పన్నెండో నెలా.. ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమనం, క్రూడాయిల్ ధరల పతనం తదితర పరిణామాల నేపథ్యంలో వరుసగా పన్నెండో నెలా ఎగుమతులు క్షీణించాయి. నవంబర్‌లో పావు వంతు పడిపోయి 20.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో 26.48 బిలియన్ డాలర్ల ఎగుమతుల విలువతో ప్రస్తుతం 24.43 శాతం తగ్గినట్లయింది. మరోవైపు, దిగుమతులు మరింతగా తగ్గాయి.
గతేడాది నవంబర్‌లో దిగుమతుల విలువ 42.72 బిలియన్ డాలర్లు కాగా తాజాగా గత నెలలో ఇవి 30 శాతం క్షీణించి 29.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 16.23 బిలియన్ డాలర్ల నుంచి 9.78 బిలియన్ డాలర్లకు తగ్గింది.
కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో వాణిజ్య లోటు 102.50 బిలియన్ డాలర్ల నుంచి 87.54 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు, అంతర్జాతీయంగా మందగమనంతో రేట్ల తగ్గుదల వల్ల ఎగుమతులు విలువపరంగానే తగ్గాయి తప్ప పరిమాణం ప్రకారం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు.
తగ్గిన పసిడి దిగుమతులు..
అంతర్జాతీయంగా రేట్లు తగ్గడంతో విలువ పరంగా పసిడి దిగుమతులు 36 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో దిగుమతి చేసుకున్న బంగారం విలువ 3.53 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది నవంబర్‌లో భారత్ 5.57 బిలియన్ డాలర్ల పసిడిని దిగుమతి చేసుకుంది. అటు వెండి దిగుమతులు 55 శాతం క్షీణించి 285.01 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.