
న్యూస్ అలెర్ట్
ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు. తింటే డేంజరంటారొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు. రావి ఆకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్‌లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారూ లేనివారూ చెప్పేది వింటే ప్రొణం మీదకు రావచ్చు.
కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడినీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బ తిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.
ఆరోగ్య ప్రచారం మంచికోసం కాకుండా సబ్‌స్ట్రయిబర్ల కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారో తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి, ఎంతవరకు అవసరమో ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిది అంటారు.
ఇలాంటి అయోమయం మధ్యలో ప్రత్యామ్నాయ ఆహార ప్రచారకర్తలు ముందుకు వచ్చి తాము నమ్మిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్థారణ ఏమిటి అన్నది ఎవరూ చూడటం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ‘సన్నగా’ కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీరతత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించిప్రొణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఉదంతం ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది.
50 కిలోల నుంచి 24 కిలోలకు
కన్నూరు జిల్లా కలూరుపరయకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సెరి కోఆపరేటివ్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు మాట్లాడుతూ ‘ఆమె బరువు 24 కేజీలు ఉంది. బి.పి. 70, ఆక్సిజన్ లెవల్ 70, బ్లడ్‌షుగర్ 45.. సోడియం, పొటాషియం లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె ఆరు నెలలుగా ఆహారం తినకుండా దాచేస్తోంది.
మూడునెలలుగా యూట్యూబర్‌ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి మూడునెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే ‘అనొరెక్సియా’ అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలి’ అన్నారు. ‘రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు’ అని ఆయన తెలిపారు.
బాడీ షేమింగ్, వీడియోలు
ఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంటే, అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయులను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు సన్నబడాలని హటాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. ‘ఇలా చేస్తే వెంటనే బరువు తగ్గుతారు’ అనే వీడియోలు నమ్మవద్దని పిల్లలకు చె΄్పాల్సిన అవసరం ఉంది.
గుడ్డిగా నమ్మవద్దు
అలోపతిలోగాని ఆయుర్వేదంలోగాని లేదా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోగాని కచ్చితమైన నిపుణులను కలిసి పూర్తిగా కేస్ హిస్టరీ చెప్పి సన్నబడటానికి లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరల, కాయగూరల జ్యూసులు తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
నిపుణుల సలహా తప్పనిసరి
బరువు తగ్గడం అనేది మానసిక వైకల్యంగా మారే స్థితికి కొంతమంది చేరుకోవడం బాధాకరం. ఇలాంటి వారు యూట్యూబ్, ఇన్‌స్టా తదితర ప్లాట్‌ఫామ్స్‌లో తెలిసీ తెలియక చెప్పే సలహాలు నమ్మి నష్టపోతున్నారు. కేరళలో చనిపోయిన అమ్మాయి ఆరు నెలలు ‘హాట్‌వాటర్’ థెరపీ చేసింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఇద్దరూ ఒకే విధంగా బరువు తగ్గరు. అందుకు వయసు, శరీరతత్త్వం, జన్యుపద్ధతి, జీవన విధానం... ప్రభావం చూపుతాయి. బరువు తగ్గించాలంటే ఎక్స్‌పర్ట్‌లు వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని, మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, వద్దో సూచిస్తారు. క్వాలిఫైడ్ డైటిషియన్స్‌ను వ్యక్తిగతంగా కలిసి డైట్ పాటించాలి తప్ప ఎవరూ ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పే విధానాలకు దిగవద్దు.
– డా.వాణి కత్తి, ఫుడ్‌సైన్స్ ఎక్స్‌పర్ట్
Comments
Please login to add a commentAdd a comment