న్యూఢిల్లీ: ఎగుమతి, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న నౌకా రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా పోర్టుల్లో కొన్ని రకాల చార్జీలు తగ్గించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) ద్వారా ఐదు సెకండ్ హ్యాండ్ కంటెయినర్ వెసెల్స్ (సరుకులు, ఉత్పత్తుల రవాణాకు ఉపయోగించే) కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య, పరిశ్రమలు, షిప్పింగ్, పోర్టులు, ఫైనాన్స్, పౌర విమానయాన, రైల్వే తదితర శాఖల సీనియర్ అధికారులు, ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో, కస్టమర్స్ అధికారులు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం తర్వాత కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. సమావేశం అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. ‘తాజాగా తీసుకున్న చర్యలు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే, ఖాళీ కంటెయినర్ల లభ్యత పెరుగుతుంది. సరుకులు వేగంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. పోర్టుల్లో రద్దీ గణనీయంగా తగ్గుతుంది’ అన్నారు.
చర్యలు ఇవీ..
» కార్గో రవాణా సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఎస్‌సీఐ అదనంగా 5 సెకండ్ హ్యాండ్ కంటెయినర్ నౌకలను కొనుగోలు చేస్తుంది.
» రైల్వే బోర్డు, కంటెయినర్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న కంటెయినర్లను యార్డులో 90 రోజుల పాటు చార్జీల్లేకుండా అందుబాటులో ఉంచుతా యి. 90 రోజుల తర్వాత రూ.3,000గా వసూ లు చేస్తున్న చార్జీని రూ.1,500కు తగ్గించారు.
» కంటెయినర్ సామర్థ్యాన్ని 9,000 టీఈయూల మేర పెంచుతున్నట్టు ఎస్‌సీఐ ప్రకటించింది.
» 40 అడుగుల కంటెయినర్‌కు రేట్లను రూ.9,000 నుంచి రూ.2,000కు తగ్గించారు. 20 అడుగుల కంటెయినర్ చార్జీలు రూ.6,000 నుంచి రూ.1,000కు దిగొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment