Summer Season
-
వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు
వేసవి ఉష్ణోగ్రతలకు చర్మం పొడిబారిపోతుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం కూడా కళా విహీనంగా తయారవుతుంది. చర్మ, ముఖం సౌందర్య రక్షణలో శతాబ్దాల తరబడి కలబంద లేదా అలోవెరా విశిష్టంగా నిలుస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం మొదలు, మొటిమల నివారణలో బాగా పనిచేస్తుంది.అలోవెరాలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మరి అలోవెరా, ఇతర మూలికలు, పదార్థాలతో కలిసి వేసుకునే మాస్క్‌ల గురించి తెలుసుకుందామా?జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద జెల్లో పాలీసాకరైడ్లు , గ్లైకోప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గాయం మానడాన్ని వేగవంతం చేసేలా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మంటను తగ్గించడానికి సాయ పడతాయి. ఇంకాకలబందలోని హైడ్రేటింగ్, యాంటీమైక్రోబయల్లక్షణాలు మొటిమలు, తామర లాంటి సమస్యల నివారణతోపాటు, చర్మం, పొడిబారడం, ఎర్రబారడం, పగుళ్లు, కాలిన గాయాలకు కూడా ప్రభావవంతంగా పనిస్తుందని అధ్యయనం పేర్కొంది.కలబంద ఫేస్ మాస్క్లుకలబంద - తేనె మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసువాలి. ఇది చక్కటి హైడ్రేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి పోషణనిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.కలబంద - పసుపు మాస్క్: పసుపు, తేనె లేదా రోజ్ వాటర్ వంటి మూలికలు , సుగంధ ద్రవ్యాలతో కలిపినప్పుడు, కలబంద చర్మ సంరక్షణ శక్తి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా సేంద్రీయ పసుపు , కలబంద మాస్క్, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్‌ను చిటికెడు పసుపుతో కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా కడగాలి. కలబంద -రోజ్ వాటర్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, టీస్పూన్ రోజ్ వాటర్ బాగా కలపాలి. దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఎరుపును తగ్గించి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.కలబంద - నిమ్మకాయ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి.దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. (బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడకూడదు). నిమ్మకాయ నల్ల మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.కలబంద-గ్రీన్ టీ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో, చల్లని గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ మాస్క్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. యవ్వనమైన, అందమైన చర్మాన్ని అందిస్తుంది.కలబంద-కీరా మాస్క్: కలబంద జెల్లో తురిమిన కీరా కలిపి దీన్ని సున్నితంగా ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది, అలసిపోయిన చర్మాన్ని డీపఫ్ చేయడానికి , హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.డిమాండ్‌కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
కూరగాయలకు ధరల మంట
సాక్షి, హైదరాబాద్: వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు దేశవ్యాప్తంగా తగ్గిన కూరగాయల సాగుతో వేసవి కాలం ముగిశాక వంటింట్లో అగ్గి రాజుకుంది. పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి. సాధారణంగా వేసవిలో కాయగూరల ధరలు పెరిగే అవకాశం ఉండగా, ఈసారి వేసవి ముగిసిన తరువాత ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటా యి. వంటింట్లో తప్పనిసరిగా వినియోగించే టమోటా, ఆలు, ఉల్లిగడ్డ ధరలు ఈ వారం రోజుల్లోనే దాదాపుగా రె ట్టింపయ్యాయి. బీర, కాకరకాయ, చిక్కుడు, దొండకాయ, సొరకాయ మొదలైన వాటి ధరలూ భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం రూ.20... ఇప్పుడు రూ.50 మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో ఉల్లిగడ్డ ఉత్పత్తి భారీగా పెరగడంతో అక్కడ ఉల్లిరైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తక్కువ ధరకే ఉల్లిగడ్డను మార్కెట్‌కు తేవడంతో దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ రేటు తగ్గింది. రిటైల్‌లోనే కిలో ఉల్లిగడ్డ రూ. 20 వరకు లభించింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అక్కడి అధికార బీజేపీ కూటమికి తక్కువ ఎంపీ సీట్లు రావడానికి కూడా ఉల్లిగడ్డల ధర తగ్గడమేనని అక్కడి ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చారు. ఉల్లిగడ్డకు ధర రాకపోవడంతో వేసవిలో అక్కడి రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేశారని తెలిసింది. దీంతో వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఉల్లిగడ్డకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పదిరోజుల క్రితం వరకు కిలో రూ.20–25 ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.45–50కి చేరింది. అన్ని కూరగాయల ధరలు పైపైకే.. హైదరాబాద్ కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన బోయినపల్లి మార్కెట్‌కు ప్రస్తుతం 22–24 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగువేల క్వింటాళ్లు తక్కువ. ఇక్కడి నుంచి కూరగాయలను చిల్లర వర్తకులు కొనుగోలు చేసి జంట నగరాల్లో విక్రయిస్తుండటంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలను పెంచే పరిస్థితి ఏర్పడింది. మాల్స్, సూపర్‌మార్కెట్లతోపాటు ఆన్లైన్ షాపింగ్ యాప్స్‌లోనూ కూరగాయల ధరలు భారీగానే ఉన్నాయి. రైతుబజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో 30–50 శాతం వరకు ధరలు అధికంగా ఉన్నాయి. టమోట కిలో రూ.60–70, ఆలుగడ్డ రూ. 45–50, పచ్చిమిర్చి రూ.80–100 మధ్య ఉన్నాయి. బీన్స్ ధరలు చెప్పలేనంతగా పెరిగాయి. వీటిని కిలోకు రూ. 110–120 మధ్య విక్రయిస్తున్నారు. బీరకాయ గత వారంలో కేజీ రూ.60 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.100కి చేరింది. చిక్కుడు నాణ్యతను బట్టి కిలోకు రూ.100పైనే ఉంది. క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీలతో పాటు పుదీనా, కొత్తిమీర తదితర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. ఈ నెలలోనే ఉల్లిగడ్డల ధరలు 21 శాతం, టమాటా ధరలు 36 శాతం, ఆలుగడ్డల ధరలు 20 శాతం, వంట నూనెల ధరలు 15 శాతం పెరిగినట్టు ఓ ఆర్థిక అధ్యయనం తెలిపింది. భారీగా తగ్గిన ఉత్పత్తి రాష్ట్రంలో ఏటా 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరమవుతాయని ఓ అంచనా. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల టన్నుల లోపే కూరగాయలు ఉత్పత్తి అవుతున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది. రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుండగా, కూరగాయల పంటలు మాత్రం 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగా 19 లక్షల టన్నుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచి వివిధ రకాల కూరగాయలు తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి. వేసవి నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లోనూ దిగుబడి తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. -
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!
వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోమ్ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్›్టబుక్స్ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్ బ్యాగ్ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్ రూమ్ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.అయితే పిల్లలు తిరిగి స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్రెడీ స్కూల్ అలవాటున్న పిల్లలను హాలిడేస్ మూడ్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?ప్రీస్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వారిని పేరెంట్స్ చాలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.చిన్నచిన్న పిల్లలకు స్కూల్ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్ స్కూల్’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.క్లాస్ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేయించాలి. లంచ్ బాక్స్, జ్యూస్ లేదా వాటర్ బాటిల్ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్ అడగాలి? వంటివి కూడా అలవాటు చెయ్యాలి.స్కూల్ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్ బ్యాగ్, పెన్సిల్ కేస్, యూనిఫాం, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది.ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.చిన్న పిల్లలకు షేరింగ్ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.ఇక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ పాఠశాలకు వెళ్లడం, స్కూల్ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్లో జాయిన్ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్ వర్క్ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్ వస్తుంది? అలాగే స్కూల్ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్ని ఆరా తియ్యాలి.అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్ చెయ్యించాలి.ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.ఇక స్కూల్‌కి సైకిల్ మీద వెళ్లే పిల్లల(టీనేజ్ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్ తప్పసరి ధరించేలా చూడాలి.అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.హోమ్‌వర్క్ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్ ఇప్పుడు చూద్దాం.రాగి కుకీలు..కావాల్సినవి..రాగి పిండి– ఒకటిన్నర కప్పులుఏలకుల పొడి– అర టేబుల్ స్పూన్గుడ్డు– 1ఉప్పు– తగినంతఅల్లం పొడి– కొద్దిగాకొబ్బరి పాలు, రైస్ బ్రాన్ ఆయిల్ – పావు కప్పు చొప్పునతయారీ..ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.ఓట్స్ ఇడ్లీ..కావాల్సినవి..ఓట్స్– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)నూనె– అర టేబుల్ స్పూన్మినప పొడి– 1 టేబుల్ స్పూన్శనగపిండి– అర టేబుల్ స్పూన్పెరుగు– 2 కప్పులుపసుపు, కారం– కొద్దికొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..కావాల్సినవి..ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,కొబ్బరి తురుము– అర కప్పు,ఉప్పు– తగినంత,నూనె– 1 టేబుల్ స్పూన్‌తయారీ..ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.హెర్బ్డ్ పొటాటోస్..కావాల్సినవి..బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి),ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి తురుము– కొద్దిగాతులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),చిల్లీ ఫ్లేక్స్– అర టేబుల్ స్పూన్ఒరేగానో తురుము– 1 టేబుల్ స్పూన్ (మార్కెట్లో దొరుకుతుంది)తేనె– 2 టేబుల్ స్పూన్లుఉప్పు– తగినంతతయారీ..ఒక బౌల్లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.స్టీమ్డ్ ధోక్లా..కావాల్సినవి..శనగపిండి – 1 కప్పు,ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,పంచదార – 1 టేబుల్ స్పూన్,పసుపు– 1 టీస్పూన్,నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్,ఉప్పు– తగినంత,బేకింగ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్నీళ్లు– సరిపడా,నూనె– 1 టీ స్పూన్‌తయారీ..శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్ వన్ అవుతారు. -
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్‌గా లాంగ్ ఫ్రాక్స్
వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్‌గా ఉండాలి అదే టైమ్‌లో స్టైలిష్‌గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్‌గా ఉంటున్నాయి. బోహోస్టైల్ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్‌గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.కలర్ఫుల్గా.. కంఫర్టబుల్‌గా..సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్‌లెస్ టాప్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్‌కోట్‌ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ సెట్ అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్‌కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్‌గా కనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్‌గా కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్‌కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్‌తో వెలిగిపోతుంది.ఓవర్కోట్లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్‌ను కూడా ఈ స్టైల్‌కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్‌గా వెలిగి΄ోవచ్చు.సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్‌కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్‌ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు! -
భయపెడుతున్న ఎండలు: వడదెబ్బతో ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రతీచోట 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం ఖాయం. జాగ్రత్తలు పాటించకుండా ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దానిని నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఎండలో వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పలు అంశాలు వెల్లడించారు. ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ఎండలో వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవుతుంది. ఎండకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. టోపీ, తలపాగానైనా తప్పకుండా ధరించాలి.సాక్షి: వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. కొబ్బరినీరు, గ్లూకోజ్, సల్ల, ఓఆర్ఎస్ నీటిని తాగించాలి. ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. మనిషికి తగినంత గాలి ఆడేలా చేయాలి. చుట్టూరా మంది గుమిగూడకూడదు. ఉప్పు కలిపిన ద్రవాలు, ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. కీరదోస ముక్కలు ఎక్కువగా తినిపించాలి.సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు.. లక్షణాలేంటి..?డీఎంహెచ్‌వో: తీవ్రమైన వడగాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిని కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.సాక్షి: వడదెబ్బకు గురైన వ్యక్తిలో కలిగే మార్పులేంటి.. ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వేడికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల సోడియంక్లోరైడ్, నీటి నిష్పత్తి తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ప్రతి గంటకు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతుంటారు. ఇలాంటి సమయంలో నీరు బాగా తీసుకోవాలి.సాక్షి: వడదెబ్బ ప్రమాదకరమేనా? అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే ఎలా?డీఎంహెచ్‌వో: వడదెబ్బ చాలా ప్రమాదకరం. మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం హైపోతలామస్ దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే సన్‌స్ట్రోక్, హీట్‌స్ట్రోక్ అంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదు.సాక్షి: ప్రథమ చికిత్స ఏంటి? ఎలా ఇవ్వాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తాగించడంతో పాటు చల్లని ప్రాంతంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా 65ఏళ్లు పైబడిన వారు బయటకు వెళ్లరాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండెజబ్బులు, బీపీ ఉన్న వారు వెళ్లవద్దు.సాక్షి: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?డీఎంహెచ్‌వో: ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ సమయం చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రికి వెళ్తే చికిత్స అందిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి.సాక్షి: ఎండలో వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ముఖ్యంగా ఎండకాలంలో వేడి కలిగించే పదార్థాలు తినకూడదు. కూల్‌డ్రింక్స్ అసలే తాగొద్దు. కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం. మజ్జిగ, కొబ్బరినీరు మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిగా చేసి అరస్పూన్ పొడిని గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఎనర్జీగా ఉంటుంది.- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్యాధికారిఇవి చదవండి: Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు -
ఎండలు బాబోయ్.. ఇక్కడికి చెక్కేద్దామా!
-
వేసవి కాలంలో.. కళ్ల మంటలా? అయితే ఇలా చేయండి!
ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చాలామందికి కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడి మంటలు రావడం సర్వ సాధారణం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం.ఇలా చేయండి..పాలలో కాని కలబంద రసంలో కానీ దూదిని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుందిగంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుందినిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు కలిపి కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా,స్వచ్ఛంగా ఉంటాయికళ్ళు మంటగా వుంటే చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీరు కళ్ళ లోని దుమ్ముకణాలు, మలినాలను తీసివేయడంలో సహాయపడుతుందిదూదిని రోజ్ వాటర్‌లో ముంచి కనురెప్పులపై 10–15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే కంటిగాయాలకి, కళ్ళ మంటలకి ఉపశమనం లభిస్తుందిదూదిని పాలలో ముంచి కంటిచుట్టు తుడవాలి. తర్వాత చల్లనినీటితో శుభ్రంగా కడుక్కోవాలిదోసకాయ ముక్కల్ని కట్ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే కళ్ళ మంట నుంచి ఉపశమనం పొందవచ్చుశుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని చల్లటి నీటితో తడిపి నీరంతా పిండేయాలి. ఆ వస్త్రంలో కొన్ని మల్లెపూలు లేదా నంది వర్ధనం పూలు ఉంచి కళ్లమీద ఆ వస్త్రాన్ని ఉంచుకుంటే చల్లగా ఉండడంతోపాటు తలనొప్పి తగ్గుతుందిపచ్చి బంగాళదుంపను చక్రాల్లా తరిగి ఆ ముక్కలను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళమంటల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి చదవండి: 'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా! -
ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే?
సెలవులొచ్చేది ఆటల కోసం, స్నేహాల కోసం బంధువుల కోసం, విహారాల కోసం, వినోదాల కోసం పిల్లలు ఇంతకాలం ఫోన్లలో కూరుకుపోయారు. వారిని ఫోన్ల నుంచి బయటకు తెండి. మీ బాల్యంలో సెలవుల్లో ఎలా గడిపారో అలా గడిపేలా చేయండి. పెద్దయ్యాక తలుచుకోవడానికి బాల్యం లేకపోవడానికి మించిన విషాదం లేదు.ఆటస్థలాలు లేని స్కూళ్లలో చదివించడం, ఆడుకునే వీలు లేని ఇళ్లలో నివసించడం, పార్కులు లేకపోవడం, ఆడుకోవడానికి తోటి పిల్లలు లేని వాతావరణంలో జీవించడం, ఇవన్నీ ఉన్నా పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవడం... వీటన్నింటి వల్ల పిల్లలకు స్కూల్, ఇల్లు కాకుండా తెలిసింది ఒకే ఒక్కటి. సెల్‌ఫోన్. పిల్లలకు సెల్ఫోన్లు ఇచ్చి వారు వాటిలో కూరుకుపోతే ‘అమ్మయ్య. మా జోలికి రావడం లేదు’ అనుకునే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు, విహారం, అనుబంధాల విలువ, కొత్త విషయాల ఎరుక ఎలా కలుగుతుంది?అందుకే వేసవి సెలవలు ఒక పెద్ద అవకాశం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు ్రపాంతాలలో వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎలా గడిపేవారో ఇప్పుడూ అలా గడిపే అవకాశం కల్పించవచ్చు. కాకుంటే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలను మోటివేట్ చేయాలి.బంధువులు– బంధాలు..బంధువులు ఎవరో తెలియకపోతే బంధాలు నిలవవు. ఎంత స్వతంత్రంగా జీవిద్దామనుకున్నా, సాటి మనుషుల విసిగింపును తప్పించుకుని తెగదెంపులు చేసుకుని బతుకుదామనుకున్నా మనిషి సంఘజీవి. అతడు బంధాలలో ఉండాల్సిందే. బంధాల వల్ల బతకాల్సిందే. పిల్లలకు బంధాలు బలపడేది, బంధాలు తెలిసేది వేసవి సెలవుల్లోనే. ఇంతకు ముందు పిల్లలు వేసవి వస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి పిన్ని, బాబాయ్, పెదనాన్న, తాతయ్య... వీళ్ల ఇళ్లకు వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. వారి పిల్లలతో బంధాలు ఏర్పరుచుకునేవారు.దీని వల్ల కొత్త ఊరు తెలిసేది. ఆటలు తెలిసేవి. కలిసి వెళ్లిన సినిమా అలా ఓ జ్ఞాపకంగా మిగిలేది. ఇవాళ పెద్దల పట్టింపులు పిల్లలకు శాపాలవుతున్నాయి. రాకపోకలు లేని బంధుత్వాలతో పిల్లలు ఎక్కడకూ వెళ్లలేని స్థితి దాపురించింది. దీనిని సరి చేయాల్సిన బాధ్యత పెద్దలదే. లేకుంటే పిల్లలు ఫోన్లనే బంధువులుగా భావించి అందులోని చెత్తను నెత్తికెక్కించుకుంటారు. జీవితంలో సవాళ్లు ఎదురైన సమయంలో ఒంటరితనం ఫీలయ్యి అతలాకుతలం అవుతారు.తెలుగు ఆటలు..సెలవుల్లో పిల్లలకు తెలుగు ఆటలు తెలియడం ఒక పరంపర. బొంగరాలు, గోలీలు, వామనగుంటలు, పరమపదసోపాన పటం, ఒంగుళ్లు–దూకుళ్లు, నేల–బండ, ఏడుపెంకులాట, పులి–మేక, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ ఆట, రైలు ఆట, ΄÷డుపుకథలు విప్పే ఆట, అంత్యాక్షరి, కళ్లకు గంతలు... ఈ ఆటల్లో మజా తెలిస్తే పిల్లలు ఫోన్ ముట్టుకుంటారా?కథ చెప్పుకుందామా..కథలంటే పిల్లలకు ఇష్టం. పెద్దలు చె΄్పాలి గాని. ఈ సెలవుల్లో రాత్రి పూట భోజనాలయ్యాక, మామిడి పండ్లు తిన్నాక, పక్కలు వేసుకుని అందరిని కూచోబెట్టి పెద్దలు కథలు చెప్తే ఎన్నెన్ని తెలుస్తాయి! ఎన్ని ఊహల కవాటాలు తెరుచుకుంటాయి. మర్యాద రామన్న, తెనాలి రాముడు, బేతాళుడు, సింద్బాద్, ఆలీబాబా, పంచతంత్రం, రామాయణం, మహాభారతం... భీముడిలోని బలం, అర్జునుడిలోని నైపుణ్యం... ఇవి కదా చె΄్పాలి.బలం కోసం తిండి..పిల్లలను సరిగ్గా గమనించి వారికి కావలసిన బలమైన తిండి తినిపించడానికి వీలయ్యేది ఈ సెలవుల్లోనే. బలహీనంగా ఉండే పిల్లలు, ఎదిగే వయసు వచ్చిన ఆడపిల్లలకు ఏమేమి వొండి తినిపించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ కాలంలో తినిపిస్తారు. శిరోజాల సంరక్షణ, చర్మ సంరక్షణ, పంటి వరుస సరి చేయించడం, జీర్ణశక్తిని ఉద్దీపన చేయడం, బంధువుల రాక వల్ల లేదా బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల పిల్లలందరికీ కలిపి వారికి వృద్ధి కలిగించే ఆహారం చేసి పెట్టవచ్చు. తోటి పిల్లలు పక్కన ఉంటే ఇష్టం లేకపోయినా పిల్లలు తింటారు.సెలవులొచ్చేది పిల్లల మానసిక, శారీరక వికాసానికి. కదలకుండా మెదలకుండా ఫోన్ పట్టుకుని కూచుని వారు ఈ సెలవులు గడిపేస్తే నింద తల్లిదండ్రుల మీదే వేయాలి... పిల్లల మీద కాదు.ఇవి చదవండి: Indian Navy Women Officers: సముద్రంపై సాహస సంతకం -
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
వేసవికి నప్పే.. వింటేజ్ స్టైల్ ఇదే..!
పెరిగే ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా ఉండాలి. మిక్స్ అండ్ మ్యాచ్ ఎంపిక క్యాజువల్ అనిపించాలి. పాతకాలపు కాంతులు కట్టిపడేస్తున్నట్టే ఉండాలి. వెస్ట్రన్ టచ్‌తో ఆకట్టుకునేలా ఉండాలి. కాలానికి తగినట్టు, కలర్ఫుల్గా కనిపించాలి. తమవైన నైపుణ్యాలను జోడించే ఫ్యాషన్ ఔత్సాహికులు వింటేజ్ స్టైల్‌ని మెరిపిస్తున్నారు. మట్టి రంగులు.. సాధారణంగా లేత రంగులను ఈ సీజన్‌కి ఎంచుకుంటాం. అయితే, వెస్ట్రన్ వింటేజ్ స్టైల్‌కి ముదురు గోధుమ, ఎరుపు, నారింజ ఈ సీజన్లో మొదటి వరసలో ఉంటాయి. ఈ రంగులు వెస్ట్రన్ వస్త్రధారణకు సహజ సౌందర్యాన్ని జోడించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రంగులు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తాయి. క్యాజువల్ వేర్కి సొగసును అందిస్తాయి. లేసులు, అల్లికలు.. ఈ సీజన్లో మరో ఆకర్షణగా కనిపించేది డెనిమ్ ఎలిమెంట్స్, లేసులు, అల్లికల అంచులు గల డ్రెస్సులు వెస్ట్రన్ ఫ్యాషన్‌లో మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇవి, డ్రెస్సులకు ఉల్లాసభరితమైన అలంకరణను జోడిస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ప్లెయిన్ స్వెడ్ టాప్ లేదా జాకెట్స్, అంచులతో డిజైన్ చేసినవి ఈ సీజన్ స్టైల్‌కి బాగా నప్పుతాయి. ఇవి మోడ్రన్ టచ్, వింటేజ్ స్టైల్‌తో ఆకట్టుకుంటాయి. డెనిమ్‌తో జత చేసే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ స్కర్టులు, బ్లేజర్లతో మ్యాక్సీ డ్రెస్సులు ధరిస్తే ఆధునికపు హంగులతో మెరిసి΄ోతారు. స్టెట్సన్ టోపీలు, కౌబాయ్ బూట్లు డ్రెస్సులకు వెస్ట్రన్ లుక్‌ని ఇట్టే తీసుకువస్తాయి. పూసల దండలు, ఇతర ఫ్యాషన్ జ్యువెలరీ, సన్నని హ్యాండల్ గల బ్యాగ్‌తో పూర్తిగా వింటేజ్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తారు. ఇవి చదవండి: Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్. -
Hot Summer చర్మానికి కావాలి చల్లదనం, ఈ మాస్క్‌లు ట్రై చేయండి!
వేసవి ఎండలు మండిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తగినన్ని నీళ్లు తాగుతూ బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ముఖ్యం. అలాగే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. చెమట పొక్కులు, దురదలు లాంటి రాకుండా ఉండాలంటే చర్మానికి సాంత్వన కలిగేలాకొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు మీకోసం ముఖ్యంగా ఎండ వేడినుంచి ఉపశమనం కలిగేలా అందుబాటులో ఉన్న సహజమైన పదార్థాల ద్వారా కొన్ని ఫేస్ మాస్క్‌లను చూద్దాం. హనీ-యోగర్ట్ మాస్క్ : ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడగాలి. వాటర్ మెలన్ మాస్క్: పుచ్చకాయ ముక్కలు అర కప్పు తీసుకుని చిదిమి గుజ్జు చేయాలి. ఆ గుజ్జును, నీటిని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోకోనట్ ఆయిల్-టర్మరిక్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో అర టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖం, మెడ, చేతులు, ΄ాదాలకు పట్టించాలి. కొంత ఆరిన తర్వాత (పూర్తిగా ఎండిపోకముందు) వేళ్లతో వలయా కారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. నూనె జిడ్డు పూర్తిగా వదలక΄ోయినప్పటికీ నీటితో కడిగి టిష్యూతో తుడవాలి తప్ప సబ్బు వాడరాదు. పపయా– హనీ మాస్క్: బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు అర కప్పు తీసుకుని బాగా చిదమాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. మింట్-కుకుంబర్ మాస్క్: కీరదోస కాయ చెక్కు తీసి అర కప్పు ముక్కలు తీసుకోవాలి. అందులో గుప్పెడు పుదీన ఆకులు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నోట్: ఎండలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా లభించే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. -
వేసవి ఉష్ణోగ్రత పెరగనుంది.. జర జాగ్రత్త! : వాతావరణశాఖ హెచ్చరిక
ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా.. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎండ తీవ్రత ఇలా.. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా.. మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మూడో వారానికి 40 డిగ్రీలు దాటగా, ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. ఏప్రిల్ 7న కొన్ని చోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆతర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈనెల రెండో వారం నుంచి సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి చదవండి: వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్! -
వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్!
వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది. వడదెబ్బ నివారణ గురించి పశువైద్యాధికారి సగ్గం మహేశ్ రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. ‘ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బబారిన పడతాయి.’ వడదెబ్బ ప్రాణాంతకమే.. వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటు పడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి. నివారణకు ముందస్తు చర్యలు.. వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళలో మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజుకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈద నివ్వాలి. గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తయిన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి నీరు చల్లాలి. వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషిత నీరు తాగకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డుపై వరిగడ్డివేసి మధ్యాహ్నం వేళ్లలో నీరివ్వాలి. షెడ్ల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడ గాల్పుల నుంచి, తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. పశువులకు గోమార్లు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలో అందుబాటులో ఉంచాలి. వడదెబ్బ లక్షణాలు.. వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి. అధిక దాహం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్‌హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది. వడదెబ్బ ప్రభావంతో చూలు పశువుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పశువుల్లో పునురుత్పత్తి ప్రక్రి య కుంటుపడుతుంది. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. చికిత్స ఇలా.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానికి పలుమార్లు కడగాలి. తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షన్లు వేయించాలి. రక్తంలోకి సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోలైట్స్ అందిస్తే నీరసం నుంచి పశువులు బయటపడతాయి. - సగ్గం మహేశ్, పశువైద్యాధికారి -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా కొనసాగనున్న “వాటర్ బెల్”
పాఠశాలల పునః ప్రారంభం (జూన్ 12వ తేదీ) తర్వాత కూడా “వాటర్ బెల్” విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు (ఏప్రిల్ 23వ తేదీ) వరకు ప్రతిరోజు వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా డీఈవోలకు సూచించారు. అంతేగాక మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని గుర్తించి నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా వారు గుర్తించేలా పోస్టర్‌ను జతపరిచామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పోస్ట్‌కార్డ్ సైజులో ముద్రించి ప్రతి మూత్రశాల మరియు టాయిలెట్ బ్లాక్ ముందు అతికించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా వస్తే పారదర్శకంగా ఉందని, నీరు అధికంగా త్రాగుతున్నారని అర్థం. లేత గోధుమ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నారని, తగినంత నీరు త్రాగుతున్నారని అర్థం. లేత పసుపు రంగు వస్తే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగు వస్తే నీరు తక్కువగా త్రాగుతున్నారని, మరి కొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో వస్తే శరీరానికి సరిపడినంత నీరు అందడం లేదని అర్థం. ముదురు గోధుమ రంగులో వస్తే వెంటనే ఎక్కువ నీరు త్రాగాలని విద్యార్థులకు సూచించేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన టోషికో మొరిమోటో, యాసుయో ఆబే, అమెరికన్ స్కాలర్స్ పటేల్ ఏఐ మరియు లాస్ ఏంజిల్స్‌కు చెందిన బోర్రుడ్ ఎల్జి, నెదర్లాండ్స్‌కు చెందిన డచ్ స్కాలర్స్ మెక్కీ టీఈ, ఫాగ్ట్ ఎస్ ఈటీ ఏఐ, ఇతరులు నిర్వహించిన పరిశోధనలు ఈ విధానం యొక్క ఆవశ్యకతను నిర్ధారించాయని ప్రవీణ్ ప్రకాష్ వివరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండ వేడిమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
నెల ముందే.. నిప్పులు చెరిగే సూరీడుతో.. జర జాగ్రత్త!
మే నెలకు ముందే సూరీడు నిప్పులు కక్కుతుండటం ఆందోళనకర పరిణామం. ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరికల క్రమంలో మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాతావరణ శాఖ కొలమానం ప్రకారం 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ప్రజలకు, పంటలకు ప్రయోజనం. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు నమోదైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 41–45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ అలర్ట్‌గా భావించాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని.. అలాగే 45కు పైగా ఉష్ణోగ్రత చేరిందంటే.. మానవాళి ప్రమాదంలో ఉన్నట్లు, రెడ్ అలర్ట్‌గా నిపుణులు చెబుతున్నారు. గత అయిదు రోజులుగా ఉష్ణోగ్రతల తీరిలా. ఎండ ప్రభావం.. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పంటలపైనా ప్రభావముంటుంది. వేడి ప్రభావాన్ని అడ్డుకునేందుకు పొలాల మధ్య ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పండ్ల తోటలకు కొంత నష్టం కలిగే అవకాశముంది. – డా.జి.మంజులత, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రైతులు ఉదయం 9 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి చేరుతున్నారు. సాధారణ ప్రజలు ఈ ఎండలకి అల్లాడిపోతున్నారు. శనివారం ఎండ తీవ్రత 44 డిగ్రీలు నమోదు కాగా.. ఆదివారం కూడా 44 డిగ్రీలు దాటింది. గతేడాది ఇదే సమయంలో పలుచోట్ల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి కూడా అదే రీతిలో నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. అసలే వరి కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో ఎండలు దంచి కొడుతుండటంతో రైతులు ఉదయం 6 గంటలకు వెళ్లి 9 గంటలకే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. పగటి పూట ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితేనే బయటకి వస్తున్నారు. వ్యవసాయం పరంగా పంటలు చివరి దశకు చేరడంతో ఎండిపోయే ప్రమాదం కనపడుతోంది. రోజురోజుకి మారుతున్న ఎండ తీవ్రత నుంచి, వీచే వడగాలుల నుంచి జాగ్రత్తలు వహించక తప్పదు. దాహానికి తగ్గ పానీయాలు సేకరించాలి. చిన్న పిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇకపై ఈ ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇవి చదవండి: సోమావతి అమావాస్య అంటే..రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు? -
వేసవి కూల్ కూల్‌గా..!
వేసవి కాలం రాకముందే ఎండ మండిపోతుంది. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! సాక్షి, హైదరాబాద్: గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు కూడా. జాగ్రత్తలివే.. ► ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. ► ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ► ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ► ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ► దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. వర్ణాల ఎంపిక ఇలా.. ► గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ► మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. ► తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. ► గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కని్పంచే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కని్పంచేలా అలంకరించుకోవచ్చు. -
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్‌తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్‌ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్‌లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్‌లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్‌తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది. -
వేసవి తాపం : మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా!
వేసవి కాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వేసవి తాపానికి అల్లాడవలసిందే. అయితే కూల్డ్రింకులు, ఇతర శీతల పానీయాలకు బదులుగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, చెరుకు రసం, పళ్లరసాలు, మజ్జిగ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచింది. వడదెబ్బ తగలకుండా, శరీరం డీ-హైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఇవి చాలా అవసరం. ముఖ్యంగా చవగా, ఈజీగా లభించే మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. వేసవికాలంలో రోజూ రెండుసార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో, వాటిని ఎలా పుచ్చుకోవాలో చూద్దాం... మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజూ మజ్జిగను తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది. గ్లాసు పల్చటి మజ్జిగలో చిటికడు సొంఠి, చిటికడు సైంధవ లవణం కలుపుకుని తాగితే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, దబ్బాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు.. శక్తి కూడా చేకూరుతుంది. వేసవి వేడికి తిన్న ఆహారం అరగక ఒక్కోసారి వాంతులు అవుతుంటాయి. అలాంటప్పుడు చిటికడు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రెండుసార్లు మజ్జిగను తీసుకోండి. -
బొద్దింకలు, చీమలతో విసిగిపోయారా? ఇవిగో చిట్కాలు!
వేసవికాలం వచ్చిందంటే చీమలు, బొద్దింకల బెడద ఎక్కువవుతుంది. వేసవిలోనే ఈ సమస్య ఎందుకుపెరుగుతుందో తెలుసా? మరి వీటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అనేక ఇతర జంతువుల వలె, చీమలు కూడా గడ్డకట్టే శీతల ఉష్ణోగ్రతల నుంచి బయటికొస్తాయి. శీతాకాలంలో నిద్రాణస్థితిలో ఉంటాయి. కొద్దిగా వాతావరణం మారగానే బొద్దింకలు, చీమలు, ఇతర కీటకాలకు ఆహారం కోసం బయటికి రావడం మొదలు పెడతాయి. ఉష్ణోగ్రత వేడెక్కడం ప్రారంభించిన తర్వాత, చీమలు కొత్త గూళ్ళు నిర్మించడం ప్రారంభిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన చీమలు మరింత చురుకుగా జతకడతాయి. సంతానం ఉత్పత్తి చేస్తాయి. ఇది సహజ జీవన చక్రంలో భాగం మాత్రమే. నీరు, వేడి లేదా ఆహారం కోసం వెతుకులాటలో చీమలు, బొద్దింకలు ఈ విషయంలో 'మాస్టర్స్’ అని చెప్పొచ్చు. చీమలు, బొద్దింకల నివారణకు రసాయనాలు, పాయిజన్‌తో నిండిన హిట్, బోరాక్స్ పౌడర్, ఇతర స్ప్రేలతో పోలిస్తే కొన్ని సహజ నివారణ పద్ధతులు పాటించడం ఉత్తమం. వంటగది షెల్ఫుల్లో కొన్ని లవంగాలు లేదా బిర్యానీ ఆకులు ఉంచండి. ఈ ఆకుల నుండి వచ్చే బలమైన వాసన బొద్దింకలు, చీమలకు పడదు అందుకే అవి ఉన్నచోటికి సాధారణంగా రావు. దోసకాయ ముక్కలుగానీ, దోసకాయ తొక్కలుగానీ చీమల రంధ్రాల దగ్గర ఉంచండి. అలాగే బత్తాయిలు, నిమ్మకాయలు, నారింజ పండ్ల తొక్కలు కూడా బాగా పనిచేస్తాయి. బొద్దింకలు, ఇతర కీటకాలకు ఈ వాసన పడదట. వైట్ వెనిగర్ ను కూడా స్ప్రే చేయవచ్చు. ఇంకా ఈగలు, బొద్దింకలు వంటి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే దాల్చిన చెక్క పొడి , పుదీనా ఆకులను ఒక గిన్నెలో వేసి ఉంచాలి. చీమల సమస్యకు కాఫీ పొడి చల్లినా కూడా ఫలితం ఉంటుంది. చెత్త డబ్బాలు తరచుగా క్లీన్ చేయంగా, ఓపెన్‌గా గాకుండా బిగుతుగా ఉండేలా మూతలు పెట్టాలి. నోట్: ఈగలు, చీమలు, బొద్దింకలు, బల్లులు ఇలాంటివి మన వంట ఇంటి ముఖం చూడకుండా ఉండాలంటే. పరిశుభ్రత చాలా ముఖ్యం. ఆహార పదార్థాలు, పండ్లపై మూతలు కచ్చితంగా పెట్టాలి. వంట ఇంటి సింక్‌లో గంటల తరబడి అంట్ల గిన్నెలను వదిలేయ కూడదు. రాత్రి పూట అసలు వదిలేయ కూడదు. సాధ్యమైనంతవరకు ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. -
ఎండాకాలం..మండే కాలం : ఏసీ మెయింటెనెన్స్ టిప్స్
వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందుంది చెడుకాలం అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం అన్ని జాగ్రత్తలతో సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్ళల్లో అయితే మరింత అప్రమత్తత అవసరం. నంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ చిట్కా ఏమిటంటే ప్రతి సంవత్సరం ఏసీని సర్వీసింగ్ చేయించడం. ఎండలు మండించే దాకా వేచి ఉండకుండా ఏసీలు ఉన్న ఇళ్లలో ఏసీ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవసరమైతే గ్యాస్ పట్టించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెలవారీ ఎయిర్ ఫిల్టర్లను చెక్ చేసుకోవాలి. ఎయిర్ కండీషనర్ సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసుకోవాలి. కండెన్సర్ యూనిట్ చుట్టూ ఖాళీ 4-అడుగుల ప్లేస్ వదలాలి. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు ఏసీ బిల్లు తడిచి మోపెడు కాకుండా ఉండాలంటే అవసరం లేనపుడు ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. విండో ఫిల్మ్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. వేసవిలో ఇది మన ఇంటిని చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. వేసవి ఇతర జాగ్రత్తలు వేసవి రాగానే ఫ్రిజ్‌లో పెట్టే వాటర్ బాటిళ్లు మరో సెట్ కొని సిద్ధం చేయడం ఆనవాయితీ. ఫ్రిజ్ బాటిళ్లతోపాటు మట్టి కుండ నీళ్లను వాడటం ఉత్తమం. మట్టి కుండలోని నీటి రుచి ఈ తరం బాల్యానికి పరిచయం చేయండి. ఇంటి కిటికీలకు వట్టివేరు తడికలను కర్టెన్లుగా వేయడానికి ప్రయత్నించండి. పర్యావరణహితంగా ఇంటిని చల్లబరుచుకుందాం. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
కూల్ డ్రింక్స్ అతిగా సేవిస్తే.. ఎంత ముప్పో తెలుసా? చివరికి...!
నేటి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక వేసవిలో అయితే కూల్ డ్రింక్స్ వినియోగం గురించి చెప్ప నక్కర లేదు. క్షణం కూడా ఆలోచించకుండా పసిపిల్లలకు కూడా తాగిస్తున్నారు. తాగిన ఆ కాసేపు రుచిగా, హాయిగా అనిపించినా, శీతల పానీయాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే షాకవుతారు. అతిగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణుల హెచ్చరికల్ని ఒకసారి గమనించండి! నలుగురు కలిసిన చోట, పార్టీల్లోనూ, శుభకార్యాల్లోనూ కూల్‌డ్రింక్స్ ఒక స్టేటస్‌గా సింబల్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరకు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఫ్రిజ్‌లలో స్టోర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కొందరైతే కూల్ డ్రింక్ తాగితే తప్ప తిన్నది అరగడం లేదు అనే స్థాయికి వచ్చేశారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం శీతల పానీయాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు ..ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు: శీతల పానీయాలు, సోడాల్లో వినియోగించే శుద్ధిచేసిన చక్కెర (ఒక్కో బాటిల్లో దాదాపు 10 టీ స్పూన్ల వరకు) అధికంగా ఉంటుంది. కేలరీలు, కెఫిన్ మోతాదు కూడా ఎక్కువే. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడంతో లెప్టిన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. డయాబెటిక్: రక్తపోటు ముప్పు పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదాన్ని చేకూరుస్తుంది. శీతల పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రధాన కార్బోహైడ్రేట్ అని గుర్తించాలి. ఫ్యాటీ లీవర్: శుద్ధి చేసిన చక్కెరలో ఉండే ప్రధానమైనవి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్. శరీర కణాలు గ్లూకోజ్‌ను సులభంగా జీర్ణం చేస్తాయి. కానీ ఫ్రక్టోజ్‌ను అరిగించే పని మాత్రం కాలేయానిదే. కూల్ డ్రింక్స్ఎక్కువైతే ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్‌కు దారితీస్తుంది. కాలేయం ఈ ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. దీంతో లీవర్ సమస్యలొస్తాయి. గుండె, కీళ్ల, సమస్యలు: శీతల పానీయాలు ఎక్కువైతే గుండె ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. అలాగే వీటిల్లోని మితిమీరిన కెఫిన్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమై గౌట్ , కీళ్లలో వాపు లేదా నొప్పి వస్తాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. పంటి సమస్యలు: సోడాల్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ దీర్ఘకాలంలో పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇవి చక్కెరతో కలిపినప్పుడు, ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియాకి కారణమవుతాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ కేన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్టు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే ప్రమాదం. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవశరీరంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపే శీతల పానీయాలకు బానిసలైన వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి. -
చిట్టి..చిట్టి మినప వడియాలు.. ఎన్ని లాభాలో..!
వేసవి కాలం వచ్చిందంటే వడియాలు, అప్పడాలు, ఆవకాయ తదితర పచ్చళ్ళ సందడి షురూ అవుతుంది. వీటిని సంవత్సరం మొత్తానికి సరిపోయేలా తయారు చేసుకోవడంలో గృహిణులు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా గుమ్మడి వడియాలు పిండి వడియాలు, మినప,పెసర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలా ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి సులువుగా తయారు చేసుకునే చిట్టి మినప వడియాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..! చిట్టి చిట్టి మినప వడియాలు తయారీకి కావాల్సినవి అరకిలో మినపప్పు (తొక్కతో ఉన్నదైతే వడియాలు గుల్లగా వస్తాయి) పచ్చిమిరపకాయలు బాగా కారం ఉండేవి 10 కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం తయారీ ముందు రోజు రాత్రి నాన బెట్టి ఉంచుకున్న మినప పప్పును శుభ్రంగా కడిగి గ్రౌండర్లోగానీ, రోటిలోగానీ మెత్తగా రుబ్బు కోవాలి. ఎక్కువ జారుగా కాకుండా, గట్టి ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి కారం కలిపిన తరువాత మరింత జారుగా అయిపోతుంది పిండి. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం కలుపుకోవాలి. ఆ తరువాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి(ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు) బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని శుభ్రమైన తడి గుడ్డపై గానీ, ప్లాస్టిక్ కవరైగానీ వేసుకుని ఎండబెట్టుకోవాలి. చక్కగా గల గల మనేలా డేలా ఎర్రటి ఎండలో రెండు మూడు రోజులు ఉంచాలి. వీటిని గుడ్డనుంచి తీసిన తరువాత ఒక బేసిన్లో వేసుకుని మరోసారి ఎండలో పెట్టాలి. పచ్చి లేకుండా బాగా ఎండాయో లేదో చెక్ చేసుకొని వీటిని తడిలేని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ చిట్టి వడియాలు కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలతో కలిపి ఇగురు కూరలా చేసుకోవచ్చు. చాలా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. పులుసు కూరల్లో వాడుకోవచ్చు. సైడ్ డిష్‌గా కూడా భలే ఉంటాయి. మినప పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పిల్లలకు, పెద్దవాళ్లతోపాటు అందరికీ మంచిది. మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది -
'మార్చి' వచ్చింది.. బోండాం 'కొట్టు..'
‘కొబ్బరి నీళ్ల జలకాలాడి కోనాసీమ కోకాగట్టి’... అని రాశాడు వేటూరి. కొబ్బరి నీళ్లతో జలకాలాడే భాగ్యం సామాన్యుడికి లేదు. పూర్వం కొన్ని బావుల్లో నీళ్లు కొబ్బరి నీళ్లలా అనిపించేవి. జనానికి ఆ బావి ఫేవరెట్‌గా ఉండేది. ‘ఎన్ని ఫ్యాన్లున్నా ఒక్క ఏసీకి సమానం కావు గందా’ అని ముళ్లపూడి వెంకట రమణ అన్నట్టు ఎన్ని బిస్లరీ బాటిళ్ల నీళ్లైనా ఒక్క కొబ్బరిబోండాంకు సమానం కావు. సృష్టి మొత్తం మీద గర్భాన తియ్యటి, శుభ్రమైన నీళ్లను దాచుకున్న కాయ కొబ్బరికాయ మాత్రమే. పండ్ల రసాలు తయారు చేసేటప్పుడు ఏదో ఒక మేరకు ఇన్ఫెక్ట్ కావచ్చు. కాని కొబ్బరినీళ్లను కలుషితం చేయలేము. అందుకే వేసవి వచ్చిందంటే ఎండలో కాయకష్టం చేసేవారికి, రోజంతా రోడ్ల పై తిరిగే సన్న జీవులకి, కార్లలో తిరిగే కలిగిన వారికీ కూడా కొబ్బరినీళ్లు ప్రాణధార. అదేమిటోకాని కొన్ని విషయాలు విశ్వామిత్రుడి అకౌంట్లో పడ్డాయి. పౌరాణిక విశ్వాసాల ప్రకారం కొబ్బరికాయ బ్రహ్మదేవుని సృష్టి కాదట. విశ్వామిత్రుడిది అట. ఎవరు సృష్టించినా భారతీయులకు కొబ్బరికాయ లేకుండా పూట గడవదు. భక్తి కలిగిన వారికి పూజల్లో, జఠరాగ్ని కలిగిన వారికి వంటల్లో కొబ్బరి తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి మార్చి వచ్చిందంటే గెలలు గెలలుగా దిగే కాయ కత్తికి సర్రున తెగుతూ తన నీటితో జిహ్వకు జీవం పోస్తుంది. కాని కొబ్బరి నీళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకొని ఉండి వాటిని సేవించడం మంచిది. ప్రయోజనాలు.. కొబ్బరి నీళ్లు పోషకాలు, ఎలక్ట్రోలైట్లను ఇస్తాయి. ఒక రకంగా కొబ్బరి నీళ్లు నోటి ద్వారా ఒంట్లో చేరే సెలైన్బాటిల్తో సమానం. మన శరీరానికి రోజుకు కనీసం 280 మిల్లిగ్రాముల సోడియం కావాలి. ఒక కొబ్బరిబోండాంలో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే శరీరానికి కావాల్సిన సోడియం రోజుకు సరిపడా అందినట్టే. ఇక పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు ఉత్తమ లవణ జలం. వీటిని మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు, లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి కొబ్బరినీళ్లు ఉత్తమ సహాయకారి. ఎండల్లో వాంతులు, విరేచనాలు అవుతుంటే కొబ్బరినీళ్లను మెల్లమెల్లగా ఎక్కువసేపు తాగితే శరీరం పుంజుకుంటుంది. ఎండ వల్ల చర్మం టాన్ అయితే కొబ్బరినీళ్లతో బాగా రుద్దితే ఆ టాన్ పోతుంది. ముఖంపై మొటిమలు ఉంటే కొబ్బరినీళ్లలో ముంచిన దూదితో శుభ్రం చేస్తే అవి పోతాయి. వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసన పోవాలంటే కొబ్బరినీళ్లు తాగాలి. జీర్ణక్రియకు మంచిది. కొబ్బరినీళ్లలో ఉన్న పొటాషియం బీపీని నియంత్రించడానికి, కిడ్నీల పని తీరుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలో యాలకుల పొడి చిటికెడు వేసుకుని తాగితే అరికాళ్లలో మంటలు తగ్గుతాయి. ‘దేహమే దేవాలయం’ అన్నారు. దేవాలయంలో కొబ్బరికాయ కొడితే ఏ ఆధ్యాత్మిక ఫలితాలు కలుగుతాయో, కొబ్బరినీళ్లు తాగితే దేహమనే దేవాలయానికి అవే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి చదవండి: వయాగ్రా..! నవజాత శిశువుల పాలిట వరం! -
టేస్టీగా..కూల్..కూల్‌గా, ఐస్ క్రీమ్స్ ఇలా చేస్తే పిల్లలు ఫిదా!
ఇంకా మార్చి నెల రాకముందే ఎండ సుర్రుమంటోంది. దీనికి తోడు పిల్లలకు గుర్తు రాకపోయినా సరే... మనింట్లో ఇడియట్స్‌బాక్స్ అదేనండీ.. టీవీ, రకరకాల ఐస్ క్రీమ్‌ల యాడ్స్‌తో ఊరిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు ఊరుకుంటారా? అందుకే పిల్లలను పార్లర్‌కు పరుగు పెట్ట నివ్వకుండా.. ఇంట్లోనే కూల్ కూల్‌గా.. టేస్టీగా ఈజీగా ఐస్ క్రీమ్స్ తయారు చేసేద్దాం..! ఇంట్లోనే హెల్దీగా ఇలా ట్రై చేయండి ఆరెంజ్ ఐస్ క్రీమ్ కావలసినవి: చల్లటి పాలు – అర లీటరు (ఫుల్ క్రీమ్ టిన్డ్ మిల్క్); చక్కెర – 100 గ్రాములు; కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్; ట్యాంగ్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు (ఆరెంజ్ ఫ్లేవర్); మీగడ – వంద గ్రాములు; ఆరెంజ్ ఎసెన్స్ – నాలుగు చుక్కలు. తయారీ: అర కప్పు పాలలో కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బీటర్ లేదా ఫోర్క్‌తో బాగా కలపాలి. మరో పాత్రలో మిగిలిన పాలను పోసి చక్కెర వేసి అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను వేసి కలుపుతూ మీడియం మంట మీద మరో ఐదు నిమిషాల సేపు మరిగించి దించేయాలి. పాలు చల్లారిన తర్వాత అందులో ట్యాంగ్ పౌడర్, క్రీమ్ వేసి బీటర్‌తో బాగా చిలకాలి. మృదువుగా తయారైన మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరు గంటల తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసి తిరిగి అదే పాత్రలో పోసి మళ్లీ అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల సేపు ఉంచితే ఐస్‌క్రీమ్ గట్టిగా సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు కప్పులో వేసి సర్వ్ చేయాలి. చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ కావలసినవి: మీగడ 2 కప్పులు; పాలు 3 టేబుల్ స్పూన్లు; కోకో పౌడర్-3 టేబుల్ స్పూన్లు; కండెన్స్డ్ మిల్క్- అర కప్పు; చాకొలెట్ చిప్స్ -కప్పు; బ్రౌన్ షుగర్-కప్పులో మూడవ వంతు (బ్లీచ్ చేయని చక్కెర, అది లేకపోతే మామూలు చక్కెర తీసుకోవచ్చు) తయారీ: ∙మీగడను పన్నెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙వెడల్పుగా ఉన్నపాత్రలో పాలు పోసి చిన్న మంట మీద వేడి చేయాలి. పాలు మరగాల్సిన అవసరం లేదు, వేడయితే చాలు (పాశ్చరైజేషన్ జరగని పాలయితే మరిగించి వేడి తగ్గే వరకు పక్కన ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడాలి). అందులో కోకో పౌడర్ వేసి బీటర్‌తో కలపాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసి మొత్తం కలిసే వరకు బీటర్‌తో చిలకాలి. ఇప్పుడు చక్కెర వేసి చిన్న మంట మీద వేడి చేస్తూ కరిగే వరకు చిలకాలి. చక్కెర కరిగిన తర్వాత దించేసి చల్లారే వరకు మిశ్రమాన్ని పక్కన ఉంచాలి. ఫ్రిజ్‌లో ఉన్న మీగడను బయటకు తీసి సమంగా కలిసే వరకు చిలకాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకుని పక్కన ఉంచిన కోకో మిశ్రమాన్ని మీగడలో వేసి చిలికినట్లు కాకుండా నిదానంగా కలపాలి. ఇప్పుడు చాకొలెట్ చిప్స్ వేసి ఒకసారి కలిపి (చాకొలెట్ చిప్స్ అన్నీ ఐస్‌క్రీమ్‌లో ఒకచోట చేరకుండా అక్కడొకటి అక్కడొకటి వచ్చేటట్లు కలిపితే చాలు) మిశ్రమం మొత్తాన్ని ఒక ట్రేలో పోసి అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి ఫ్రీజర్‌లో పెట్టాలి. పది గంటల తర్వాత ట్రేని బయటకు తీసి ఐదారు నిమిషాల తర్వాత అల్యూమినియం ఫాయిల్ తొలగించి ఐస్‌క్రీమ్‌ని కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. వెనీలా ఐస్ క్రీమ్ కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ -400 గ్రా; చిక్కటి మీగడ – 200 గ్రా; వెనీలా ఎక్స్ట్రాక్ట్ - 2 టీ స్పూన్లు. తయారీ: ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ముందు రోజు రాత్రి మీగడను ఫ్రీజర్‌లో పెట్టాలి. అలాగే ఒక ఖాళీ పాత్రను కూడా ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి. కనీసం పది లేదా పన్నెండు గంటలసేపు ఉంచాలి. ∙ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరవాత మీగడను ఫ్రిజ్‌లో చల్లబరిచిన పాత్రలో వేసి ఏడు లేదా ఎనిమిది నిమిషాల సేపు చిలకాలి. చిలికేటప్పుడు మొదట మెల్లగా చిలుకుతూ క్రమంగా వేగం పెంచాలి. ఆ తరవాత అందులో కండెన్స్డ్ మిల్క్ వేసి మెల్లగా చిలకాలి. ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో పోసి సమంగా సర్ది అల్యూమినియం ఫాయిల్ పేపర్ అమర్చి అంచులకు క్లిప్ పెట్టాలి. పేపర్ ఐస్ క్రీమ్ మిశ్రమంలోకి జారి పోకుండా ఈ ఏర్పాటు. ఈ ట్రేని పన్నెండు గంటల సేపు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో నుంచి బయటకు తీసిన తర్వాత ఐదారు నిమిషాల సేపు కదిలించకూడదు. ఆ తర్వాత ట్రే మీద కవర్ చేసిన అల్యూమినియం ఫాయిల్‌ని తొలగించి ఐస్‌క్రీమ్‌ని పెద్ద స్పూన్‌తో తీసి కప్పుల్లో వేసి సర్వ్ చేయాలి. ఈ ఐస్ క్రీమ్ కోసం స్టవ్ వెలిగించే పనే లేదు. కావలసిన వస్తువులన్నీ రెడీమేడ్‌గా దొరికేవే కాబట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ల సహాయం లేకుండా సొంతంగా చేసుకోవచ్చు. -
మిక్స్డ్ వెదర్‌తో మహా డేంజర్! డాక్టర్ల కీలక సూచనలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వేసవి కాలం చివరి రోజుల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రమంతా ఉదయం నుంచే 40 నుంచి 45 డిగ్రీల ఎండలు హీటెక్కిస్తున్నాయి. వడగాడ్పులతోపాటు అప్పుడప్పుడు సాయంత్రం అకస్మాత్తుగా గాలివాన కురియడంతో వాతావరణం చల్లబడుతోంది. అదీగాక వేసవి సీజన్ ముగిసిపోతుండటంతో ఎండలు చండప్రచండంగా మారుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ శాఖ నివేదికలున్నా.. ప్రతీ ఏడాది ఇవి ఆలస్యంగానే వస్తున్నాయి. అందువల్ల మరికొన్ని రోజులపాటు ఇలాంటి ‘మిక్స్డ్ వెదర్’తోనే ప్రజలు నెట్టుకురాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియాలు, వైరస్లు చురుగ్గా ఉండి దాడి చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా మసలుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాలి అటు వేడి, ఇటు చల్లదనం వంటి మధ్యస్థ వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు యాక్టివ్‌గా ఉంటాయి. మన శరీరాలు కూడా అటు వేడికి, ఇటు చల్లటి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అలాంటి సమయం కోసం వైరస్లు, బ్యాక్టీరియాలు వేచిచూసి దాడిచేస్తాయి. టైఫాయిడ్, సీజనల్ జ్వరాలు, గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెంజా వైరస్ల వంటివి వచ్చే అవకాశాలు అధికమవుతాయి. ఇలాంటి వాటికి ఆహారాన్నే ఔషధంగా మార్చుకుని తిప్పికొట్టాలి. ఫ్రైడ్ పదార్ధాలు, జంక్‌ఫుడ్ వంటివి మానేయాలి. అప్పటికప్పుడు వేడిగా తయారుచేసిన ఆహారపదార్థాలు తీసుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీరు లేదా పరిశుభ్రమైన నీటిని తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడే వ్యాధినిరోధక« శక్తిని పెంచుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి తీవ్ర ఎండ వేడిమి నుంచి చల్లటి వాతావరణానికి మారినపుడు అనేక జబ్బులు వ్యాపిస్తాయి. ఇంకా తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నందున వడదెబ్బ తగులకుండా, డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగడంతోపాటు సహజమైన పళ్లరసాలు వంటివి తీసుకోవాలి. దోమలు, ఎలుకలు వంటి వాటి ద్వారా నీరు.. గాలి ద్వారా ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాప్తి చెందుతాయి. డెంగీ, మలేరియా వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం నీటిలో తడిచిన ప్రతీసారి ఫ్రెష్‌గా స్నానం చేయాలి. ఏడాదికోసారి ఫ్లూవ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. -
ప్రత్యేక రైళ్లకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో వేసవి రద్దీ పెరిగింది. పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు జనం పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో నడిచే రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జూన్ నెలాఖరు వరకు అందుబాటులో ఉండేవిధంగా వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఆ రైళ్లలోనూ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరడం గమనార్హం. హైదరాబాద్ నుంచి కటక్, బికనేర్, రెక్సాల్, పట్నా తదితర ప్రాంతాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో జనం పడిగాపులు కాయాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతి రోజు సుమారు 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, మరో 100 వరకు ప్యాసింజర్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. ఈ స్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది ప్రయాణంచేస్తారు. మరో 60 వేల మంది వరకు కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి తదితర స్టేషన్ల నుంచి ప్రయాణిస్తారు. వేసవి సందర్భంగా గత నెల రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్లనుంచి సుమారు 3 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. సొంత ఊళ్లకు వెళ్లేవారికంటే ఆధ్యాత్మీక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని సమాచారం. దీంతో తిరుపతి, విశాఖ, ముంబై, షిరిడీ, ఢిల్లీ, వారణాసి, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు తాకిడి పెరిగింది.గతంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 50 నుంచి 70 ప్రత్యేక రైళ్లను నడిపితే ఇప్పుడు వాటి సంఖ్య సగానికిపైగా తగ్గడం గమనార్హం. అన్ని సదుపాయాలతో భారత్ గౌరవ్ రైళ్లు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ పర్యాటక రైళ్లలో వందశాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ వేసవి సీజన్లో సికింద్రాబాద్ నుంచి ఇప్పటి వరకు 8 రైళ్లు బయలుదేరాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని ఆధ్యాత్మీక క్షేత్రాలను సందర్శించేందుకు ఈ రైళ్లలో వెళుతున్నారు. ‘పూరీ– కాశి– అయోధ్య‘పేరుతో ఐఆర్సీటీసీ ఇటీవల భారత్ గౌరవ్ రైలును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ రైలులో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీయే అన్ని రకాల సేవలను అందజేస్తోంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతో పాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర అన్ని ఏర్పాట్లు ఉంటాయి. రైలులో సీసీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, గయా విష్ణు పాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్ రాజ్ తదితర ప్రాంతాలను సందర్శించ వచ్చు.8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ ట్రైన్లో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇప్పటి వరకు నడిచిన 8 ట్రిప్పుల్లో రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్ కావడం విశేషం. -
రోజురోజుకు పెరుగుతున్న ఎండలు
రోజురోజుకు పెరుగుతున్న ఎండలు -
బెల్ట్ తొడుక్కుంటే.. ఎండలో హాయిగా తిరుగొచ్చు
ఎండాకాలం బయటకు అడుగు పెట్టాలంటే కష్టమే! ఎండలు మండిపడుతున్నప్పుడు వీథుల్లోకి వెళితే ఒళ్లంతా వేడెక్కి, ముచ్చెమటలతో తడిసి ముద్దయిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎండలు భగభగమని మండిపడుతున్నా, బయటకు వెళ్లాలంటే ఇదివరకటి కాలంలో గొడుగులు ఉపయోగించేవారు. గొడుగులు తల మీద కాస్తంత నీడనివ్వగలవేమో గాని, ఒంటికి చల్లదనాన్ని ఇవ్వలేవు. అయితే, ఈ ఫొటోలోని వ్యక్తి తొడుక్కున్న బెల్ట్‌లాంటిది మీరూ తొడుక్కుంటే, ఎండలో కూడా హాయిగా బయట వ్యాహ్యాళికి వెళ్లొచ్చు. ఎందుకంటే, ఇది ఏసీ బెల్ట్. కెనడా కంపెనీ ‘స్పార్కల్ టీమ్’ దీనిని రూపొందించింది. ‘స్పార్కల్ టోర్నడో’ పేరిట రూపొందించిన ఈ బెల్ట్ చుట్టూ ఐదు ఫ్యాన్లు ఉంటాయి. ఇది 12 వోల్టుల రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని ఫ్యాన్లు చప్పుడు చేయకుండా తిరుగుతూ, 500 మిల్లీమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఉన్న గాలిని చల్లబరుస్తాయి. ఇవి నిమిషానికి 583 లీటర్ల గాలిని చల్లబరుస్తూ, ఒంటికి వేడి సోకకుండా రక్షణనిస్తాయి. ఇందులోని బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకుంటే, మూడుగంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. మూడుగంటల కంటే ఎక్కువసేపు బయట ఎండలో గడపాల్సి వస్తే, పవర్‌బ్యాంక్‌ను వెంట తీసుకుపోవడం ఉత్తమం! ‘స్పార్కల్ టీమ్’ క్రౌడ్ ఫండింగ్ ద్వారా దీని ఉత్పత్తి చేపట్టనుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. చదవండి👉 ట్విటర్ సీఈవోగా లిండా నియామకం.. ఎలాన్ మస్క్‌పై ప్రశంసల వర్షం! -
నిండా ముంచిన అకాల వర్షాలు.. 16 జిల్లాలపై ప్రభావం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని 16 జిల్లాలపై ప్రభావాన్ని చూపాయి. నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, విజయనగరం, వైఎస్సార్, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, గుంటూరు, చిత్తూరు, పార్వతీపురం మన్యం, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ఏలూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 119 మండలాల పరిధిలో 372 గ్రామాల్లో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా వర్షాలు, పిడుగులకు 951 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సుమారు 20 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. పలుచోట్ల విద్యుత్ లైన్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. పిడుగులు పడే అవకాశం కాగా మరో మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతర్గత తమిళనాడు నుంచి మధ్య ఛత్తీస్‌గఢ్ వరకు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణల మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. కాగా సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
సమ్మర్ రష్: కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ జోరు
న్యూఢిల్లీ: దేశంలో కన్జ్యూమర్ ఉత్పత్తుల తయారీ సంస్థలు వేసవి సీజన్ కోసం పూర్తి సన్నద్ధమయ్యాయి. ఏటా వేసవిలో సహజంగానే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్లు ఇతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. దీంతో రానున్న మూడు నెలల్లో డిమాండ్‌ను కంపెనీలు ముందే అంచనా వేస్తున్నాయి. కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తిని గడిచిన 18 నెలల్లోనే గరిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఇప్పటికే అసాధారణంగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా ఉండొచ్చన్నది కంపెనీల అంచనా. ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా! వైట్‌గూడ్స్ తయారీ సంస్థలు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, చెస్ట్ ఫ్రీజర్లను 90-100 శాతం సామర్థ్యం మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో వీటి ఉత్పత్తి 60-70 శాతం పరిధిలోనే ఉండడం గమనించాలి. అంతేకాదు వేసవి డిమాండ్‌కు ఎఫ్ఎంసీజీ కంపెనీలు, బీర్ కంపెనీలు కూడా పూర్తి సామర్థ్యం మేరపనిచేస్తున్నాయి. ‘‘చాలాకాలం తర్వాత మా ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేర పనిచేస్తున్నాయి. అంతకుముందు మార్చి నెలతో పోలిస్తే ప్రస్తుతం విక్రయాలు ఇప్పటికే 20 శాతం అధికంగా నమోదవుతున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) -
పులులకు ‘ఎండదెబ్బ’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న పులుల మరణాలు కలవర పరుస్తున్నాయి. ఈ ఏడాది రెండు నెలల్లోనే 34 పులులు మరణించాయి. ముఖ్యంగా ఎండాకాలం వాటి పాలిట మృత్యువుగా మారుతోంది. గత పదేళ్ల గణాకాలు కూడా అదే చెబుతున్నాయి. మార్చి నుంచి మే చివరి వరకు పులుల మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. దాంతో ఈ వేసవిలో పులుల సంరక్షణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. 2012–2022 మధ్య పదేళ్లలో దేశవ్యాప్తంగా 1,062 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్రలో 184, కర్ణాటకలో 150 పులులు మరణించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో తొమ్మిది పులులు మృత్యువాత పడ్డాయి. 2020లో 106, 2021లో 127, 2022లో 121 పులులు మరణించాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిల్లోనే 34 ప్రాణాలు కోల్పోవడం విషాదం. వీటిలో మధ్యప్రదేశ్‌లో 9, మహారాష్ట్రలో 8 మరణాలు సంభవించాయి. గడిచిన పదేళ్ల రికార్డులు చూస్తే మార్చిలో 123, ఏప్రిల్‌లో 112, మేలో 113 మరణాలు నమోదయ్యాయి. అంటే పదేళ్లలో వేసవిలో ఏకంగా 348 పులులు చనిపోయాయి! తస్మాత్ జాగ్రత్త ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటొచ్చన్న అంచనాల నేపథ్యంలో పులుల సంరక్షణకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాత్రిళ్లు అభయారణ్యాల్లో సఫారీలను ఆపేయండి. అక్రమ నిర్మాణాలపై నిఘా పెంచండి’’ అని పేర్కొంది. వేసవిలో పులుల మరణాలకు ఇవీ కారణాలు... ► ఎండాకాలంలో నీరు, ఆహారం కోసం తమ ఆవాసాలను దాటి దూరంగా రావడం ► అభయారణ్యాలనుంచి బయటకు వచ్చేయడం ► ఆహారం కోసం పులుల మధ్య పోరాటాలు ► అడవుల్లో పచ్చదనం తగ్గడం, బఫర్ జోన్లు లేకపోవడం ► అటవీ భూముల నరికివేత, సమీప ప్రజల్లో అడవి జంతువులపై అసహనం, భయంతో కొట్టి చంపడం -
ఎండలు.. జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా సూచనలు చేసింది. దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని పేర్కొంది. దాహం వేసేంతవరకు వేచిచూడడం మంచి సూచిక కాదని తెలిపింది. పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను వదిలి వెళ్లవద్దనీ, వాహనం లోపల ఉష్ణోగ్రత ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించింది. ►బయటకు వెళ్లేప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను వినియోగించాలి. నిమ్మరసం, మజ్జిగ, లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు, ఉప్పు కలిపిన పండ్ల రసాలను తీసుకోవాలి. పుచ్చ, కర్బూజ, ఆరెంజ్, ద్రాక్ష, వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న సీజనల్ పండ్లు, కూరగాయలను తినాలి. అలాగే పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు, కూరగాయలు తినాలని సూచించింది. సన్నని వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం మంచిది. గొడుగు, టోపీ, టవల్ వంటి ఇతర సాంప్రదాయ పద్ధతుల్లో తలను ఎండ వేడి నుంచి రక్షించుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు బూట్లు లేదా చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►బాగా వెంటిలేషన్ ఉన్న చల్లని ప్రదేశాల్లో ఉండాలి. ప్రత్యక్ష సూర్యకాంతి, వేడి గాలులను నిరోధించాలి. పగటిపూట కిటికీలు, కర్టెన్లను మూసి ఉంచాలి. ►ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ►అనారోగ్యంతో ఉన్నవారు ఎండాకాలంలో ఇతరులకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. వీరు అదనపు శ్రద్ధ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఆరుబయట పనిచేసే వ్యక్తులు, మానసిక వ్యాధి ఉన్న వ్యక్తులు, శారీరకంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ►ఒంటరిగా నివసించే వృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రతి రోజూ పర్యవేక్షించాలి. ►శరీరాన్ని చల్లబరచడానికి ఫ్యాన్, తడిబట్టలను ఉపయోగించాలి. ►మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రావొద్దు. ఒకవేళ వచ్చినా ఎండలో శారీరకమైన కఠినమైన పనులు చేయకూడదు. ►తీవ్రమైన ఎండ సమయంలో వంట గదిలో వంట చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే వంటిల్లు వెంటిలేషన్‌తో ఉండాలి. వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవాలి. ►ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను తీసుకోకూడదు. ఇవి శరీర ద్రవాన్ని కోల్పోవడానికి లేదా కడుపు తిమ్మిరికి కారణం కావచ్చు. ►ఆరు బయట పనిచేసే కార్మికుల కోసం పని ప్రదేశంలో చల్లని తాగునీటిని అందుబాటులో ఉంచాలి. ప్రతి 20 నిమిషాలకు ఒక గ్లాసు నీరు తాగాలని వారికి చెప్పాలి. ►సాధారణ మానవ శరీర ఉష్ణోగ్రత 97.5ని ఫారిన్‌హీట్ నుండి 98.9ని ఫారీన్ హీట్ ఉండాలి. -
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
సాక్షి, హైదరాబాద్: రాబోయే వేసవికాలంలో తాగునీటి సరాఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాల ని అధికారులను సీఎంవో, మిషన్ భగీరథ విభాగం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరాయాలు లేని తాగునీటి సరాఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆవాసాలు, విద్యాసంస్థలకు నిరాటంకంగా తాగునీటి సరాఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం తాగునీటి సరాఫరాపై మిషన్ భగీరథ కార్యాలయంలో స్మితా సబర్వాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సాగుతున్న బల్క్, ఇంట్రా సరాఫరా తీరుపై స్మితా సబర్వాల్ సంతృప్తి వ్యక్తంచేశారు. రిజర్వాయర్ల నీటి మట్టాల నిరంతర పర్యవేక్షణ ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఉన్న పంపులు, మోటార్ల వ్యవస్థలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మెయిన్, సెకండరీ పైప్లైన్లలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే రిపేర్ చేసేలా మొబైల్ టీంలను నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. మారుమూల, అట వీ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలు, రెసిడెన్షియల్ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ తాగునీటి సరాఫరా తీరుపై గిరిజన, సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌చోంగ్తూతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, వివిధ జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. -
సమ్మర్ సీజన్: ఫలరాజు భలే క్రేజు
సాక్షి రాయచోటి(కడప): మామిడి పండ్లలో గుర్తింపు పొందిన అనేక రకాల మామిడి కాయలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు జిల్లాలు, రాష్ట్రాలు సరిహద్దులు దాటుతున్నాయి. కచ్చితంగా రెండు నెలలపాటు సీజన్లో కాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ సారి ఆశించిన మేర దిగుబడి లేకపోగా.. ధర మొదట్లో పెద్దగా లేకపోయినా ప్రస్తుతం బాగానే ఉండటంతో దిగుబడి ఉన్న మేరకు కాయలను విక్రయిస్తున్నారు.ఇక్కడి పండ్లు తియ్యగా ఉండటంతో ఈ ప్రాంతానికి చెందిన కాయలకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు లారీల్లో సరుకు రవాణా అవుతోంది. బెనీషా, నీలం, తోతాపురి, ఇమామ్ పసందు, మలిగుబ్బ లాంటి రకాల మామిడి కాయలకు సంబంధించి పల్ప్ ఫ్యాక్టరీలతోపాటు ఇతర రాష్ట్రాల మార్కెట్లకు కాయలు రవాణా అవుతున్నాయి. మామిడికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోని అనేక మండలాల్లో విస్తారంగా మామిడి పండిస్తారు. కాబట్టి ఇతర రాష్ట్రాల షేట్లు(వ్యాపారులు) సైతం ఇక్కడే మకాం వేసి ఇక్కడ నుంచి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు లారీల ద్వారా పంపిస్తున్నారు. జిల్లాలో సరాసరి 90 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. దిగుబడి ఈసారి ఎకరాకు ఒక టన్ను చొప్పున కంటే లేకపోవడంతో సరాసరిన 90–100 వేల టన్నుల దిగుబడి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు, నవంబర్ నెలల్లో విరివిగా వర్షాలు కురవడం.. పూతకు అవకాశం లేకపోవడంతో దిగుబడి తగ్గినట్లు ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న దిగుబడికి సంబంధించి లోకల్ మార్కెట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎక్కడికక్కడ సరుకు రవాణా అవుతోంది. రాయచోటి, రైల్వేకోడూరు, సుండుపల్లె, వీరబల్లె, కె.వి.పల్లె, చిన్నమండెం, సంబేపల్లె, పీలేరులతోపాటు లక్కిరెడ్డిపల్లె, రామాపురం, పుల్లంపేట తదితర మండలాల్లో మామిడి విస్తారంగా పండిస్తారు. రైల్వేకోడూరు, వీరబల్లె, కె.వి.పల్లె, సుండుపల్లె, చిన్నమండెం తదితర ప్రాంతాల నుంచి ప్రతి రోజు 40 నుంచి 50లారీలలో సరుకు రవాణా జరుగుతోంది. జిల్లాలో మామిడికి సంబంధించి బెంగుళూరు, తోతపూరి, బేనీషా, నీలం, ఇమామ్ పసంద్, రుమాని, పులిహార, ఖాదర్, లాల్ బహర్ రకాల మామిడి కాయలను పండిస్తున్నారు. ప్రస్తుతం బేనీషా టన్ను రూ.35వేల నుంచి రూ.45వేల వరకు ఉండగా.. ఇమామ్ పసంద్ టన్ను లక్ష రూపాయలకుపైన, తోతపూరి రూ.16–20 వేలు, నీలం రూ. 30వేల నుంచి రూ. 40వేల వరకు ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పండిస్తున్న మామిడి కాయలను ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ముంబై, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాలకు సరఫరా జరుగుతోంది. అన్నమయ్య జిల్లాలో మామిడి పంట సీజన్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు (షేట్లు) జిల్లాలో మకాం వేస్తారు. కొన్నేళ్లుగా సీజన్లో రావడం, కొనుగోళ్లు చేసి ఆయా రాష్ట్రాలకు లారీల ద్వారా పంపుతుంటారు. రైల్వేకోడూరుతోపాటు రాజంపేట, రాయచోటి ప్రాంతాలలో70నుంచి 80మంది దాకా షేట్లు ఇక్కడే ప్రత్యేకంగా గదులు అద్దెకు తీసుకుని ఉంటారు. లారీలు కూడా దాదాపు 100నుంచి 150 వరకు ప్రతినిత్యం సమీప ప్రాంతాల్లోనే సిద్ధంగా ఉంటాయి. వీటిల్లో సరుకు పంపిస్తుంటారు. ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తుంటాం అన్నమయ్య జిల్లాలో ప్రతి ఏడాది వేసవి సీజన్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చి మామిడి కాయల వ్యాపారం నిర్వహిస్తుంటాం. నాతోపాటు చాలామంది వ్యాపారులు సరుకు కొనుగోలు చేసి మార్కెట్ల నుంచి మహారాష్ట్రకు పంపుతుంటాం. కాయల కొనుగోలుకు లారీలు కూడా ఆయా రాష్ట్రాల నుంచి వస్తాయి. మామిడి కాయలు రుచిగా, నాణ్యతగా ఉండటంతో వీటికి మంచి గిరాకీ ఉంటోంది. – జావేద్, మామిడికాయల వ్యాపారి, మహారాష్ట్ర మామిడి పండ్లకు డిమాండ్ జిల్లాలోని మామిడిపండ్లకు డిమాండ్ ఉంటోంది. ఇక్కడి మామిడి పండు రుచికరంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి ఏడాది సరుకు ఇక్కడ నుంచి పలు రాష్ట్రాలకు వెళుతోంది. అనేక రకాల మామిడి పండ్లు పండిస్తారు. కాకపోతే ఈ ఏడాది చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. అయినప్పటికీ ఇక్కడి నుంచి డిమాండ్‌కు అనుగుణంగా జ్యూస్, మార్కెట్లకు, ఇతర రాష్ట్రాలకు మామిడి కాయలు వెళుతున్నాయి. – రవీంద్రనాథరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, అన్నమయ్య జిల్లా -
సమ్మర్లో స్లిమ్‌గా.. బరువు తగ్గాలనుకునే వారికి వేసవి కాలం వరం
బరువు పెరిగిపోతున్నామని జనం తెగ బెంగపడిపోతున్నారు. పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఫిట్నెస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు మారుతున్న జీవన విధానంలో జీహ్వా చాపల్యాన్ని అదుపులో ఉంచుకోలేక పోతున్నారు. సరికొత్త రుచులకు అలవాటు పడి బరువును పెంచేసుకుంటున్నారు. ఆ తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి కుస్తీలు పడుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధ పడుతూ ఎలాగైనా తగ్గాలనుకునే వారికి వేసవి వరంలాంటిది. ఫిట్నెస్ కేంద్రాల్లో ఎలాంటి ఫీట్లు చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని చిట్కాలతో స్లిమ్‌గా మారొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రస్తుత యాంత్రిక జీవనంలో సమయాన్ని ఎన్నో రకాల పనులకు వెచ్చిస్తున్నారు. వాటి వలన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. దీనిని నడకలో తేలికగా అధిగమించవచ్చు. సాయంత్రం కంటే మార్నింగ్ వాక్ చాలా మంచిది. ఉదయం స్వచ్ఛమైన వాతావరణంతో పాటు, ఆక్సిజన్ స్థాయి అధికంగా ఉంటుంది. సున్నితంగా సూర్యకిరణాలు పడుతుంటే మనసుకు హాయినిస్తుంది. అయితే జాగింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చన్నీటి స్నానం తర్వాత వ్యాయామం తక్కువ బరువు ఉండి, చెమటను త్వరగా పీల్చే దుస్తులతో వ్యాయామం చేయడం ఉత్తమం. వేసవిలో వర్క్అవుట్లు కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కారాలు తక్కువ చేయడం మంచిది. బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్ మంచి వ్యాయామం. వర్క్ అవుట్ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత పెరగదు. నీరసం వచ్చే వరకూ జాగింగ్ చేయడం ప్రమాదకరం. దాహం వేస్తే అందుబాటులో తాగునీటిని ఉంచుకోవాలి. వాకింగ్, జాగింగ్ వంటివి మినహాయిస్తే వర్క్అవుట్లు చేయాంటే మాత్రం ఫిట్నెస్ ట్రైనర్ సూచనలు తీసుకోవడం మంచిది. ద్రవ పదార్ధాలు ఎక్కువుగా... ఎంతటి భోజన ప్రియులైన వేసవి కాలంలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు. వేసవిలో ఘన పదార్ధాల కంటే ద్రవ పదార్ధాలను ఎక్కువుగా తీసుకోవాలనిపిస్తుంది. ఆకలి తక్కువుగా ఉంటుంది. 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చొప్పున రోజుకి కనీసం 5 లీటర్ల నీరు వివిధ రూపాల్లో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటి కన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం. గొంతు నొప్పి తదితర సమస్యలు తలెత్తవు. చదవండి: (బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీహెచ్ ప్రతాప్‌రెడ్డి) శీతల ప్రాణయామం... వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం 8 నుంచే మొదలవుతుంది. ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువుగా తాగాలి. నీటితో పాటు, శీతల ప్రాణయామం చేస్తే కొంత వరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. శీతల ప్రాణయామం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి ముక్కు ద్వారా వదిలే పక్రియే శీతల ప్రాణయామం. ఉదయం 7 గంటల లోపు 5 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆహారం తీసుకుంటే మేలు.. ►నీటి శాతం ఎక్కువుగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజా, తాటి ముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటిశాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లవణాలు అందుతాయి. ►నీటి శాతం ఎక్కువుగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన కడుపు నిండినట్లు ఉంటుంది. డైట్ కంట్రోల్ అవుతుంది. ►శీతల పానీయాలు, అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే బరువు తగ్గకపోగా కొత్త సమస్యలు వస్తాయి. ►వేసవిలో ఆకలి తక్కువుగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. నీరసం రాకుండా జాగ్రత్త పడాలి వాకింగ్, జాగింగ్, వ్యాయామం చేసే సమయంలో నీరసం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా వాకింగ్ చేయకూడదు. శరీరం ఎంత వరకు సహకరిస్తే అంతే మితంగా చేయాలి. బరువు తగ్గాలని అదే పనిగా వాకింగ్ చేస్తే నీరసం తప్పదు. ఎండలో వాకింగ్ చేయడం ప్రమాదం. వేసవిలో శరీరంలో నీరు త్వరగా ఆవిరై డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. అందుకే నీటి శాతం ఎక్కువుగా ఉన్న పండ్లు తీసుకోవాలి. – కొమ్మూరి హరిత, ఆహార నిపుణులు(న్యూట్రీషియన్) -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
అకాల వానలు, పిడుగులు.. ఆ సమయాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేసవే అయినా మబ్బులు భయపెడుతున్నాయి. అకాల వానలతో పాటు పిడుగులు ప్రాణాలను బలికొంటున్నాయి. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమని వైద్యులు, వాతావరణ వేత్తలు సూచిస్తున్నారు. వర్షాల సమయంలో బయట పనులకు వెళ్లేవారు, పొలంలో పనిచేసే రైతులు, ఉపాధి వేతనదారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఏం చేయకూడదు..? ►జోరు వాన కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదు. ►ఉరుములు, మెరుపుల సమయాల్లో పొలాల్లో ఉండకూడదు. ►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లే దా అంతకంటే తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరంలో పిడుగుపడే అవకాశముంది. ►మెరుపు కనపడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లకపోవడం మేలు. ►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండరాదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ►గుండె సంబంధిత వ్యా«ధులు ఉన్నవారు మె రుపులు, ఉరుములతో భయాందోళనకు గురవుతారు. ఇలాంటి వారు ఇళ్లలో ఉండడం మేలు. ఇలా చేయండి... ఆమదాలవలస: పిడుగు పాటుపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమదాలవలస డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె.జగన్నాథరావు సూ చించారు. మేఘం నల్లబడే సమయంలో పొలాల్లో, ఆరుబయట ఎవరూ ఉండకూడదని వెంటనే దగ్గరలో ఉన్న షెల్టర్‌లోకి చేరుకోవాలని సూచించారు. ము ఖ్యంగా భారీ చెట్లు, తాటిచెట్టు, ఈత చెట్టు వంటి వాటి కిందకు వెళ్లకూడదన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో గొడుగు కూడా వేసుకొని బహిరంగ ప్ర దేశాల్లోకి వెళ్తే వారిపై పిడుగు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. గ త్యంతరం లేని పరిస్థితుల్లో పొలంలో ఉండిపోతే వెంటే ఎలాంటి చెట్లు లేని దగ్గర కాళ్ల ముడుకులు గుండె భాగానికి తగిలేలా కూర్చుని, చెవులు రెండు చేతులతో మూసుకొని కూర్చుంటే 80 శాతం రక్షణ పొందవచ్చునని తెలిపారు. ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో పడుకోబెట్టాలి. తడిబట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పాలి. రెండు కాళ్లను ఒక అడుగు పైకి ఎత్తాలి. గాలి తగిలే ప్రదేశంలో ఉంచి అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమచికిత్స చేయాలి. సకాలంలో ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించాలి. – యండ భవ్యశ్రీ, వైద్యాధికారి, సరుబుజ్జిలి చదవండి: ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా! -
పౌల్ట్రీలకు వడదెబ్బ.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
మండపేట(కోనసీమ జిల్లా): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోళ్ల రైతుల పరిస్థితి. ఎగుమతులకు ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ, పెరిగిన మేత ధరలతో కుదేలైన కోళ్ల పరిశ్రమను మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక రోజుకు దాదాపు లక్ష కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమకు రోజుకు రూ.2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. చదవండి: ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..! నష్టాల మోత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకూ ఉండగా, మిగిలిన దశల్లోని కోళ్లు 1.2 కోట్ల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 23 వేల నుంచి 25 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తట్టుకుంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవడంతో కోళ్ల మరణాలు పెరగడంతో పాటు గుడ్లు ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఎండలతో కోళ్ల మరణాలు మూడు రెట్లు పెరిగినట్టు పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సగటున సుమారు రూ.150 మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.15 ప్రకారం చూస్తే.. 16.5 లక్షల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వలన రైతులు రూ.51.98 లక్షల మేర నష్టపోవాల్సి వస్తోంది. కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ. 2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. నిర్వహణ తడిసి మోపెడు.. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని రైతులంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి, వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ పడిపోయింది. మరోపక్క మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గుడ్డు ధర గిట్టుబాటు కాక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధిక ఎండలతో గుడ్ల డ్రాపింగ్, కోళ్ల మరణాలు పరిశ్రమను మరింత నష్టాల పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో కూరుకుపోతోంది.. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వడ్డీ రాయితీ, ఎఫ్‌సీఐ నుంచి సబ్సిడీపై మేతలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కర్రి వెంకట ముకుందరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్, కొమరిపాలెం ప్రభుత్వం గట్టెక్కించాలి ఇటీవల ఒడిశాలో ఏపీ గుడ్ల ఎగుమతులను అక్కడి ట్రేడర్స్ అడ్డుకున్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అదే విధంగా ప్రస్తుత సంక్షోభం నుంచి పరిశ్రమ గట్టెక్కేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌల్ట్రీ ఫెడరేషన్, అర్తమూరు -
బాబోయ్ ఎండలు.. అలా చేస్తే వాహనాలు పేలే ప్రమాదం
సాక్షి,ఆమదాలవలస(శ్రీకాకుళం): భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ అనధికార కర్ఫ్యూ విధిస్తున్నాడు. ఎండల్లో బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. గొడుగులు, టోపీలు లేనిదే అడుగు బయట పెట్టడం లేదు. సూరీడు నిప్పులు కక్కుతున్న వేళ ప్రజలతో పాటు వాహనాలకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాహనాలు ఎండలో గంటల సమయం ఉంచడం వల్ల రంగు వెలిసి పోతాయని, పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వాహనాలకు ట్యాంక్ నిండా పెట్రోల్ పోస్తే ఒక్కోసారి పేలే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. రక్షణ ఇలా.. ►వాహనాలు ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ లేదా కవర్లు కప్పి గానీ ఉంచాలి. ►అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది. ►బైక్ ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. ► ఎండ వేడికి ఇంజిన్ ఆయిల్ కూడా త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం మంచిది. ►వేసవిలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసినప్పుడు ఒకసారి ట్యాంకు మూతను తెరిచి మూయాలి. ►వేసవిలో ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. ఒక వేళ వెళ్లాల్సి వస్తే కొంతదూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత గడువు లోపు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. కార్ల విషయంలో.. ► కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లు తరచూ తనిఖీ చేయించుకోవాలి. ► రేడియేటర్లలో నీళ్ల కంటే కూఎంట్ ఆయిల్ వాడడం మంచిది. ► పెట్రోల్, డీజిల్ తోపాటు ఎల్పీజీ గ్యాస్ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాంటి వాహనదారులు వేసవిలో గ్యాస్ కిట్‌ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. ► ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్మ్యాట్స్ను ఏర్పాటు చేసుకోవాలి. చదవండి: వైరల్ వీడియో: పాపం.. మృత్యువు ఇలా వస్తుందని ఊహించి ఉండరు -
తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి సీజన్లో పర్యాటకులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్( ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–అరకు–విశాఖపట్నం (రైల్ కం రోడ్ ప్యాకేజీ): ఈ టూర్ ప్రతీ రోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ(ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, థింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరుతారు. అక్కడ నుంచి అన్ని ప్రాంతాలను చూపించి తిరిగి అరకు నుంచి రోడ్ మార్గం ద్వారా అదేరోజు రాత్రి విశాఖపట్నం చేరుస్తారు. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలు విశాఖ నుంచి అరకు వరకు విస్టాడోమ్ కోచ్‌లో వెళ్లాలనుకుంటే పెద్దలకు రూ.3,060, పిల్లలకు రూ.2670, స్లీపర్ క్లాస్ కోచ్ అయితే పెద్దలకు రూ.2,385, పిల్లలకు రూ.2,015, సెకండ్ సిటింగ్ పెద్దలకు రూ.2,185, పిల్లలకు రూ.1,815(ఈ చార్జీలు సైట్‌సీయింగ్, రానుపోను ప్రయాణఖర్చులు, అల్పాహారం, మ«ధ్యాహ్నం భోజనం, సాయంత్రం హై టీ, బోర్రా ప్రవేశచార్జీలు, అన్ని పన్నులు కలుపుకుని) తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతీ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. థర్డ్ ఏసీ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.17,860, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 11,720, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.10,495, స్లీపర్ క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.15,765, డబుల్ ఆక్యుపెన్సీ రూ.9,625, త్రిబుల్ ఆక్యుపెన్సీ రూ.9,400.. వసతి, రవాణా, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం చార్జీలు, కాణిపాకం, తిరుచానూర్ టికెట్ చార్జీలు, టోల్ గేట్స్, పార్కింగ్, జీఎస్టీ వంటి అన్ని చార్జీలతో కలిపి ఉంటాయని తెలిపారు. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నెంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో స్వయంగా గానీ లేదా 0891–2500695, 8287932318 నెంబర్లలో గానీ సంప్రదించాలని కోరారు. (చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలే టార్గెట్) -
Photo Feature: వీటిని తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?
సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం: ఐస్ యాపిల్‌గా పేరుగాంచిన తాటి ముంజల సీజన్ మొదలైంది. కూడళ్లలో ముంజల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎర్రటి ఎండలో ముంజల్ని ఆరగించేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఉండే ద్రవ పదార్థాన్ని ఇష్టంగా లాగించేస్తున్నారు. లేత ముంజలకు రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. నగరంలోని జీటీరోడ్లో విక్రయాల్ని చిత్రాల్లో చూడొచ్చు. చదవండి: కర్బూజా జ్యూస్.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో! వేసవి వరం.. ♦తాటిముంజలు వేసవి వరమని చెబుతున్నారు వైద్య నిపుణులు. దాని వల్ల కలిగే ప్రయోజనాల్ని వివరిస్తున్నారు. అజీర్తిని తగ్గించే గుణందీని సొంతం. ♦బరువు తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది. ♦లేతముంజల్ని తింటే ఉపయోగం. ♦డీహైడ్రేషన్ రాకుండా చేస్తుంది. ♦బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూమర్ వంటివి రాకుండా కాపాడుతుంది. -
వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి
-
కణకణమండే నిప్పుల కొలిమి, భగభగా మండుతున్న నగరాలు
దేశాలు కుతకుతలాడుతున్నాయి. వందల మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలో ఢిల్లీ, హరియాణాతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనంతటికీ కారణం ‘హీట్ డోమ్’లు ఏర్పడటమే. ఉన్నట్టుండి ఈ హీట్ డోమ్‌లు ఏమిటి? ఎందుకు ఇంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తు అంచనాలేమిటన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి మైనస్ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్ డోమ్ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఏమిటీ హీట్ డోమ్? ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇలా హీట్ డోమ్ ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి ఒక్కోసారి రెండు, మూడు వారాల వరకు కూడా ఇవి కొనసాగుతాయి. కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల హీట్‌డోమ్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో కొద్ది కిలోమీటర్ల ఎత్తున (స్ట్రాటోస్ఫియర్ పొరలో).. భూమి చుట్టూ తిరిగే గాలి ప్రవాహాలు (పవనాలు) ఉంటాయి. భూమ్మీద ఉష్ణోగ్రతలు, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పీడనాలను ఈ పవనాలు సమం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఈ పవనాలు ఏదైనా ఓ ప్రాంతంలో ఆగిపోతాయి. అలా ఆగిపోయిన చోట.. భూఉపరితలానికి ఎగువన వాతావరణ పీడనం పెరిగిపోతుంది. కింద ఉన్న గాలిపై ఒత్తిడి పెరిగి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వాతావరణం ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మేఘాలు కూడా ఏర్పడవు. ఫలితంగా సూర్యరశ్మి నేరుగా పడి.. హీట్‌డోమ్ ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. 1. వేడెక్కిన గాలి పైకి వెళ్తుంది 2. అధిక పీడనం ఆ గాలిని కిందికి తోస్తుంది 3. ఈ పరిస్థితి వల్ల మేఘాలు దూరంగా చెల్లాచెదురవుతాయి 4. గాలి ఒత్తిడి పెరిగి, ఎండ నేరుగా పడి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి ఉత్తర భారతం గరంగరం మన దేశంలో మార్చి నుంచి జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో జూలైలోనూ కొనసాగుతాయి. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఈసారి అలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గురు, శుక్రవారాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఇది ఏడు డిగ్రీలు ఎక్కువ. ఢిల్లీ, హరియాణా, పరిసర ప్రాంతాల్లో హీట్ డోమ్ ఏర్పడటంతోనే.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇరవై ఏళ్లలో మరింతగా మంటలు! భారత దేశంలో మరో ఇరవై ఏళ్లలో ఎండల తీవ్రత భారీగా పెరుగుతుందని.. వడగాడ్పులూ దానికి తోడవుతాయని ‘ది ఎకనమిస్ట్’మేగజైన్ వెల్లడించింది. కొన్నేళ్లుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ప్రస్తుత పరిస్థితి, వాతావరణ మార్పులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదికను విడుదల చేసింది. 2041 నాటికి దేశంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 49.3 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో 50 డిగ్రీలకుపైగా నమోదు కావొచ్చని పేర్కొంది. చెన్నై పరిస్థితి దారుణమవుతుందని, ఎండల తీవ్రతకు వేల మంది చనిపోవచ్చని అంచనా వేసింది. హైదరాబాద్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అమెరికా, కెనడా ఆగమాగం అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాలు, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతం కొద్దిరోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. కెనడా చరిత్రలోనే అత్యధికంగా 49.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేడికి కార్చిచ్చు చెలరేగి ఇక్కడి లిట్టన్ ప్రాంతం 90 శాతం దహనమైపోయింది. మరోవైపు రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరప్ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రత్యేకంగా కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ♦ఎండల కారణంగా ఏసీలు, ఇతర ఉపకరణా లు, నీటి వినియోగం పెరిగిపోయింది. దీనితో బిల్లులు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని అమెరికాలోని న్యూయార్క్ పాలకవర్గం నిర్ణయించింది. ♦గ్రీస్‌లోని ఏథెన్స్, ఇతర పట్టణాల్లో ఎండ తీవ్రత, దగ్గర్లోని కూలింగ్ సెంటర్లను సూచించేందుకు యాప్స్ వినియోగిస్తున్నారు. ♦ఇజ్రాయెల్ బహిరంగ ప్రదేశాలు, వాక్ వే లలో నీడ కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం డిజైన్లు పంపాలని పోటీలు నిర్వహిస్తోంది. అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి మైనస్ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్ డోమ్ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. -
పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా? అయితే జాగ్రత్త!
చిక్కడపల్లిలోని భారత్ పెట్రోలియంకు చెందిన ఒక బంక్‌లోరెండు రోజుల క్రితం వాహనంలో పెట్రోల్ పోస్తుండగా మంటలు చెలరేగాయి. ఒక వ్యక్తి సుజికి యాక్సిస్ ద్విచక్రవాహనంపై దూరప్రాంతానికి వెళ్లి వస్తూ మధ్యలో బంకు వద్ద పెట్రోల్ పోయించుకుంటుండగా వేడిగా ఉన్న ట్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. రెండు రోజుల క్రితం సూర్యాపేట నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న కారు తార్నాకలోని మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోగానే ఇంజిన్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్, అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం అయింది. సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలకు ఇంధనం ఆవిరైపోతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాహనాల ఇంధనంపై ప్రభావం చూపుతున్నాయి. మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌తో ఒక వైపు తగ్గుతున్న మైలేజీకి తోడు ట్యాంక్‌లో పోస్తున్న ఇంధనం రోజువారీ అవసరాల కోసం ఏ మూలకు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఎండల్లో పార్కింగ్తో ట్యాంకుల్లోని ఇంధనం వేడెక్కి ఆవిరై గాలిలో కలుస్తోంది. ఫలితంగా వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌లను పోయించుకోవడం సర్వసాధారణమైంది. వాహనాల ట్యాంకులు ఉష్ణతాపానికి వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది. ప్రతిరోజు సగటు వినియోగంలో 20 శాతానికి పైగా పెట్రోల్, డీజిల్ వేడికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ముప్పు పొంచి ఉంది.. సూర్యుడి ప్రతాపానికి కార్లు, ఆటోలు, బైక్‌ల నుంచి మంటలు చెలరేగుతాయి. సాధారణంగా వాహనాల్లో వాడుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇంధనాలు లీకైనా వేడికి వెంటనే మంటలు వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఏసీ కారులో ప్రయాణాలు సాగిస్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని మెకానిక్‌లు సూచిస్తున్నారు. వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లీకేజీలతో మంటలు అంటుకునే అవకాశాలు లేకపోలేదు. వాహనాల్లో నాణ్యత లేని వైర్లు వాడడంతో నిప్పు రవ్వలు వచ్చి మంటలు అంటుకునే ప్రమాదమున్నది. (చదవండి: సౌదీ చమురు పెత్తనానికి చెక్!) వాహనాలు.. ఇలా గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 65.14 లక్షల వాహనాలున్నాయి. అందులో ద్విచక్ర వాహ నాలు సుమారు 44.04 లక్షల వరకూ ఉంటాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 560 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజూ 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు సాగుతున్నట్లు చమురు కంపెనీల గణాంకాలు చెబుతున్నాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వలపై వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్‌లో సగం వరకే ఇంధనం నింపాలని స్పష్టం చేస్తున్నాయి. ట్యాంక్‌ను నిండుగా నింపితే ఉష్ణతాపానికి ఆవిరై పోవడంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్తలు ఇలా... వాహనాలను నీడలోనే పార్కింగ్ చేయాలి. ఇంజన్‌కు సరిపడా ఆయిల్ ఉండేట్లు చూడాలి. ఎండల వేడికి ఇంజన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. వేసవిలో ఇంజిన్ గార్డు లు తొలగించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేవారు మధ్యమధ్యలో బండి ఆపి కొద్దిసేపు ఇంజ¯Œన్కు విశ్రాంతినివ్వాలి. వాహనాల పెట్రోల్ ట్యాంకుపై దళసరి కవర్ ఉండేటట్లు చూడాలి. కవర్లు వేడెక్కకుండా ఉండేందుకు వెల్వెట్, పోస్టు క్లాత్ సీట్ కవర్లు వాడాలి. వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూసివేయాలి. (చదవండి: ఏప్రిలియా బుకింగ్స్ షురూ...!) -
వేసవిలోనూ ‘జగనన్న గోరుముద్ద’
సాక్షి, అమరావతి : లాక్డౌన్, కరోనా నియంత్రణ చర్యలతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం, వేసవి సెలవులతో జూన్ 12వ తేదీ వరకు తెరుచుకునే అవకాశం లేనందున ఇంటివద్దే గడిపే పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మూడో విడత మధ్యాహ్న భోజనం సరుకులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 19 నుంచి 31 వరకు మొదటి విడతలో, ఏప్రిల్ 1వ తేదీనుంచి 23 వరకు రెండో విడతలో మధ్యాహ్న భోజనం సరుకులను విద్యార్థులకు ప్రభుత్వం అందించింది. కేవలం బియ్యంతో సరిపెట్టకుండా ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా విద్యార్థులకు పౌష్టిక విలువలతో కూడిన కోడిగుడ్లు, చిక్కీలను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు వేసవిలో మూడో విడత పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మధ్యాహ్న భోజనం పథకం, పాఠశాలల శానిటేషన్ డైరెక్టర్ చిట్టూరి శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం.. ►‘జగనన్న గోరుముద్ద’ ద్వారా విద్యార్థులకు అందించే మెనూ మొత్తాన్ని మార్చేసి రుచి, శుచి, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ►35,282 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 17,78,081 మంది విద్యార్థులు చదువుతున్నారు. ►4,525 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1105148 మంది విద్యార్థులున్నారు. ►5,916 హైస్కూళ్లలో 7,26,796 మంది విద్యార్థులున్నారు. మూడో విడత పంపిణీ ఇలా... ►ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు పనిదినాలను 40 రోజులుగా లెక్కించి మూడో విడత సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు ►ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు రోజుకు 100 గ్రాముల చొప్పున 40 రోజులకు సరిపడా బియ్యం అందిస్తారు. ►6 – 10వ తరగతి వారికి రోజుకు 150 గ్రాముల చొప్పున 40 రోజులకు పంపిణీ చేస్తారు. ►గుడ్లు, చిక్కీలు అన్ని తరగతుల పిల్లలకు సమానంగా పంపిణీ చేస్తారు. ►ఒకొక్కరికి 34 కోడిగుడ్లు, 20 చిక్కీలు అందచేస్తారు. ►తొలి విడతలో మార్చి 19 నుంచి 31 వరకు 6,336.40 టన్నుల బియ్యం, 5,05,40,350 గుడ్లు, 3,24,90,225 చిక్కీలను ప్రభుత్వం విద్యార్థుల ఇళ్లకే పంపిణీ చేసింది. ►రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు 4,073.40 టన్నుల బియ్యం, 2,59,92,180 గుడ్లు, 1,29,96,090 చిక్కీలు విద్యార్థులకు అందచేశారు. -
గిర్రా.. గిర్రా.. గిర్రా..తిరుగుతోంది మీటర్
సాక్షి, విజయనగరం : వేసవి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కాలు బయటపెట్టేందుకు వెనుకాడే పరిస్థితి. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైనా ఉక్కపోత కొనసాగుతుండడంతో విద్యుత్ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. మీటర్ గిరాగిరా తిరుగుతోంది. విద్యుత్ బిల్లులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గడిచిన మూడు నెలల వ్యవధిలో సుమారు 10 లక్షల యూనిట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు 6.5 మిలియన్ యూనిట్లు (65 లక్షల యూనిట్లు) విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించగా.. ప్రస్తుత పరిస్థితులు ఆ వినియోగం 7.8 మిలియన్ యూనిట్లు (78 లక్షల యూనిట్లకు) పెరిగిపోయింది. మే నెలలో పరిశీలిస్తే సగటున 7.5 మిలియన్ యూనిట్లు (75 లక్షల యూనిట్లు) విద్యుత్ వినియోగమైనట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 7 లక్షల 22వేల 229 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో చీపురుపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలో 61వేల 281 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. మొత్తం సర్వీసుల్లో ఎల్టీ, హెచ్‌టీ, కమర్షియల్ సర్వీసులు ఈ ఏడాది గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది సగటును రోజుకు 6 ఎంయూ (60 లక్షల యూనియట్లు) విద్యుత్‌ను వినియోగించే వారు. అదే వేసవిలో అయితే 6.5 ఎంయూ యూనిట్లు (65 లక్షల యూనిట్ల) వినియోగం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది గతం కంటే విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి వినియోగదారులు సౌకర్యాల్లో శీతలగృహోపకరణాల వినియోగానికి ప్రాధాన్యమివ్వడమే కారణంగా తెలుస్తోంది. మరో వైపు ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు వాడకం విద్యుత్వినియోగం పెరుగుదలకు ఊతమిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ సమయంలోనే అధిక వినియోగం... రోజుకో విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భానుడి ఉగ్రరూపం నుంచి రక్షణ పొందేందుకు ఏసీలు, ఫ్రిజలు, కూలర్లు తదితర శీతల గృహోపకరణ వస్తువులు వినియోగం గణనీయంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరల రాత్రి 8 నుంచి 11 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయాల్లో ప్రజలు ఇళ్లల్లో ఎక్కువగా ఉంటారు. దీంతో విద్యుత్ వినియోగం అధికంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ కన్నా 10 లక్షల యూనిట్లు తక్కువ కేటాయింపులు ఉన్నా అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి మాచ్‌ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని, ఈ ఏడాది వేసవిలో నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వినియోగం గణనీయంగా పెరిగింది.. పరిస్థితుల ప్రభావంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతీ ఒక్కరు కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు వినియోగిస్తున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్‌ను ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఉంది. వినియోగదారులు అవసరంలేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి. – వై.విష్ణు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
ఎక్కిళ్లు!
