Jewelery industry
-
ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం పట్టు!
ముంబై: ఆభరణాల మార్కెట్లో సంఘటిత రంగం వాటా ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–15 శాతం మేర పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద సంస్థలన్నీ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్న విషయాన్ని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా గుర్తు చేసింది. దీంతో స్థూల ఆర్థిక సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ సంఘటిత రంగం వాటా పెంచుకోగలదని ఇక్రా అంచనా వేస్తోంది. ఆభరణాల మార్కెట్ 2023–24లో విలువ పరంగా 8–10 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది. బంగారం ధరల్లో అస్థిరతల నేపథ్యంలో పరిమాణాత్మకంగా మార్కెట్లో పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చన్న అంచనాతో ఉంది. కాకపోతే బంగారానికి ఉన్న బలమైన సాంస్కృతిక అనుబంధం నేపథ్యంలో పండుగలు, వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్ మద్దతుగా నిలుస్తుందని వివరించింది. ‘‘చాలా మంది జ్యుయలరీ రిటైలర్లు 2023 అక్షయ తృతీయ సందర్భంగా ఆదాయంలో 15 శాతానికి పైగా వృద్ధిని చూసినట్టు పేర్కొన్నారు. బంగారం ధరలు పెరగడం, ఎక్కువ సంస్థలు దూకుడుగా రిటైల్ స్టోర్లను పెంచడం ఆదాయ వృద్ధికి మద్దతునిస్తుంది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ దాస్ పేర్కొన్నారు. జ్యుయలర్ల ఆపరేటింగ్ మార్జిన్ సౌకర్య స్థాయిలో 7.5–8 శాతం మేర వచ్చే రెండేళ్లు ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. -
పసిడికి ధన్‌తెరాస్ ధగధగలు..
న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్‌తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు. పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్‌తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్‌తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్‌తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్‌తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్‌తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు. -
World Gold Council: గొలుసుకట్టు ఆభరణాల సంస్థలకు మంచి రోజులు
న్యూఢిల్లీ: భారత రిటైల్ ఆభరణాల మార్కెట్లో గొలుసుకట్టు ఆభరణ విక్రయ సంస్థల వాటా వచ్చే ఐదేళ్లలో 40 శాతానికి వృద్ధి చెందుతుందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది. 2021 చివరికే చైన్ స్టోర్లు రిటైల్ మార్కెట్లో 35 శాతం వాటాను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. అంటే ఐదేళ్లలో మరో 5 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రగామి ఐదు రిటైల్ సంస్థలు వచ్చే ఐదేళ్లలో 800 నుంచి 1,000 వరకు ఆభరణాల విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తాయని డబ్ల్యూజీసీ తెలిపింది. భారత్‌లో జ్యుయలరీ మార్కెట్ నిర్మాణంపై ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. చిన్న, చిన్న విభాగాలుగా ఈ మార్కెట్ విస్తరించి ఉన్నందున, మొత్తం జ్యుయలరీ సంస్థలు ఎన్ని ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడింది. పలు వాణిజ్య సంఘాల అంచనాల ప్రకారం భారత్‌లో 5–6 లక్షల వరకు జ్యుయలరీ విక్రేతలు ఉండొచ్చని పేర్కొంది. సానుకూలతలు.. వినియోగదారుల అనుభవం, వినూత్నమైన డిజైన్లు, హాల్ మార్కింగ్ పట్ల అవగాహన పెరగడం, మెరుగైన ధరల విధానం, సులభతర వెనక్కిచ్చేసే విధానాలు, జీఎస్టీ, డీమోనిటైజేషన్ ఇవన్నీ కూడా భారత్‌లో చైన్ జ్యుయలరీ స్టోర్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపేలా చేసినట్టు డబ్ల్యూజీసీ వివరించింది. పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్న చిన్న ఆభరణాల విక్రేతలే ఇప్పటికీ మార్కెట్‌ను శాసిస్తున్నట్టు తెలిపింది. అయితే, గొలుసుకట్టు సంస్థల మార్కెట్ వాటా గత దశాబ్ద కాలంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ఈ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మరింత పెరిగేందుకు అవకాశాలున్నట్టు తెలిపింది. నిర్మాణాత్మక మార్పులు ‘‘భారత రిటైల్ జ్యుయలరీ మార్కెట్ గత దశాబ్ద కాలంలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులను చూసింది. విధానపరమైన ప్రోత్సాహకాలు, కస్టమర్ల ధోరణిలో మార్పు దీనికి దారితీసింది. తప్పనిసరి హాల్ మార్కింగ్ ఈ రంగంలో అన్ని సంస్థలు సమాన అవకాశాలు పొందేలా వీలు కల్పించింది. పెద్ద మొత్తంలో రుణ సదుపాయాలు, పెద్ద సంఖ్యలో ఆభరణాల నిల్వలను కలిగి ఉంటే సానుకూలతలు జాతీయ, ప్రాంతీయ చైన్ స్టోర్లు మరింత మార్కెట్ వాటా పెంచుకునేందుకు మద్దతుగా నిలుస్తాయి’’అని డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. చిన్న సంస్థలు మరింత పారదర్శకమైన విధానాలు అనుసరించడం, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా పెద్ద సంస్థలతో సమానంగా పోటీ పడడమే కాకుండా, తమ మార్కెట్ వాటాను కాపాడుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌లోనూ ఆభరణాల విక్రయాలు పెరుగుతున్నాయని, 5–10 గ్రాముల పరిమాణంలో ఉన్నవి, లైట్ వెయిట్, రోజువారీ ధారణకు వీలైన 18 క్యారట్ల ఆభరణాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. -
పసిడి ‘ధనత్రయోదశి’ ధగధగలు
ముంబై: ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేశవ్యాప్తంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. కరోనా కారణంగా గతేడాది డిమాండ్ తగ్గగా.. ఈ ఏడాది పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. కొనుగోళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. గతేడాదితో పోలిస్తే 40 శాతం పెరిగినట్టు పరిశ్రమ వర్గాలు చెప్పాయి. ఆన్లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. 15 టన్నుల ఆభరణాలు.. జ్యుయలరీ పరిశ్రమ కరోనా మహమ్మారి నుంచి కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) పేర్కొంది. ‘‘దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ మేర సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాలు విక్రయాలు ధనత్రయోదశి రోజున నమోదయ్యాయి’’ అని తెలిపింది. గత డిమాండ్ తోడవ్వడం, ధరలు అనుకూలంగా ఉండడం, లాక్డౌన్ ఆంక్షలు సడలిపోవడం డిమాండ్‌కు మద్దతునిస్తాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈవో సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి సంవత్సరాల్లోనే బంగారానికి అత్యంత మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ధనత్రయోదశి సందర్భంగా బంగారానికి డిమాండ్ గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరామ్‌గార్గ్ సైతం తెలిపారు. గతేడాదితో పోలిస్తే డిమాండ్ రెట్టింపైనట్టు ఆగ్మంట్ గోల్డ్ ఫర్ ఆల్ డైరెక్టర్ సచిన్ కొథారి పేర్కొన్నారు. 20–30 టన్నుల మేర.. ‘‘బంగారం ధరలు 2019తో పోలిస్తే పెరిగినప్పటికీ.. కరోనా ముందు నాటి స్థాయికి విక్రయాలు చేరుకుంటాయని అంచనా వేస్తున్నాము’’అని అఖిల భారత జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆవిష్ పెథే తెలిపారు. ఏటా ధనత్రయోదశి నాడు దేశవ్యాప్తంగా 20–30 టన్నుల బంగారం అమ్ముడుపోతోందని.. ఈ ఏడాది విక్రయాలు కొంచెం అధికంగానే ఉంటాయని పరిపరిశ్రమ వరా>్గలు వెల్లడించాయి. బంగారం ధరలు తులం రూ.57,000 స్థాయి వరకు వెళ్లి దిగి రావడం కూడా డిమాండ్‌కు కలిసొచ్చింది. ఢిల్లీలో బంగారం 10 గ్రాముల ధర రూ.47,644 (పన్నులు కాకుండా) పలికింది. అయితే 2020 ధనత్రయోదశి రోజున ఉన్న ధర రూ.39,240తో పోలిస్తే కాస్త పెరగడం గమనార్హం. బుధవారం ఉదయం వరకు త్రయోదశి తిథి ఉన్నందున ఆ రోజు కూడా బంగారం కొనుగోళ్లు కొనసాగనున్నాయి. హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనండి హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వద్ద నమోదైన వర్తకులకు చెందిన దుకాణాల్లో మాత్రమే హాల్‌మార్క్ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదార్ల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ‘బిల్లు/ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్‌మార్క్ ఆభరణాల విక్రయ బిల్లు, ఇన్వాయిస్లో.. ప్రతి ఆభరణం తాలూకు ప్రత్యేక వివరణ, విలువైన లోహం నికర బరువు, క్యారెట్లో స్వచ్ఛత, హాల్‌మార్కింగ్ రుసుమును సూచిస్తుంది’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
కానరాని ‘అక్షయ’ మెరుపులు.. టన్ను బంగారం కూడా అమ్మలేదు..
