ఎగుమతులు 9వ నెలా తగ్గాయ్
న్యూఢిల్లీ : ఎగుమతుల క్షీణ పరిస్థితి కొనసాగుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఆగస్టు గణాంకాలను విడుదల చేసింది. 2014 ఆగస్టు నెల ఎగుమతుల విలువతో పోల్చిచూస్తే, 2015 ఆగస్టులో విలువ అసలు పెరక్కపోగా 21 శాతం క్షీణించింది. 21.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ విలువ 27 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం.
దిగుమతులు చూస్తే...
ఆగస్టు నెలలోనూ దిగుమతులు 10% క్షీణిం చాయి. 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వేర్వేరుగా చూస్తే.. చమురు దిగుమతుల బిల్లు 42.59% పడిపోయి 7.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 31 శాతం. మొత్తం ఎగుమతుల్లో ఒక్క పెట్రోలియం ప్రొడక్టుల వాటా 18 శాతం. కాగా చమురు యేతర దిగుమతుల విలువ 7.01 శాతం పెరిగి 26.38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
భారీగా పసిడి దిగుమతులు..
ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు ఆగస్టు నెలలో 12.47 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రధాన దిగుమతి కమోడిటీ చమురు బిల్లు తగ్గినా... రెండవ ప్రధాన దిగుమతుల కమోడిటీ అయిన పసిడి దిగుమతులు అధికంగా వుండటం వల్ల వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణం. 2014 ఆగస్టులో వాణిజ్యలోటు 10.66 బిలియన్ డాలర్లు. కాగా 2015 ఆగస్టులో పసిడి దిగుమతులు 140 శాతం పెరిగాయి. 2.06 బిలియన్ డాలర్ల నుంచి 4.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) పసిడి దిగుమతుల విలువ 15.43 బిలియన్ డాలర్లు. 2014-15 మొత్తంలో ఈ దిగుమతుల విలువ 40.88 బిలియన్ డాలర్లు.