ప్రభుత్వ అలసత్వం..అధికారుల ముందుచూపులేని వ్యవహారం వల్ల పల్లె, పట్టణాల ప్రజలకునీటికష్టాలు తప్పడంలేదు.రాత్రంతా మేలుకున్నా..పగలంతా ఎదురుచూసినా...కొళాయిలోనీటి చుక్క కనిపించడం లేదు. వేసవి ఆరంభానికి ముందు కేవలం 100 గ్రామాల్లోపే సమస్య ఉండగా..అది కాస్త 500కు చేరిందంటే జిల్లాలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందోఅర్థమవుతోంది. ఒకప్పుడు నీటితో కళకళలాడిన పల్లెలు సైతం నేడు దాహమో రామచంద్రాఅంటూ గగ్గోలు పెడుతున్నాయి. సాక్షి కడప/ఎడ్యుకేషన్: జిల్లాలో దాహం కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి.నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. కొందరు వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తుండగా..మరికొందరు ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.గత ఏడాది ఇదే సమయానికి కేవలం 17 గ్రామాల్లోనే తాగునీటి సమస్య ఉండగా, ఈసారి వందలు దాటింది. ఖరీఫ్‌తోపాటు రబీలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతోనే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. 544 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జిల్లాలో ప్రస్తుతం ఎండలు ముదిరాయి. బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు. జిల్లాలో 790 పంచాయతీలకుగాను 4,446మజరా గ్రామాలు ఉన్నాయి. మొత్తం మీద 544 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల వద్ద జనాలు బారులు తీరుతుండడం..సంపూర్ణంగా నీటిని అందుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే స్కీమ్ ద్వారా వస్తే పూర్తి స్థాయిలో ఇంటి అవసరాలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ట్యాంకర్లు కావడంతో అరకొరగా పట్టుకోవాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు. 100 గ్రామాలకు అద్దె బోర్లతో నీటి సరఫరా జిల్లాలో తాగునీటి సమస్య నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకుని పల్లెలకు నీరు అందిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రాయచోటి నియోజకవర్గంతోపాటు బద్వేలు, కమలాపురం, జమ్మలమడుగు, రైల్వేకోడూరు, మైదుకూరు, పులివెందుల, రాజంపేట ప్రాంతాల్లోని 31 మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. సుమారు 100 గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ బోర్లలో ఒక్కో బోరుకు రోజుకు రూ. 150 అద్దె చెల్లించి నీటి సరఫరా సాగిస్తున్నారు. పట్టణాలను వేధిస్తున్న సమస్య జిల్లా కేంద్రమైన కడపతోపాటు పలు పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. నగరంలోని అనేక కాలనీలకు ఐదారు రోజులకు గాని నీరందని పరిస్థితి నెలకొంది. రాత్రింబవళ్లు మేలుకున్నా నీరు రావడం లేదు. దీంతో వచ్చిన సమయంలోనే డ్రమ్ములకు నింపుకుని పొదుపుగా వాడుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. కడప నగరంతోపాటు జిల్లాలోని పలు మున్సిపాలిటీలను నీటి సమస్య వేధిస్తోంది.ఈరోజు బోరులో నీరు వస్తే రేపు వస్తుందో, రాదో అన్న ఆందోళన అధికారులను వెంటాడుతోంది. ప్రజలపై ఆర్థికభారం కడప నగరంలో ఐదారు రోజులకు ఒకసారి నీరు రావడంతో ప్రైవేటు ట్యాంకర్లకు డిమాండ్ ఏర్పడింది. ఒక్కో ట్యాంకరును రూ. 500–600 వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో 26.89 మీటర్ల లోతులో ఉన్నాయి.గత ఏడాది ఇదే సమయంలో 15 మీటర్ల లోతులో ఉండేవి. బిందె నీరు కరువు మా గ్రామంలో గత నెలరోజులుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. గ్రామానికి రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని కూడా టీడీపి వారికే పంపుతున్నారు. వైఎస్సార్ కాలనీలో సమస్య ఉన్నా వారికి పట్టడం లేదు. విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు, ఉన్నతాధికారులు స్పందించి తాగునీటిని అందించాలి. – హుస్సేనయ్య, ఆకులనారాయణపల్లె . కాశినాయన మండలం -
మామిడి.. అరకొర దిగుబడి!
ప్రకాశం, కందుకూరు: డివిజన్లోని కందుకూరు ఉద్యానవనశాఖ పరిధిలో దాదాపు 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. వీటిలో ఉలవపాడు మండలంలో 5850 ఎకరాల్లో, గుడ్లూరు 4100 ఎకరాలు, కందుకూరు 1900, వలేటివారిపాలెం 1065, టంగుటూరు 820, సింగరాయకొండ 1557లతో పాటు పొన్నలూరు తదితర మండలాల్లో మామిడి తోటలున్నాయి. గతంలో దాదాపు 25 వేల ఎకరాలకు పైగానే మామిడి తోటలు ఈ ప్రాంతంలో ఉండేవి. ఏడాదంతా ఎదురు చూసినా కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ప్రతి ఏడాది నష్టాలే వస్తుండడంతో రైతులు క్రమంగా తోటలు తొలగిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులు చెట్లు నరికేసి ఇతర పంటల వైపు మొగ్గుచూపసాగారు. ఈ ఏడాది దిగుబడి దారుణం కందుకూరు ప్రాంతాన్ని గత ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. అరకొర మెట్ట పంటలు తప్పా ఇతర ఏ పంటలు కూడా పండే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభావం క్రమంగా మామిడి రైతుల మీద కూడా పడింది. ఈ ఏడాది గత నాలుగుగైదు నెలలుగా ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. దీంతో మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీసం పూత కూడా రాలేదు. ఆ ప్రభావం కాస్త ఇప్పుడు దిగుబడి మీద పడింది. వర్షాలు క్రమంగా పడి వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి దాదాపు 5 నుంచి 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది ఎకరానికి ఒక టన్ను దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. వేల ఎకరాల్లో ఇప్పటి వరకు కనీసం పూత కూడా రాలేదు. చెట్లు ఎండిపోయాయి. వీటిని కాపాడుకునే పరిస్థితి కూడా రైతుల్లో లేదు. దీంతో రైతులు చేతులెత్తేశారు. దీంతో ఈ ఏడాది మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. దిగుబడి ప్రభావంతో రైతులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. కందుకూరు డివిజన్ నుంచి ప్రతి ఏడాది దాదాపు 76 వేల మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వస్తుంది. ఇందులో ఉలవపాడు, గుడ్లూరు మండలాల నుంచి అధికంగా దిగుబడి వస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలు ఈ దిగుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రతి ఏడాది సరాసరిన 10 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి తగ్గుతున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగుమతులపైన ప్రభావం ఈ ప్రాంతం నుంచి దేశ వ్యాప్తంగా ఈ సీజన్లో మామిడి ఎగుమతులు జోరుగా సాగుతాయి. ప్రధానంగా ఉలవపాడు కేంద్రంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ వంటి ప్రాంతాలకు భారీగా ఎగుమతులు ఉంటాయి. దీంతో దాదాపు సీజన్ మూడు, నాలుగు నెలల పాటు మార్కెట్ ఉత్సాహంగా సాగుతుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కానరావడం లేదు. మార్కెట్లోకి కాయలు రావడమే గగనంగా మారింది. అత్యంత నాణ్యమైన పేరుగాంచిన మామిడి రకాలు ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి. బంగినపల్లి, చెరుకురసాలు, చోటాపురి, ఇమామిపసందు వంటి తదితర రకాలు పండుతాయి. కానీ ఈ రకాలు ఏవి కూడా ప్రస్తుతం దొరికే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మామిడి ఎగుమతులపై కూడా ప్రభావం పడనుంది. ఇక సామాన్యుడు మామిడి రుచిని ఆస్వాదించడం అంత సులువు కాదు ఈ ఏడాది. -
చెమటలు కక్కి..
ఎండలు మండిపోతున్నాయి.. భూమి సెగలు కక్కుతోంది. కాలు కింద పెడితే భగ్గుమంటోంది. పార పట్టుకుంటే బొబ్బలొస్తున్నాయి..కాసింత సేపు సేదదీరుదామంటే నీడకూడా కరువు..దాహమేసినా ఇంటినుంచి తెచ్చుకున్న నీళ్లే గతి. మజ్జిగ చుక్కకూ మంగళం పాడారు. ఎండకు కళ్లు తిరిగినా.. చిన్న గాయమైనా మందులు అందుబాటులో లేక ఆస్పత్రికి పరుగు తీయాల్సిన పరిస్థితి. అయినా నాలుగు వేళ్లు నోట్లో వెళ్లేందుకు నిరుపేదలంతా ‘ఉపాధి’ బాట పట్టారు. కనీస సౌకర్యాలు లేకపోయినా రక్తాన్ని స్వేదంగా మార్చి బతుకుపోరు సాగిస్తున్నారు. కనీస సౌకర్యాల కోసం కేంద్రమే డబ్బులిస్తున్నా.. అవన్నీ దిగమింగుతున్న సిబ్బంది ‘ఉపాధి’ కూలీలకు నరకం చూపుతున్నారు. అనంతపురం టౌన్ : రోజురోజుకూ భానుడు మండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. స్థానికంగా వ్యవసాయ పనులేవీ లేవు. దీంతో నిరుపేదలంతా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అయితే పనులు చేసే చోట వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో కూలీలు పనుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు జిల్లాలో 7,85,227 లక్షలు ఉండగా.. 18.23 లక్షల మంది ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కూలీలు పని చేస్తున్న ప్రదేశాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కూలీలు ఎండల్లో పనిచేసేందుకు భయపడుతున్నారు. నీడలేదు...మందులు కరువు ఉపాధి పనులు చేసే ప్రదేశంలో ఎక్కడా టెంట్లు లేవు.. ఎండలోనే ఉపాధి కూలీలు పనులు చేస్తూ ఎండవేడిమికి తాళలేక అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉపాధి కూలీలకు విధిగా మజ్జిగ, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా...అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఉపాధి కూలీలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా... అవి మాత్రం పని ప్రదేశంలో ఎక్కడ కనిపించడంలేదు. కొన్ని ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం అందజేసిన మెడికల్ బాక్సులనే వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్క అయోడిన్ మినహా అన్ని కాలం చెల్లడంతో ఎక్కడ కూడా ప్రథమ చికిత్సా బాక్సులను వినియోగించడం లేదు. రోజురోజుకూ పడిపోతున్న హాజరు శాతం భానుడి భగభగ మంటున్నా...అధికారులు ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే రోజుకు లక్ష మందికి పైగా ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ..హాజరు శాతం దారుణంగా పడిపోయింది. వసతులు కల్పించకుంటే చర్యలు : జ్యోతిబసు, డ్వామా పీడీ పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు అన్ని రకాల వసతులు కల్పించాలి. విధిగా టెంట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో నీడ కల్పించే దిశగా ఏపీఓలు చొరవ చూపాలి. కూలీలకు వసతులు కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం. -
ఎండ దెబ్బ.. వీధి కుక్కల వింత ప్రవర్తన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎండలుమండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలుఅత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఏకంగా 40 డిగ్రీలు నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవసరాల నిమిత్తం బయటకు వెళ్తున్న సిటీజనులు వడదెబ్బకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, యాచకులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో చాలామంది తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఎండలకు తోడు సరైన నీరు, ఆహారం లభించకపోవడంతో వీధి కుక్కలు వింతగా ప్రవర్తిస్తున్నాయి. రోడ్డుపై వెళ్లేవారిపై దాడి చేస్తూ కాటేస్తున్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 40–50 మంది కుక్కకాటు బాధితులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వాడుతుండడంతో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా నిత్యం సందర్శకులతో రద్దీగా ఉండే ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఎండలకు వెలవెలబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ అనివార్యమైతే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సొమ్మసిల్లితే... సహజంగా మనిషి రోజుకు 7–8 లీటర్ల నీరు తాగాలి. కానీ చాలామంది పని ఒత్తిడితో 2–3లీటర్లు కూడా తాగడం లేదు. ఇదిలా ఉంటే నగరానికి రోజుకు సగటున లక్ష మంది ప్రయాణికులు వచ్చి పోతున్నట్లు అంచనా. వివిధ పనులతో జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, రోజంతా ఎండలో తిరగడం వల్ల అనేక మంది వడదెబ్బకు గురవుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే నీడ ప్రదేశానికి తీసుకెళ్లి నీటితో ముఖం శుభ్రం చేయాలి. నిమ్మకాయ, ఉప్పు కలిపిన వాటర్, కొబ్బరి బొండం తాగించాలి. అత్యవసరమైతే ఆస్పత్రికి తరలించాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్ ధరించాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యనిపుణుడు చిన్నారుల విషయంలో... సెలవుల నేపథ్యంలో పిల్లలు ఎక్కువసేపు ఎండలో ఆడకుండా చూడాలి. ఎక్కువసేపు ఎండలో తిరిగితే వడదెబ్బబారిన పడే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఉదయం 10గంటల లోపు, సాయంత్రం 5గంటల తర్వాతే బయటకు అనుమతించాలి. ఎండలకు త్వరగా దాహం వేస్తుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీరు తాగించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారంతో పాటు పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి. ఉక్కపోతకు శరీరంపై చెమటపొక్కులు వచ్చే అవకాశం ఉంది. వీటిని గిల్లడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జీన్స్ కాకుండా తేలికైన తెల్లని వస్త్రాలు ధరించడం ద్వారా శరీరానికి గాలి సోకుతుంది. చెమటపొక్కుల సమస్య ఉండదు. రోజు రెండుసార్లు చన్నీటి స్నానం చేయించడంతో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో పిల్లలకు చికెన్‌ఫాక్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలి.– డాక్టర్ రమేశ్ దంపురి, నిలోఫర్ ఆస్పత్రి మంచినీరు తాగాలి... నగరంలో చాలామంది ప్రతిరోజు టూవీలర్‌పై ప్రయాణిస్తుంటారు. ముఖ్యంగా మార్కెంటింగ్ వారు రోజుకు ఐదారు గంటలు రోడ్డుపైనే తిరగాల్సి ఉంటుంది. అతినీలలోహిత కిరణాలు నేరుగా ముఖానికి తగలడం వల్ల ముఖం, చేతులు నల్లగా వాడిపోతాయి. దాహం వేస్తే రోడ్డు పక్కనున్న చలివేంద్రాలు, హోటళ్లు తదితర ఎక్కడి నీరైనా తాగుతున్నారు. అయితే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, విరేచనాల బారినపడాల్సి వస్తుంది. శరీరానికి వేడిమినిచ్చే నల్లని దుస్తులు కాకుండా తేలికైన తెల్లని కాటన్ దుస్తులు ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం ఉత్తమం. – డాక్టర్ నాగేందర్, ఉస్మానియా ఆస్పత్రి వీధి కుక్కలతో జాగ్రత్త... ఎండ ప్రభావం వీధి కుక్కలపై ఎక్కువగా ఉంటుంది. సరిపడా ఆహారం లభించకపోవడం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం తదితర కుక్కల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయి. అందుకే అవి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాయి. అసలే కుక్కలకు వేట సహజ లక్షణం. ఆ లక్షణమే వేగంగా వచ్చిపోయే వాహనదారులు, వీధుల్లో ఆడుకుంటున్న చిన్నారులు, వృద్ధులపై దాడికి కారణమవుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో కుక్కకాటు కేసులు ఎక్కువ నమోదు అవుతుండడానికి కారణమిదే. కుక్కకాటుకు గురైనప్పుడు కట్టు కట్టకుండాకుళాయి నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత యాంటీ రేబీస్ ఇంజక్షన్ వేయించుకోవాలి. లేదంటే రేబీస్ సోకి చనిపోయే ప్రమాదం ఉంది. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి -
సమ్మర్ ‘జిమ్‌దగీ’
సాక్షి, సిటీబ్యూరో :ఓ వైపు ఫిట్నెస్ ఫీవర్ కారణంగా సిటీటెంపరేచర్తో ఉంది. మరోవైపు సమ్మర్ సీజన్ శరీరాల్ని హీటెక్కించేస్తోంది. వారంలో రెండు మూడు రోజులతో సరిపెట్టేవారు మాత్రమే కాదు ఒక్క రోజు కూడా జిమ్‌కి డుమ్మా కొట్టడానికి ఇష్టపడని వారూ సిటీలో ఎక్కువే.ఈ నేపథ్యంలో.. హాట్ సమ్మర్లో ‘జిమ్‌దగీ’ ఎలా ఉండాలో వివరిస్తున్నారు నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఎం.వెంకట్. వెయిట్‌లాస్‌కి ప్లస్... చలికాలం, వానాకాలంతో పోలిస్తే వేసవిలో శరీరం త్వరగా వార్మప్ అవుతుంది. ‘శారీరక శ్రమ, మరో వైపు వేడిగాలి బాడీ టెంపరేచర్‌ను పెంచుతాయి. ఈ వేడి దేహమంతా విస్తరించేందుకు చర్మం ద్వారా రక్తం అధికంగా సరఫరా అవుతుంది. ఇది గుండె కొట్టుకునే స్థాయిని పెంచుతుంది. దీంతో బాడీ టెంపరేచర్ సాధారణ స్థాయికన్నా పెరుగుతుంది. ఈ పరిస్థితి కేలరీలు అధికంగా ఖర్చయ్యేందుకు, మరింత వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఈ సీజన్ వెయిట్ లాస్ కోరుకునేవారికి ప్లస్ అవుతుంది. నిదానమే సరైన విధానం... ఈ సీజన్లో వ్యాయామం స్లోగానే స్టార్ట్ చేసి దశలవారీగా వేగం పెంచాలి. ఏదేమైనా కొంత వేగాన్ని నియంత్రించడం అవసరమే. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు అధికంగా చేసేవాళ్లు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. దాహం అనిపించకపోయినా సరే వ్యాయామ సమయంలో తరచూ నీళ్లు తాగుతుండాలి. వెదర్.. చూడాలి బ్రదర్.. మిట్టమధ్యాహ్నపు ఎండలో ఏసీ జిమ్‌లో అయినా సరే ఎక్సర్సైజ్లు చేయడం అంతగా మంచిది కాదు. వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లోనే వ్యాయామం చేయడం సముచితం. బలహీనత, తలనొప్పి, తలతిరగడం, ఒళ్లు పట్టేయడం వాంతులు, గుండె మరీ ఎక్కువగా కొట్టుకోవడం, తీవ్రమైన అలసటకు సంబంధించిన సూచనలు కనిపించినట్లయితే వెంటనే వ్యాయామం ఆపేసి, చల్లని ప్రదేశంలో, నీడలో సేదతీరడం అవసరం. వ్యాయామానంతరం చన్నీటి స్నానం చేస్తే అలసిన కండరాలకు చక్కగా సేదతీరే అవకాశం లభిస్తుంది. సీజన్‌కి...నప్పేవి ఈ సీజన్లో శరీరం సహజంగానే కొంత ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి బాగా ఒత్తిడికి గురిచేసే క్రాస్ ఫిట్ శైలి వ్యాయామాలు టైర్, హామర్తో, బాటిల్ రోప్‌తో చేసే వర్కవుట్స్‌ని బాగా తగ్గించేయాలి. శరీరం వార్మప్ అయి ఉంటుంది కాబట్టి మజిల్ టోనింగ్ మీద దృష్టి పెట్టాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూనే కార్డియో వ్యాయామాలకు బదులుగా క్రంచెస్, పుషప్స్, బర్పీస్, ఇంచ్వామ్, మౌంటెయిన్ క్లైంబర్స్, స్పాట్ జాగింగ్ వంటివి ఎంచుకోవాలి. డీహైడ్రేషన్ దరిచేరకుండా... రోజు మొత్తం మీద కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలి. చెమట ద్వారా కోల్పోయే సోడియం, పొటాíషియం, క్లోరైడ్లను భర్తీ చేసేందుకు వ్యాయామానికి ముందు పొటాసియం అధికంగా ఉండే అరటి, దానిమ్మ పండ్లు వంటివి తీసుకోవాలి. అవసరమైతే ఓఆర్ఎస్ వంటి సప్లిమెంట్స్‌ని వర్కవుట్స్ చేసే సమయంలో వినియోగించడం మంచిది. స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయించవచ్చు. కాఫీ, టీ, ఆల్కహాల్ వల్ల దేహంలోని నీటిస్థాయి ఆవిరై వ్యాయామ సమయంలో త్వరగా అలసిపోతాం. వాటికి ఈ సీజన్లో తప్పనిసరిగా గుడ్‌బై చెప్పాల్సిందే. వెయిట్‌లాస్‌కి బెస్ట్... కొంత మంది వేసవి సీజన్లో వేడికి భయపడి వర్కవుట్స్ మానేస్తారు. అయితే సరిగ్గా వినియోగించుకుంటే ఇది మజిల్ టోనింగ్‌కి, ముఖ్యంగా వెయిట్‌లాస్‌కి అత్యంత ఉపయుక్తమైన సీజన్. డ్రైఫిట్ దుస్తులు ధరించడం దగ్గర్నుంచి స్వల్ప మార్పు చేర్పులతో ఈ సీజన్లో వర్కవుట్స్‌ని ఎంజాయ్ చేయవచ్చు. – ఎం.వెంకట్, ట్రైనర్, టార్క్ ఫిట్నెస్ స్టూడియో -
బిందె బిందెకు కన్నీళ్లు
సాక్షి , మచిలీపట్నం : ఇంట్లో చంటోడు ఆకలితో గుక్క పెట్టాడు.. వాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. ఎసట్లో పోయడానికి ఇంట్లో చెంబుడు నీళ్లు కూడా లేవు.. అందుకే అమ్మ.. బుంగ చేతబట్టి ఊళ్లో వాటర్ ట్యాంకర్ దగ్గరకు పరుగులు పెట్టింది.. అప్పటికే చాంతాడంత క్యూ.. చెమటలు తుడుచుకుంటూ.. అమ్మా .. పిల్లాడు ఏడుస్తున్నాడు.. ఒక్క బుంగ పట్టుకోనివ్వండమ్మా అంటూ వేడుకుంది. ఖాళీ బిందెలతో ఎదురు చూస్తున్న మిగిలిన మహిళలు.. అసలు నీళ్లే రావడం లేదమ్మా.. అంటూ బదులిచ్చారు.. పిల్లాడి ఏడుపు గుర్తొచ్చి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. గబగబా ట్యాంకర్ వద్దకు వెళ్లి.. పైపు నోట్లోకి తీసుకుని నీళ్ల కోసం తంటాలు పడింది. పచ్చని నీళ్లు పైపులో నుంచి సన్నని ధారగా వచ్చాయి. దగ్గరగా చూస్తే ముక్కుపుటాలను బద్దలు చేస్తున్నాయి. ఇక దిక్కులేక వాటినే బిందెలో పట్టుకుని బయలుదేరింది.. ఆ నీళ్లనే వడబోసి.. కాచి వంటకు సిద్ధం చేసింది. ఇలా మిగిలిన మహిళలూ గంటల తరబడి తమ వంతు వచ్చే వరకు ఉండి.. బిందెడు నీళ్లు పట్టుకున్నారు...‘అయ్యా..ఇదెక్కడి పాలనయ్యా.. మా నియోజకవర్గంలో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు.. అయినా గుక్కెడు నీళ్లివ్వడం చేతకాలేదు.. వేల ఎకరాల్లో పంటలు మాత్రం తడిపామని చెబుతున్నారు.. మా ఎండిన గొంతులో బాధను మాత్రం ఒక్కసారి కూడా ఆలకించడం లేదు. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మీ చేతగానితనాన్ని వెక్కిరిస్తున్న ఈ దుస్థితిని కళ్లారా చూడండయ్యా..! అంటూ వారి వేదన కన్నీటి బొట్లుగా రాలుతుండగా ఇంటి దారి పట్టారు. మచిలీపట్నం నియోజవర్గంలోని పల్లెతుమ్మలపాలెంలో మత్స్యకారుల నీటి కోసం ఇలా నిత్యం అవస్థలు పడుతున్నారు. -
పల్లెల్లో దాహం కేకలు !
సాక్షి, దాచేపల్లి : పల్లెవాసుల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించకపోవటంతో వారి తీరును తప్పుపడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఉంటే ముందు రోజుల్లో మరింతగా నీటి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవటంతో అనేక గ్రామాలకు కృష్ణమ్మ రావటంలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించటంతో మంచినీటి సమస్యకు కారణంగా మారింది. పైపులైన్ల తొలగింపు.... నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం,మన్షూర్షాపేట, అంజనాపురం, నడికుడి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి పైపులను తొలగించారు. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణాలు పూర్తికాక పైపులైన్లను అమర్చలేదు. దీంతో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కేసానుపల్లి గ్రామంలో పలు బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లకు నీరు అందటంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లకు నీరు అందక పనిచేయటంలేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. రైల్వేట్రాక్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో బోర్లు పనిచేయక కాలనీవాసులు నీటి కోసం అరకిలోమీటర్ దూరం వెళ్తున్నారు. దాచేపల్లిలోని పలు వార్డుల్లో మంచినీటి సమస్య ఉంది. మాదినపాడు, తంగెడ, తక్కెళ్లపాడు, గామాలపాడు, పొందుగల గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వేసవికాలం రావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతేడాది వర్షపాతం తక్కువ మోతాదులో నమోదు కావటంతో భూగర్భ జలాలు స్థాయి పెరగలేదు. దీంతో బోర్లకు నీరు అందటంలేదు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో బోర్లు వేసిన అర అంగుళం నీటి ధార రావటంలేదు. నాగులేరు, పలు వాగుల్లో అధికపార్టీ నాయకులు చెక్‌డ్యాంలను నిర్మించారు. కేవలం నిధులు డ్రా చేసుకునేందుకు వీటిని నిర్మించారే తప్ప నీరు నిలబడేందుకు కాదనే విషయం చెక్‌డ్యాంలను చూస్తే తెలుస్తుంది. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏప్రిల్, మే నెలలో అసలు బోర్లు పనిచేయవనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ నుంచి మే నెలాఖారు వరకు మంచినీటి ఎద్దడి నెలకొనటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నడికుడికి చెందిన మందపాటి నాగిరెడ్డి ఫౌండేషన్, ఇరికేపల్లికి చెందిన ది మధర్ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకున్న చొరవను ప్రభుత్వం చూపించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల కోసం పైపులైన్లు తొలగించారు నారాయణపురంలో రోడ్ల నిర్మాణం కోసం మంచినీటి పైపులైన్లను తొలగించారు. పైపులను తీసేయటం వల్ల మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. గత నెల రోజుల నుంచి మంచినీటి కోసం పక్క వీధులకు వెళ్తున్నారు. పైపులైన్ల ద్వారా మంచినీరు సక్రమంగా అందటంలేదు. – షేక్ షరిఫ్. నారాయణపురం -
పగలు ప్లాన్.. రాత్రి దోపిడీ
సాక్షి, నిజామాబాద్: మళ్లీ దుండగుల అలజడి పెరిగింది. వరుసగా చోరీలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఏదో ఒక చో ట చోరీలు జరుగుతున్నాయి. పోలీసులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో దుండగులు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లోనే పదిలోపు చోరీలు జరిగాయంటే పరిస్థి తి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నా రు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరిగే అవకా శం ఉండడంతో అవగాహన, ప్రచారం కల్పించాల్సిన పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో ఉండ డంతో చోరీల నియంత్రణ ఇబ్బందిగా మారింది. ప్రణాళికతోనే చోరీలు... నాలుగు రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఓ పైనాన్స్‌లో దుండగులు పడి లాకర్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ పుటేజీలను సైతం తీసుకెళ్లారు. షెట్టర్ పగుల గొట్టి చోరీకి పాల్పడ్డారు. కంఠేశ్వర్‌లోని ఆర్మూర్ ప్రధాన రహదారిపైనే ఈ చోరీ జరిగింది. మరో మూడు రోజుల్లోనే ఇదే ప్రధాన రహదారిపై ఉన్న ఓ గ్లాస్ ఎంపోరియం షెట్టర్ పగులగొట్టి చోరీ చేశారు. అంతకు ముందు ఎల్లమ్మగుట్టలో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. 6వ పోలీసుస్టేషన్ పరిధిలో మరో చోరీ జరిగింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లలోనే ఈ చోరీలు అవుతున్నాయి. మహారాష్ట్ర ముఠాకు చెందిన దుండగులు ఈ అలజడి సృష్టిస్తున్నట్లు పోలీసులు విచారిస్తున్నారు. గతంలో అపార్ట్మెంట్లతో పాటు పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన మూటలు మళ్లీ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. గత వారం రోజుల కింద బాల్కొండ, ముప్కాల్ కేంద్రాల్లో షెట్టర్ పగులగొట్టి చోరీలు జరుగగా ఇటీవలే అరెస్టు చేశారు. అయినా చోరీలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఆర్మూర్‌లో మహారాష్ట్రకు చెందిన దుండగుల ముఠా వరుసగా రెండు రోజులపాటు దోపిడీ చేసింది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల ఇరిగేషన్ కార్యాలయంలో ఒక కారును అపహరించారు. మహారాష్ట్రకు చెందిన ఈ దుండగులు జిల్లాలో ప్రవేశించి మధ్యాహ్నం పూట రెక్కి నిర్వహిస్తున్నారు. రాత్రివేళ అనుకూలమైన ప్రాంతాల్లో దోపిడీలు చేసేస్తున్నారు. నవీపేట, బోధన్ ప్రాంతాల్లో ఇటీవల చోరీలు పెరిగాయి. జిల్లా కేంద్రంలో చోరీ చేసి పారిపోతూ నవీపేట, బోధన్ ప్రాంతాల్లో అందిన కాడికి దోచుకుంటున్నారని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర పోలీసుల అదుపులో ఫైనాన్స్ దుండగులు .. వారం రోజుల కింద కంఠేశ్వర్‌లోని ఫైనాన్స్‌లో చోరీ చేసిన దుండగుల ముఠాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహించిన సాగర్సింగ్ను పోలీసులు విచారించగా ఇతడి గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించగా అక్కడ ఈ ముఠాకు సంబం«ధించి సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది ముఠా సభ్యులు పరారీలో ఉన్నారని వారికోసం అక్కడి పోలీసులు వేట సాగిస్తున్నారు. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో పగటిపూట జరిగిన గత మూడేళ్లలో పరిశీలిస్తే 2015లో 27, 2016లో 33, 2017లో 34, 2018లో 42 నమోదయ్యాయి. రాత్రిపూట జరిగిన చోరీలను పరిశీలిస్తే 2015లో 221, 2016–218, 2017–192, 2018లో 206 చోరీలు జరిగాయి. ఇలాంటి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో పెట్రోలింగ్ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోతున్నారు. త్వరలోనే పట్టుకుంటాం.. ఇటీవల జిల్లా కేంద్రంలో చోరీలకు పాల్పడిన ముఠాలను గుర్తిస్తున్నాం. త్వరలోనే పట్టుకుంటాం. కఠిన చర్యలు తప్పవు. చోరీల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి. మహారాష్ట్రకు చెందిన ముఠాలు జిల్లా కేంద్రానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.–శ్రీనివాస్‌కుమార్, ఏసీపీ. -
మట్టికుండ.. ఆరోగ్యానికి అండ
సాక్షి, మెదక్ రూరల్: వేసవిలో చల్లటి నీరు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అందుకు ధనవంతులు రిఫ్రిజిరేటర్లో నీటి తాగితే మధ్య తరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలోకూడా కుండలను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి కుండలను తయారు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లు ఎంత సాంకేతికంగా అందుబాటులో ఉన్నా కుండలకు సాటిరావని కొనుగోలు దారుల అభిప్రాయం. మట్టితో తయారు చేసిన రంజన్లు, కుండలకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గటం లేదు. జిల్లాలోని ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రధాన రహదారుల వెంట మట్టి కుండలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. వేసవి ఆరంభం కావడంతో ప్రజలు చల్లటి నీటిని తాగేందుకు కుండలను, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తయారుచేసిన రిఫ్రిజిరేటర్లో చల్లటి నీటిని తాగితే ఆనారోగ్య సమస్యలున్నవారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుండటంతో ఆనీటిని తాగేందుకు ఇష్టపడటంలేదు. ఇక మట్టి కుండలో నీరు అన్ని విధాలుగా మంచిదని వైద్యులే చెబుతుండటంతో వీటి ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. ఆదిలాబాద్, కలకత్తా, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రా నుంచి కుండలు, రంజన్లను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. ఒక్కో కుండ, «రంజన్ ధర రూ.250 నుండి రూ.800 వరకు పలుకుతు మట్టి వాటర్ బాటిల్స్ వచ్చాయి – మంజుల, వ్యాపారి, మెదక్ మట్టితో తయారు చేసిన కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పెరిగాయి. వివిద రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ సైతం మార్కెట్లోకి వచ్చాయి. సైజును బట్టి ధర ఉంటుంది. -
నాణ్యత డొల్లేనా!
సాక్షి, మహబూబ్‌నగర్ : భానుడు భగభగ మంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో గొంతెండిపోతోంది. ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక ఉపశమనం కోసం పరుగులు తీస్తున్నారు. దాహార్తిని తీర్చుకునేందుకు చెరుకు, పండ్ల రసాలు, మజ్జిగ ఇతర పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ సెంటర్లకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ఇదే అదనుగా ఎక్కడపడితే జ్యూస్, చెరుకు రసం దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఈ సీజన్లో ఇది సహాజమే అయినా.. చాలా మంది చల్లదనం కోసం లేనిదే ఆ పానీయాలను ముట్టుకోరు. ఇంకొందరైతే అడిగి మరీ మరిన్ని ఐస్ గడ్డలు వేయించుకుంటారు. ఎలాంటి అనుమతులు లేకుండా, శుభ్రత పాటించకుండా ఈ కేంద్రాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. అపరిశుభ్రమైన నీటితో తయారు చేసే ఐస్‌తో లేనిపోని ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో పెరుగుతున్న రోగులు.. వేసవి వచ్చిందంటే పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెరుకు, పండ్ల రసాలు, లస్సీ, మజ్జిగ తదితర పానీయాలను విక్రయించే దుకాణాలు వెలుస్తాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఇలాంటి దుకాణాలు 200పైగా ఉంటాయి. ఎండ కాలంలో బయటకు వచ్చే పట్టణ వాసులతో పాటు బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిలో కనీసం 20నుంచి 30శాతం మంది ఎక్కడో ఓ చోట కచ్చింతంగా చల్లని పానీయాన్ని పుచ్చుకుంటున్నారు. కొందరు వ్యాపారుల్లో అవగాహన లేక పానీయాల్లో చల్లదనం కోసం అపరిశుభ్ర వాతావరణంలో, కలుషిత నీటితో తయారు చేసిన ఐస్‌ను వినియోగిస్తున్నారు. అందుకే వేసవిలో ఆస్పత్రుల బాటపటే పట్టణ వాసుల సంఖ్య సుమారు 5శాతం పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఐస్‌తో ప్రమాదమే.. వాస్తవానికి పండ్ల రసాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఆయా పండ్ల రసాల్లో కలిపే ఐస్ అనారోగ్యానికి దారితీస్తోంది. జిల్లా కేంద్రంలో కొందరు వ్యాపారులు అపరిశుభ్రత నీటితో ఐస్ తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఐస్‌లో అనేక రకాల బాక్టీరియా, క్రీముల ఉంటాయి. అవి పండ్ల రసాల్లో కలిసిపోయి జ్యూస్ ద్వారా శరీరంలోకి చేరి అనారోగ్యం కల్గిస్తాయి. రోజుల పాటు నిల్వ.. కొందరు వ్యాపారులు పండ్లను నిల్వ చేసి వాటితో జ్యూస్‌లను తయారుచేస్తున్నారు. వాటిలో వాడిపోయినవి, కుళ్లిపోయినవి ఉంటున్నాయి. వాస్తవానికి తాజా పండ్లతో అప్పటికప్పుడు రసం తయారు చేసి ఇవ్వాలి. అయితే చాలా మంది రెండు మూడు రోజులకు ఒకేసారి పెద్దమొత్తంలో రసాలు తయారుచేసి డ్రమ్ములలో నిల్వ ఉంచుతున్నారు. మరికొందరు వ్యాపారులు పండ్ల రసాల పేరుతో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. ఐస్‌క్రీంలు, లస్సీల్లో వీటి వాడకం అధికం ఉంది. గుర్తించడం కష్టమే.. సాధారణంగా ఐస్‌ను చూడగానే ఇది మంచి నీటి తో తయారైందా లేదా అన్న విషయాన్ని మనమే కాదు.. నిపుణులు సైతం అప్పటికప్పుడు గుర్తించలేరు. ప్రస్తుతం మార్కెట్లో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే ఐస్‌తో పాటు ఎడిబుల్ రకం అందుబాటులో ఉంది. మొదటి రకాన్ని చేప లు, మాంసాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు.. పండ్లు, ఇతర వస్తువులను ఎగుమతి చేసేందుకు.. ఆస్పత్రుల్లో శవాలను భద్రపరిచే మార్చురీల్లో వినియోగిస్తారు. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో పెద్ద క్యూబ్ రూ.30నుంచి రూ. 50 వరకు లభిస్తుంది. ఈ రకం ఐస్ తయారీ మం చి నీటితో, పరిశుభ్ర వాతావరణంలోనే చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఇక ఎడిబుల్ విషయానికొస్తే ఖచ్చితంగా నియామాలను పాటించాలి. మం చి నీటినే వినియోగించాలి. కాకపోతే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో క్యూబ్ రూ. 100 నుంచి 150వరకు లభిస్తుంది. శీతల పానీయాల్లో ఎడిబుల్ ఐస్‌ను వినియోగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా మంది చిరు వ్యాపారులు ఖర్చు తగ్గించుకునేందుకు మొదటి రకం ఐస్‌ను వినియోగించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఎన్నో.. నాణ్యత లేని ఐస్‌ను వాడటంతో గొంతు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ వైరల్ జ్వరాలు తదితర ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రోటా, అడినో, హెపటైటీస్–బి వంటి వైరస్‌లతో ఊపిరితిత్తుల్లో సమస్యలు, పచ్చకామెర్లు సంభవిస్తాయి. గొంతు నొప్పి, జలుబు, దగ్గు బారిన పడతారు. రోగనిరోధక శక్తి తగ్గిపోయి నీరసంగా తయారవుతారు. చిన్నపిల్లలకు గవద బిళ్లల వ్యాధి వస్తుంది. – డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వైద్య నిపుణుడు -
తాగునీటి కోసం ఆందోళన
సాక్షి,మేదరమెట్ల( ప్రకాశం) : వేసవి ఆరంభంలోనే తాగునీటి కోసం ప్రజలు రోడెక్కాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ఉదాహరణ కొరిశపాడు మండలంలోని అనమనమూరు ముంపు గ్రామంలోని కొంతమందికి బొడ్డువానిపాలెం కొండసమీపంలో పునరావాసం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉంటున్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న పైపులైను పది రోజుల క్రితం పగిలిపోవడంతో ఆ కాలనీ ప్రజలు, బొడ్డువానిపాలెం ఎస్సీకాలనీ వారు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేదరమెట్ల నుంచి అద్దంకి వెళ్లే రాష్ట్రీయ రహదారి నాలుగులైన్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇదే రోడ్డు పక్కన బొడ్డువానిపాలెం గ్రామానికి తాగునీటి సరఫరా చేసే పైపులైను ఉంది. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఐదుసార్లు ఈ పైపులైను మరమ్మతులకు గురైందని, ప్రతిసారి తాము కొంతసొమ్ముతో మరమ్మతులు చేయించుకుంటున్నట్లు కాలనీ వాసులు చెపుతున్నారు. పదిరోజుల కిందట సుమారు 300 అడుగుల మేర తాగునీటి సరఫరాచేసే పైపులైను రోడ్డునిర్మాణంతో పూర్తిగా దెబ్బతింది. విషయం కాంట్రాక్టర్ దృష్టికి తీసుకుపోయారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే మేదరమెట్ల వచ్చిన సమయంలో విన్నవించుకున్నా తమ గోడు పట్టించుకోవలేదని కాలనీ వాసులు వాపోయారు. పనులు అడ్డుకున్న మహిళలు తాగునీటి పైప్‌లేన్ మరమ్మతుల విషయం ఎవరూ పట్టించుకుకోకపోవడంతో కాలనీకి చెందిన మహిళలు అద్దంకి రోడ్డులో నిర్మాణం చేస్తున్న పనులను బుధవారం మహిళలు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ రెండు, మూడు రోజుల్లో పైపులైను మరమ్మతులు చేయించడం జరుగుతుందని కాలనీవాసులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఇటీవల ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలనీలోని చేతి పంపులు, బోర్లు పూర్తిగా అడుగంటిపోయాయని, పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తామే ట్యాంకర్‌ను ఏర్పాటు చేసుకొని తాగునీటి సరఫరా చేసుకుంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బొడ్డువానిపాలెం, అనమనమూరు ముంపు కాలనీకి తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆప్రాంత ప్రజానీకం కోరుతున్నారు. -
జలవిల!
సాక్షి, సిటీబ్యూరో: మండు వేసవి రాకముందే గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో జలం అడుగంటుతోంది. ఫిబ్రవరి తొలివారంలోనే గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. భూగర్భజల శాఖ నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తరువాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేసవి మొదలుకాకముందే వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ట్యాంకర్ మాఫియా... ప్రధానంగా కుత్భుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా..ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు, విచక్షణారహితంగా నీటిని తోడేస్తుండడంతో భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్.. బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయని పేర్కొంది. గ్రేటర్లో ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా... సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఈ ఇంకుడు గుంతలో సీజన్లో సాధారణ వర్షపాతం(20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని నేలగర్భంలోకి ఇంకించవచ్చు. -
కారు బానెట్‌ను ఇలా కూడా వాడొచ్చు..!
బీజింగ్ : ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలిపోయే ఎండలు బాబోయ్..! అనడం పరిపాటే..! కానీ, చైనాలో మాత్రం ఓ యువతి ఇంకాస్త ఎండైనా ఫరవాలేదు అంటున్నారు. 40 డిగ్రీల ఎండ వేడిలో కారు బానెట్‌పై ఎంచక్కా చేపలను ఫ్రై చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. చైనాలోని బింజౌలో ఈ విశేషం చోటు చేసుకుంది. ఓ ఐదు చేపలను, కొన్ని కూరగాయలను లేతగా వేయించి.. కొన్ని నిమిషాల్లోనే భోజనానికి ఏర్పాట్లు చేశారీ నయా చెఫ్. విపరీతమైన ఎండల కారణంగా చెమటలు కక్కుతున్న చైనీయుల కష్టాలను తన ‘ఎండ వంట’తో ప్రపంచానికి తెలియజెప్పారు. ఆమె వంట ఫొటోలను ట్విటర్లో పోస్టు చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. కాగా, గత సంవత్సరం ఒడిషాలోని టిట్లానగర్లో భీకరమైన ఎండలు నమోదయ్యాయి. 45 డిగ్రీలకు పైగా ఎండలు కాయడంతో ఓ వ్యక్తి ఇలాంటి పనే చేశాడు. రోడ్డుపైన పెనం పెట్టి ఎగ్ ఆమ్లెట్ వేశాడు. మండుతున్న ఎండలతో జాగ్రత్త సుమీ..! అంటూ జనాన్ని అప్రమత్తం చేశాడు. It's sizzling hot! A woman fries fish on a burning hot car hood as temperatures neared 40 °C in Binzhou, east China’s Shandong province on Tuesday. pic.twitter.com/r9pGldjePS — People's Daily,China (@PDChina) June 6, 2018 -
వేసవికి దోస
దోసకాయలో నీటిపాళ్లు ఎక్కువ. అందుకే ఈ వేసవి సీజన్లో తప్పక వండుకోవాల్సిన కూరగాయ దోస. దాదాపు 80 రకాల పోషకాలు నిండి ఉన్న ఆరోగ్య వనరు ఇది. చాలా రుచిగా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వాటిల్లో ఇవి కొన్ని. ►దోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ, పెద్దపేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గ్యాస్ట్రబుల్నూ, కడుపునొప్పిని అరికడుతుంది. ► నోట్లోకి యాసిడ్ రావడం, ఛాతీలో మంట వంటి సమస్యలను నివారిస్తుంది. ► దోసకాయ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ► రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చూడటంతో పాటు, గుండెను కాపాడుతుంది. ► అనేక రకాల చర్మవ్యాధులను, చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంతో పాటు మేనికి నిగారింపు తెస్తుంది. ► మనకు మేలు చేసే అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం వల్ల మనకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. ►అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మరీ ముఖ్యంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తుంది. ►త్వరగా కడుపు నిండినట్లుగా అనిపించడంతో పాటు, సంతృప్తభావనను ఇస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ►మైగ్రేన్ వంటి తలనొప్పులను తగ్గిస్తుంది. -
ఈ ఏడాదీ ఎండలు మండుతాయి
న్యూఢిల్లీ: దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. అయితే కోస్తా ఆంధ్ర ప్రాంతంతోపాటు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అప్పుడప్పుడు కురుస్తాయనీ, తద్వారా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ చెప్పారు. రుతుపవనాలు సరైన సమయానికే వస్తాయనడానికి ఇదొక సూచిక కూడా అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య సమయాన్ని ఐఎండీ వేసవి కాలంగా పరిగణిస్తుంది. గత సంవత్సరాల్లో మాదిరిగానే ఈ ఏడాది కూడా మధ్య, ఉత్తర భారతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించిపోతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. 2017ను అత్యంత వేడి సంవత్సరంగా ఐఎండీ గుర్తించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగానే నమోదైనా.. 2017తో పోలిస్తే అవి తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తుండటం ఒకింత ఊరటనిచ్చే అంశం. -
సమ్మర్ సీజన్.. చలో టూర్..
♦ 39 శాతం పెరిగిన ట్రావెల్ బుకింగ్స్ ♦ మేక్మైట్రిప్ నివేదిక ముంబై: ఎండలు కాస్త ఎక్కువైతే చాలు మనం బయట తిరగడం తగ్గించేస్తాం. అలాంటిది ఒకవైపు భానుడు తీవ్ర ప్రతాపం చూపిస్తోన్న కూడా ఈ సమ్మర్ సీజన్‌కి (ఏప్రిల్–జూన్) సంబంధించి ట్రావెల్ బుకింగ్స్ 39 శాతం మేర పెరిగాయి. ఈ విషయం మేక్మైట్రిప్ ‘సమ్మర్ ట్రావెల్ ట్రెం డ్స్’ నివేదికలో వెల్లడయ్యింది. ‘సమ్మర్ సీజన్లో ప్రయాణాలపై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్యలో ఇప్పుడు దాదాపు 39 శాతం వృద్ధి నమోదయ్యింది. వీరందరూ ఈ వేసవిలో వివిధ ప్రాంతాలను చుట్టిరావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు’ అని మేక్మైట్రిప్ సీఈవో (హోటల్స్ అండ్ హాలిడేస్) మోహిత్ గుప్తా తెలి పారు. మేక్మైట్రిప్ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 28 వరకు జరిగిన బుకింగ్స్ వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామని చెప్పారు. యాప్ లావాదేవీలు 49 శాతం అప్ స్మార్ట్‌ఫోన్స్ ద్వారా జరిగే బుకింగ్స్‌లో గణనీయమైన వృద్ధి నమోదయ్యిందని మోహిత్ గుప్తా తెలిపారు. దీనికి స్మార్ట్‌ఫోన్స్ వినియోగం, యువ పర్యాటకుల సంఖ్య పెరుగుదల వంటి పలు అంశాలు కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతేడాది సమ్మర్ సీజన్ నుంచి చేస్తే మొబైల్ యాప్ లావాదేవీలు 49 శాతం పెరిగాయని తెలిపారు. ఈ సమ్మర్లో ప్రయాణించే వారిలో 18–24 ఏళ్ల వయసున్న వారు 12 శాతంగా ఉన్నారని, వీరి సంఖ్య గతేడాది 9 శాతంగా ఉందని వివరించారు. అలాగే ఒంటరిగా ప్రయాణించేవారి సంఖ్య కూడా 32 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందని తెలిపారు. గోవానే టాప్ దేశీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారిలో చాలా మంది గోవా, మనాలీ (హిమాచల్ ప్రదేశ్), ఊటీ (తమిళనాడు), గ్యాంగ్‌టక్ (సిక్కిం) ప్రదేశాలకు వెళ్తున్నారు. అంతర్జాతీయ ప్రదేశాలు చూడటానికి వెళ్లే వారిలో చాలా మంది కౌలాలంపూర్, దుబాయ్, థాయ్‌లాండ్, సింగపూర్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అలాగే సుదూర ప్రయాణాలు చేసేవారికి లండన్, పారిస్, మసాయి మారా సఫారీ (కెన్యా) ప్రాంతాలు గమ్యస్థానాలుగా ఉన్నాయి. కార్డు ద్వారా జరిగే బుకింగ్సే ఎక్కువ ముంబై: డీమోనిటైజేషన్ తర్వాత దాదాపు 90 శాతానికిపైగా భారతీయ పర్యాటకులు వారి టూర్ల బుకింగ్స్‌కి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. యాత్రా.కామ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టూర్ ప్రణాళికలపై నోట్ల రద్దు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి 80 శాతానికి పైగా భారతీయులు వారి ట్రావెల్ డేస్‌ను తగ్గించుకుంటున్నారని, అలాగే వసతి విషయాల్లో రాజీపడుతున్నారని యాత్రా.కామ్ ప్రెసిడెంట్ శరత్ ఢాల్ తెలిపారు. టూర్ ప్లానింగ్ సమయంలో 50 శాతానికిపైగా భారతీయ పర్యాటకులు ఆన్లైన్ రివ్యూలను చదువుతున్నారని, 30 శాతం మంది స్నేహితుల సూచనలు తీసుకుంటున్నారని వివరించారు. ఇండిగో సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ న్యూఢిల్లీ: దిగ్గజ విమానయాన కంపెనీ ‘ఇండిగో’ తాజాగా సమ్మర్ స్పెషల్ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ఈ ఆఫర్లో భాగంగా విమాన టికెట్లను రూ.999ల ప్రారంభ ధరతో ప్రయాణికులు అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే వర్తించే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఏప్రిల్ 12 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇక ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు మే 1 నుంచి జూన్ 30 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. ఒకసారి టికెట్‌ను బుకింగ్ చేసుకున్న తర్వాత మళ్లీ రిఫండ్ అంటూ ఏమీ ఉండదని పేర్కొంది. -
ఎండాకాలమ్... ఎంజాయ్ చేద్దామ్...
సమ్మర్ అనగానే భయపడేవారే గానీ ఇష్టపడేవారుంటారా? అంటే మేమున్నాంగా అంటున్నారీ స్టార్స్. సమ్మర్ సీజన్లో కొద్దిపాటి జీవనశైలి మార్పులు చేసుకుంటే చాలు... వేడి కాలానికి హాయిగా వీడ్కోలు చెప్పేయవచ్చు అంటున్నారు. ఎండా కాలాన్ని ఆరోగ్యకరంగా ఆనందించేందుకు ఉపకరించే తమ లైఫ్‌స్టైల్ ఛేంజెస్‌ను ఇలా వివరిస్తున్నారు. తలకు క్యాప్... గోవా ట్రిప్ వేసవి సీజన్‌ని నేను బాగా ఎంజాయ్ చేస్తా. నా యాన్యువల్ బీచ్ హాలిడేస్ టైమ్ అదే. ఈ టైమ్‌లో గోవా నేను ఎంచుకునే అత్యంత ప్రధానమైన డెస్టినేషన్. సన్‌బ్లాక్, సమ్మర్లో ఫెడొరా/బ్యాండేనా (తలకు పెట్టుకునే క్యాప్/ బ్యాండ్) లేకుండా బయటకు అడుగుపెట్టను. డీ హైడ్రేషన్ రాకుండా గ్రీన్ జ్యూసెస్, మంచి నీళ్లు అధికంగా తీసుకుంటాను. సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోను. కొబ్బరినీళ్లు, పుచ్చకాయ, దానిమ్మ... బాగా తీసుకుంటాను. – బిపాసా బసు రోజ్ వాటర్స్ప్రే.. బ్రౌన్‌రైస్ ఈ సీజన్లో లూజ్ ట్రెండీ క్లోత్స్ హ్యాపీగా ధరించవచ్చు. సమ్మర్లో ఫ్యాషన్ అంటే లూజ్ క్లోత్స్, లినెన్, కాటన్ వంటి సౌకర్యవంతమైన ఫ్యాబ్రిక్స్, షార్ట్ డ్రెస్సులు, ఫ్లోయీ స్కర్ట్స్, ఎక్కువ వైట్ కలర్‌వి వార్డ్రోబ్ నుంచి బయటకు తీస్తాను. నుదుటి మీద హెయిర్ పడితే చాలా చికాకుగా ఉంటుందీ సీజన్లో. అందుకని బొహెమెయిన్ హెయిర్ బ్యాండ్/ హెడ్ గేర్ ధరిస్తాను. స్పైసీ, ఆయిలీ ఫుడ్‌ని పూర్తిగా దూరం పెడతాను. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు రోటీస్, బ్రౌన్ రైస్ వాడతాను. కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ, కోల్డ్ వాటర్ మిలన్ సలాడ్ వంటివి తీసుకుంటాను. తరచుగా ముఖాన్ని శుభ్రమైన నీళ్లతో కడుగుతాను. అలోవెరా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగిస్తాను. రోజ్‌వాటర్ స్ప్రే చేసుకుంటే ఓహ్... ఎంత రిఫ్రెషింగ్! నా బ్యాగ్‌లో స్కిన్వైప్స్ (చర్మాన్ని శుభ్రపరచుకునేవి) తప్పకుండా ఉంటాయి. – రియా చక్రవర్తి నాన్ స్పైసీ ఫుడ్... కాటన్ డ్రెస్ వింటే మరీ విపరీతంగా అనిపిస్తోందేమో కానీ నేను వేసవి కాలాన్ని బాగా ఆస్వాదిస్తాను. అవుట్ డోర్ షూటింగ్ ఉంటే మన మేకప్ సామాన్లు సర్దుకోవడం, విభిన్న రకాల దుస్తులు ధరించడం వగైరా చికాకులు ఉంటాయి. అదేమీ లేకపోతే మాత్రం సమస్య లేదు. మామూలుగానే నేను కాటన్ దుస్తులు ధరిస్తా కాబట్టి... ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ మార్చనక్కర్లేదు. అలాగే ఎప్పుడూ తక్కువ ఆయిల్, నాన్ స్పైసీ డైట్ మాత్రమే తీసుకుంటాను. సో... డైట్ కూడా మార్చే అవసరం లేదు. అయితే ఎప్పటికన్నా ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటాను. అలాగే మంచినీరు క్వాంటిటీ పెంచుతాను. – కత్రినాకైఫ్ సలాడ్... హోమ్ ఫుడ్ ఎస్! హాట్ హాట్ సమ్మర్‌ని ఎంజాయ్ చేయాలంటే కూల్ కూల్ మార్పులు చేసుకుంటే సరి. నేనైతే ఈ సీజన్లో లేవగానే బొప్పాయి పండును నిమ్మరసం పిండుకుని తింటాను. దాంతోపాటే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగుతాను. ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటాను. ఆహారంలో చిరుధాన్యాలు, కూరగాయల వాడకం పెంచుతాను. మామూలుగా అయితే రోజూ వర్కవుట్ చేస్తా. కాని ఈ సీజన్లో పిలాటిస్, డ్యాన్స్ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడూ వాటర్ సిప్పర్ నాతోనే ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా తేలికపాటి దుస్తులు లేదా వైట్ షర్ట్, జీన్స్‌నే ధరిస్తాను. – జాక్వెలిన్ ఫెర్నాండెజ్ -
సమ్మర్ సెగ
-
2017 నుంచి విదేశాలకు గోఎయిర్
కంపెనీ సీఈవో ఊల్ఫ్‌గాంగ్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఏడాది వేసవి సీజన్ నుంచి విదేశీ రూట్లలోనూ సర్వీసులు ప్రారంభించే అవకాశాలున్నాయని ప్రైవేట్ విమానయాన సంస్థ గోఎయిర్ సీఈవో ఊల్ఫ్‌గాంగ్ ప్రాక్-షోర్ వెల్లడించారు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, చైనా, ఇరాన్, వియత్నాం తదితర దేశాలకు విమాన సేవలు మొదలు కాగలవన్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు మొదలైన రూట్లలో గోఎయిర్ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 20గా ఉన్న విమానాల సంఖ్యను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు కల్లా 26కి పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటిదాకా 144 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డరివ్వగా.. వచ్చే పదేళ్లలో నెలకొకటి చొప్పున 2025 నాటికల్లా డెలివరీ అందుకోగలమన్నారు. వీటిలో సింహభాగం సేల్, లీజ్‌బ్యాక్ విధానంలో ఉంటాయని చెప్పారు. దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 8 శాతం మేర ఉందని, అయిదో స్థానంలో ఉన్నామని ఊల్ఫ్‌గాంగ్ వివరించారు. రోజూ 23 నగరాల మధ్య తమ 144 ఫ్లయిట్స్ తిరుగుతుండగా .. డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 184కి చేరగలదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ వృద్ధి రేటు 20 శాతం మేర ఉన్నప్పటికీ.. రాబోయే రోజుల్లో ముడివనరుల వ్యయాల పెరుగుదల, మౌలిక సదుపాయాలపరమైన అడ్డంకులు మొదలైనవి డిమాండ్‌పై కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అయితే, 10 శాతం పైగా.. 15 శాతం మేర వృద్ధి రేటు నమోదైనా మెరుగైనదిగానే భావించవచ్చని ఊల్ఫ్‌గాంగ్ తెలిపారు. ప్రాంతీయ పట్టణాలకు విమాన సేవల పథకంపై స్పందిస్తూ.. ప్రస్తు తం తమ విమానాలకు అనువుగా ఉన్న పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. -
మొక్కు‘బడి’గా భోజనం
► మండుతున్న ఎండలే ప్రధాన కారణం ► చాలా చోట్ల ప్రారంభం కాని పథకం కరీంనగర్‌ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం ఫలితమివ్వలేదు. మండుతున్న ఎండలు, నెలరోజుల ముందే పరీక్షలు ముగియడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలో 1955 ప్రాథమిక, 327 ప్రాథమికోన్నత, 644 ఉన్నత పాఠశాలల్లో సుమారు 2.12 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు తక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. పెద్దపల్లి, హుజూరాబాద్, ధర్మపురి, గోదావరిఖని, మంథని నియోజకవర్గాల్లో భోజన పథకం అసలే ప్రారంభంకాలేదు. వేములవాడ, మాన కొండూర్, చొప్పదండి, కరీంన గర్, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లోని కొన్ని పాఠశాలల్లో పథకం ప్రారంభమైనా.. మరికొన్నింటిలో అసలే ప్రారంభం కాలేదు. ఎండలు...వసతుల లేమి.... జిల్లాలోని 57 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేలా జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసినా.. ఎండ కారణంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చి భోజనం చేయడానికి ఆసక్తి చూపలేదు. ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు పక్క గ్రామాల నుంచి తాము చదువుకునే పాఠశాలకు వచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు పాఠశాలల్లో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఏజెన్సీల నిర్వాహకులూ ఎండలు చూసి భయపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వ్యాసరచన, ఆటపాటలు, పెయింటింగ్‌పై శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలనే ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ఉపాధ్యాయులూ పాఠశాలలకు వచ్చేందుకు ముందుకు రావడంలేదు. కరీంనగర్ నియోజకవర్గంలో 136 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 98 పాఠశాలల్లో బుధవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించారు. 13,320 మంది విద్యార్థులకు కేవలం 1400 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 180 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 12,859 మంది విద్యార్థులున్నారు. అయితే మధ్యాహ్న భోజనం ఆరగించేందుకు కేవలం 3,223 మంది విద్యార్థులే హాజరయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో 4,465 మంది విద్యార్థులకు గాను 2,680 విద్యార్థులు హాజరయ్యారు. మెట్పల్లి మండలంలో 4,163 మంది విద్యార్థులకు గాను 1,050 మంది హాజరయ్యారు. కోరుట్ల అర్బన్, రూరల్ పరిధి పాఠశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను 580 మంది హాజరయ్యారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపించింది. మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో 3,466 మంది విద్యార్థులకుగాను 803 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. ఇల్లంతకుంట మండలంలో 51 పాఠశాలల్లో 3,508 మంది విద్యార్థులకుగాను 948 మంది హాజరయ్యారు. మానకొండూరు మండలంలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో 4005 మంది విద్యార్థులకు గాను 719 మంది మాత్రమే భోజనం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 237 ప్రభుత్వ పాఠశాలల్లో 27842 మంది విద్యార్థులకు గాను 4656 మంది మధ్యాహ్న భోజనానికి వచ్చారు. తొమ్మిది స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా తినేందుకు రాకపోవడం విశేషం.వేములవాడ నియోజక వర్గంలో వేములవాడ అర్బన్, రూరల్‌తో పాటు చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 21,026 మంది విద్యార్థులకు గాను 3,420 మంది విద్యార్థులు హాజరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క చిగురుమామిడి మండలంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, బోయినపల్లి మండలాల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించారు. పూర్తి వివరాలు అందలేదు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మొదటి రోజు సగం నియోజకవర్గాల్లోనే కొనసాగింది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలవుతుం ది. ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు ఇతర గ్రామాల నుంచి వచ్చేవారు కాబట్టి హాజరు శాతం ఉండడంలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థుల హాజరు శాతం 45 మాత్రమే ఉంది. జిల్లా వ్యాప్తంగా భోజనం చేసిన విద్యార్థుల వివరాలు అందలేదు. గురువారం నుంచి ఎస్ఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పాఠశాల యూడైస్ కోడ్ కొట్టి స్పేస్ ఇచ్చి ఎండీఎంటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విద్యార్థుల సంఖ్యను టైప్ చేసి 99634 72066 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. - శ్రీనివాసాచారి, డీఈవో -
లైట్‌గా తీసుకోండి... హాయిగా ఉండండి!
ఏ సీజన్లో ఉండాల్సిన కష్టాలు ఆ సీజన్‌కి ఉంటాయి. చలికాలం వణికించేస్తుంది. వర్షాకాలం పనులకు ఆటంకం కలగజేస్తుంది. ఎండాకాలం అయితే చెమటలు కక్కించేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ సీజన్‌ని అయినా హాయిగా గడిపేయొచ్చంటున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి, చర్మ సౌందర్య గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలనీ, ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలనీ ఆమె అన్నారు. ఇక, సమ్మర్లో శ్రుతీహాసన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం... ► సమ్మర్లో స్కిన్ డ్యామేజ్‌ని తప్పించలేం. అందుకే మిగతా సమయాలకన్నా రెట్టింపు కేర్ తీసుకోవాలి. బయటికు వెళ్లేటప్పుడు మొహం, మెడ, చేతులు.. ఇలా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అందరు చెప్పేదే నేనూ చెబుతున్నా. ఈ సీజన్లో ఆయిలీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. ► మా ప్రొఫెషన్‌కి మేకప్ చేసుకోకపోతే కుదరదు. ఎండలో మేకప్ అంటే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. చర్మానికి ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. అందుకే, ఈ సీజన్లో షూటింగ్స్ లేనప్పుడు స్కిన్‌ని ఫ్రీగా వదిలేస్తా. ► ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలిపోతుంది. అది ఒక పట్టాన తగ్గదు. స్కిన్ ట్యాన్‌ని పోగొట్టాలంటే బంగాళదుంప తొక్కుని ఉపయోగించవచ్చు. ఆ తొక్కుని గుజ్జుగా చేసి, శెనగపిండి, పాలు కలిపి ట్యాన్ అయిన చోట పట్టించాలి. ఎండిపోయిన తర్వాత కడిగేయాలి. ట్యాన్ పోయేంతవరకూ ఇలా చేయొచ్చు. ► మార్కెట్లోకి ఎన్ని సౌందర్య సాధనాలైనా రానివ్వండి. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్‌లే బెటర్. శెనగపిండి, మీగడ కలిపి మొహానికి పట్టించుకుంటే చర్మానికి మంచిది. వేసవికి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్. ► సమ్మర్లో నా డైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ బాగా తాగుతాను. కొబ్బరి నీళ్లు కూడా తీసుకుంటాను. తేలికపాటి ఆహారమే తింటాను. మధ్యాహ్నం భోజనానికి పాస్తా, వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే అన్నం, పప్పు తీసుకుంటాను. సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో పండ్ల ముక్కలు తింటాను. రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ ముగించేస్తాను. సూప్, కూరగాయలు, పప్పు, రోటీ తింటాను. సమ్మర్లో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. -
విశాఖ, విజయవాడ నుంచి మరిన్ని స్పైస్ జెట్ సర్వీసులు
ముంబై: వేసవి సీజన్ సందర్భంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ మూడు కొత్త రూట్లలో సర్వీసులు ప్రారంభించింది. అలాగే ఆరు రూట్లలో సర్వీసులు పెంచింది. కొత్తగా ప్రవేశపెట్టిన వాటిలో తిరుపతి-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ముంబై-ఉదయ్‌పూర్ రూట్లు ఉన్నాయి. మరోవైపు సర్వీసుల ఫ్రీక్వెన్సీ పెంచిన వాటిల్లో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-విశాఖపట్నం, ఢిల్లీ-ధర్మశాల, ఢిల్లీ-శ్రీనగర్ రూట్లు ఉన్నాయి. కంపెనీ ఇటీవలే ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి సర్వీసులు ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్-చెన్నై రూట్లో నాలుగో నాన్-స్టాప్ ఫ్లయిట్, హైదరాబాద్-బెంగళూరు మధ్య నాలుగో డెరైక్ట్ ఫ్లయిట్, ఢిల్లీ-శ్రీనగర్ రూట్లో రెండో నాన్ స్టాప్ ఫ్లయిట్ ప్రారంభించినట్లవుతుంది. -
వేచవి చూద్దాం!
...::: taste the box-office summer :::... ‘బాహుబలి’ కోసం చూస్తూ, నిరుడు సమ్మర్ సీజన్‌ను వృథా చేసుకున్న చిత్రసీమ ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు. కొందరు పెద్ద హీరోలు లేరనే కానీ, ఈ వేసవిలో బాక్సాఫీస్ ఆల్రెడీ హీటెక్కింది. ఈ రిలీజ్ ఫిల్మ్స్‌లో కొన్నిటిపై ఫోకస్... కుటుంబ బంధాల ‘బ్రహ్మోత్సవం’ చిత్రం: ‘బ్రహ్మోత్సవం’ తారాగణం: మహేశ్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్, రేవతి, నరేశ్,తులసి, నిర్మాతలు: పరమ్, పెరల్ వి. పొట్లూరి, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల ఇతివృత్తం: కుటుంబ బంధాల చుట్టూ తిరిగే కథ. హైలైట్స్: ‘హమ్ ఆప్కే హై కౌన్’లా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ భారీ తారాగణం, ఒకరికి ముగ్గురు హీరోయిన్లు నిర్మాణ విలువలు తోట తరణి (ఆర్ట్), రత్నవేల్ (కెమేరా), మిక్కీ జె. మేయర్ (సంగీతం) లాంటి పేరున్న టెక్నీషియన్స్ అండ వినోదం, సెంటిమెంట్, ఎమోషన్స్‌తో సమ్మర్‌కి అందరూ చూసే ‘బాహుబలి’ లాంటి ‘ఈవెంట్ మూవీ’ అని నిర్మాతల మాట. ప్రోగ్రెస్: ఉత్తరాదిన కాశీ, హరిద్వార్, ఉదయ్పూర్లలో, దక్షిణాన ఊటీలో కీలక సీన్స్ చిత్రీకరించారు. 80 శాతం పూర్తి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏకధాటిగా షూటింగ్. ఏప్రిల్ 10న ఆడియో రిలీజ్‌కి ప్లాన్. బడ్జెట్: దాదాపు రూ. 75 కోట్లు రిలీజ్: ఏప్రిల్ 29న. తెలుగుతో పాటు తమిళంలోనూ ‘బ్రహ్మోత్సవం’గా రిలీజ్. మాఫియా సెంటిమెంట్ ‘కబాలి’ చిత్రం: ‘కబాలి’ తారాగణం: రజనీకాంత్, రాధికా ఆప్టే, కిశోర్, ధన్సిక, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాత: ‘కలైపులి’ ఎస్. థాను. దర్శకత్వం: పా. రంజిత్ ఇతివృత్తం: మాఫియా నేపథ్యం. యాక్షన్, సెంటిమెంట్ కలగలిసిన కథ. హైలైట్స్: విలక్షణమైన రజనీకాంత్ గెటప్, క్యారెక్టరైజేషన్. అప్పటి ‘బాషా’ లా ఇప్పుడు ఈ ‘కబాలి’ అని అంచనా. హాంగ్‌కాంగ్, థాయిలాండ్, మలేసియాల్లో షూటింగ్ చేశారు. చైనా సూపర్‌స్టార్ విల్సెన్ చో విలన్ ప్రోగ్రెస్: షూటింగ్ పూర్తి. ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతున్నాయి. బడ్జెట్: రూ. 100 కోట్ల పై మాటే! (తెలుగు, తమిళ భాషల్లో) రిలీజ్: మే నెలలో. వినోదాల విందు... ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం: ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తారాగణం: పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్, శరత్ కేల్కర్, రాయ్‌లక్ష్మి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: శరత్ మరార్, సునీల్ లుల్లా, దర్శకత్వం: కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఇతివృత్తం: చాలాచోట్ల ప్రచారమవుతున్నట్లు ఈ సినిమా పవన్‌కల్యాణ్ సంచలనాత్మక హిట్ ‘గబ్బర్‌సింగ్’కు సీక్వెల్ కాదు. ప్రీక్వెల్ కూడా కాదు. పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా పవన్‌కల్యాణ్ కనిపించే ఈ భారీ చిత్రం పూర్తిస్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం. హైలైట్స్: కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో విస్తృత షూటింగ్ చేశారు. సినిమా నిండా వందలాది గుర్రాలు, వింటేజ్ కార్లతో గుర్రాల మేళా లాంటి భారీ ఎపిసోడ్లు, రతన్‌పూర్ లాంటి భారీ సెట్స్ రోజూ వందల మంది యూనిట్‌తో షూటింగ్ సాగుతున్న భారీ ఫిల్మ్. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ నిర్మాణ, సాంకేతిక విలువలు పుష్కలం. కథాబలం, సన్నివేశ బలానికి తోడు అలరించే బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్, రామ్- లక్ష్మణ్‌ల యాక్షన్ రాయ్‌లక్ష్మితో ప్రత్యేక గీతంతో పాటు, అభిమానులకు పండగగా చిరంజీవి పాటకు డ్యాన్స్, ప్రసిద్ధమైన ‘వీణ స్టెప్’, పంచ్ డైలాగ్స్ సహా చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. ప్రోగ్రెస్: దాదాపు నెలన్నర పైగా ఏకధాటిగా ఒకటికి రెండు యూనిట్లతో చిత్రీకరణ జరుగు తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. 17వ తేదీ కల్లా మొత్తం పూర్తి. ఆ రోజే హిందీ, తెలుగుల్లో టీజర్ రిలీజ్. మార్చి 20న ఆడియో రిలీజ్. వెంటనే మిగిలిన 2 పాటల చిత్రీకరణకు ఛలో స్విట్జర్లాండ్, పవన్‌కల్యాణ్ ఇప్పటికే కొంత డబ్బింగ్ కూడా చెప్పారు. చెప్పిన డేట్‌కి రిలీజ్ కోసం యూనిట్ 24గంటలూ పనిచేస్తోంది. బడ్జెట్: సుమారు రూ. 70 కోట్లు రిలీజ్: తెలుగు ఉగాదైన ఏప్రిల్ 8న! హిందీ డబ్బింగ్ కూడా అదే రోజున వందలాది హాళ్లలో! కొత్త తరహా కథలకు... ‘ఊపిరి’ చిత్రం: ‘ఊపిరి’ తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా, సంగీతం: గోపీ సుందర్, నిర్మాతలు: పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే, స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: వంశీ పైడిపల్లి ఇతివృత్తం: ఫ్రెంచ్ సినిమా ‘ది ఇన్‌టచబుల్స్’ ఆధారంగా రూపొందుతున్న చిత్ర మిది. శారీరకంగా వికలాంగుడైన వందల కోట్ల అధిపతికీ, సామాజికంగా వెనుక బడిన దిగువ మధ్యతరగతి మనిషికీ మధ్య స్నేహబంధమెలా ఏర్పడింది? ఇద్దరూ కలసి దాన్నెలా కొనసాగించారనే కథాంశంతో ఈ భారీ మల్టీస్టారర్ రూపొందు తోంది. ఒక నిజమైన తోడుంటే, జీవితమెలా ఉంటుందో చెబుతుంది. చాలామంది అనుకుంటున్నట్లిది ప్రయోగాత్మక చిత్రం కాదు. ఎమోషనల్ ఎంటర్టైనర్. హైలైట్స్: శరీరం కదలించలేని వ్యాధిగ్రస్థుడై, చక్రాల కుర్చీకే పరిమితమైన వైవిధ్యభరిత పాత్రను నాగార్జున చేస్తున్నారు ఏకకాలంలో తెలుగుతో పాటు తమిళంలోనూ (తమిళ టైటిల్ ‘తోళా’) తీశారు. తొలిసారి నాగార్జున తమిళంలో, తమన్నా తెలుగులో డబ్బింగ్ చెప్పారు ఈ చిత్రంలో నాగార్జున వాడే చక్రాల కుర్చీని ప్రత్యేకించి వాడేవారి శరీరం కొలతలకు తగ్గట్లుగానే స్వీడన్లో తయారుచేస్తారు. గడ్డంతో ఆపరేట్ చేసే ఈ కుర్చీని, నాగార్జున కొలతలకు తగ్గట్లు, రూ. 25 లక్షలు పెట్టి తయారుచేయించి, దిగుమతి చేసుకున్నారు మొత్తం 108 షూటింగ్ డేస్ పట్టిన ఈ సినిమాను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, బెల్గ్రేడ్, బల్గేరియా - ఇలా మొత్తం 5 దేశాల్లో చిత్రీకరించారు. విపరీతంగా ఖర్చయ్యే ప్యారిస్ లాంటి చోట్ల ‘క్వీన్’ లాంటి హిందీ చిత్రాల తర్వాత ఈ మధ్య ఇంత విస్తృతంగా షూటింగ్ చేసిన సౌతిండియన్ సినిమా ఇదే ఆమిర్ ఖాన్ ‘గజనీ’, అమితాబ్ ‘పా’ లాంటి చిత్రాలకు పనిచేసిన మలయాళీ సునీల్ బాబు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేయడం విశేషం. వెండితెరపై ‘సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్’ అని దర్శక, నిర్మాతలు చెబుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఒత్తిడి నుంచి దూరం చేయడమే కాక, టికెట్ ఖర్చుకే ప్యారిస్‌లోని ప్రధాన ప్రాంతాలన్నీ చూపే కనువిందు. ప్రోగ్రెస్: దర్శకుడు హైదరాబాద్, చెన్నైల మధ్య తిరుగుతూ, శర వేగంతో పోస్ట్ ప్రొడ క్షన్ చేయిస్తున్నారు. బడ్జెట్: 60 కోట్లు రిలీజ్: మార్చి 25 (తెలుగు, తమిళాలు రెండూ) సరైన మాస్ యాక్షన్ చిత్రం: ‘సరైనోడు’ తారాగణం: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్‌సింగ్, సంగీతం: తమన్, నిర్మాత: అల్లు అరవింద్, దర్శకత్వం: బోయపాటి శ్రీను ఇతివృత్తం: లవ్, యాక్షన్ ఎంటర్టైనర్. ఎలాంటి బాదరబందీ లేని యువకుడి కథ. అమ్మాయి కోసం అతను ఏం చేశాడనేది కీలకాంశం. హైలైట్స్: అల్లు అర్జున్ పాడిన పాట. హీరో క్యారెక్టరైజేన్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్ర. ప్రోగ్రెస్: సౌత్ అమెరికాలో బొలీవియాలో ఉయు నిలో తాజాగా పాట తీశారు. షూటింగ్ పూర్తి. తుదిదశలో పోస్ట్ ప్రొడక్షన్. ఏప్రిల్ ఫస్ట్‌కే రెడీ. బడ్జెట్: సుమారు రూ. 45 కోట్లు రిలీజ్: ఏప్రిల్ 22న. ఫీల్‌గుడ్‌గా సాగిపో చిత్రం: ‘సాహసం శ్వాసగా సాగిపో’ తారాగణం: నాగచైతన్య, మంజిమా మోహన్, సంగీతం: రహ్మాన్, నిర్మాత: మిరియాల రవీందర్ రెడ్డి, దర్శకత్వం: గౌతమ్ మీనన్ ఇతివృత్తం: రొమాంటిక్- యాక్షన్ ఎంటర్టైనర్ హైలైట్స్: ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ. ఎ.ఆర్. రహ్మాన్ మ్యూజిక్. ఇదే కథతో తమిళంలో శింబు హీరోగా రూపొందిస్తున్నారు. ప్రోగ్రెస్: ఒక పాట మినహా పూర్తి. త్వరలో యూరప్‌లో ఆ పాట చిత్రీకరణ. నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బడ్జెట్: సుమారు రూ. 25 కోట్లు రిలీజ్: ఏప్రిల్ ద్వితీయార్ధంలో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం: శ్రీదేవి మూవీస్ చిత్రం. టైటిల్ పెట్టాలి. తారాగణం: నాని, సురభి, నివేదా థామస్, అవసరాల శ్రీనివాస్, రోహిణి, సంగీతం: మణిశర్మ, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి ఇతివృత్తం: సిటీ నేపథ్యంలో, ధనిక వ్యాపార ఫ్యామిలీల మధ్య సాగే రొమాంటిక్ థ్రిల్లర్ హైలైట్స్: ఇటీవల వస్తున్న కొత్త తరహా చిత్రాల ఫక్కీలోది. కథా పరంగా, టెక్ని కల్గా ఉన్నత ప్రమాణాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలం వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్, కథకు తగ్గ యాక్షన్, ఛేజ్‌లతో అన్ని ఉంటూ, అన్ని వర్గాలకూ నచ్చే చిత్రం పాటలు, డ్యాన్స్‌లకే పరిమితం కాని ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరితోనూ మంచి రొమాన్స్. రీరికార్డింగ్కున్న మంచి అవకాశానికి తగ్గట్లు మణిశర్మ అందిస్తున్న కొత్త తరహా సంగీతం. ఎస్. రవీందర్ (ఆర్ట్), పి.జి. విందా (సినిమాటోగ్రఫీ) లాంటి పేరున్న టెక్నీషియన్ల పనితనం ప్రోగ్రెస్: 75 శాతం పూర్తి. ఇటీవలే కొడెకైనాల్లో భారీ షెడ్యూల్ చేశారు. ఏప్రిల్ మొదటి వారానికి చిత్రీకరణ పూర్తి బడ్జెట్: సుమారు రూ. 15 కోట్లు రిలీజ్: మే చివరి వారంలో! వేసవికి కూల్ఫిల్మ్ చిత్రం: ‘అ...ఆ...’ తారాగణం: నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్, నదియా, సీనియర్ నరేశ్, సంగీతం: మిక్కీ జె. మేయర్, నిర్మాత: చినబాబు), రచన - దర్శకత్వం: త్రివిక్రమ్ ఇతివృత్తం: ఒక హీరో, ఇద్దరు హీరోయిన్ల లవ్‌స్టోరీ. కానీ, ముక్కోణపు ప్రేమ కాదు. అనసూయా రామలింగంగా సమంత, ఆనంద్ విహారిగా నితిన్‌ల రొమాంటిక్ - కామెడీ. కుటుంబ బంధాలకు పెద్ద పీట! హైలైట్స్: ఆహ్లాదపరుస్తూనే ఆలోచింప జేసే త్రివిక్రమ్ మార్కు సన్నివేశాలు, సంభాషణలు. ఒక మామూలు కథను ఎలాంటి జిమ్మిక్కులూ లేకుండా, ఎంత నిజాయతీగా చెప్పవచ్చో అంత నిజాయతీగా చెప్పిన, నిఖార్సైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కెమేరామన్ నటరాజ్ సుబ్రమణియన్ ‘ఫ్లై కామ్’ను విస్తృతంగా వినియోగించారు. ప్రోగ్రెస్: పొల్లాచ్చిలో ఆమధ్య చేసిన 10 రోజుల షెడ్యూల్‌తో టాకీ పూర్తి. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్ చేస్తున్నారు. వేగంగా పోస్ట్ ప్రొడక్షన్. మార్చి 24 నుంచి 2 పాటలు తీస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆడియో రిలీజ్. బడ్జెట్: సుమారు రూ. 40 కోట్లు రిలీజ్: మే 6న. సైన్స్ ప్లస్ ఫిక్షన్ చిత్రం: ‘24’ తారాగణం: సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, సంగీతం: ఎ.ఆర్. రహ్మాన్, నిర్మా తలు: శ్రేష్ఠ్ మూవీస్, గ్లోబల్ సినిమాస్, దర్శకత్వం: విక్రమ్ కుమార్ ఇతివృత్తం: సైన్స్ - ఫిక్షన్ థ్రిల్లర్. టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే కథ. 24 అంకె చుట్టూ కథ సాగుతుంది. ఆరేళ్ళ క్రితమే విక్రమ్ హీరోగా తెర మీదకు రావాల్సింది. తర్వాత మహేశ్ వద్దకూ ఈ స్క్రిప్ట్ వచ్చింది. భారీ బడ్జెట్, సాంకేతిక కారణాల వల్ల ఆగి, ఇప్పుడు సూర్య హీరోగా వస్తోంది. హైలైట్స్: సూర్య విచిత్ర వేషధారణ. హీరోగా, విలన్‌గా 2 పాత్రలూ చేస్తున్నారు. ఎన్ని గెటప్స్‌లో ఎలా కనిపిస్తారని సస్పె న్స్ విలన్ పాత్రకి 4 గంటలు మేకప్, కాన్సెప్ట్, టైమ్ మిషన్ నేపథ్యం చెన్నైలోనే కాక ముంబయ్, గుర్గావ్, పుణేలతో పాటు పోలెండ్లోనూ చిత్రీకరణ. ఖరీదైన అద్భుత లొకేషన్స్‌ను కెమేరాలో బంధించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం. హీరో నితిన్ దీన్ని తెలుగులో అందిస్తున్నారు. ప్రోగ్రెస్: చిత్రీకరణ తుది దశలో ఉంది. బడ్జెట్: సుమారు రూ. 80 కోట్ల పైనే! రిలీజ్: తమిళం, తెలుగుల్లో మే నెలలో! నవ్వులే... నవ్వులు చిత్రం: అధికారికంగా ప్రకటించలేదు. తారాగణం: మంచు విష్ణు, రాజ్‌తరుణ్, సోనారిక, హెబ్బాపటేల్, రాజేంద్రప్రసాద్, పోసాని, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: అనిల్ సుంకర, స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి ఇతివృత్తం: సమకాలీన యువతుల స్వభావాన్ని చూపెడుతూనే, ఒక చిన్న సందేశాన్ని పూర్తి కామెడీతో చెప్పే ఎంటర్టైనర్. హైలైట్స్: కథాంశంలో ఒక చిన్న పెయిన్ఫుల్ అంశం ఉన్నా, పంచదార పూతతో చెప్పే కథనం. సినిమా మొత్తానికీ కామెడీయే పెద్ద హైలైట్. పాత్రల పరిచయమై పోయాక, రెండో రీల్ నుంచి చివరి రీలు దాకా హిలేరియస్ కామెడీగా నడుస్తుందని దర్శక, నిర్మాతల ఉవాచ ప్రత్యర్థి పాత్రల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, హీరోలు నడిపే డ్రామా బ్యాంకాక్‌లో, హైదరాబాద్‌లో సెట్స్‌లో పాటల చిత్రీకరణ. ప్రోగ్రెస్: పాటలతో సహా షూటింగ్, ఎడిటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఏప్రిల్ ఫస్ట్ కల్లా తొలి కాపీ రెడీ. బడ్జెట్: సుమారు రూ. 13 కోట్లు. రిలీజ్: ఏప్రిల్ 14న. సుప్రీమ్ యాక్షన్ చిత్రం: ‘సుప్రీమ్’ తారాగణం: సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా, రాజేంద్రప్రసాద్, రవికిషన్, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: ‘దిల్’ రాజు, దర్శకత్వం: అనిల్ రావిపూడి ఇతివృత్తం: హీరో ట్యాక్సీ డ్రైవర్, హీరోయిన్ పోలీస్ ఇన్‌స్పెక్టరైన ఈ చిత్రకథ పూర్తి వినోదాత్మకం. ‘సుప్రీమ్’ అనే పేరు కూడా కథలో భాగమే. తొలి రీల్లోనే ఆ సంగతి వెల్లడి. హైలైట్స్: సమ్మర్ సీజన్‌కి అవసరమైన పూర్తి వినోదంతో పాటు థ్రిల్ చేసే యాక్షన్‌తో సౌతిండియన్ మీల్స్ లాంటి సినిమా వినోదం నిండిన విలన్‌గా భోజ్‌పురీ హీరో రవికిషన్ ‘యముడికి మొగుడు’లో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ‘అందం హిందోళం అధరం తాంబూలం...’ను రీమిక్స్ చేశారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా కుటుంబమంతా చూడదగ్గ చిత్రం ప్రోగ్రెస్: నాలుగైదు రోజుల షూటింగ్ మినహా మిగతా సినిమా పూర్తి. బడ్జెట్: సుమారు రూ. 15 కోట్లు. అభిషేక్ పిక్చర్స్ వారు రూ. 20 కోట్ల పైగా మొత్త మిచ్చి,ఈ చిత్రం హక్కులన్నీ కొనుగోలు చేసినట్లు సమాచారం. రిలీజ్: ఏప్రిల్ 29న అని ప్లాన్. ఇది... 600 కోట్ల జూదం! ఈసారి వేసవికి బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలు, ప్రభాస్, చిన్న ఎన్టీయార్, రామ్‌చరణ్, గోపీచంద్, రామ్, కల్యాణరామ్ లాంటి యువ హీరోలు హాళ్లలో పలకరించడం లేదు. తరువాతి సీజన్లలో జనం ముందుకు రావడానికి షూటింగ్స్‌లో బిజీగా గడపనున్నారు. అయితే, సందీప్ కిషన్ (‘రన్’), నారా రోహిత్ (‘సావిత్రి’, ‘రాజా చెయ్యి వేస్తే’), మంచు మనోజ్ (‘ఎటాక్’), సుమంత్ అశ్విన్ (‘రైట్ రైట్’) లాంటి యువ హీరోలు మాత్రం బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ వేసవి సినీ సమరంలో మరింత వేడిమికి తోడవుతున్నారు. వెరసి, ఈ వేసవిలో చెప్పుకోదగ్గ హీరోలు అందరివీ కలిపి పాతిక సినిమాల దాకా రానున్నాయి. ఈ మార్చి ఆఖరు నుంచి రాగల 75 రోజుల్లో 25 సినిమాలు రిలీజ్... అంటే, సగటున ప్రతి మూడు రోజులకో కొత్త సినిమా! వీటిపై రూ.600 కోట్ల దాకా పెట్టుబడి పణంగా పెట్టారు. అందుకే, ఈ సమ్మర్ చాలా హాట్ గురూ! - రెంటాల జయదేవ -
మాల్దీవుల్లో మస్త్ మజా...!
ఎప్పటిలానే వేసవి వేగంగా దూసుకొచ్చింది. ఇన్నాళ్లూ కాస్త కామ్‌గా ఉన్న సూర్యుడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే ఏదైనా చల్లని ప్రాంతాలకు వెళ్లి, సేద తీరాలనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా తారలు ఇండియాలో సమ్మర్ సీజన్ ఎంటరవ్వగానే వీలు కుదిరితే వింటర్ సీజన్ ఉన్న దేశాలకు వెళ్లిపోయి ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం నాగార్జున అండ్ ఫ్యామిలీ ఆ పని మీదే ఉన్నారు. భార్య అమల, కొడుకులు నాగచైతన్య, అఖిల్‌తో కలిసి నాగ్ మాల్దీవులు వెళ్లారు. ఇప్పుడక్కడ వింటర్ సీజన్. కూల్ కూల్‌గా ఉండటంతో హాయి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. కొడుకులతో కలిసి నాగ్ స్కూబా డైవింగ్ చేశారు. అమల కూడా వెనక్కి తగ్గలేదు. సముద్రంలో భర్త, పిల్లలతో డైవ్ చేశారు. ‘‘నీలి రంగు నీళ్లల్లో డైవ్ చేయడం మంచి అనుభూతి కలిగించింది. నీటి లోపల ఎంతో అందంగా ఉంది’’ అని నాగ్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. అఖిల్ అయితే, ‘‘ఇప్పటివరకూ నేను చేసిన వర్కవుట్స్లోనే ఇదే బెస్ట్’’ అంటూ మాల్దీవుల్లో వర్కవుట్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇంకా నాగ్, అమల, నాగచైతన్య, అఖిల్ డైవింగ్‌కి వెళ్లే ముందు డైవింగ్ సూట్లు ధరించి, ఫొటో దిగారు. మొత్తం మీద విహార యాత్రను ఈ కుటుంబం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. -
ఎండల్లో హెయిర్‌కేర్
ఎండకాలంలో చర్మసంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో కేశసంరక్షణకు కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. కొంచెం శ్రద్ధపెడితే తీవ్రమైన ఎండల్లోనూ అలల్లా ఎగిసిపడే కేశాలు సాధ్యమే. * ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి రాసినట్లే జుట్టుకు లేదా మాడుకు కొంచెం సన్‌స్క్రీన్ లోషన్ అప్లయ్ చేయాలి. ఈ లోషన్లు రాసినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత లేదా రాత్రి పడుకునే లోపుగా తలస్నానం చేయాలి. అలా సాధ్యం కానప్పుడు లోషన్లకు బదులుగా మాడుకు కొబ్బరినూనె రాయాలి. * ఈ కాలంలో స్విమ్మింగ్‌పూల్స్ అన్నీ నిండుగా ఉంటాయి. ఈతప్రియులు ఎండవేడి నుంచి సాంత్వన పొందడానికి ఎక్కువ సేపు నీటిలో ఉండడానికి ఇష్టపడతారు. అయితే స్విమ్మింగ్‌పూల్స్‌లో ఉండే నీటిలో క్లోరిన్ కలుపుతారు, ఉప్పునీరు కూడా ఉంటుంది. కాబట్టి పూల్‌లో దిగే ముందు తలను మంచినీటితో తడపాలి. జుట్టు తగినంత నీటిని పీల్చుకున్న తర్వాత ఎంత సేపు పూల్‌లో ఉన్నా ఆ నీటిని పీల్చుకోదు. కాబట్టి అందులోని రసాయనాల ప్రభావం జుట్టుపై పడదు. స్విమ్మింగ్ పూర్తయిన తర్వాత తప్పని సరిగా తలస్నానం చేయాలి. * తలస్నానం పూర్తయిన తర్వాత కండిషనర్ వాడకాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. సమ్మర్ కోసం ప్రత్యేకంగా సన్‌స్క్రీన్ ఉన్న హెయిర్ కండిషనర్లు మార్కెట్లో దొరుకుతాయి. * తలస్నానం చేసేటప్పుడు చివరగా నిమ్మరసం కలిపిన నీటితో జుట్టును తడపాలి. ఇలా చేయడం వల్ల కేశాలు దృఢంగా మారతాయి. కాని ఎండకాలంలో పొడిజుట్టుకు నిమ్మరసం వాడితే మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పొడిజుట్టుకు కాఫీ డికాషన్ వంటి కండిషనర్లను వాడడం మంచిది. * మూడు కప్పుల మంచినీటిలో రెండు కప్పుల ఆపిల్‌సైడర్ వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు ఉంటే ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు కూడా పట్టించాలి. -
వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం!
వేసవి పేరు చెప్పగానే భగభగ మండే భానుడి ఎండ ప్రతాపం గుర్తుకు రావడం ఎంత సహజమో.. వాటి నుంచి ఉపశమనం ఇచ్చే తియ్యనైన చల్లని పుచ్చకాయ ముక్కలు గుర్తుకురావడం కూడా అంతే సహజం. వీటి రుచిని ఆస్వాదించకుండా వేసవి పూర్తికాదనే చెప్పాలి. అందరికీ అందుబాటు ధరలో అత్యధిక పోషకాలనందిస్తూ వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. మార్చిలో కూడా అడుగుపెట్టక ముందే అప్పడే భానుడు తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు. అందుకే మార్కెట్లో పుచ్చకాయల వినియోగం ఊపందుకుంది. ఈరోజు వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..! - సాక్షి, స్కూల్ ఎడిషన్ పుచ్చకాయనే కర్జూజ అని కూడా పిలుస్తారు. దీన్ని మన దేశంలో ఉద్యాన పంటగా సాగుచేస్తున్నారు. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా ఈజిప్టులో ఐదు వేల ఏళ్ల క్రితమే పుచ్చను పండించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతో నచ్చడం వల్లే వారి గోడల మీదున్న చిత్రాల్లో వీటికి చోటు కల్పించారు. సమాధుల్లో కూడా వీటిని ఉంచేవారట. 13వ శతాబ్దానికి ఈ పంట యూరప్‌కు విస్తరించింది. మన దేశానికి.. క్రీ.శ నాలుగో శతాబ్దంలో మనదేశానికి పుచ్చకాయ వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇక్కడే పుట్టిందని వాదించే వాళ్లూ ఉన్నారు. శుశృతుడు తన శుశృత సంహితలో సింధునదీ తీరంలో పుచ్చకాయలను పండించినట్టు పేర్కొన్నాడు. అందులో దీన్ని ‘కళింద’గా రాసాడట. పొడిగా ఉండే ఉష్ణమండల వాతావరణంలో ఎలాంటి నేలలో అయినా పుచ్చ పంటను సాగుచేయవచ్చు. అందుకే ఇది ప్రపంచమంతా విస్తరించింది. ఈ పంట అమెరికన్లకు 17వ శతాబ్దంలో పరిచయమయింది. పోషకాలమయం.. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి లభ్యమవుతున్నా వేసవిలో పండించే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. బి-విటమన్లు, పొటాషియం సమృద్ధిగా లభించే పుచ్చకాయల నుంచి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. బి-విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన శరీరానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు పుచ్చకాయలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్లు అధికంగా లభ్యమవుతాయి. వీటిని మన శరీరం ఎ-విటమిన్‌గా మార్చుకుంటుంది. వీటితో పాటు విటమిన్ బీ6, విటమిన్ సీ, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. మిగిలిన పండ్లతో పోల్చుకుంటే నీటి శాతం వీటిలో అత్యధికం. విశేషాలు.. - అమెరికన్లు పుచ్చ పంటను సాగుచేయడంలో ఆఫ్రికన్లతో పోటీపడి అనేక ప్రయోగాలు చేస్తూన్నారు. గింజలు లేని పుచ్చకాయల్ని పండించడంతో పాటు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పండిస్తున్నారు. - వీటి ఉత్పత్తిలో అమెరికాది నాలుగో స్థానం. - జపాన్‌లో చతురస్రాకారంలో ఉండే పుచ్చకాయల్ని పండిస్తున్నారు. పిందె దశలో ఉన్నప్పుడే కావాల్సిన పరిమాణంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెలో తీగకు ఉన్న పిందెను అమర్చుతారు. అది క్రమంగా అదే ఆకారంలో అమరుతుంది. ఇవి చూడటానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. - చైనా,జపాన్లలో ఇంటికి వచ్చే అతిథులు ఎక్కువగా తెచ్చే బహుమతులు పుచ్చకాయలే. - సాధారణ పుచ్చకాయ బరువు 5-10 కిలోల బరువుంటే, వీటికి భిన్నంగా అమెరికాలో 20 కిలోల బరువుండే పుచ్చకాయల్ని పెంచుతారు. - అమెరికాలోని ఎరింగ్టన్కు చెందిన బిల్కార్నర్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు. - పుచ్చలు డిసెంబర్ నుంచి మే వరకు బాగా పండుతాయి. - ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల్లో పుచ్చకాయముక్కలకు ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తినడాన్ని బాగా ఇష్టపడతారు. 100 గ్రాములు పుచ్చకాయ గుజ్జులో.. 1 నీరు - 95.2 గ్రా 1 ప్రోటీన్ - 0.3 గ్రా 1 కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా 1 పీచు పదార్థాలు - 0.4 గ్రా 1 కెరోటిన్ - 169 మి.గ్రా 1 సీ విటమిన్ - 26 మి.గ్రా 1 కాల్షియం - 32 మి.గ్రా 1 ఫాస్పరస్ - 14 మి.గ్రా 1 ఇనుము - 1.4 మి.గ్రా 1 సోడియం - 104.6 మి.గ్రా 1 పొటాషియం - 341 మి.గ్రా 1 శక్తి - 17 కిలోక్యాలరీలు విభిన్న రకాలు.. ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల పుచ్చ జాతుల్ని పండిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. 1 నూర్జహాన్ 1 షర్బత్-ఎ- అనార్ 1 అనార్కలీ 1 షుగర్బేబీ (మహారాష్ట్రలోని అమెరికా రకం) 1 అసాహా యమటో (పశ్చిమ బెంగాల్‌లోని జపాన్ రకం) 1 నందారి (ఏపీలో అధికంగా పండించే రకం) 1 రెడ్ టైగర్ 1 ఆల్ స్వీట్ 1 వాల్ పెయింట్ -
సన్ డే
-
అప్పుడే కోతలు
నెల్లూరు (రవాణా): వేసవి కాలం పూర్తి స్థాయిలో ప్రారంభంకాక ముందే జిల్లాలో కరెంటు కోతలు మొదలయ్యాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఎప్పుడుపడితే అప్పుడు కరెంటు కట్ చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొద్ది రోజులుగా అనధికార కోతలు మొదలయ్యాయి. ఎమర్జన్సీ లోడ్ రిలీవ్(ఈఎల్ఆర్) పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు గంటలు, పట్టణ ప్రాంతాల్లో గంట పాటు కోత విధిస్తున్నారు. జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గడం, వినియోగం అనూహ్యంగా పెరగడంతో జిల్లాలో అధికారులు అనధికార కోతలు అమలు చేస్తున్నారు. కోతలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రోజుకు 99 లక్షల యూనిట్ల వినియోగం జరుగుతుంది. అదే పది రోజుల క్రితం 95 లక్షల యూనిట్ల వరకు వినియోగం ఉంది. అధికారులు మాత్రం జిల్లాకు కోటాగా కోటి యూనిట్లను కేటాయించారు. అయితే కోటా ప్రకారం జిల్లాకు విద్యుత్‌ను సరఫరా చేయడంలేదు. ఓ వైపు ఎండలు 35 డిగ్రీలకు చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో కరెం టు కోతలు విధించడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. తగ్గిన ఉత్పత్తి: శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఆర్టీపీపీ, వీటీపీఎస్, సీలేరు, సింహాద్రి తదితర ప్రాంతాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే బొగ్గు కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి నిలిచిపోతోంది. కృష్ణపట్నంలో 350 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికి అవసరం మేర సరిపోకపోవడంతో కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాలో కూడా రోజు వినియోగం పెరగడంతో ఎక్కువగా వినియోగించే సమయాల్లో అనధికార కోతలు విధిస్తున్నారు. ఇబ్బందులు పడుతున్న రైతులు: కరెంటు కోతల కారణంగా జిల్లా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా నాలుగు నుంచి ఐదు గంటల పాటు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. అదీ కూడా పగలు మూడు గంటలు, రాత్రి సమయంలో రెండు గంటలు సరఫరా చేస్తుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి పంట చేతికొచ్చే దశలో ఉంది. రైతులు కేవలం బోరు బావుల మీదే ఆధారపడ్డారు. రాత్రిళ్లు పొలాల్లోనే ఉండి కరెంటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనెలలో కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో కూడా మరమ్మతుల పేరుతో ఆయా ప్రాంతాల్లో గంట నుంచి రెండు గంటలు అనధికార కోత ఉంది. కోతలు రాష్ట్ర ఉన్నతాధికారులు విధిస్తున్నారే తప్ప తమ చేతుల్లో ఏం లేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. అనధికార కోతలు విధిస్తున్నాం : వెంకటేశ్వరావు, టెక్నికల్ డీఈ జిల్లాలో రెండు గంటల పాటు అనధికార కోతలున్నాయి. వినియోగం పెరగడం, ఉత్పత్తి కొంత మేర తగ్గడంతో అనధికార కోతల్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని గంటలు అనేది రాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకుంటారు. రానున్న రోజుల్లో కోతలు మరింత పెరిగే అవకాశం ఉంది. -
ఆక్వా చెరువుల్లో మృత్యుఘంటికలు
పిట్టలవానిపాలెం : ప్రస్తుతం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో సాగులో ఉన్న వెనామీ రొయ్య చలికి వణుకుతోంది. శీతల పరిస్థితులను వెనామీ రకం రొయ్యలు తట్టుకోవడం కష్టం. వారం రోజులుగా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలి ఎక్కువగా ఉండడంతోపాటు, మంచు అధికంగా కురుస్తోంది. ఈ ప్రాంతంలో సుమారు 3 వేల ఎకరాల్లో వెనామీ రకం రొయ్య సాగవు తోంది. గత కొంత కాలంగా వెనామీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. చెరువులపై మంచు తెరలు ఉదయం 10 గంటలకు కూడా తొలగడం లేదు. ప్రస్తుతం సాగులో ఉన్న నెలలోపు వెనామీ రొయ్యలు చలికి తట్టుకోలేకపోతున్నాయి. కొన్ని పిల్లలు చెరువులోనే మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని మేత కూడా తీసుకోలేక పోవడం వల్ల పెరుగుదల లోపం కనిపిస్తోంది. కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగితే 50 నుంచి 70 శాతం మేర రొయ్య పిల్లలు మృత్యువాత పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెనామీకి ఈ వాతావరణం ఇబ్బందికరమే... కొద్ది రోజులుగా శీతల వాతావరణ పరిస్థితులు వెనామీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి తీవ్రత అధికమైంది. దీంతో రొయ్య పిల్ల సరిగా మేత తినలేక ఎదుగుదల నిలిచిపోతోంది. రోజుల పిల్లలైతే చలికి తట్టుకోలేక చెరువు లోనే మృత్యువాత పడుతున్నాయి. - బడుగు ప్రకాశరావు,రైతు వేసవి పంటకు ఈ పంటకు తేడా ఉంది.. వేసవి కాలంలో సాగు చేసే రొయ్యసాగుకు ప్రస్తుతం చలికాలంలో సాగుకు చాలా తేడా ఉంది. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో రొయ్యలు మేత సరిగా తినక పోవడం వల్ల ఎదుగుదల ఉండడం లేదు. మరోవైపు ఖర్చులు పెరిగిపోతున్నాయి. - మంతెన గంగరాజు,రైతు -
మళ్లీ కోతలు
నిజామాబాద్ అర్బన్ : కరెంటు కోతలు మళ్లీ తీవ్రమయ్యాయి. వేసవి కాలంలో మాదిరిగా గంటల తరబడి కరెంటు కోతలు విధించడంతో గృహ అవసరాలతో పాటు, వ్యాపారులకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. మరో వైపు వ్యవసాయ రంగానికి కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే కరెంటును అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు మొత్తం ఆరు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉదయం 7 గం టల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు ఉండడం లేదు. 12 గంటల పాటు కరెంటు లేక గ్రామీణ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు కోతల వ ల్ల తాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. ఉదయం మాత్రమే నీరు అందుబాటులో ఉంటోంది. అనంత రం సాయంత్రం వరకు నీటి కష్టాలు కలుగుతున్నా యి. తాగునీరు, ఇతరత్రా అవసరాల కోసం ప్రజలు చెరువులు, కుంటలను ఆశ్రయిస్తున్నారు. జిల్లా కేం ద్రంలో, మండల కేంద్రంలోనైతే కరెంటు కోతల వల్ల వ్యాపారుల పనులు నిలిచిపోతున్నాయి. ట్రాన్స్‌కో షెడ్యుల్ ప్రకారం కరెంటు కోతలు విధించడం లేదు. కొన్ని చోట్ల ప్రకటించిన దానికంటే గంట అదనంగానే కోతలు విధిస్తున్నారు. ప్రస్తుతం బతుకమ్మ సంబరాలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉండడంతో కరెంటు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పగటి పూట మాత్రం కరెంటు కోతల వల్ల ఎలాంటి పనులు సాగడం లేదు. గ్రామీణ ప్రాం తాల్లో వ్యవసాయ రంగానికి కరెంటు కోతలు ఇబ్బం దులకు గురిచేస్తోంది. వరి పొట్టదశలో, చివరి దశలో ఉండడంతో నీరు అధికంగా అవసరం ఉంటుంది. కరెంటు కోతల వల్ల నీటి కష్టాలు ఎదురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడమే కరెంటు కోతలకు ప్రధాన కారణంగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. జలాశయా ల్లో అవసరమైన మేరకు విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. వ్యవసాయానికి ఐదు గంటల త్రీఫేజ్ కరెంట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి కావడం లేదు.. -ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రభాకర్ అవసరమైన మేరకు కరెంటు ఉత్పత్తి జరుగడం లేదు. అందుకే కోతలు తలెత్తుతున్నాయి. వీలైనంత మేరకు పూర్తిగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లో కోతలు లేకుండా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఈ కోతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా కరెంటును పొదుపుగా వాడుకునే విధంగా ప్రయత్నించాలి.