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం షాపుల ముందు కస్టమర్ల క్యూలు.. వినియోగదార్లతో కిటకిటలాడే దుకాణాలు. అక్షయ తృతీయ అనగానే సాధారణంగా ఇవే గుర్తొస్తాయి. ఇదంతా గతం. కోవిడ్–19 మహమ్మారి ఒక్కసారిగా మార్కెట్‌ను తారుమారు చేసింది. వరుసగా రెండవ ఏడాదీ పరిశ్రమను దెబ్బతీసింది. సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో జువెల్లరీ షాపులు మూతపడ్డాయి. పాక్షిక లాక్డౌన్ కొనసాగుతున్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని దుకాణాలే తెరుచుకున్నాయి. వీటిలోకూడా వినియోగదార్లు లేక వెలవెలబోయాయి. వైరస్ భయంతో కస్టమర్లు బయటకు రాలేదు. పుత్తడి కొనాలన్న సెంటిమెంటూ లేకపోవడంతో శుక్రవారం అక్షయ తృతీయ మెరుపులు కానరాలేదు. మరోవైపు పరిమిత సమయం దుకాణాలు తెరిచే అవకాశం ఉన్నా చాలాచోట్ల వర్తకులు ఆసక్తి చూపలేదు. ఒక టన్ను కూడా అమ్మలేదు.. సాధారణంగా అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా సుమారు 30 టన్నుల పుత్తడి అమ్ముడవుతుంది. ఈసారి ఒక టన్ను కూడా విక్రయం కాలేదని పరిశ్రమ వర్గాలు సమాచారం. ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, పుణేతోపాటు పుత్తడి అధికంగా విక్రయమయ్యే కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో ఆఫ్‌లైన్ సేల్స్‌పై తీవ్ర ప్రభావం పడిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ఆన్లైన్ విక్రయాలను వర్తకులు ప్రోత్సహించారని చెప్పారు. ‘90 శాతం రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉంది. ఈ రాష్ట్రాల్లో అమ్మకాలు నిల్. జరిగిన కొద్ది విక్రయాలు కూడా ఫోన్, డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగాయి. గతేడాది 2.5 టన్నులు విక్రయమైతే, ఈ ఏడాది 3–4 టన్నులు కస్టమర్ల చేతుల్లోకి వెళ్తుందని భావించారు. షాపులు తెరిచినచోట 10–15 శాతం సేల్స్ జరిగే అవకాశం ఉందని వర్తకులు అంచనా వేస్తున్నారు’ అని ఆల్ ఇండియా జెమ్స్, జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశిష్ పేథీ తెలిపారు. ఈ ఏడాది అక్షయకు 1 నుంచి 1.5 టన్నుల మధ్య సేల్స్ ఉండే అవకాశం ఉందని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ వెల్లడించారు. సానుకూలంగా లేదు.. గతేడాదితో పోలిస్తే 2021 అక్షయ తృతీయ భిన్నమైనదని కళ్యాణ్ జువెల్లర్స్ ఈడీ రమేశ్ కళ్యాణరామన్ తెలిపారు. సంస్థకు చెందిన 20 శాతం షోరూంలు మాత్రమే తెరుచుకున్నాయని, అది కూడా పరిమిత సమయమేనని చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కస్టమర్లు ఇష్టపడడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో సెంటిమెంట్ సానుకూలంగా లేదని పేర్కొన్నారు. ‘అక్షయ తృతీయ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు లాక్డౌన్లో ఉన్నాయి. రెండు మూడు రాష్ట్రాల్లో రిటైల్ షాపులు ఉదయం 6 నుంచి 10 వరకే తెరిచేందుకు అనుమతి ఉంది. ఇది కస్టమర్లకు అసాధారణ సమయం’ అని వివరించారు. కరోనాకు భయపడి వినియోగదార్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదని హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్ వ్యాపారి గుల్లపూడి నాగకిరణ్ కుమార్ తెలిపారు. షాపింగ్‌కు తక్కువ సమయం ఉండడం, పుత్తడి కొనాలన్న ఆలోచన కూడా కస్టమర్లలో లేదని అన్నారు. కోవిడ్–19 ముందస్తుతో పోలిస్తే అమ్మకాలు స్వల్పమని సిరివర్ణిక జువెల్లర్స్ ఫౌండర్ వడ్డేపల్లి ప్రియమాధవి చెప్పారు. -
మగువల అందాన్ని పెంచుతున్న వన్‌గ్రామ్ జ్యువెల్లరీ
సాక్షి, కరీంనగర్ బిజినెస్: ఆభరణాలు అతివల అందాలను రెట్టింపు చేస్తాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో నగలతోనే హడావిడి ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న బంగారం ధరలతో ఆభరణాలు చేయించుకోవాలంటే అందరికీ సాధ్యపడదు. చేయించుకున్నా వాటిని భద్రపర్చడం మరో సమస్యగా మారింది. ఈతరుణంలో మార్కెట్లో మహిళల కోసం వన్‌గ్రామ్ ఇమిటేషన్ జ్యువెల్లరీ నగలు అందరికీ ఆకర్షిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వీటికి మరింత గిరాకీ పెరిగింది. అచ్చుబంగారంలా కనిపించి వివిధ రకాల నూతన డిజైన్లలో లభ్యమవుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల మహిళలు మక్కువ చూపిస్తున్నారు. సంపన్నులను సైతం ఆకర్షించే డిజైన్లు ఉండడంతో రోజుకో డిజైన్ మార్చుతూ, సందర్భానికో ఆభరణం కొనుగోలు చేస్తున్నారు. ఇమిటేషన్ జ్యువెల్లరీ వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి మహిళల మనసుదోచే డిజైన్లను తెప్పించి సిద్ధంగా ఉంచుతుండటంతో గిరాకీ కూడా పెరుగుతోంది. ఎన్నో రకాలు.. వన్‌గ్రాం గోల్డ్ ఆభరణాల కొనుగోలుకు ఉద్యోగినులు, గృహిణులతోపాటు కళాశాల విద్యార్థులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వన్‌గ్రాం గోల్ట్షాపులు పెళ్లిళ్ల సీజన్లో కలకలలాడుతున్నాయి. స్టోన్ నెక్లెస్, నల్లపూసల దండలు, గ్లాస్లాగెట్స్, రింగ్స్, ఒడ్డాలం, వంకీలు, ముత్యాల హారాలు, జడపోతలు, కెంపుల హారాలు, సీజెడ్ స్టోన్స్ ఆభరణాలు, పాపడ బిల్లలు, మాటీలు, గాజులు, వెడ్డింగ్ కలెక్షన్లు, లాంగ్‌చైన్‌లు, త్రీబైఫోర్ చైన్లు, రాంపరివార్ మ్యాట్గోల్డ్ నగలుతోపాటు వివిధ రకాల వన్‌గ్రామ్ గోల్డ్నగలు లభిస్తున్నాయి. వివిధ చీరలకు మ్యాచింగ్ అయ్యేలా సెట్టింగ్ స్పెషల్ గాజులు ప్రస్తుతం న్యూట్రెండ్గా మారింది. దీంతో వివాహాది శుభకార్యాల్లో మహిళలు తమ చీరలకు తగ్గట్టుగా ఉండే కలర్స్ సెట్స్ ఎక్కువగా వాడుతున్నారు. వ్యాపారులు ఢిల్లీ, హైద్రాబాద్, బెంగుళూర్, ఫెరోజాబాద్ వంటి ప్రాంతాల నుండి ప్రత్యేకంగా వన్‌గ్రాం ఆభరణాలు తెప్పిస్తున్నారు. పెళ్లిళ్లసీజన్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మక్కువ పెరుగుతోంది.. మహిళలను ఆకట్టుకునే వన్‌గ్రాం ఇమిటేషన్ జ్యూవెల్లరీలో సరికొత్త రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు ఇమిటేషన్ జ్యూవెల్లరీని ఇష్టపడుతున్నారు. ప్రత్యేకంగా వీటిని ఫెరోజాబాద్, ఢిల్లీ నుంచి ఆభరణాలు తెప్పిస్తాం. బ్యాంగిల్ సెట్స్‌తో మొదలుకొని అన్ని రకాల ఆభరణాలు మా వద్ద ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. – శ్రీదేవి, ఆకర్ష్ లేడీస్ ఎంపోరియం యజమాని కొత్త డిజైన్లు బాగున్నాయి.. వన్‌గ్రాం గోల్డ్ఐటమ్స్లో కొత్త డిజైన్లు బాగున్నాయి. చీరలకు మ్యాచింగ్‌గా ఉండే సెట్స్‌లో ఆకర్షణీయంగా వివిధ రకాల మోడల్స్ ఉన్నాయి. దీంతోపాటు నెక్లెస్‌లు, హారాలన్నీ మోడల్స్ కూడా అచ్చుబంగారంలా కనిపిస్తాయి. బంగారంతో చేసిన నగలున్నప్పటికీ ఇమిటేషన్ జ్యూవెల్లరీ కూడా సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రావడంతో కొనుగోలు చేస్తుంటా. – మనీషా, గృహిణి -
నోట్ల రద్దుపై ఎవరేమన్నారంటే..
• పసిడికి తక్షణం ఇబ్బందే.. • ప్రభుత్వ నిర్ణయంపై జువెలరీ పరిశ్రమ అభిప్రాయం న్యూఢిల్లీ: దేశంలో రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం పసిడికి శుభ సూచకమని పరిశ్రమ పేర్కొంది. కరెన్సీ నోట్ల కన్నా, విలువైన మెటల్‌పై విశ్వాసం పెంచుకోవాలన్న అభిప్రాయం ఈ నిర్ణయం వల్ల ప్రజల్లో బలపడుతుందని పరిశ్రమ విశ్లేషించింది. పలువురి అభిప్రాయాలను చూస్తే... స్వల్పకాలానికి ప్రతికూల ప్రభావం... నిర్ణయం స్వల్ప కాలం ఇబ్బందిని కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూలత ఉంటుంది. అరుుతే మొత్తంగా చూస్తే- దేశానికి ఇది మంచిదే. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమకు సానుకూలం. కరెన్సీ నోట్లకన్నా, ఆభరణాలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. ఇక సాధారణ మానవునిపై తక్షణ ప్రభావాన్ని చూస్తే- మీరు కూరగాయలు కొనాలనుకుంటారు. చిన్న నోట్లు లేకపోతే మీరు ఏమిచేస్తారు? - మెహుల్ చోక్సి, గీతాంజలి జెమ్స్ సీఎండీ స్వల్పకాలిక ప్రభావం... ర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంలో మంచి నిర్ణయమే. ప్రత్యేకించి వ్యవస్థీకృత రం గానికి సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. పసిడికి డిమాండ్ పెరగడానికి దోహదపడుతుంది. - బల్రామ్ గార్గ్, పీసీ జ్యూయెలర్స్ ఎండీ అసంఘటిత రంగానికి సమస్య... దేశంలో అన్ని పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. పసిడికి సంబంధించి అసంఘటిత రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సంఘటిత రంగానికి మాత్రం సానుకూలమే. దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపే ప్రధాని ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. - జీ శ్రీధర్, జీజేటీఎఫ్ -
బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలి
వాణిజ్య మంత్రిత్వశాఖ న్యూఢిల్లీ: బంగారం దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుకుంటున్నట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా పేర్కొంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, మరో రెండు రోజుల్లో పార్లమెంటులో 2015-16 వార్షిక బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ గురువారం ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఖేర్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ⇒ పలు ఆంక్షల వల్ల బంగారం దిగుమతులు తగ్గాయి. అనుకున్న క్యాడ్(కరెంట్ అకౌంట్ లోటు) లక్ష్యం నెరవేరింది. ఈ పరిస్థితుల్లో ఇక పసిడి దిగుమతి సుంకాలను తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కోరుకుంటోంది. ⇒ రత్నాలు, ఆభరణాల తయారీ, ఎగుమతుల వృద్ధికి ఇది అవసరం. జనవరిలో రత్నాలు, ఆభరణాల రంగాల నుంచి ఎగుమతులు 3.73 శాతం క్షీణించడం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. ఈ రంగంలో ప్రస్తుతం 35 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. ⇒ ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పసిడి దిగుమతి సుంకం 2 శాతానికి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో గుర్తించిన కీలక రంగాల్లో రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కూడా ఒకటి.