న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా పడినట్లు కనబడుతోంది. అనధికార సమాచారం ప్రకారం, 2020 మేలో దిగుమతులు 99 శాతం పడిపోయాయి. కేవలం 1.3 టన్నుల దిగుమతులు మాత్రమే జరిగాయి. 2019 ఇదే నెలలో ఈ పరిమాణం 105.8 టన్నులు. ఏప్రిల్‌లోనూ దిగుమతుల పరిమాణం క్షీణించి కేవలం 60 కిలోగ్రాములుగా నమోదయ్యింది. గడచిన దశాబ్ద కాలంలో ఇంత కనిష్ట స్థాయిలో పసిడి దిగుమతులు జరగలేదు. కోవిడ్–19 భయాందోళన నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశం పూర్తి లాక్‌డౌన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఈ యేడాది మే వరకూ గడచిన ఐదు నెలల్లో భారత్ పసిడి దిగుమతులు 80 శాతం పతనమై 75.46 టన్నులుగా నమోదయినట్లు ఒక వార్తా సంస్థ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి.
సెప్టెంబర్‌లోపు డిమాండ్ పేలవమే!
కాగా, సెప్టెంబర్‌లోపు ఈ రంగంలో డిమాండ్ వచ్చే అవకాశాలు కనబడ్డం లేదని ఈ రంగంలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. పలు వర్గాలు ఆర్థికపరమైన ఒత్తిడిలో ఉండడం దీనికి ఒక కారణంకాగా, ఇప్పటికే ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండడం మరో కారణమని వారు పేర్కొంటున్నారు. ఇక కోవిడ్–19 సంబంధ ఆందోళనలు ఎప్పటికి సమసిపోతాయో చెప్పలేని పరిస్థితి ఉండడం మరో ప్రతికూల అంశమని వారు తెలుపుతున్నారు. తమ ఆభరణాల విభాగం నుంచి మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఆదాయం దాదాపు 6 శాతం పడిపోయినట్లు సోమవారంనాటి తన మార్చి త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా మార్కెట్ విలువలో భారత్‌లో అతిపెద్ద ఆభరణాల సంస్థ టైటాన్ కంపెనీ పేర్కొంది.
ధరలు మరింత పైకి...
ఇక పసిడి ధరను చూస్తే, భారీగా పడిపోయే అవకాశాలు ప్రస్తుతం ఏమీలేకపోగా, ఔన్స్ (31.1గ్రా) ధర రికార్డుస్థాయి 1,900 డాలర్ల దిశగా దూసుకుపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో 1,900 డాలర్లకు చేరడం ఖాయమన్న విశ్లేషణలూ ఉన్నాయి. 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధిరేటు –5.2 శాతంలోకి జారిపోతుందన్న ప్రపంచబ్యాంక్ అంచనాలు దీనికి నేపథ్యం. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు –7.0 శాతం క్షీణిస్తే, వర్థమాన దేశాల విషయంలో ఈ క్షీణ రేటు –2.5 శాతంగా ఉంటుందన్నది అంచనా. ప్రస్తుతం పావుశాతంగా ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీరేటు నెగెటివ్‌లోకి వెళితే, పసిడి 2011 ఆగస్టు, సెప్టెంబర్ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలు 1,920 డాలర్ల దిశగా తిరిగి వేగంగా దూసుకుపోతుందన్న అంచనాలను స్టాండర్డ్ చార్టర్డ్ అంచనావేస్తోంది.
ఇక దేశంలోనూ డాలర్ మారకంలో రూపాయి బలహీన ధోరణి నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.50,000 దిశగా నడిచే అవకాశాలే స్పష్టమవుతున్నాయి. ఈ వార్తరాసే సమయం మంగళవారం రాత్రి 9 గంటలకు పసిడి అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ ధర 22 డాలర్లు పెరిగి 1,729 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది గరిష్ట స్థాయి 1,788 డాలర్లు. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర దాదాపు రూ.573 లాభంతో రూ.46,674 వద్ద ట్రేడవుతోంది. వడ్డీరేట్లకు సంబంధించి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బుధవారంనాడు తీసుకోనున్న కీలక నిర్ణయం ఈ ధరల తాజా భారీ పెరుగుదలకు మరో నేపథ్యం.
Comments
Please login to add a commentAdd a comment