Ministry of Commerce
-
వియత్నాం స్టీల్‌పై యాంటీ డంపింగ్!
న్యూఢిల్లీ: హాట్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులను వియత్నాం నుండి దిగుమతి చేసుకోవడంపై యాంటీ డంపింగ్ విచారణను భారత్ ప్రారంభించింది. హాట్ రోల్డ్ ఫ్లాట్ అల్లాయ్ లేదా నాన్–అల్లాయ్ స్టీల్ డంపింగ్ ఆరోపణలపై వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఈ విచారణ జరుపుతోంది. డీజీటీఆర్ నోటిఫికేషన్ ప్రకారం వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించాలని కోరుతూ దేశీయ ఉత్పత్తిదారులైన జేఎస్‌డబ్లు్య స్టీల్ లిమిటెడ్, ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తరపున ఇండియన్ స్టీల్ అసోసియేషన్ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దేశీయంగా తయారీ కంటే తక్కువ ధరలకు ఉత్పత్తిని దిగుమతి చేసుకుంటున్నారని.. ఇది దేశీయ పరిశ్రమకు వస్తుపరమైన హాని కలిగిస్తోందని దరఖాస్తుదారులు ఆరోపించారు. అలాగే దేశీయ పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని, యాంటీ డంపింగ్ డ్యూటీని విధించాలని అభ్యర్థించారు. దేశీయ కంపెనీలకు ఈ డంపింగ్ కారణంగా నష్టం కలిగిందని నిర్ధారణ అయితే దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ సిఫార్సు చేస్తుంది. సుంకాలు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి వివిధ దేశాలు యాంటీ డంపింగ్ విచారణ నిర్వహిస్తాయి. -
స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ హవా.. ఎక్కువ ఆ దేశానికే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి యూఎస్‌కు జరుగుతున్న స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో కొత్త రికార్డు నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో దేశీయంగా తయారైన రూ.6,679 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు యూఎస్‌కు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.758 కోట్లుగా ఉంది. భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో విలువ పరంగా యూఎస్ మూడవ స్థానంలో ఉంది. ఇక మొత్తం ఎగుమతులు ఏప్రిల్–మే నెలలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 158 శాతం అధికమై రూ.19,975 కోట్లు నమోదయ్యాయి. యూఏఈకి రూ.3,983 కోట్లు, నెదర్లాండ్స్‌కు రూ.1,685 కోట్లు, యూకే మార్కెట్‌కు రూ.1,244 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు సరఫరా అయ్యాయి. ఇటలీ, చెక్ రిపబ్లిక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022–23లో భారత్ నుంచి వివిధ దేశాలకు చేరిన స్మార్ట్ఫోన్ల విలువ రూ.90,009 కోట్లు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ప్రకటించడం, యుఎస్‌కు చెందిన ఆపిల్ దేశీయంగా తయారీలోకి ప్రవేశించిన తర్వాత స్మార్ట్ఫోన్లకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా భారత్ అవతరిస్తోంది. -
Budget 2023: ఆభరణాల ఎగుమతులుకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: రత్నాలు– ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగం పురోగతికి రాబోయే బడ్జెట్లో కీలక చర్యలు ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక శాఖను కోరుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ► దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై సుంకాన్ని కేంద్రం జూలైలో 10.75 శాతం నుండి 15 శాతానికి పెంచింది. ఇందులో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) 2.5 శాతంగా ఉన్నాయి. ► ప్రతి సంవత్సరం, రత్నాలు– ఆభరణాల ఎగుమతి పరిశ్రమ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతుంది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) మాజీ చైర్మన్ కోలిన్ షా ఈ అంశంపై మాట్లాడుతూ, ఈ రంగంలో ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్‌పై పరిశ్రమ ఆశలు పెట్టుకుందని అన్నారు. ఇందులో ప్రధానంగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు వివరించారు. ► మండలి అంచనా ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఆభరణాలకు రిపేర్ హబ్‌గా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విధానం 400 మిలియన్ డాలర్ల వరకు ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్–నవంబర్ మధ్య రత్నాలు –ఆభరణాల ఎగుమతులు 2 శాతం పెరిగి 26.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే బంగారం దిగుమతులు 18.13 శాతం తగ్గి 27.21 బిలియన్ డాలర్లకు దిగాయి. ► భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడంలో భాగంగా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిమాణం వార్షికంగా 800 నుంచి 900 టన్నుల వరకూ ఉంటుంది. -
రెండేళ్ల తర్వాత ఎగుమతులు ‘మైనస్’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు రెండేళ్ల తర్వాత అక్టోబర్‌లో క్షీణతను చవిచూశాయి. సమీక్షా నెల్లో అసలు వృద్ధిలేకపోగా 17 శాతం పడిపోయి (2021 ఇదే నెలతో పోల్చి) 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గ్లోబల్ డిమాండ్ పడిపోవడం దీనికి నేపథ్యం. ద్రవ్యోల్బణం,, కరెన్సీ విలువల్లో విపరీతమైన ఒడిదుడుకులు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలూ భారత్ ఎగుమతులకు ప్రతికూలంగా నిలిచా యి. ఇక ఇదే నెల్లో దిగుమతులు 6 శాతం పెరిగి 56.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసం–వాణిజ్యలోటు 26.91 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ►రత్నాలు–ఆభరణాలు (21.56%), ఇంజనీరింగ్ (21.26%), పెట్రోలియం ఉత్పత్తులు (11.28%), రెడీమేడ్ వస్త్రాలు–టెక్స్టైల్స్ ((21.16%), రసాయనాలు (16.44%), ఫార్మా (9.24%), సముద్ర ఉత్పత్తులు (10.83%), తోలు (5.84%) సహా కీలక ఎగుమతి రంగాలు అక్టోబర్‌లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ►అయితే ఆయిల్ సీడ్స్, ఆయిల్మీల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, పొగాకు, టీ, బియ్యం ఎగుమతుల సానుకూల వృద్ధిని నమోదుచేశాయి. ►ఆర్థిక వృద్ధి, దేశీయ వినియోగం పెరగడం కూడా దిగుమతుల పురోగతికి దోహదపడుతోంది. ►మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లు 29.1 శాతం వృద్ధితో 15.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ►పసిడి దిగుమతుల విలువ 27.47 శాతం తగ్గి 3.7 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్–అక్టోబర్ మధ్య వృద్ధి 12.55 శాతం కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలూ (ఏప్రిల్–అక్టోబర్) మధ్య ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులు ఇదే కాలంలో 33.12 శాతం పెరిగి 436.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు 173.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో వాణిజ్యలోటు 94.16 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లు. 2022–23లో ఈ లక్ష్యం 450 బిలియన్ డాలర్లు. అయితే ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ లక్ష్యం సాధన కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇక నెలకు ఒకసారే వాణిజ్య గణాంకాలు
న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది. తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి. గడచిన మూడు నెలలూ ఇలా... తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. -
సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆశాకిరణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్‌డీడీఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మంత్రి, ఎన్ఐడి ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మన్ వాగీ దీక్షిత్ పాల్గొన్నారు. -
వరుసగా మూడో నెలా క్షీణత నుంచి వృద్ధికి...
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతుల తొలి, తుది లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దిగుమతులు 8.66 శాతం పెరిగి 61.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 26.16 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య క్షీణత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య భారత్ ఎగుమతులు వృద్ధిలేకపోగా 16.96 బిలియన్ డాలర్లు క్షీణించి 231.88 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 38.55 శాతం పెరిగి 380.34 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు భారీగా 148.46 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విలువ 76.25 బిలియన్ డాలర్లు. కీలక రంగాలు నిరాశ ► ఇంజనీరింగ్ వస్తు ఎగుమతులు 10.85 శాతం క్షీణించి 8.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు కూడా 18 శాతం క్షీణించి బిలియన్ డాలర్లకు తగాయి. ► ప్లాస్టిక్స్ కూడా ఇదే పరిస్థితి. 12.2 శాతం క్షీణతతో 660.66 మిలియన్ డాలర్లకు చేరాయి. ► అయితే రత్నాలు–ఆభరణాలు, పెట్రోలియం ప్రొడక్టులు, తోలు, ఫార్మా, కెమికల్స్, బియ్యం ఎగుమతులు పెరిగాయి. దిగుమతులు ఇలా... ► ఆయిల్ దిగుమతులు 5.38 శాతం తగ్గి 15.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► పసిడి దిగుమతులు 24.62 శాతం పడిపోయి 3.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► బొగ్గు, కోక్, బ్రిక్విటీస్ దిగుమతులు 60.82 శాతం పెరిగి 3.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల రంగం ఎగుమతులు 19 శాతం అప్ ఇదిలావుండగా, సేవల రంగం ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో 18.72 శాతం పెరిగి 25.65 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. దిగుమతుల విలువ 20 శాతం పెరిగి 15.10 బిలియన్ డాలర్లకు చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సేవల ఎగుమతులు 27.88 శాతం వృద్ధితో 150.43 బిలియన్ డాలర్లకు చేరాయి. జూలై, ఆగస్లుల్లో సవరణలు ఇలా... జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా స్వల్పంగా 1.15 శాతం మేర క్షీణించాయని (33 బిలియన్ డాలర్లు) తొలి గణాంకాలు తెలిపాయి. తరువాత గణాంకాల సవరణల్లో 1.6 శాతం వృద్ధికి ఎగుమతుల పరిమాణం మారింది. ఇక జూలైలో ఎగుమతులు 0.76 శాతం క్షీణించి 35.24 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు మొదట్లో వెలువడిన తొలి గణాంకాలు పేర్కొన్నాయి. అయితే అటు తర్వాత సవరించిన లెక్కల ప్రకారం, ఎగుమతులు జూలైలో 2.14 శాతం పెరిగి 36.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో ఎగుమతులు ఏకంగా 3.5 శాతం క్షీణించి, 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని, దిగుమతులుసైతం ఏడు నెలల్లో తొలిసారి 60 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయని తొలి గణాంకాలు వెలువడ్డాయి. తాజా గణాంకాలు పరిస్థితిని ఆశాజనకంగా మార్చాయి. వరుసగా 22 నెలలూ ఎగుమతులు వృద్ధి బాటన నడిచినట్లయ్యింది. లక్ష్యం కష్టమేనా... 2021–22లో 400 బిలియన్ డాలర్లకుపైగా ఎగుమతులను సాధించిన భారత్, 2022–23లో 450 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ లక్ష్యం సాధన కష్టమేనన్న విశ్లేషణ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు దేశాల మధ్య వాణిజ్యంపై తీవ్ర ప్రతికూలత చూపుతాయన్న విశ్లేషణలే దీనికి కారణం. -
ప్రత్యేక ఆర్థిక జోన్ల పునర్వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ: కొత్త చట్టం ద్వారా ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్ఈజెడ్) పునర్ వ్యవస్థీకరించడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎస్ఈజెడ్లకు సంబంధించి దిగుమతి సుంకాల వాయిదా, ఎగుమతి పన్నుల నుండి మినహాయింపు వంటి ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రోత్సాహకాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండలాలను నియంత్రించే ప్రస్తుత చట్టాన్ని కొత్త చట్టంతో భర్తీ చేయాలని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) వార్షిక బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ మేరకు రూపొందే ‘‘డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్’’ (డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలు భాగస్వాములు కావడానికి వీలుగా కేంద్రం పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కొత్త బిల్లుకు సంబంధించి ఆర్థికమంత్రిత్వశాఖసహా పలు మంత్రిత్వశాఖల అభిప్రాయాలను వాణిజ్య మంత్రిత్వశాఖ స్వీకరిస్తున్నట్లు సమాచారం. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందిన తర్వాత వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక కొత్త బిల్లును రూపొందించి, క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రోత్సాహకాలు ఇవీ... ఎస్ఈజెడ్లో ఒక యూనిట్ ద్వారా దేశీయ సేకరణపై ఐజీఎస్టీ (ఇంటిగ్రేడెట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) మినహాయింపు, ఈ జోన్ల డెవలపర్లకు పరోక్ష పన్ను ప్రయోజనాల కొనసాగింపు, దేశీయ టారిఫ్‌లకు సంబంధించి ఉపయోగించిన మూలధన వస్తువుల అమ్మకాలపై తరుగుదల అనుమతించడం వంటివి ప్రత్యేక ఆర్థిక జోన్లకు ఇస్తున్న ప్రోత్సాహకాల ప్రతిపాదనల్లో ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత డెవలప్మెంట్ హబ్‌లలో అధీకృత కార్యకలాపాలను చేపట్టే యూనిట్లకు ఎలాంటి మినహాయింపులు లేకుండా 15 శాతం కార్పొరేట్ పన్ను రేటును వర్తింపజేయాలన్నది బిల్లు ప్రతిపాదనల్లో మరోటి. తయారీ, ఉద్యోగ కల్పనను పెంచడానికి రాష్ట్రాలు కూడా ఈ జోన్లకు సహాయక చర్యలను కూడా అందించే వీలు కల్పించాలన్నది బిల్లులో ప్రధాన లక్ష్యంగా ఉంది. 2022–23 బడ్జెట్ సమర్పణ సందర్భంగా లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎకానమీలో కీలకపాత్ర... దేశంలో ఎగుమతి కేంద్రాలు, తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2006లో ప్రస్తుత సెజ్ చట్టం రూపొందింది. 2022 జూన్ 30 నాటికి కేంద్రం 425 ఎస్ఈజెడ్ డెవలపర్లకు అధికారిక అనుమతులు ఇచ్చింది. అయితే అందులో ప్రస్తుతం 268 పని చేస్తున్నాయి. ఈ జోన్లు దాదాపు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. దాదాపు 27 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ జోన్ల నుంచి ఎగుమతులు 32 శాతం పెరిగి దాదాపు రూ.2.9 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక 2020–21లో ఈ జోన్ల నుంచి రూ.7.6 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, 2021–22లో ఈ విలువ రూ.10 లక్షలకు చేరింది. -
'వాణిజ్య భవన్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ విభాగానికి చెందిన 'వాణిజ్య భవన్'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. (ఎన్‌ఐఆర్‌వైఏటీ) నేషనల్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ రికార్డ్ ఫర్ ఇయర్లీ అనాలసిస్ ఆఫ్ ట్రేడ్ పోర్టల్‌ని లాంచ్ చేశారు. ఈ పోర్టల్ స్టేక్ హోల్డర్లకు ఒక వేదికలా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఇలా ఉంది. ♦వాణిజ్య భవన్,ఎన్‌ఐఆర్‌వైఏటీ పోర్టల్‌తో ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షలు నెరవేరుతాయి.వాణిజ్య-వ్యాపార సంబంధాలతో పాటు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు సానుకూల ఫలితాలు పొందవచ్చని ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ♦వాణిజ్య భవన్‌తో వ్యాపార-వాణిజ్య రంగాలకు చెందిన వారితో పాటు ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ♦గతేడాది ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. అదే సమయంలో భారత్ 670 బిలియన్ల(భారత కరెన్సీలో రూ.50లక్షల కోట్లు) ఎగుమతులు చేసింది. ♦దేశ ప్రగతికి ఎగుమతులు కీలకం. 'వోకల్ ఫర్ లోకల్' వంటి కార్యక్రమాలు దేశ ఎగుమతులను వేగవంతం చేసేందుకు దోహద పడ్డాయని మోదీ తెలిపారు. ♦గతేడాది దేశం ప్రతి సవాలును ఎదుర్కొన్నప్పటికీ ఎగుమతుల విషయంలో భారత్ 400 బిలియన్ల పరిమితిని దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మనం అనూహ్యంగా 418 బిలియన్ డాలర్లు అంటే 31 లక్షల కోట్ల రూపాయల ఎగుమతితో సరికొత్త రికార్డ్‌ను సృష్టించాం. ♦ఈరోజు ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వంలోని ప్రతి విభాగం 'పూర్తి ప్రభుత్వ' విధానంతో ఎగుమతులను పెంచడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి." ఎంఎస్ఎంఈ, మంత్రిత్వ శాఖ లేదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, వ్యవసాయం,వాణిజ్య మంత్రిత్వ శాఖ..ఇలా అందరూ ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి కట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
భారత్‌కు వాణిజ్యలోటు గుబులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేనెల్లో 15.46 శాతం పెరిగి 37.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు విలువ 56.14 శాతం ఎగసి 60.62 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 23.33 బిలియన్ డాలర్లగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఎగుమతులు ఇలా... ► ఎగుమతులకు సంబంధించి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల వంటి రంగాల పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. ►ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 7.84 శాతం పెరిగి 9.3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌లు విషయంలో ఈ రేటు 52.71 శాతం పెరిగి 8.11 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గత ఏడాది మేలో 2.96 బిలియన్ డాలర్లు ఉంటే, తాజా సమీక్షా నెల్లో 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 12 శాతం పెరిగి విలువలో 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఫార్మా ఎగుమతులు 5.78 శాతం ఎగసి 1.98 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 23% పురోగ తితో 1.36 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతుల తీరిది... ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు మే నెల్లో 91.6 శాతం పెరిగి 18.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులు మే 2 బిలియన్ డాలర్ల (2021 మేలో) నుండి 5.33 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► బంగారం దిగుమతులు 677 మిలియన్ డాలర్ల నుంచి భారీగా 5.82 బిలియన్ డాలర్లకు ఎగశాయి. తొలి రెండు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) ఎగుమతులు 22.26 శాతం పెరిగి 77.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు ఇదే కాలంలో 42.35 శాతం ఎగసి 120.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చితే 21.82 బిలియన్ డాలర్ల నుంచి 43.73 బిలియన్ డాలర్లకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. భారత్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు (దాదాపు 600 బిలియన్ డాలర్లు) దాదాపు 12 నెలల దిగుమతులుకు సరిపోతాయన్నది అంచనా. అయితే వాణిజ్యలోటు పెరుగుదల కొంత ఇబ్బందికరమైన పరిణామం. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారానికీ ఇది దారితీస్తుంది. 2022–23లో క్యాడ్ 2 శాతం దాటుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2021–22ను అధిగమిస్తాం ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్ఐ స్కీమ్ వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
అక్రమాలకు చెక్ ....గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయిన సంగతి తెలిసింది. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్ ప్రపంచం గోధుమల కోసం భారత్‌వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది. ఈ మేరకు భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలసిందే. అంతేకాదు కేంద్రం గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ప్రైవేట్ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీలు) జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్' పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి)ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకర్లకు ఏ దశలోనైనా ఏదైన సమస్య తలెత్తినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఐతే ఈ కమిటీ క్లియరన్స్ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
ఎగుమతులు ‘రికార్డు’ శుభారంభం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో కొత్త రికార్డు నెలకొల్పాయి. 24 శాతం పెరుగుదలతో (2021 ఇదే నెలతో పోల్చి) 38.19 బిలియన్ డాలర్లకు ఎగశాయి. భారత్ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయి విలువను నమోదుచేయడం ఇదే తొలిసారి. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. భారీ వాణిజ్యలోటు... ఇక సమీక్షా నెల్లో దిగుమతుల విలువ కూడా 26.55 శాతం ఎగసి 58.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 20.07 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి నెల్లో ఈ లోటు 15.29 బిలియన్ డాలర్లు. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► పెట్రోలియం ప్రొడక్టులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల రంగాల ఎగుమతులు మంచి పురోగతిని సాధించాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 15.38 శాతం ఎగసి 9.2 బిలియన్ డాలర్లకు చేరాయి. పెట్రోలియం ప్రొడక్టుల విలువ భారీగా 113.21 శాతం పెరిగి 7.73 బిలియన్ డాలర్లకు చేరడం సానుకూల అంశం. ► కాగా, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2.11 శాతం క్షీణించి 3.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► ఇక మొత్తం దిగుమతుల్లో చమురు బిల్లును చూస్తే 81.21% పెరిగి 19.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ► బొగ్గు, కోక్, బ్రికెట్స్ దిగుమతులు 2021 ఏప్రిల్‌లో 2 బిలియన్ డాలర్లయితే, ఈ విలువ తాజా సమీక్షా నెల్లో ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► అయితే పసిడి దిగుమతులు మాత్రం భారీగా 6.23 బిలియన్ డాలర్ల నుంచి 1.68 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మరింత ఊపందుకుంటాయ్... ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్ఐ స్కీమ్ సానుకూలం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
శ్రీసిటీ.. ఇట్స్ ఎ బ్రాండ్!
సాక్షి, న్యూఢిల్లీ/వరదయ్యపాళెం: దేశంలోని అత్యున్నత పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా ఏపీలోని శ్రీసిటీ నిలిచింది. కేంద్ర పరిశ్రమ, అంతర్గత వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) రిపోర్ట్ 2.0 నివేదికలో 41 పారిశ్రామిక పార్కులను ‘లీడర్స్’గా గుర్తించారు. ఇందులో దక్షిణ భారత్ నుంచి శ్రీసిటీ మాత్రమే లీడర్స్ కేటగిరీలో చోటు దక్కించుకోవడం విశేషం. దేశంలోని 15 అత్యున్నత సెజ్‌లలో ఒకటిగా శ్రీసిటీ నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న 449 పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లపై జరిపిన అధ్యయనంలో పారిశ్రామిక పార్కులను లీడర్స్, చాలెంజర్స్, ఆస్పిరర్స్‌గా విభజించారు. కాగా 90 పారిశ్రామిక పార్కులను చాలెంజర్ కేటగిరీలో, 185 పార్కులను ఆస్పిరర్స్‌గా చేర్చారు. ఈ రేటింగ్‌లు ఇప్పటికే ఉన్న కీలక పారామీటర్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా కేటాయించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ ఈ నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ నివేదిక భారతదేశ పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని తెలిపారు. కాగా, ఐపీఆర్‌ఎస్ రేటింగ్‌పై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గౌరవం శ్రీసిటీ ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు, పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణానికి, స్థిరమైన పర్యావరణ ఉత్తమ పద్ధతులకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. -
జూన్‌లో ఎగుమతులు జూమ్!!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, రత్నాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఊతంతో జూన్‌లో ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 47 శాతం వృద్ధి చెంది 32.46 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. అయితే దిగుమతులు 96 శాతం పెరిగి సుమారు 42 బిలియన్ డాలర్లుగా నమోదు కావడంతో వాణిజ్య లోటు 9.4 బిలియన్ డాలర్లకు చేరింది. కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 జూన్‌లో 25 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు గతేడాది 22 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది జూన్‌లో వాణిజ్య మిగులు సాధించిన భారత్.. ఈ ఏడాది జూన్‌లో మాత్రం వాణిజ్య లోటు నమోదు చేసిందని వాణిజ్య శాఖ తెలిపింది. క్యూ1లో 95 బిలియన్ డాలర్లకు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఎగుమతులు 95 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇంజనీరింగ్, బియ్యం, మెరైన్ ఉత్పత్తులు మొదలైన రంగాలు మెరుగైన వృద్ధి కనపర్చడంతో ఇది సాధ్యపడిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2018–19 జూన్ త్రైమాసికంలో ఎగుమతులు 82 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2020–21 ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 51 బిలియన్ డాలర్లుగా, 2020–21 ఆఖరు త్రైమాసికంలో 90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి ఒక క్వార్టర్లో ఇంత భారీగా నమోదు కావడం ఇదే ప్రథమమని గోయల్ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సంబంధిత వర్గాలన్నింటితో తమ శాఖ సంప్రదింపులు జరుపుతోందని ఆయన పేర్కొన్నారు. నిబంధనల సరళీకరణ, లైసెన్సుల పొడిగింపు తదితర అంశాలు రికార్డు స్థాయి ఎగుమతులకు దోహదపడ్డాయని గోయల్ చెప్పారు. మరోవైపు, సేవల రంగం ఎగుమతులు 2025 నాటికి 350 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత త్వరలోనే 500 బిలియన్ డాలర్లకు కూడా చేరవచ్చని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గతేడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈసారి దిగుమతులు 61 బిలియన్ డాలర్ల నుంచి 126 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు 13 బిలియన్ డాలర్ల నుంచి 31 బిలియన్ డాలర్లకు పెరిగాయి. జూన్ క్వార్టర్లో ఇంజనీరింగ్ ఎగుమతుల విలువ 25.9 బిలియన్ డాలర్లుగా, పెట్రోలియం ఉత్పత్తులు 12.9 బిలియన్ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 5.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ఎగుమతులను భారీగా పెంచుదాం
సాక్షి, అమరావతి: దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను ప్రస్తుతం ఉన్న 5.8 శాతం నుంచి 10 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రూ.1,07,730 కోట్లకుపైగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల్ని 2030 నాటికి రూ.2,52,750 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధన కోసం రంగాల వారీగా ప్రణాళికలను సిద్ధం చేసింది. రాష్ట్ర ఎగుమతుల్లో కీలకమైన నాలుగు రంగాల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఇతరత్రా మార్కెట్ అవకాశాలు, అమ్మకాలు, సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టిసారించింది. మత్స్యసంపద, ఫార్మాస్యూటికల్స్, రసాయనాలు, ముడి ఇనుము–స్టీల్ ఎగుమతుల్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటూ కాఫీ, గ్రానైట్, బైరటీస్, నిర్మాణరంగ పరికరాలు, ఎలక్ట్రికల్, కాటన్, దుస్తులు వంటి మరికొన్ని రంగాల్లో వ్యాపార అవకాశాలను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. అగ్రస్థానంలో ఉన్న 4 రంగాల ఎగుమతుల వాటా 2030 నాటికి 42.7 శాతానికి చేర్చాలని నిర్ణయించింది. దేశ ఎగుమతుల్లో మన రాష్ట్ర వాటాను 10%కి పెంచేందుకు కొన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఇదీ రోడ్‌మ్యాప్ సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం రూ.16,350 కోట్లుగా ఉన్న చేపలు, రొయ్యల ఎగుమతి 2030 నాటికి రూ.37,575 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకు పెద్దపీట వేయడమే కాకుండా కాకినాడ వద్ద బల్‌్కడ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటివల్ల ఫార్మా ఎగుమతులు ప్రస్తుతం ఉన్న రూ.12,300 కోట్ల నుంచి రూ.28,275 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు కర్మాగారంతోపాటు రాష్ట్రంలో పోస్కో, జిందాల్ వంటి సంస్థలు ఉక్కు తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఈ రంగంలో కూడా ఎగుమతులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కొత్త యూనిట్ల ఏర్పాటు, విస్తరణ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ముడి ఇనుము, ఉక్కు ఎగుమతుల విలువ రూ.7, 425 కోట్ల నుంచి రూ.17,100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రసాయనాల ఎగుమతులు రూ.10,725 కోట్ల నుంచి రూ.24,675 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. మినరల్ ఫ్యూయల్స్ రూ.3,300 కోట్ల నుంచి రూ.7,650 కోట్లకు, కాఫీ ఎగుమతులు రూ.3,900 కోట్ల నుంచి రూ.8,625 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
