గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల దూకుడు పెరగనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈవీలపై జీవితకాల పన్ను మినహాయించింది. దీంతో కొంతకాలంగా నగరంలో ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలు, కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. తాజాగా కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహాన్నిచ్చేలా రాయితీలను ప్రకటించింది. ఈ వాహనాలకు వినియోగించే బ్యాటరీలకు వాడే 35 రకాల ముడి పదార్థాలపై పన్ను మినహాయించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని రవాణారంగం నిపుణులు పేర్కొంటున్నారు.
15 శాతం నుంచి 20 శాతం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా. బైక్‌లపై గరిష్టంగా రూ.10 వేల వరకు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గవచ్చని ఆటో మైబైల్ డీలర్లు సైతం అంచనా వేస్తున్నారు. మరోవైపు 15 ఏళ్లు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా తుక్కుగా మార్చుకొంటే వాటి స్థానంలో కొనుగోలు చేసేవాటిపై సబ్సిబీ లభించనుంది. కాలపరిమితి ముగిసిన వాటిను తుక్కు చేసి కొత్తగా ఈవీలను కొనుగోలు చేస్తే మరింత ప్రయోజనం కలగనుంది.
లగ్జరీ వాహనాల ధరలు తగ్గుముఖం..
మరోవైపు కేంద్రం తాజా బడ్జెట్‌లో దిగుమతి చేసుకొనే వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో హైఎండ్ వాహనాల ధరలు కూడా తగ్గుముఖం పట్టనుంది. లగ్జరీ బైక్‌లు, కార్లు, బస్సులు, ఇతర వాహనాల ధరలు కూడా 12 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గనున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
ఈవీలకు ఇది ప్రోత్సాహకరం
ఈవీ ధరలు నేరుగా తగ్గకపోయినా బ్యాటరీ ముడి పదార్థాలపై పన్ను మినహాయించడం వల్ల ఈవీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తుంది. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయి. బ్యాటరీల తయారీకి వినియోగించే 35 రకాల పదార్థాలపై కేంద్రం పన్ను మినహాయింపునివ్వడం ఎంతో సంతోషంచదగ్గ అంశం. ఇది ఆటోమేటిక్‌గా ఎలక్ట్రిక్ వాహనాల ధరల తగ్గింపునకు దోహదం చేస్తుంది.
– సంధ్య, ఎలక్ట్రిక్ వాహన డీలర్
Comments
Please login to add a commentAdd a comment