భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
ఏప్రిల్‌లో 66 శాతం డౌన్
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్‌లో భారీగా 66.33 శాతం తగ్గాయి. 19.6 టన్నులుగా నమోదయ్యాయి. 2015 ఏప్రిల్‌లో ఈ దిగుమతుల విలువ 60 టన్నులు. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపును నిరసిస్తూ... ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్‌లో సుంకం విధింపు ప్రతిపాదనను నిరసిస్తూ... ఈ రంగం మార్చి 2న చేపట్టిన సమ్మె 42 రోజులు సాగింది. అయితే ‘ఎక్సైజ్ అధికారుల నుంచి ఎటువంటి వేధింపులూ ఉండబోవని’ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఆభరణ వర్తక సంఘాలు తమ సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశాయి.
2014-15లో భారత్ పసిడి దిగుమతులు 971 టన్నులు. అయితే 2015-16 నాటికి ఈ పరిమాణం 750 టన్నులకు తగ్గింది. మందగమన పరిస్థితుల వల్ల అమెరికా, యూరప్ వంటి సాంప్రదాయ మార్కెట్లకు ఎగుమతులు తగ్గిన ప్రభావం... పసిడి దిగుమతులపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది.