Imports of gold
-
భారత్ విదేశీ చెల్లింపుల సమతౌల్యం భేష్
ముంబై: భారత్ విదేశీ చెల్లింపుల సమతౌల్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువల నిష్పత్తిలో) పరిమితం అయ్యే అవకాశాలు, దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు, తక్కువ స్థాయి రుణ భారం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో చెల్లింపుల సమతౌల్య మిగులు 39 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ సంవత్సరం ఐదుసార్లు అమెరికా ఫెడ్ ఫండ్ రేటును తగ్గించే అవకాశం ఉందని అంచనా. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. దేశ విదేశీ సమతౌల్య పరిస్థితులకు ఇది మంచి పరిణామం (గోల్డిలాక్స్). ► పలు సానుకూల అంశాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరం భారత్ క్యాడ్ అంచనాను (ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చే విదేశీ మారకద్రవ్యం– దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం విలువల మధ్య నికర వ్యత్యాసం) క్రితం 1.3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తున్నాం. 2024–24 అంచనాలను 1.9 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గిస్తున్నాం. ► 2024లో క్రూడ్ బ్యారల్ ఆయిల్ 90 డాలర్ల పైన ఉంటుందన్న తొలి అంచనాలను 81 డాలర్లకు తగ్గిస్తున్నాం. 2023 జనవరి–నవంబర్ కాలంలో చమురు దిగుమతుల విలువ 164 బిలియనడాలర్లు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 189 బిలియన్ డాలరు. తాజా సమీక్షా కాలంలో క్రూడ్ ధరలు 18 శాతం తక్కువగా ఉండడం కారణం. ►సేవల ఎగుమతుల కూడా క్రితం అంచనాలకన్నా ఎంతో బాగున్నాయి. ఆయా అంశాలు ఎకానమీ విదేశీ చెల్లింపుల పటిష్టతకు దోహదపడే అంశాలు. ►అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధానానికి శ్రీకారం చుట్టినప్పుడు, భారత్‌లోకి బలమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు జరుగుతాయి. జూన్ 2024 నుండి జేపీ మోర్గాన్ గ్లోబల్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్‌లో బాండ్లు చేర్చినుందున, బలమైన రుణ ప్రవాహాలకూ అవకాశం ఉంది. ప్రాంతీయ సప్లై చైన్ వైవిధ్యం నుండి ప్రయోజనం పొందడం కొనసాగుతుంది. దీనివల్ల దేశంలోకి అధిక విదేశీ ప్రత్యక్ష ప్రవాహాలు కొనసాగుతాయి. ►బంగారం దిగుమతులు 2022–23లో 37 బిలియన్ డాలర్లుకాగా, 2023–24లో 44 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. నవంబర్ వరకూ ఈ విలువ 39.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే క్రూడ్ ధరలు తగ్గుదల, సేవల ఎగుమతుల కారణంగా బంగారం దిగుమతుల భారం సర్దుబాటుకానుంది. ►మొత్తంగా ఎగుమతుల పరిస్థితులు స్థిరంగా ఉండే వీలుంది. చమురు, బంగారం యేతర దిగుమతులు మునుపటి అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువగానే ఉన్నాయి. ఎల్రక్టానిక్ వస్తువులు, యంత్రాల దిగుమతుల ఇందులో ప్రధానమైనవి. ►భారత్ విదేశీ మారకద్రవ్యనిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. కోవిడ్‌కు ముందు (9.5 నెలలకు మాత్రమే)కన్నా పరిస్థితి మెరుపడింది. 550 బిలియన్ డాలర్లపైగా 10 సంవత్సరాల కనిష్ట స్థాయిలో దేశ ఫారెక్స్ నిల్వలు కొనసాగడం హర్షణీయ పరిణామం. ►రూపాయి తక్కువ అస్థిరత ఉన్న కరెన్సీగా భావించవచ్చు. అయితే ‘గోల్డిలాక్స్‘ పరిస్థితులు ఉన్నప్పటికీ, రూపాయి పలు ఆసియా కరెన్సీలతో పోల్చితే దిగువస్థాయి పనితీరును ప్రదర్శించే అవకాశం ఉంది. రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో డాలర్లో రూపాయి మారకపు విలువ 83–82 శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. తరువాతి 12 నెలల్లో 81కి బలపడుతుందని అంచనా. -
మాకు బంగారం కావాలి! ఎగబడి పసిడిని కొంటున్న భారతీయులు
న్యూఢిల్లీ: కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నా స్థూలంగా కరోనా పట్ల ప్రజల్లో మునుపటి భయాలు తగ్గాయి. దాదాపు రెండేళ్లుగా పెళ్లిళ్లు, పేరంటాలు తదితర ఫంక్షన్లకు దూరంగా ఇండియన్లు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ మేరకు దిగుమతుల్లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 38 బిలియన్ డాలర్లు భారత్ పసిడి దిగుగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–డిసెంబర్ మధ్య భారీగా పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పరిమాణం 16.78 బిలియన్ డాలర్లు. 2021 డిసెంబర్లో 2020 డిసెంబర్‌తో పోల్చితే పసిడి దిగుమతులు 4.5 బిలియన్ డాలర్ల నుంచి 4.8 బిలియన్ డాలర్లకు చేరాయి. వెండి దిగుమతుల్లోనూ భారీ జంప్.. మరోవైపు వెండి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలంలో 762 మిలియన్ డాలర్ల నుంచి 2 బిలియన్ డాలర్లకు ఎగశాయి. కారణాలు ఇవీ.. దేశంలో కరోనా ప్రేరిత ఆంక్షలు తొలగడం, పండుగల, పెళ్లిళ్ల సీజన్లో కరోనా రహిత ఉత్సాహ వాతావరణం నెలకొనడం వంటి అంశాలు పసిడి, వెండి డిమాండ్ భారీ పెరగుదలకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో ఆభరణాల పరిశ్రమ కూడా లాభపడింది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 71 శాతం పెరిగి 29 మిలియన్ డాలర్ల విలువకు ఎగశాయి. భారత్ చైనా తర్వాత పసిడికి సంబంధించి అతిపెద్ద వినియోగ దేశంగా ఉంది. ఎకానమీపై ఎఫెక్ట్... పసిడి భారీ దిగుమతుల నేపథ్యంలో 2021–22 తొలి తొమ్మిది నెలల కాలంలో భారత్ మొత్తం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 61.38 బిలియన్ డాలర్ల నుంచి 142.44 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఫలితం కరెంట్ అకౌంట్‌పైనా కనిపిస్తోంది. భారత్ కరెంట్ అకౌంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) లోటులోకి జారిపోయింది. కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) రెండవ త్రైమాసికంలో 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిర్దిష్ట త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఈ పరిమాణం 1.3 శాతం. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించేదే కరెంట్ అకౌంట్. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులుగా పరిగణిస్తారు. వస్తువులు, సేవల ఎగుమతి–దిగుమతులు, అంతర్జాతీయంగా మూలధన బదలాయింపులు ఈ అకౌంట్ పరిధిలోకి వస్తాయి. చదవండి: బంగారంతో ట్రేడింగ్.. గోల్డ్ ఎక్సేంజీ ఏర్పాటులో కీలక అడుగులు -
పసిడి దిగుమతులు లాక్‘డౌన్’!
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై లాక్డౌన్ ప్రభావం తీవ్రంగా పడినట్లు కనబడుతోంది. అనధికార సమాచారం ప్రకారం, 2020 మేలో దిగుమతులు 99 శాతం పడిపోయాయి. కేవలం 1.3 టన్నుల దిగుమతులు మాత్రమే జరిగాయి. 2019 ఇదే నెలలో ఈ పరిమాణం 105.8 టన్నులు. ఏప్రిల్‌లోనూ దిగుమతుల పరిమాణం క్షీణించి కేవలం 60 కిలోగ్రాములుగా నమోదయ్యింది. గడచిన దశాబ్ద కాలంలో ఇంత కనిష్ట స్థాయిలో పసిడి దిగుమతులు జరగలేదు. కోవిడ్–19 భయాందోళన నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశం పూర్తి లాక్డౌన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈ యేడాది మే వరకూ గడచిన ఐదు నెలల్లో భారత్ పసిడి దిగుమతులు 80 శాతం పతనమై 75.46 టన్నులుగా నమోదయినట్లు ఒక వార్తా సంస్థ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. సెప్టెంబర్‌లోపు డిమాండ్ పేలవమే! కాగా, సెప్టెంబర్‌లోపు ఈ రంగంలో డిమాండ్ వచ్చే అవకాశాలు కనబడ్డం లేదని ఈ రంగంలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. పలు వర్గాలు ఆర్థికపరమైన ఒత్తిడిలో ఉండడం దీనికి ఒక కారణంకాగా, ఇప్పటికే ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండడం మరో కారణమని వారు పేర్కొంటున్నారు. ఇక కోవిడ్–19 సంబంధ ఆందోళనలు ఎప్పటికి సమసిపోతాయో చెప్పలేని పరిస్థితి ఉండడం మరో ప్రతికూల అంశమని వారు తెలుపుతున్నారు. తమ ఆభరణాల విభాగం నుంచి మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఆదాయం దాదాపు 6 శాతం పడిపోయినట్లు సోమవారంనాటి తన మార్చి త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా మార్కెట్ విలువలో భారత్‌లో అతిపెద్ద ఆభరణాల సంస్థ టైటాన్ కంపెనీ పేర్కొంది. ధరలు మరింత పైకి... ఇక పసిడి ధరను చూస్తే, భారీగా పడిపోయే అవకాశాలు ప్రస్తుతం ఏమీలేకపోగా, ఔన్స్ (31.1గ్రా) ధర రికార్డుస్థాయి 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5.2 శాతంలోకి జారిపోతుందన్న ప్రపంచబ్యాంక్ అంచనాలు దీనికి నేపథ్యం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు –7.0 శాతం క్షీణిస్తే, వర్థమాన దేశాల విషయంలో ఈ క్షీణ రేటు –2.5 శాతంగా ఉంటుందన్నది అంచనా. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలను స్టాండర్డ్ చార్టర్డ్ అంచనావేస్తోంది. ఇక దేశంలోనూ డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి. ఈ వార్తరాసే సమయం మంగళవారం రాత్రి 9 గంటలకు పసిడి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ ధర 22 డాలర్లు పెరిగి 1,729 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది గరిష్ట స్థాయి 1,788 డాలర్లు. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ.573 లాభంతో రూ.46,674 వద్ద ట్రేడవుతోంది. వడ్డీరేట్లకు సంబంధించి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బుధవారంనాడు తీసుకోనున్న కీలక నిర్ణయం ఈ ధరల తాజా భారీ పెరుగుదలకు మరో నేపథ్యం. -
భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
ఏప్రిల్‌లో 66 శాతం డౌన్ న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా 66.33 శాతం తగ్గాయి. 19.6 టన్నులుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్‌లో ఈ దిగుమతుల విలువ 60 టన్నులు. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపును నిరసిస్తూ... ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్లో సుంకం విధింపు ప్రతిపాదనను నిరసిస్తూ... ఈ రంగం మార్చి 2న చేపట్టిన సమ్మె 42 రోజులు సాగింది. అయితే ‘ఎక్సైజ్ అధికారుల నుంచి ఎటువంటి వేధింపులూ ఉండబోవని’ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఆభరణ వర్తక సంఘాలు తమ సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశాయి. 2014-15లో భారత్ పసిడి దిగుమతులు 971 టన్నులు. అయితే 2015-16 నాటికి ఈ పరిమాణం 750 టన్నులకు తగ్గింది. మందగమన పరిస్థితుల వల్ల అమెరికా, యూరప్ వంటి సాంప్రదాయ మార్కెట్లకు ఎగుమతులు తగ్గిన ప్రభావం... పసిడి దిగుమతులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. -
ఎగుమతులను వదలని ‘క్షీణత’
♦ ఫిబ్రవరిలో 6 శాతం పతనం... ♦ 21 బిలియన్ డాలర్లుగా నమోదు ♦ దిగుమతులదీ క్షీణబాటే... న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల రంగంలో నిరాశ తొలగిపోలేదు. 2015 ఫిబ్రవరితో పోల్చితే భారత్ ఎగుమతులు అసలు పెరక్కపోగా... విలువ రూపంలో 6% క్షీణించి 21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 15 నెలలుగా భారత్ ఎగుమతుల రంగం ఈ క్షీణ ధోరణిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. క్రూడ్ ధరల దిగువ శ్రేణివల్ల పెట్రోలియం ఎగుమతుల విలువ పడిపోవడం, ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల మందగమనం వంటివి నిరాశాజనక పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 28% క్షీణించి 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 11% క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు 5 శాతం డౌన్ కాగా దిగుమతుల్లో కూడా అసలు వృద్ధి నమోదుకావడం లేదు. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో 5 శాతం క్షీణించి 28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు- దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు దాదాపు 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో చమురు విలువ 21.92 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా ఉంటే... చమురు యేతర దిగుమతుల విలువ కూడా దాదాపు అరశాతం తగ్గి 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. భారీగా పడిన పసిడి దిగుమతులు ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు భారీగా పడిపోయాయి. 2015లో ఈ మెటల్ దిగుమతుల విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు ఉంటే... ఇది 2016 సమీక్షా నెలలో 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ ఎగుమతుల విలువ 17% క్షీణించి 238 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 286 బిలియన్ డాలర్లు. దిగుమతులు సైతం 15 శాతం పడిపోయి 352 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు 114 బిలయన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 260 బిలి యన్ డాలర్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. 2014-15తో పోల్చితే 2015-16లో ఎగుమతుల విలువ క్షీణిస్తుందని స్పష్టమైపోయిందని ఎఫ్ఐఈఓ పేర్కొంది. -
పన్నెండో నెలా.. ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమనం, క్రూడాయిల్ ధరల పతనం తదితర పరిణామాల నేపథ్యంలో వరుసగా పన్నెండో నెలా ఎగుమతులు క్షీణించాయి. నవంబర్‌లో పావు వంతు పడిపోయి 20.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గతేడాది నవంబర్‌లో 26.48 బిలియన్ డాలర్ల ఎగుమతుల విలువతో ప్రస్తుతం 24.43 శాతం తగ్గినట్లయింది. మరోవైపు, దిగుమతులు మరింతగా తగ్గాయి. గతేడాది నవంబర్‌లో దిగుమతుల విలువ 42.72 బిలియన్ డాలర్లు కాగా తాజాగా గత నెలలో ఇవి 30 శాతం క్షీణించి 29.79 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 16.23 బిలియన్ డాలర్ల నుంచి 9.78 బిలియన్ డాలర్లకు తగ్గింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ మేరకు మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో వాణిజ్య లోటు 102.50 బిలియన్ డాలర్ల నుంచి 87.54 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరోవైపు, అంతర్జాతీయంగా మందగమనంతో రేట్ల తగ్గుదల వల్ల ఎగుమతులు విలువపరంగానే తగ్గాయి తప్ప పరిమాణం ప్రకారం కాదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. తగ్గిన పసిడి దిగుమతులు.. అంతర్జాతీయంగా రేట్లు తగ్గడంతో విలువ పరంగా పసిడి దిగుమతులు 36 శాతం మేర క్షీణించాయి. నవంబర్‌లో దిగుమతి చేసుకున్న బంగారం విలువ 3.53 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది నవంబర్‌లో భారత్ 5.57 బిలియన్ డాలర్ల పసిడిని దిగుమతి చేసుకుంది. అటు వెండి దిగుమతులు 55 శాతం క్షీణించి 285.01 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. -
ఎగుమతులు 9వ నెలా తగ్గాయ్
న్యూఢిల్లీ : ఎగుమతుల క్షీణ పరిస్థితి కొనసాగుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఆగస్టు గణాంకాలను విడుదల చేసింది. 2014 ఆగస్టు నెల ఎగుమతుల విలువతో పోల్చిచూస్తే, 2015 ఆగస్టులో విలువ అసలు పెరక్కపోగా 21 శాతం క్షీణించింది. 21.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ విలువ 27 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఆగస్టు నెలలోనూ దిగుమతులు 10% క్షీణిం చాయి. 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వేర్వేరుగా చూస్తే.. చమురు దిగుమతుల బిల్లు 42.59% పడిపోయి 7.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 31 శాతం. మొత్తం ఎగుమతుల్లో ఒక్క పెట్రోలియం ప్రొడక్టుల వాటా 18 శాతం. కాగా చమురు యేతర దిగుమతుల విలువ 7.01 శాతం పెరిగి 26.38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. భారీగా పసిడి దిగుమతులు.. ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు ఆగస్టు నెలలో 12.47 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రధాన దిగుమతి కమోడిటీ చమురు బిల్లు తగ్గినా... రెండవ ప్రధాన దిగుమతుల కమోడిటీ అయిన పసిడి దిగుమతులు అధికంగా వుండటం వల్ల వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణం. 2014 ఆగస్టులో వాణిజ్యలోటు 10.66 బిలియన్ డాలర్లు. కాగా 2015 ఆగస్టులో పసిడి దిగుమతులు 140 శాతం పెరిగాయి. 2.06 బిలియన్ డాలర్ల నుంచి 4.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) పసిడి దిగుమతుల విలువ 15.43 బిలియన్ డాలర్లు. 2014-15 మొత్తంలో ఈ దిగుమతుల విలువ 40.88 బిలియన్ డాలర్లు. -
గతవారం బిజినెస్
నియామకాలు.. ♦ మ్యూచువల్ ఫండ్ సమాఖ్య ఏఎంఎఫ్ఐ సీఈవోగా ఆంధ్రా బ్యాంక్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్.రాజేంద్రన్ నియమితులయ్యారు. ఆయన సెప్టెంబర్‌లో పదవీ బాధ్యతలు చేపడతారు. ♦ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని లొహానీ నియమితులయ్యారు. తొలిసారిగా ఒక రైల్వే శాఖకు చెందిన అధికారి ఎయిర్ఇండియా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 250 విమానాలకు ఇండిగో ఆర్డర్ కార్యకలాపాల విస్తరణలో భాగంగా 250 ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల ఆర్డరుకు సంబంధించి ఇండిగో పూర్తి స్థాయి కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 25.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1.55 లక్షల కోట్లు). గతేడాది అక్టోబర్‌లో ఈ ఆర్డరు విషయంలో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తాజా కాంట్రాక్టుతో మొత్తం 530 విమానాల కోసం ఇండిగో ఆర్డరు ఇచ్చినట్లవుతుంది. పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెంపు పసిడి దిగుమతులపై టారిఫ్ విలువ పెరిగింది. దీని ప్రకారం- ఈ రేటు 10 గ్రాములకు 354 డాలర్ల నుంచి 363 డాలర్లకు పెరిగింది. ఇక వెండి కేజీపై రేటు కూడా 498 డాలర్ల నుంచి స్వల్పంగా 499 డాలర్లకు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల మార్పులకు అనుగుణంగా సాధారణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) పసిడి, వెండి టారిఫ్ విలువను నిర్ణయిస్తుంది. పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. పూర్తి బుక్ బిల్డింగ్ విధానంలో జరిగే ఈ పబ్లిక్ ఇష్యూ ఆఫర్ ధరను రూ. 170 - 178గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కొత్తగా రూ. 58 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడంతోపాటు, 55.16 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఎల్ఐసీ నుంచి తొలి యులిప్ పాలసీ మారిన నిబంధనల తర్వాత దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలి యూనిట్ ఆధారిత బీమా పథకం (యులిప్)ను ప్రవేశపెట్టింది. న్యూ ఎండోమెంట్ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యూలిప్ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని స్టాక్ మార్కెట్, డెట్, మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే లాభనష్టాలను పాలసీదారులకు అందిస్తారు. త్వరలో రిలయన్స్, ఎయిర్టెల్ బ్యాంకులు.. రిలయన్స్ ఇండస్ట్రీస్, పోస్టల్ డిపార్ట్మెంట్ సహా 11 సంస్థలు పేమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బుధవారం ‘సూత్రప్రాయంగా’ అనుమతులు ఇచ్చింది. సూత్రప్రాయ అనుమతులు 18 నెలల పాటు వర్తిస్తాయి. ఈలోగా పూర్తి స్థాయి అనుమతులు సాధించేందుకు అవసరమైన నిబంధనలను ఈ సంస్థలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలూ నిర్వహించకూడదు. మొత్తం 41 సంస్థలు పేమెంట్ బ్యాంకు పర్మిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నల్లధనంపై సెబీ యుద్ధం పన్ను ఎగవేత కోసం స్టాక్ మార్కెట్లను ఉపయోగించుకున్నందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 59 సంస్థలపై నిషేధం విధించింది. ఇకపై ఈ సంస్థలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్టాక్ మార్కెట్లో ఎలాంటి కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలను నిర్వహించవు. నిషేధానికి గురైన వాటిల్లో హెచ్ఎన్ఐ, రిద్దిసిద్ధి బులియన్స్, వుడ్‌ల్యాండ్ రిటైల్స్, మహా కాళేశ్వర్ మైన్స్, శ్రీ కమోడిటీస్ తదితర సంస్థలు ఉన్నాయి. షావొమీ ఓఎస్ అప్‌గ్రేడ్ చైనీస్ హ్యాండ్సెట్ దిగ్గజం షావొమీ తాజాగా తమ ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్) అప్‌గ్రేడెడ్ వెర్షన్ ‘ఎంఐయూఐ-7’ను ప్రవేశపెట్టింది. భారత్‌లో తాము విక్రయించిన స్మార్ట్‌ఫోన్స్ అన్నింటికీ దీని బీటా వెర్షన్ ఆగస్టు 24న లభిస్తుందని షావొమీ గ్లోబల్ వీపీ హ్యూగో బరా తెలిపారు. ఇందులో విజు వల్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, స్మార్ట్ ఎస్ఎంఎస్ ఫిల్టర్ మొదలైన ‘మేడ్ ఫర్ ఇండియా’ ఫీచర్లు ఉంటాయని ఆయన వివరించారు. బ్యాంకులకు 2, 4 శనివారాలు సెలవు లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త! ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్న ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3,269 కోట్లు సమీకరించిన స్నాప్‌డీల్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ తాజాగా 50 కోట్ల డాలర్ల (రూ.3,269 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. చైనాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఆలీబాబా, తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫాక్స్‌కాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ల నుంచి ఈ నిధులు సమీకరించామని స్నాప్‌డీల్ తెలిపింది. ఇప్పటికే తమ సంస్థలో ఇన్వెస్ట్ చేసిన టిమసెక్, బ్లాక్‌రాక్, మైరాయిడ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ల నుంచి కూడా ఈ తాజా నిధుల సమీకరణలో పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. సాఫ్ట్‌బ్యాంక్‌లో భారతీయుడి పెట్టుబడులు నికేశ్ అరోరా... గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి గత ఏడాది బయటకు వచ్చిన ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌కు ప్రెసిడెం ట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత్‌లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్బ్యాం క్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్కు బుధవారం వెల్లడించింది. నేడు ఐవోసీలో 10% వాటా విక్రయం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)లో 10 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా సోమవారం విక్రయిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో అతి పెద్ద రిఫైనింగ్, మార్కెటింగ్ కంపెనీగా ఉన్న ఐవోసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 68.57 శాతం వాటా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది నాలుగో డిజిన్వెస్ట్‌మెంట్. కనీస ధర రూ.387. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డీల్స్.. ►స్విట్జర్లాండ్ సిమెంట్ దిగ్గజం లఫార్జ్-హోల్సిమ్కు భారతదేశంలో ఉన్న రెండు ప్లాంట్లను ఎంపీ బిర్లా గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన బిర్లా కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.5,000 కోట్లు. ►ప్రైవేట్ రంగ వ్యవసాయ స్టోరేజ్ కంపెనీ అయిన నేషనల్ కొల్లేటరల్ మేనేజ్మెంట్ సర్వీసెస్(ఎన్‌సీఎంఎస్)లో మెజారిటీ వాటాను ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.800 కోట్లు. ►అమెరికాకు చెందిన ట్యాక్సీ యాప్ దిగ్గజం ఉబర్‌లో టాటా క్యాపిటల్ నిర్వహణలో ఉన్న టాటా ఆపర్చునిటీస్ ఫండ్(టీఓఎఫ్) భారీగా పెట్టుబడులు పెట్టనుంది.