న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల రీఫండ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం ద్వారా ఎగుమతులకు తోడ్పాటునిచ్చే దిశగా ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయంగా కఠినతరమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగుమతుల వృద్ధికి ఇది తోడ్పడగలదని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ మే 30న కొలువు తీరే కొత్త ప్రభుత్వానికి రూపొందించిన 100 రోజుల ఎజెండాలో ఈ మేరకు 10 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ అమలు చేస్తున్న ఎంఈఐఎస్ పథకం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కొత్త స్కీమ్ ప్రవేశపెట్టడం అవసరమవుతోందని వాణిజ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
దీన్ని కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల పథకంగా వ్యవహరించే అవకాశం ఉందని వివరించారు. దీని ప్రకారం.. ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో వినియోగించిన ముడివస్తువులపై విధించే అన్–రిబేటెడ్ పన్నులు, సుంకాల సత్వర రీఫండ్‌కు కొత్త స్కీమ్ ఉపయోగపడనుంది. రవాణాకు ఉపయోగించే ఇంధనంపై సెంట్రల్ ఎక్సై జ్ సుంకం/రాష్ట్ర వ్యాట్, మండీ పన్ను, ఎగుమతి పత్రాలపై స్టాంపు డ్యూటీ మొదలైనవి అన్–రిబేటెడ్ పన్నులు, సుంకాల పరిధిలోకి వస్తాయి.
ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకం..
ఉత్పత్తి ఆధారిత మద్దతు పథకాన్ని కూడా వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, హై–టెక్ ఇంజనీరింగ్, మెడికల్ డివైజ్‌లు, ఫార్మా తదితర రంగ సంస్థలతో దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ చర్చలు జరుపుతోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేసే అవకాశం ఉందని అధికారి వివరించారు. సర్వీసుల రంగం నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 1న కొత్తగా పంచవర్ష విదేశీ వాణిజ్య విధానాన్ని (2020–2025) కూడా ప్రకటించాలని పది సూత్రాల కార్యాచరణ ప్రణాళికలో వాణిజ్య శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుత పాలసీ గడువు మార్చి 2020 నాటికి ముగుస్తుంది. ఇటు ఆర్థిక వృద్ధి అటు ఉపాధి కల్పనకు ఊతమిచ్చేలా ఎగుమతులను ప్రోత్సహించేందుకు సంబంధించి ఈ విధానంలో మార్గదర్శకాలు ఉంటాయి. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని కీలక పథకాలను కొనసాగించడంతో పాటు కొత్తగా కొన్ని ఎగుమతి పథకాలను కూడా కొత్త విధానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారి వివరించారు.
మరికొన్ని ప్రతిపాదనలు..
వ్యవసాయ రంగానికి సంబంధించి డబ్ల్యూటీవోతో వివాదాస్పద అంశాల పరిష్కారం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్)లను పునరుద్ధరించేందుకు చర్యలు, వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానం అమలు, గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌కు విస్తృత ప్రచారం కల్పించడం, జాతీయ లాజిస్టిక్స్ విధానం అమలు తదితర ప్రతిపాదనలు కూడా వాణిజ్య శాఖ చేసింది. సెజ్‌ల విషయానికొస్తే.. అన్ని సెజ్‌ల ఆర్థిక, పాలనాపరమైన విధానాల్లో ఏకరూపత తీసుకురావడం, కొత్త పెట్టుబడుల అభ్యర్థనల ప్రాసెసింగ్ కోసం సమీకృత ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం, నిబంధనలపరమైన వెసులుబాట్లు కల్పించడం వంటి అంశాలు ఉన్నాయి. సెజ్‌లలో పెట్టుబడులను ఆకర్షించడానికి, తయారీ.. ఎగుమతులను ప్రోత్సహించడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారి పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలు, అంతర్జాతీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్లకు అనుకూలంగా కొత్త సెజ్ విధానం ఉండాలని ఆయన తెలిపారు.
విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు..
ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ప్రతిపాదించింది. ఈ మేరకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం వియత్నాంతో దీటుగా ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చిన పక్షంలో భారత్ ఏటా 100 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించగలదని అంచనాలు ఉన్నాయి. దీనితో పాటు చట్టపరమైన మార్పులతో ఉపాధి కల్పన వ్యూహాలను రూపొందించడం, సానుకూల పన్నుల విధానాలు, సముచితంగా సహజ వనరుల కేటాయింపులు, చిన్న వ్యాపార సంస్థలకు తోడ్పాటు, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డీపీఐఐటీ ప్రతిపాదించింది.
ప్రతిపాదనల్లోని కొన్ని విశేషాలు..
- సానుకూల పన్నుల విధానం అమలు దిశగా.. పెట్రోలియం ఉత్పత్తులు, సహజ వాయువు, విద్యుత్ వంటివాటిని కూడా వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ)లోకి చేర్చాలని డిపార్ట్‌మెంట్ సిఫార్సు చేసింది.
- వ్యాపార సంస్థల విస్తరణ ప్రణాళికలకు పెద్ద అవరోధాలుగా ఉంటున్న కఠిన కార్మిక చట్టాలను సడలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పార్ట్‌టైమ్, ఫ్రీలాన్స్ ఉపాధి మార్గాలను కూడా కొత్త ఉద్యోగాల కేటగిరీలోకి చేర్చడం ద్వారా వ్యాపారాల నిబంధనలను సరళతరం చేయాలని డీపీఐఐటీ ప్రతిపాదించింది.
- 6.5 కోట్ల మంది చిన్న వ్యాపారస్తులకు తోడ్పాటునిచ్చేలా జాతీయ రిటైల్ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
- చిన్న సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి, అవి మరింత పోటీతత్వంతో పనిచేయడానికి తోడ్పాటునిచ్చేందుకు చర్యలు ఉండాలని డీపీఐఐటీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment