న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్‌తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు.
పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్‌తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్‌తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది.
కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్‌తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్‌తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు.
ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్‌జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్‌తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment