రికార్డు స్థాయిలో బంగారం
10 గ్రాముల ధర రూ.87,500
పెళ్లిళ్ల సీజన్ కావడంతో సామాన్యుల ఆందోళన
జిల్లాలో 80 పైగా దుకాణాలు
పెళ్లిళ్ల వేళ పసిడి ధర చుక్కలు చూపిస్తుంది. గతేడాది కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించడంతో రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందే కొనేసుకుందాం అని అనుకున్నారు. కానీ పసిడి మాత్రం తగ్గేదేలే అంటూ పెరుగుతూ వస్తుంది. దీంతో శుభకార్యాలకు బంగారం కొనేవారు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం 10 గ్రాముల బంగారం రికార్డు స్థాయిలో రూ.87,500 పలికింది. వెండి ధర 10 గ్రాములకు రూ.970 నమోదు అయ్యింది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గత 20 ఏళ్లలో బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపు లేకుంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర కొండెక్కి కూర్చుంది. దేశీయంగా డాలర్ విలువ రూ.87.36 కావడంతో మన దేశంలో పసిడి మరింత భగ్గుమంటుంది. 2004 ఏప్రిల్ బంగారం ధర 10 గ్రాములు రూ.5,800 ఉంది. 2024 ఏప్రిల్ నాటికి రూ.71,300కు పెరిగింది. కాగా ఫిబ్రవరి 5న నాటికి ఎప్పుడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో రూ.87,500 పలికింది. వెండి 10 గ్రాములకు రూ.970 నమోదయ్యింది. గత డిసెంబర్‌లో రూ.72 వేలు, ఈ జనవరిలో రూ.74 వేలు ఉండగా వారం రోజుల్లోనే అమాంతంగా పెరిగింది. జిల్లాలో మెదక్ కేంద్రంగా బంగారం వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడ సుమారు 80 వరకు బంగారు దుకాణాలు ఉండగా, సీజన్‌లో రోజుకు రూ.కోటి టర్నోవర్ జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ధరలు పెరగడంతో గిరాకీ తక్కువగా ఉంటుందని వ్యాపారులు వాపోతున్నారు.
పెళ్లికి కొనలేని పరిస్థితి..
ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ ప్రారంభంకావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంట్లో పెళ్లి చేస్తే వధువుకు ఎంత లేదన్నా కనీసం 5 తులాల పైగానే బంగారం పెడుతుంటారు. ఈ మధ్యలో మగ పెళ్లివారు కట్న కనుకలు అడుగకుండా మీ అమ్మాయికి ఇంత బంగారం పెడితే చాలు అంటూ తేలిగ్గా చెప్పేస్తున్నారు. దీంతో పెళ్లి కూతురు తరఫున వారు బంగారం ధర చూసి నోరెల్ల బెడుతున్నారు. పెళ్లి ఖర్చుకంటే బంగారానికే ఎక్కువ ఖర్చు అవుతుందని, రూ.లక్షలు పెట్టి కొనలేక వెనక్కి తగ్గుతున్నారు. ఈ సీజన్‌లో పసిడి ధర మరింత పైకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తలకు మించిన భారం
బంగారం ధరలు ఇలా పెరిగితే ఎలా కొంటాం. ఆడ కూతుళ్ల పెళ్లీళ్లు చేయాలంటే మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారం అవుతోంది. ఈ రోజుల్లో ఎంత లేదన్నా అమ్మాయికి కనీసం 10 తులాలు పెట్టాలి. ఇలా ధరలు పెరిగితే వారి పరిస్థితి ఏంటి. ఈ రోజు రూ.87,500 తులం బంగారం ఉంది. ప్రభుత్వం స్పందించి బంగారం ధరలపై నియంత్రణ ఉంచేలా చర్యలు తీసుకోవాలి.
– కుకూనూరు స్వప్న, గృహిణి, పాపన్నపేట
Comments
Please login to add a commentAdd a comment