న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. 2022 ఇదే నెలతో పోల్చితే ఎగుమతులు 6.58 శాతం తగ్గి, 32.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు దీనికి నేపథ్యం. గడచిన 10 నెలలుగా ఇంజనీరింగ్ గూడ్స్, ముడి ఇనుము, ప్లాస్టిక్, రత్నాలు–ఆభరణాల రంగాలు క్షీణ రేటులో ఉన్నాయి.
10 నెలల్లో...
ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 21.89 శాతం పెరిగి 602.20 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు ఈ కాలంలో 233 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లుపైబడగా, 2022–23లో కూడా దాదాపు ఇదే గణాంకాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా సమీక్షా కాలం 10 నెలల్లో క్రూడ్ దిగుమతుల విలువ 53.54 శాతం పెరిగి 178.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
దిగుమతులూ క్షీణతే..
దిగుమతులు కూడా జనవరిలో 3.63 శాతం క్షీణించాయి. విలువలో 50.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి దిగుమతులు ఏప్రిల్–జనవరి మధ్య 11.26% తగ్గి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాణిజ్యలోటు 12 నెలల కనిష్టం
ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు జనవరిలో 12 నెలల కనిష్టంగా 17.75 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
రష్యా నుంచి 384 శాతం పెరిగిన దిగుమతులు
2022–23 ఏప్రిల్–జనవరి మధ్య రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏకంగా 384 శాతం పెరగడం గమనార్హం. విలువలో ఏకంగా 37.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. క్రూడ్ ఈ విలువలో కీలక వెయిటేజ్ పొందింది. 2021–22లో 9.86 బిలియన్ డాలర్ల దిగుమతులతో రష్యా భారత్‌కు 18వ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. తాజా సమీక్షా నెల్లో ఈ అంకె 4కు తగ్గిపోయింది.
ఆర్థిక మంత్రి సూచనలు..
అంతర్జాతీయంగా మందగమనం వచ్చే అవకాశాలను, తమ తమ వ్యాపారాలపై దాని ప్రభావాల గురించి ఎగుమతిదారులు ముందస్తుగానే అంచనాలు వేసుకుని సన్నద్ధంగా ఉండాలని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని పేర్కొన్నారు.
రూపాయిలో వాణిజ్యానికి ఆసక్తి
భారత్‌తో రూపాయిలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు పలు దేశాల్లో ఆసక్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు వీలుగా పలు బ్యాంకులు ప్రత్యేక వ్యాస్టో అకౌంట్లను ప్రారంభిస్తున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) సంతోష్ కుమార్ పేర్కొన్నారు. అకౌంట్లు ప్రారంభించిన జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యుకో బ్యాంక్‌సహా 20 బ్యాంకులు ఉన్నట్లు ఆయన తెలిపారు. రష్యాసహా రూపాయిలో ట్రేడింగ్‌కు ఆసక్తి చూపిస్తున్న దేశాల్లో కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్‌లు కూడా వీటిలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో ఆ దేశంపై అంతర్జాతీయ ఆంక్షలు, దీనితో డాలర్ మారకంలో వాణిజ్యంలో ఇబ్బందులు వంటి పరిణామాలు రూపాయిలో వాణిజ్యానికి దారితీసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment