నేటి కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా కూల్‌డ్రింక్స్ ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక వేసవిలో అయితే కూల్ డ్రింక్స్ వినియోగం గురించి చెప్ప నక్కర లేదు. క్షణం కూడా ఆలోచించకుండా పసిపిల్లలకు కూడా తాగిస్తున్నారు. తాగిన ఆ కాసేపు రుచిగా, హాయిగా అనిపించినా, శీతల పానీయాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే షాకవుతారు. అతిగా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణుల హెచ్చరికల్ని ఒకసారి గమనించండి!
నలుగురు కలిసిన చోట, పార్టీల్లోనూ, శుభకార్యాల్లోనూ కూల్‌డ్రింక్స్ ఒక స్టేటస్‌గా సింబల్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరకు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఫ్రిజ్‌లలో స్టోర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కొందరైతే కూల్ డ్రింక్ తాగితే తప్ప తిన్నది అరగడం లేదు అనే స్థాయికి వచ్చేశారు.
ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం శీతల పానీయాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు ..ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అధిక బరువు: శీతల పానీయాలు, సోడాల్లో వినియోగించే శుద్ధిచేసిన చక్కెర (ఒక్కో బాటిల్‌లో దాదాపు 10 టీ స్పూన్ల వరకు) అధికంగా ఉంటుంది. కేలరీలు, కెఫిన్ మోతాదు కూడా ఎక్కువే. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడంతో లెప్టిన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూలం.
డయాబెటిక్: రక్తపోటు ముప్పు పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదాన్ని చేకూరుస్తుంది. శీతల పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రధాన కార్బోహైడ్రేట్ అని గుర్తించాలి.
ఫ్యాటీ లీవర్: శుద్ధి చేసిన చక్కెరలో ఉండే ప్రధానమైనవి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్. శరీర కణాలు గ్లూకోజ్‌ను సులభంగా జీర్ణం చేస్తాయి. కానీ ఫ్రక్టోజ్‌ను అరిగించే పని మాత్రం కాలేయానిదే. కూల్ డ్రింక్స్‌ఎక్కువైతే ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్‌కు దారితీస్తుంది. కాలేయం ఈ ఫ్రక్టోజ్‌ను కొవ్వుగా మారుస్తుంది. దీంతో లీవర్ సమస్యలొస్తాయి.
గుండె, కీళ్ల, సమస్యలు: శీతల పానీయాలు ఎక్కువైతే గుండె ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. అలాగే వీటిల్లోని మితిమీరిన కెఫిన్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమై గౌట్ , కీళ్లలో వాపు లేదా నొప్పి వస్తాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది.
పంటి సమస్యలు: సోడాల్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ దీర్ఘకాలంలో పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. ఇవి చక్కెరతో కలిపినప్పుడు, ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియాకి కారణమవుతాయి.
వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ కేన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్టు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే ప్రమాదం. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మానవశరీరంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపే శీతల పానీయాలకు బానిసలైన వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి.
Comments
Please login to add a commentAdd a comment