కరోనా టీకా సంస్థలకు బూస్ట్
న్యూఢిల్లీ: త్వరలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా కోవిడ్–19 టీకాలు వేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్ తదితర టీకాల తయారీ సంస్థలకు భవిష్యత్‌లో సరఫరా చేయబోయే వ్యాక్సిన్లకు సంబంధించి రూ. 4,500 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకునేందుకు తోడ్పడేలా బ్యాంక్ గ్యారంటీ అవసరం లేకుండా అడ్వాన్స్ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలను సడలించినట్లు వివరించాయి. దీనికి క్యాబినెట్ అనుమతి అవసరం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘క్రెడిట్ లైన్ రూపంలో ఈ నిధులు ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని భావిస్తున్నాను. ఇందుకు ఆర్థిక మంత్రికి అధికారాలు ఉంటాయి. దీనికి క్యాబినెట్ ఆమోదం అవసరం లేదు. ప్రభుత్వం తలపెట్టిన టీకాల కొనుగోలు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన స్థాయిలో వ్యాక్సిన్ల సరఫరాకు ఇది తోడ్పడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. దీని ప్రకారం ఎస్ఐఐకి రూ. 3,000 కోట్లు, భారత్ బయోటెక్‌కు సుమారు రూ. 1,500 కోట్లు లభిస్తాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్ఐఐ సీఈవో అదార్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. ‘దేశీయంగా టీకాల ఉత్పత్తి, పంపిణీకి తోడ్పడేలా విధానపరమైన మార్పులు చేయడంతో పాటు సత్వరం ఆర్థిక సహాయం చేయడంలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పూనావాలా ట్వీట్ చేశారు. మరోవైపు, పన్నుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనలకు సంబం ధించి ఫైనాన్స్ బిల్లు 2021కి చేసిన సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోవిడ్ వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం మినహాయింపు! విదేశాల నుంచి భారత్‌కు వచ్చే కోవిడ్–19 వ్యాక్సిన్లపై ప్రభుత్వం దిగుమతి సుంకం మినహాయించే అవకాశం ఉంది. విదేశీ వ్యాక్సిన్ల ధర తక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దిగుమతయ్యే వ్యాక్సిన్లపై ప్రస్తుతం 10% కస్టమ్స్ డ్యూటీ (దిగుమతి సుంకం) ఉంది. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల ప్రారంభంలో రష్యాకు చెందిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ భారత్‌లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. మరోవైపు అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా మోడెర్నా, జాన్సన్ సైతం ప్రభుత్వానికి విన్నవించాయి. దిగుమతి అయ్యే వ్యాక్సిన్లపై కస్టమ్స్ డ్యూటీతోపాటు 16.5% ఐ–జీఎస్టీ, సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ వసూలు చేస్తున్నారు. వ్యాక్సిన్లను భారత్‌కు సరఫరా చేసేందుకు అనుమతించాల్సిందిగా విదేశీ సంస్థలు భారత ప్రభుత్వాన్ని కోరిన వెంటనే కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో తమ వ్యాక్సిన్‌కు అనుమతి కోసం ఫైజర్ ప్రభుత్వాన్ని సంప్రదించిన సమయంలోనే సుంకం మినహాయింపు అంశంపై చర్చ మొదలైంది. ఐసీఏఐ, సీఏఏఎన్‌జెడ్ ఒప్పందానికి ఓకే.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆ్రస్టేలియా అండ్ న్యూజిలాండ్ (సీఏఏఎన్‌జెడ్) మధ్య కుదిరిన తాజా అవగాహన ఒప్పందానికి (ఎంవోయూ) కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సభ్యుల అర్హతలకు సంబంధించి రెండు సంస్థలూ పరస్పరం గుర్తింపునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భారత్‌కు రెమిటెన్సులు పెరిగేందుకు కూడా ఇది తోడ్పడగలదని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఐసీఏఐ, సర్టిఫైడ్ ప్రాక్టీసింగ్ అకౌంటెంట్ ఆస్ట్రేలియా మధ్య ఒప్పందానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు వివరించింది. తాల్చేర్ ఫెర్టిలైజర్ యూరియాకు సబ్సిడీ కోల్–గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా యూరియా ఉత్పత్తి చేసే తాల్చేర్ ఫెర్టిలైజర్స్ (టీఎఫ్ఎల్) కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన సబ్సిడీ విధానానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గెయిల్, కోల్ ఇండియా, ఆర్సీఎఫ్, ఎఫ్‌సీఐఎల్ కలిసి జాయింట్ వెంచర్‌గా 2015లో దీన్ని ఏర్పాటు చేశాయి. ఒరిస్సాలో ఎఫ్సీఐఎల్కి చెందిన తాల్చేర్ ప్లాంట్‌ను పునరుద్ధరించే దిశగా టీఎఫ్ఎల్ 12.7 లక్షల టన్నుల వార్షిక సామర్ధ్యంతో ప్లాంటును నిర్మిస్తోంది. యూరియా ఉత్పత్తికి సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, ఎల్ఎన్జీ దిగుమతి బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. -
అమెజాన్‌పై ఆరోపణలు.. రంగంలోకి ఈడీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ మారక చట్టం, దేశ నియమాలను ఉల్లంఘించిన ఆరోపణలపై ఈడీ రంగంలోకి దిగింది. కొన్ని మల్టీ–బ్రాండ్స్‌కు సంబంధించి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలపై అవసరమైన చర్యలు కోరుతూ ఈడీకి ఇటీవల వాణిజ్య మంత్రిత్వ శాఖ నుండి ఆదేశాలు అందిన నేపథ్యంలో.. విదేశీ మారక నిర్వహణ చట్టంలోని (ఫెమా) వివిధ సెక్షన్ల కింద దర్యాప్తు జరుగుతోంది. ఫ్యూచర్ రిటైల్‌ను నియంత్రించడానికి అమెరికాకు చెందిన అమెజాన్.. ఫ్యూచర్ రిటైల్ యొక్క అన్‌లిస్టెడ్ యూనిట్‌తో చేసుకున్న ఒప్పందాల ద్వారా చేసిన ప్రయత్నం ఫెమా మరియు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఫెమా, ఎఫ్‌డీఐ నిబంధనలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఉల్లంఘించాయంటూ వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్‌కు (డీపీఐఐటీ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిర్యాదు చేశాయి. -
డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం దురదృష్టకరం
న్యూఢిల్లీ: భారత్‌కు ప్రస్తుతం కల్పిస్తున్న వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను త్వరలో ఎత్తివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై భారత్ విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకరమైన పరిణామంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో భాగంగా అమెరికా విజ్ఞప్తులపై పరస్పర సమ్మతితో ముందుకుసాగేవిధంగా భారత్ పలు పరిష్కార మార్గాలను ప్రతిపాదించింది. కానీ, వాటిని అమెరికా అంగీకరించలేదు. ఇది దురదృష్టకరం’ అని వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరుదేశాల ఆర్థిక సంబంధాల్లో భాగంగానే ఈ అంశం కూడా కాలానుగుణంగా ఉమ్మడి సమ్మతితో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికాతో ఆర్థికపరంగానే కాకుండా పరస్పరం ఇరుదేశాల ప్రజల మధ్య బలమైన అనుబంధం కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపింది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. -
ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారం
న్యూఢిల్లీ: భారతదేశ ఎగుమతుల విలువ 2018 మే నెలలో 28.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2017 మే నెలలో ఎగుమతులతో పోల్చితే వృద్ధి రేటు 20.18 శాతంగా నమోదయ్యింది. ఇంత స్థాయి వృద్ధిరేటు ఆరు నెలల్లో ఇదే తొలిసారి. 2017 నవంబర్‌లో ఎగుమతుల్లో 30.55 శాతం వృద్ధి నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యాంశాలు చూస్తే... ♦ ఎగుమతులు పెరిగినా, వాణిజ్యలోటు తీవ్రత ఆందోళనకు గురిచేస్తోంది. ఎగుమతులు– దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇది మే నెలలో 14.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది జనవరిలో 16.28 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యింది. ♦ మే నెలలో దిగుమతులు కూడా భారీగా 14.85 శాతంగా నమోదయ్యాయి. విలువ రూపంలో 43.48 బిలియన్ డాలర్లు. ♦ పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఇంజనీరింగ్ రంగాలు ఎగుమతుల పెరుగుదలకు దారితీశాయి. అయితే జీడిపప్పు, ముడి ఇనుము, జౌళి, రత్నాలు–ఆభరణాలు, హస్తకళల ఉత్పత్తులు, కార్పెట్ విభాగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. ♦ పసిడి దిగుమతులు భారీగా 29.85 శాతం పతనమయ్యాయి. విలువ 4.96 బిలియన్ డాలర్ల నుంచి 3.48 బిలియన్ డాలర్లకు పడ్డాయి. ఏప్రిల్–మే నెలల్లో...: ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు– ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు 13 శాతం పెరిగి 54.77 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 9.72 శాతం పెరిగి 83.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 28.34 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 27.09 బిలియన్ డాలర్లు. -
సెజ్ పాలసీ అధ్యయనానికి గ్రూప్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (సెజ్) పాలసీ అధ్యయనానికి ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి దీనికి హెడ్‌గా వ్యవహరిస్తారని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘గ్రూప్ సెజ్ పాలసీని విశ్లేషిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎగుమతిదారుల అవసరాలను తీర్చేందుకు అవసరమైన సలహాలను సూచిస్తుంది. ఇతర వాటితో పోలుస్తూ పాలసీకి సంబంధించిన తులనాత్మక విశ్లేషణను రూపొందిస్తుంది’ అని వివరించింది. ఈ గ్రూప్ మూడు నెలల కాలంలో తన ప్రతిపాదనలను ఒక నివేదిక రూపంలో మంత్రిత్వ శాఖకు అందజేస్తుంది. ఇక గ్రూప్‌లో శ్రీసిటీ సెజ్ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి, కె రహేజ గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజ, టాటా స్టీల్ సెజ్ ఎండీ అరుణ్ మిశ్రా, మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్ ఎండీ అనిత అర్జున్‌దాస్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడ్, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (పరిశ్రమలు) సభ్యులుగా ఉంటారు. -
కెమికల్స్, పెట్రో సాయం!
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 25.67 శాతం పెరిగాయి. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. విలువ రూపంలో 28.61 బిలియన్ డాలర్లు. రసాయనాలు (46 శాతం), పెట్రోలియం (37 శాతం), ఇంజనీరింగ్ ఉత్పత్తుల (44 శాతం) ఎగుమతుల్లో భారీ వృద్ధి మొత్తం గణాంకాలకు సానుకూలమయ్యాయి. అయితే హస్తకళలు, ముడి ఇనుము, పండ్లు, కూరగాయల ఎగుమతులు అసలు పెరక్కపోగా 2017 సెప్టెంబర్‌కన్నా క్షీణించాయి. శుక్రవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ ఎగుమతులు–దిగుమతుల అధికారిక గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులు చూస్తే...: దిగుమతులూ 18 శాతం ఎగశాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో 31.83 బిలియన్ ఉన్న దిగుమతుల విలువ 2017 సెప్టెంబర్‌లో 37.6 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతులు 18.47 శాతం పెరుగుదలతో 8.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురుయేతర దిగుమతులు 18 శాతం పెరిగి 29.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్యలోటు యథాతథం... ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు దాదాపు నిశ్చలంగా ఉంది. 2017 సెప్టెంబర్‌లో 8.98 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదయ్యింది. 2016 సెప్టెంబర్‌లో ఈ విలువ 9 బిలియన్ డాలర్లు. పసిడి దిగుమతులు 5 శాతం డౌన్..! పసిడి దిగుమతులు ఐదు శాతం పతనమయ్యాయి. 1.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వృద్ధి బాటకు ఎగుమతులు వరుసగా పదమూడు నెలల నుంచీ ఎగుమతులు మొత్తంగా సానుకూల వృద్ధిని నమోదుచేసుకుంటున్నాయి. ఎగుమతులు తిరిగి వృద్ధి గాటన పడ్డాయనడానికి ఇది ఉదాహరణ. – సురేశ్ ప్రభు, వాణిజ్యశాఖ మంత్రి మరింత ముందుకు... జీఎస్టీకి సంబంధించి ఆందోళనలను పరిష్కరించడంలో కేంద్రం ముందుకు రావడం ఎగుమతుల వృద్ధికి ఒక కారణం. అంతర్జాతీయ అనిశ్చితి, రూపాయి ఒడిదుడుకులు, రక్షణాత్మక విధానాలు ఎగుమతులకు సవాళ్లను విసిరే అంశాల్లో కొన్ని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 310 బిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నాం. – గణేశ్ గుప్తా, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
ఎగుమతుల వృద్ధికి చర్యలు
కేంద్రం హామీ ఎగుమతి సంఘాల ప్రతినిధులతో భేటీ న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా నిరాశ కలిగిస్తున్న ఎగుమతుల రంగానికి ఊపునివ్వడానికి త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. వడ్డీ సబ్సిడీ స్కీమ్ పొడిగింపు కూడా ప్రోత్సాహకాల్లో ఒకటిగా సూచనప్రాయంగా తెలి పింది. ఎగుమతుల వృద్ధి కోసం వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం ఇక్కడ ఒక అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. వాణిజ్యశాఖ కార్యదర్శి రీటా తియోటియా ఈ సమావేశంలో మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఎగుమతుల ప్రోత్సాహక పథకాలకు కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.18,000 కోట్ల నుంచి రూ.21,000 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఎగుమతుల విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు. ప్రత్యేక ఆర్థిక జోన్లపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపు, రుణ సమీకరణ అలాగే లావాదేవీల భారం అధికంగా ఉండడం వంటి అంశాలను ఈ సందర్భంగా పలు ఎగుమతి మండళ్ల ప్రతినిధులు ప్రస్తావించారు. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్న అంశాల్లో ఇవి కూడా ఉన్నాయని తెలిపారు. ఆయా అంశాలను ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే... గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల విలువ 310.5 బిలియన్ డాలర్లను సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చేరుకోవడం కష్టమని కూడా అభిప్రాయపడ్డారు. ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఈ రంగం ప్రతినిధులు ఏమన్నారో చూస్తే... -
ఎగుమతులు 9వ నెలా తగ్గాయ్
న్యూఢిల్లీ : ఎగుమతుల క్షీణ పరిస్థితి కొనసాగుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం ఆగస్టు గణాంకాలను విడుదల చేసింది. 2014 ఆగస్టు నెల ఎగుమతుల విలువతో పోల్చిచూస్తే, 2015 ఆగస్టులో విలువ అసలు పెరక్కపోగా 21 శాతం క్షీణించింది. 21.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ విలువ 27 బిలియన్ డాలర్లు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, కమోడిటీ ధరల తగ్గుదల దీనికి ప్రధాన కారణం. దిగుమతులు చూస్తే... ఆగస్టు నెలలోనూ దిగుమతులు 10% క్షీణిం చాయి. 34 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వేర్వేరుగా చూస్తే.. చమురు దిగుమతుల బిల్లు 42.59% పడిపోయి 7.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 31 శాతం. మొత్తం ఎగుమతుల్లో ఒక్క పెట్రోలియం ప్రొడక్టుల వాటా 18 శాతం. కాగా చమురు యేతర దిగుమతుల విలువ 7.01 శాతం పెరిగి 26.38 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. భారీగా పసిడి దిగుమతులు.. ఎగుమతులు-దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు ఆగస్టు నెలలో 12.47 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రధాన దిగుమతి కమోడిటీ చమురు బిల్లు తగ్గినా... రెండవ ప్రధాన దిగుమతుల కమోడిటీ అయిన పసిడి దిగుమతులు అధికంగా వుండటం వల్ల వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణం. 2014 ఆగస్టులో వాణిజ్యలోటు 10.66 బిలియన్ డాలర్లు. కాగా 2015 ఆగస్టులో పసిడి దిగుమతులు 140 శాతం పెరిగాయి. 2.06 బిలియన్ డాలర్ల నుంచి 4.95 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్-ఆగస్టు) పసిడి దిగుమతుల విలువ 15.43 బిలియన్ డాలర్లు. 2014-15 మొత్తంలో ఈ దిగుమతుల విలువ 40.88 బిలియన్ డాలర్లు. -
బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలి
వాణిజ్య మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుకుంటున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా పేర్కొంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, మరో రెండు రోజుల్లో పార్లమెంటులో 2015-16 వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ గురువారం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఖేర్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ⇒ పలు ఆంక్షల వల్ల బంగారం దిగుమతులు తగ్గాయి. అనుకున్న క్యాడ్(కరెంట్ అకౌంట్ లోటు) లక్ష్యం నెరవేరింది. ఈ పరిస్థితుల్లో ఇక పసిడి దిగుమతి సుంకాలను తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కోరుకుంటోంది. ⇒ రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల వృద్ధికి ఇది అవసరం. జనవరిలో రత్నాలు, ఆభరణాల రంగాల నుంచి ఎగుమతులు 3.73 శాతం క్షీణించడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. ఈ రంగంలో ప్రస్తుతం 35 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. ⇒ ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పసిడి దిగుమతి సుంకం 2 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో గుర్తించిన కీలక రంగాల్లో రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కూడా ఒకటి.