తెలంగాణలో మందస్తు జాగ్రత్త!
బెవరేజెస్ కంపెనీలకు ఎక్సైజ్‌శాఖ నుంచి ఆదేశాలు
నెలరోజులుగా ఉత్పత్తిని పెంచిన కంపెనీలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.
డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి..
సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్‌ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్‌లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్‌ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్‌ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.
డిమాండ్‌కు తగినట్టుగా
‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.
సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా..
సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్‌లైన్‌లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment