియన్ డాలర్ల విలువైన ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఎగుమతులు నమోదయ్యాయి. యూకే వాటా 3.4 శాతంగా ఉంది. దక్షిణాఫ్రికాకు 268 మిలియన్ డాలర్లు (2.8 శాతం), ఫ్రాన్స్‌కు 243 మిలియన్ డాలర్లు (2.6 శాతం), కెనడాకు 197 మిలియన్ డాలర్లు (2.1 శాతం) విలువ చేసే ఔషధ ఫార్ములేషన్లు, బయోలాజికల్స్ ఎగుమతయ్యాయి. → మధ్యప్రాచ్యంలో ఇరాక్‌కు 86.5 మిలియన్ డా లర్ల విలువ చేసే ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు ఎగుమతి చేశాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఎగుమతులు 43.5 మిలియన్ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి. → నాణ్యతా ప్రమాణాలతో కూడిన భారత సర్జికల్ ఉత్పత్తులకు సైతం అంతర్జాతీ య మార్కెట్లో ఆదరణ అధికమవుతోంది. గడిచిన ఐదేళ్ల నుంచి ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2019–20లో 0.45 బిలియన్ డా లర్ల ఎగుమతులు నమోదు కాగా, 2023 –24లో ఇవి 0.70 బిలియన్ డాలర్లకు పెరిగాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత్ నుంచి ఎగుమతి అయిన సర్జికల్ ఉత్పత్తుల్లో 53 మిలియన్ డాలర్లు (18.1 శాతం) యూఎస్‌కే వెళ్లాయి. జర్మనీకి 13.5 మిలియన్ డాలర్లు (4.6 శాతం), బ్రిటన్‌కు 13.4 మిలియన్ డాలర్ల చొప్పున సర్జికల్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. -
ELECRAMA 2023: ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయండి
నోయిడా: అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ సంస్థలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అలాగే వర్ధమాన దేశాలే కాకుండా సంపన్న మార్కెట్లనూ లక్ష్యంగా చేసుకోవాలని పేర్కొన్నారు. ఎలెక్‌రమా 2023 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నేరుగా సంపన్న దేశాల మార్కెట్లలోకి వెళ్లి భారతదేశ సామర్థ్యాలను చాటి చెప్పాలని తయారీ సంస్థలకు మంత్రి సూచించారు. కోవిడ్–19 మహమ్మారి తర్వాత విశ్వసనీయ భాగస్వాములతోనే కలిసి పని చేయడం ఎంత ముఖ్యమో యావత్ ప్రపంచం గుర్తెరిగిందని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలు లావాదేవీలు జరిపేటప్పుడు పారదర్శకత, సమగ్రత, నిజాయితీని కోరుకుంటున్నాయని గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో బంగారంలాంటి అవకాశాన్ని వదులుకోకుండా సత్వరం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
100 రోజుల యాక్షన్ ప్లాన్
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల రీఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం ద్వారా ఎగుమతులకు తోడ్పాటునిచ్చే దిశగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతుల వృద్ధికి ఇది తోడ్పడగలదని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ మే 30న కొలువు తీరే కొత్త ప్రభుత్వానికి రూపొందించిన 100 రోజుల ఎజెండాలో ఈ మేరకు 10 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ అమలు చేస్తున్న ఎంఈఐఎస్ పథకం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం అవసరమవుతోందని వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీన్ని కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల పథకంగా వ్యవహరించే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రకారం.. ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో వినియోగించిన ముడివస్తువులపై విధించే అన్–రిబేటెడ్ పన్నులు, సుంకాల సత్వర రీఫండ్‌కు కొత్త స్కీమ్ ఉపయోగపడనుంది. రవాణాకు ఉపయోగించే ఇంధనంపై సెంట్రల్ ఎక్సై జ్ సుంకం/రాష్ట్ర వ్యాట్, మండీ పన్ను, ఎగుమతి పత్రాలపై స్టాంపు డ్యూటీ మొదలైనవి అన్–రిబేటెడ్ పన్నులు, సుంకాల పరిధిలోకి వస్తాయి. ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకం.. ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకాన్ని కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, హై–టెక్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజ్‌లు, ఫార్మా తదితర రంగ సంస్థలతో దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేసే అవకాశం ఉందని అధికారి వివరించారు. సర్వీసుల రంగం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 1న కొత్తగా పంచవర్ష విదేశీ వాణిజ్య విధానాన్ని (2020–2025) కూడా ప్రకటించాలని పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికలో వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత పాలసీ గడువు మార్చి 2020 నాటికి ముగుస్తుంది. ఇటు ఆర్థిక వృద్ధి అటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా ఎగుమతులను ప్రోత్సహించేందుకు సంబంధించి ఈ విధానంలో మార్గదర్శకాలు ఉంటాయి. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని కీలక పథకాలను కొనసాగించడంతో పాటు కొత్తగా కొన్ని ఎగుమతి పథకాలను కూడా కొత్త విధానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారి వివరించారు. మరికొన్ని ప్రతిపాదనలు.. వ్యవసాయ రంగానికి సంబంధించి డబ్ల్యూటీవోతో వివాదాస్పద అంశాల పరిష్కారం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్ఈజెడ్)లను పునరుద్ధరించేందుకు చర్యలు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానం అమలు, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌కు విస్తృత ప్రచారం కల్పించడం, జాతీయ లాజిస్టిక్స్ విధానం అమలు తదితర ప్రతిపాదనలు కూడా వాణిజ్య శాఖ చేసింది. సెజ్‌ల విషయానికొస్తే.. అన్ని సెజ్‌ల ఆర్థిక, పాలనాపరమైన విధానాల్లో ఏకరూపత తీసుకురావడం, కొత్త పెట్టుబడుల అభ్యర్థనల ప్రాసెసింగ్ కోసం సమీకృత ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం, నిబంధనలపరమైన వెసులుబాట్లు కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. సెజ్‌లలో పెట్టుబడులను ఆకర్షించడానికి, తయారీ.. ఎగుమతులను ప్రోత్సహించడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారి పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలు, అంతర్జాతీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లకు అనుకూలంగా కొత్త సెజ్ విధానం ఉండాలని ఆయన తెలిపారు. విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు.. ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం వియత్నాంతో దీటుగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చిన పక్షంలో భారత్ ఏటా 100 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు చట్టపరమైన మార్పులతో ఉపాధి కల్పన వ్యూహాలను రూపొందించడం, సానుకూల పన్నుల విధానాలు, సముచితంగా సహజ వనరుల కేటాయింపులు, చిన్న వ్యాపార సంస్థలకు తోడ్పాటు, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డీపీఐఐటీ ప్రతిపాదించింది. ప్రతిపాదనల్లోని కొన్ని విశేషాలు.. సానుకూల పన్నుల విధానం అమలు దిశగా.. పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు, విద్యుత్ వంటివాటిని కూడా వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)లోకి చేర్చాలని డిపార్ట్మెంట్ సిఫార్సు చేసింది. వ్యాపార సంస్థల విస్తరణ ప్రణాళికలకు పెద్ద అవరోధాలుగా ఉంటున్న కఠిన కార్మిక చట్టాలను సడలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పార్ట్‌టైమ్, ఫ్రీలాన్స్ ఉపాధి మార్గాలను కూడా కొత్త ఉద్యోగాల కేటగిరీలోకి చేర్చడం ద్వారా వ్యాపారాల నిబంధనలను సరళతరం చేయాలని డీపీఐఐటీ ప్రతిపాదించింది. 6.5 కోట్ల మంది చిన్న వ్యాపారస్తులకు తోడ్పాటునిచ్చేలా జాతీయ రిటైల్ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిన్న సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి, అవి మరింత పోటీతత్వంతో పనిచేయడానికి తోడ్పాటునిచ్చేందుకు చర్యలు ఉండాలని డీపీఐఐటీ పేర్కొంది. -
పన్నెండో నెలా.. ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమనం, క్రూడాయిల్ ధరల పతనం తదితర పరిణామాల నేపథ్యంలో వరుసగా పన్నెండో నెలా ఎగుమతులు క్షీణించాయి. నవంబర్‌లో పావు వంతు పడిపోయి 20.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో 26.48 బిలియన్ డాలర్ల ఎగుమతుల విలువతో ప్రస్తుతం 24.43 శాతం తగ్గినట్లయింది. మరోవైపు, దిగుమతులు మరింతగా తగ్గాయి. గతేడాది నవంబర్‌లో దిగుమతుల విలువ 42.72 బిలియన్ డాలర్లు కాగా తాజాగా గత నెలలో ఇవి 30 శాతం క్షీణించి 29.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 16.23 బిలియన్ డాలర్ల నుంచి 9.78 బిలియన్ డాలర్లకు తగ్గింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో వాణిజ్య లోటు 102.50 బిలియన్ డాలర్ల నుంచి 87.54 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు, అంతర్జాతీయంగా మందగమనంతో రేట్ల తగ్గుదల వల్ల ఎగుమతులు విలువపరంగానే తగ్గాయి తప్ప పరిమాణం ప్రకారం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. తగ్గిన పసిడి దిగుమతులు.. అంతర్జాతీయంగా రేట్లు తగ్గడంతో విలువ పరంగా పసిడి దిగుమతులు 36 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో దిగుమతి చేసుకున్న బంగారం విలువ 3.53 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది నవంబర్‌లో భారత్ 5.57 బిలియన్ డాలర్ల పసిడిని దిగుమతి చేసుకుంది. అటు వెండి దిగుమతులు 55 శాతం క్షీణించి 285.01 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
పసుపు పంటకు బోర్డు ఏర్పాటు చేయండి
కేంద్ర వాణిజ్య మంత్రికి ఎంపీ కవిత వినతి న్యూఢిల్లీ: పసుపు రైతులకు ప్రయోజనం కలిగించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిజామాబాద్ ఎంపీ కవిత గురువారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి విజ్ఞప్తిచేశారు. తెలంగాణలో పండుతున్న ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు కూడా ఒకటని, అయితే ఈ పంటను శాస్త్రీయ పద్ధతుల్లో పండించేందుకు తగిన మెలకువలు గానీ, ఇతరత్రా సహకారం గానీ రైతులకు అందడం లేదని పేర్కొన్నారు. రైతులు కేవలం స్థానిక విత్తనాలు, రకాలపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ పంట పండిస్తున్నవారిలో ఎక్కువ భాగం చిన్న, సన్నకారు రైతులేనని వివరించారు. ఇతర సుగంధ ద్రవ్య పంటలకు అందే ఇన్పుట్ సబ్సిడీ ఈ ముఖ్యమైన పంటకు మాత్రం ఇవ్వడం లేదని మంత్రికి చెప్పారు. శాస్త్రీయ పద్ధతులు తెలియక రైతులు భారీగా పంట నష్టపోతున్నారని, ఈ పంటను ప్రాసెసింగ్ చేసే సౌకర్యాలు తెలంగాణలో ఎక్కడా లేవని వివరించారు. ప్రస్తుతం పసుపు పంట స్పైసెస్ బోర్డు పరిధిలో ఉందని, ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని విన్నవించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ‘పసుపుపై తగినంత పరిశోధనలు జరగడంలేదు. ఈ పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలని నిర్మలా సీతారామన్‌ను కలిశాం. మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు.