న్యూఢిల్లీ: రత్నాలు– ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగం పురోగతికి రాబోయే బడ్జెట్‌లో కీలక చర్యలు ఉండాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక శాఖను కోరుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి ఆ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం..
► దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా బంగారం దిగుమతులపై సుంకాన్ని కేంద్రం జూలైలో 10.75 శాతం నుండి 15 శాతానికి పెంచింది. ఇందులో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం. వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (ఏఐడీసీ) 2.5 శాతంగా ఉన్నాయి.
► ప్రతి సంవత్సరం, రత్నాలు– ఆభరణాల ఎగుమతి పరిశ్రమ దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతుంది.
► రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) మాజీ చైర్మన్ కోలిన్ షా ఈ అంశంపై మాట్లాడుతూ, ఈ రంగంలో ఎగుమతులను పెంచడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి రాబోయే బడ్జెట్‌పై పరిశ్రమ ఆశలు పెట్టుకుందని అన్నారు. ఇందులో ప్రధానంగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు వివరించారు.
► మండలి అంచనా ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఆభరణాలకు రిపేర్ హబ్‌గా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ విధానం 400 మిలియన్ డాలర్ల వరకు ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుంది.
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022 ఏప్రిల్–నవంబర్ మధ్య రత్నాలు –ఆభరణాల ఎగుమతులు 2 శాతం పెరిగి 26.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే బంగారం దిగుమతులు 18.13 శాతం తగ్గి 27.21 బిలియన్ డాలర్లకు దిగాయి.
► భారతదేశం బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడంలో భాగంగా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిమాణం వార్షికంగా 800 నుంచి 900 టన్నుల వరకూ ఉంటుంది.
Budget 2023: ఆభరణాల ఎగుమతులుకు ఊతం ఇవ్వాలి
Published Sat, Jan 7 2023 6:00 AM | Last Updated on Sat, Jan 7 2023 6:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment