మాకు బంగారం కావాలి! ఎగబడి పసిడిని కొంటున్న భారతీయులు | Gold And Silver Imports Increased In December 2021 | Sakshi
Sakshi News home page

భారీగా పసిడి దిగుమతులు

Published Mon, Jan 17 2022 12:06 PM | Last Updated on Mon, Jan 17 2022 12:33 PM

Gold And Silver Imports Increased In December 2021 - Sakshi

న్యూఢిల్లీ: కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నా స్థూలంగా కరోనా పట్ల ప్రజల్లో మునుపటి భయాలు తగ్గాయి. దాదాపు రెండేళ్లుగా పెళ్లిళ్లు, పేరంటాలు తదితర ఫంక‌్షన్లకు దూరంగా ఇండియన్లు ఇప్పుడు రూటు మారుస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బంగారానికి డిమాండ్‌ పెరిగింది. ఈ మేరకు దిగుమతుల్లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 

38 బిలియన్‌ డాలర్లు
భారత్‌ పసిడి దిగుగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్య భారీగా పెరిగి 38 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఈ పరిమాణం 16.78 బిలియన్‌ డాలర్లు. 2021 డిసెంబర్‌లో 2020 డిసెంబర్‌తో పోల్చితే పసిడి దిగుమతులు 4.5 బిలియన్‌ డాలర్ల నుంచి 4.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  

వెండి దిగుమతుల్లోనూ భారీ జంప్‌.. 
మరోవైపు వెండి దిగుమతులు ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలంలో 762 మిలియన్‌ డాలర్ల నుంచి 2 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.  

కారణాలు ఇవీ.. 
దేశంలో కరోనా ప్రేరిత ఆంక్షలు తొలగడం, పండుగల, పెళ్లిళ్ల సీజన్‌లో కరోనా రహిత ఉత్సాహ వాతావరణం నెలకొనడం వంటి అంశాలు పసిడి, వెండి డిమాండ్‌ భారీ పెరగుదలకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో ఆభరణాల పరిశ్రమ కూడా లాభపడింది. ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 71 శాతం పెరిగి 29 మిలియన్‌ డాలర్ల విలువకు ఎగశాయి. భారత్‌ చైనా తర్వాత పసిడికి సంబంధించి అతిపెద్ద వినియోగ దేశంగా ఉంది.  

ఎకానమీపై ఎఫెక్ట్‌... 
పసిడి భారీ దిగుమతుల నేపథ్యంలో 2021–22 తొలి తొమ్మిది నెలల కాలంలో భారత్‌ మొత్తం ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం 61.38 బిలియన్‌ డాలర్ల నుంచి 142.44 బిలియన్‌ డాలర్లకు ఎగసింది. ఫలితం కరెంట్‌ అకౌంట్‌పైనా కనిపిస్తోంది. భారత్‌ కరెంట్‌ అకౌంట్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) లోటులోకి జారిపోయింది. కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ– క్యాడ్‌) రెండవ త్రైమాసికంలో 9.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. నిర్దిష్ట త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఈ పరిమాణం 1.3 శాతం. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని  ప్రతిబింబించేదే కరెంట్‌ అకౌంట్‌. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్‌ అకౌంట్‌ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్‌ అకౌంట్‌ మిగులుగా పరిగణిస్తారు. వస్తువులు, సేవల ఎగుమతి–దిగుమతులు, అంతర్జాతీయంగా మూలధన బదలాయింపులు ఈ అకౌంట్‌ పరిధిలోకి వస్తాయి. 

చదవండి: బంగారంతో ట్రేడింగ్‌.. గోల్డ్‌ ఎక్సేంజీ ఏర్పాటులో కీలక అడుగులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement