బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలి
వాణిజ్య మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుకుంటున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా పేర్కొంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, మరో రెండు రోజుల్లో పార్లమెంటులో 2015-16 వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ గురువారం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఖేర్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే...
⇒ పలు ఆంక్షల వల్ల బంగారం దిగుమతులు తగ్గాయి. అనుకున్న క్యాడ్(కరెంట్ అకౌంట్ లోటు) లక్ష్యం నెరవేరింది. ఈ పరిస్థితుల్లో ఇక పసిడి దిగుమతి సుంకాలను తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కోరుకుంటోంది.
⇒ రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల వృద్ధికి ఇది అవసరం. జనవరిలో రత్నాలు, ఆభరణాల రంగాల నుంచి ఎగుమతులు 3.73 శాతం క్షీణించడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. ఈ రంగంలో ప్రస్తుతం 35 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు.
⇒ ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పసిడి దిగుమతి సుంకం 2 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో గుర్తించిన కీలక రంగాల్లో రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కూడా ఒకటి.