హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాక్‌డౌన్ తదనంతరం షాపింగ్ వ్యయాలను తగ్గించుకుంటామని అత్యధిక మంది కస్టమర్లు చెబుతున్నారు. కేవలం 33 శాతం మంది మాత్రమే కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) సర్వేలో తేలింది. లిట్మస్ వరల్డ్‌తో కలిసి ఆర్‌ఏఐ చేసిన ఈ సర్వేలో 4,239 మంది పాలుపంచుకున్నారు. షాపింగ్ వ్యయం తగ్గించుకుంటామని 78 శాతం మంది తెలిపారు. కొనుగోళ్లకు ఖర్చులు గణనీయంగా కోత పడుతుందని 41 శాతం మంది, కొంత మేర మాత్రమే తగ్గించుకుంటామని 37 శాతం మంది, గతంలో మాదిరిగానే వ్యయం చేస్తామని 16 శాతం మంది, భారీగా ఖర్చు పెట్టుకుంటామని 6 శాతం మంది వెల్లడించారు. లాక్‌డౌన్ తొలగించిన తర్వాత మూడు నెలల్లో దుకాణాలకు వెళతామని 62 శాతం మంది, 3 నెలల తర్వాత ఏడాది లోపు సందర్శిస్తామని 32 శాతం, ఏడాది వరకు దూరంగా ఉంటామని 6 శాతం మంది తెలిపారు. వచ్చే మూడు నెలల్లో రిటైల్ స్టోర్లకు వెళ్లేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 75 శాతం మంది కస్టమర్లు ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
కస్టమర్లలో విశ్వాసం పెంచాలి..
ఈ నేపథ్యంలో రికవరీ నెమ్మదిగా ఉంటుందని అసోసియేషన్ వ్యాఖ్యానించింది. కొన్ని నెలలుగా ఆదాయాలు లేకపోగా రిటైలర్లు నష్టపోయారని తెలిపింది. రిటైలర్లు భద్రత, శుభ్రత ప్రాధాన్యతగా తీసుకొని, కస్టమర్లలో విశ్వాసం పెంచాలని ఆర్‌ఏఐ సీఈవో కుమార్ రాజగోపాలన్ స్పష్టం చేశారు. ఇందుకు ఖర్చుకు వెనుకాడరాదని సూచించారు. ఇక షాపింగ్ లిస్ట్ విషయంలో ఆహారోత్పత్తులు, దుస్తులకు ప్రాధాన్యత అని 52 శాతం మంది తెలిపారు. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ అని 31 శాతం, సౌందర్యం, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అని 25 శాతం మంది చెప్పారు. లాక్‌డౌన్ తదనంతరం మూడు నెలల్లో రిటైల్ ఎకానమీ తిరిగి పుంజుకుంటుందని లిట్మస్ వరల్డ్ మార్కెటింగ్ హెడ్ కుశాల్ తల్రేజా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment