ముంబై: భారత్ విదేశీ చెల్లింపుల సమతౌల్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ– గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి– జీడీపీ విలువల నిష్పత్తిలో) పరిమితం అయ్యే అవకాశాలు, దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం, తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు, తక్కువ స్థాయి రుణ భారం తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో చెల్లింపుల సమతౌల్య మిగులు 39 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనావేస్తున్నట్లు తెలిపింది.
నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు...
► ఈ సంవత్సరం ఐదుసార్లు అమెరికా ఫెడ్ ఫండ్ రేటును తగ్గించే అవకాశం ఉందని అంచనా. ఇది డాలర్ బలహీనతకు దారితీస్తుంది. దేశ విదేశీ సమతౌల్య పరిస్థితులకు ఇది మంచి పరిణామం (గోల్డిలాక్స్).
► పలు సానుకూల అంశాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరం భారత్ క్యాడ్ అంచనాను (ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చే విదేశీ మారకద్రవ్యం– దేశం నుంచి వెళ్లే విదేశీ మారకద్రవ్యం విలువల మధ్య నికర వ్యత్యాసం) క్రితం 1.3 శాతం నుంచి 1 శాతానికి తగ్గిస్తున్నాం. 2024–24 అంచనాలను 1.9 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గిస్తున్నాం.
► 2024లో క్రూడ్ బ్యారల్ ఆయిల్ 90 డాలర్ల పైన ఉంటుందన్న తొలి అంచనాలను 81 డాలర్లకు తగ్గిస్తున్నాం. 2023 జనవరి–నవంబర్ కాలంలో చమురు దిగుమతుల విలువ 164 బిలియనడాలర్లు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 189 బిలియన్ డాలరు. తాజా సమీక్షా కాలంలో క్రూడ్ ధరలు 18 శాతం తక్కువగా ఉండడం కారణం.
►సేవల ఎగుమతుల కూడా క్రితం అంచనాలకన్నా ఎంతో బాగున్నాయి. ఆయా అంశాలు ఎకానమీ విదేశీ చెల్లింపుల పటిష్టతకు దోహదపడే అంశాలు.
►అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర ద్రవ్య విధానానికి శ్రీకారం చుట్టినప్పుడు, భారత్‌లోకి బలమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు జరుగుతాయి. జూన్ 2024 నుండి జేపీ మోర్గాన్ గ్లోబల్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్‌లో బాండ్‌లు చేర్చినుందున, బలమైన రుణ ప్రవాహాలకూ అవకాశం ఉంది. ప్రాంతీయ సప్లై చైన్ వైవిధ్యం నుండి ప్రయోజనం పొందడం కొనసాగుతుంది. దీనివల్ల దేశంలోకి అధిక విదేశీ ప్రత్యక్ష ప్రవాహాలు కొనసాగుతాయి.
►బంగారం దిగుమతులు 2022–23లో 37 బిలియన్ డాలర్లుకాగా, 2023–24లో 44 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. నవంబర్ వరకూ ఈ విలువ 39.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే క్రూడ్ ధరలు తగ్గుదల, సేవల ఎగుమతుల కారణంగా బంగారం దిగుమతుల భారం సర్దుబాటుకానుంది.
►మొత్తంగా ఎగుమతుల పరిస్థితులు స్థిరంగా ఉండే వీలుంది. చమురు, బంగారం యేతర దిగుమతులు మునుపటి అంచనాల కంటే స్వల్పంగా ఎక్కువగానే ఉన్నాయి. ఎల్రక్టానిక్ వస్తువులు, యంత్రాల దిగుమతుల ఇందులో ప్రధానమైనవి.
►భారత్ విదేశీ మారకద్రవ్యనిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోతాయి. కోవిడ్‌కు ముందు (9.5 నెలలకు మాత్రమే)కన్నా పరిస్థితి మెరుపడింది. 550 బిలియన్ డాలర్లపైగా 10 సంవత్సరాల కనిష్ట స్థాయిలో దేశ ఫారెక్స్ నిల్వలు కొనసాగడం హర్షణీయ పరిణామం.
►రూపాయి తక్కువ అస్థిరత ఉన్న కరెన్సీగా భావించవచ్చు. అయితే ‘గోల్డిలాక్స్‘ పరిస్థితులు ఉన్నప్పటికీ, రూపాయి పలు ఆసియా కరెన్సీలతో పోల్చితే దిగువస్థాయి పనితీరును ప్రదర్శించే అవకాశం ఉంది. రాబోయే మూడు నుండి ఆరు నెలల్లో డాలర్‌లో రూపాయి మారకపు విలువ 83–82 శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. తరువాతి 12 నెలల్లో 81కి బలపడుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment