ఎగుమతులను వదలని ‘క్షీణత’ | India's exports drop 6% in January to $21 billion in 14th straight fall | Sakshi
Sakshi News home page

ఎగుమతులను వదలని ‘క్షీణత’

Published Wed, Mar 16 2016 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

ఎగుమతులను వదలని ‘క్షీణత’

ఎగుమతులను వదలని ‘క్షీణత’

ఫిబ్రవరిలో 6 శాతం పతనం...
21 బిలియన్ డాలర్లుగా నమోదు
దిగుమతులదీ క్షీణబాటే...

న్యూఢిల్లీ: భారత్ ఎగుమతుల రంగంలో నిరాశ తొలగిపోలేదు. 2015 ఫిబ్రవరితో పోల్చితే భారత్ ఎగుమతులు అసలు పెరక్కపోగా... విలువ రూపంలో 6% క్షీణించి 21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 15 నెలలుగా భారత్ ఎగుమతుల రంగం ఈ క్షీణ ధోరణిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మందగమన పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. క్రూడ్ ధరల దిగువ శ్రేణివల్ల  పెట్రోలియం ఎగుమతుల విలువ పడిపోవడం,  ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతుల మందగమనం వంటివి నిరాశాజనక పరిస్థితికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 28% క్షీణించి 2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 11% క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

 దిగుమతులు 5 శాతం డౌన్
కాగా దిగుమతుల్లో కూడా అసలు వృద్ధి నమోదుకావడం లేదు. వార్షిక ప్రాతిపదికన ఫిబ్రవరిలో 5 శాతం క్షీణించి 28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు- దిగుమతుల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు దాదాపు 7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల్లో చమురు విలువ 21.92 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లుగా ఉంటే... చమురు యేతర దిగుమతుల విలువ కూడా దాదాపు అరశాతం తగ్గి 22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.

 భారీగా పడిన పసిడి దిగుమతులు
ఫిబ్రవరిలో పసిడి దిగుమతులు భారీగా పడిపోయాయి. 2015లో ఈ మెటల్ దిగుమతుల విలువ దాదాపు 2 బిలియన్ డాలర్లు ఉంటే... ఇది 2016 సమీక్షా నెలలో 1.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ ఎగుమతుల విలువ 17% క్షీణించి 238 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ విలువ 286 బిలియన్ డాలర్లు. దిగుమతులు సైతం 15 శాతం పడిపోయి 352 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు 114 బిలయన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 260 బిలి యన్ డాలర్లకు పరిమితమయ్యే అవకాశం ఉందని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. 2014-15తో పోల్చితే 2015-16లో ఎగుమతుల విలువ క్షీణిస్తుందని స్పష్టమైపోయిందని ఎఫ్‌ఐఈఓ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement