సాక్షి, ముంబై: వేసవి కాలం వచ్చిందంటే కరెంట్ లేక ఉక్కపోతతో ఇబ్బందిపడే ప్రజానీకానికి ఈసారి ఆ తిప్పలు తప్పనున్నాయి. ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ కావడంతో ఆ సమస్య ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ‘వేసవి కాలం వచ్చిందంటే ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిపోతుంది. అందుకు సరిపడా విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో ఇదివరకు కోత విధించాల్సి వచ్చేది.
అయితే ఈసారి రాష్ట్రవాసులకు ఆ ఇబ్బంది ఉండద’ని చెప్పారు. రాష్ట్రానికి 15,488 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఈ ఏడాది ఏకంగా 16,822 మెగావాట్ల విద్యుత్‌ను అధికారులు ఉత్పత్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలకు ఈ ఏడాది విద్యుత్ కోత నుంచి ఉపశమనం లభించనుందని వారు తెలిపారు. ‘రాష్ట్రంలో 1,58,26,042 మంది గృహ విద్యుత్, 25,31,474 వాణిజ్య, 3,46,808 పరిశ్రమ, 35,73,509 మోటారు బావి కనెక్షన్లు, 1,54,265 మంది ఇతర విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరికి 15,488 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంద’ని వివరించారు.
కాగా, మహానిర్మితి విద్యుత్ ఉత్పత్తి కంపెనీ బొగ్గు, గ్యాస్, నీరు ప్రాజెక్ట్‌ల ద్వారా 7,682 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ప్రైవేట్ ప్రాజెక్ట్ నుంచి 3,505 మెగావాట్లు, కేంద్ర ప్రాజెక్ట్‌ల ద్వారా రాష్ట్రానికి 5,635 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం వద్ద తాజాగా 16,822 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. రాష్ట్రంలో డిమాండ్ ప్రకారం విద్యుత్ సరఫరా చేసినప్పటికీ 1,334 మెగావాట్ల విద్యుత్ అదనంగా ఉంటుంది. దీన్ని బట్టి ప్రస్తుతం రాష్ట్రానికి విద్యుత్ కోత నుంచి విముక్తి లభించినట్లేనని విద్యుత్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మహాజెన్‌కోకు చెందిన బొగ్గు ప్రాజెక్ట్ ద్వారా 5,310 మెగావాట్లు, గ్యాస్ ప్రాజెక్ట్ ద్వారా 301 మెగావాట్లు, నీటి ప్రాజెక్ట్ ద్వారా 1,649 మెగావాట్లు, సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా 92 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
ధులే జిల్లాలోని సాక్రీ కేంద్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా 92 మెగావాట్లు, రాయ్‌గఢ్ జిల్లా ఉరణ్ కేంద్రంలోని గ్యాస్ ప్లాంట్ నుంచి 351 మెగావాట్ల విద్యుత్ లభిస్తుంది. కోరాడి విద్యుత్ కేంద్రంలో 1,040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అయితే మరికొన్ని యూనిట్లలో పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ద్వారా సామర్థ్యానికంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అయినా రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువే విద్యుత్ అందుబాటులో ఉండడంతో రాష్ట్ర ప్రజలకు ఈ ఏడాది వేసవిలో విద్యుత్ కోత నుంచి ఉపశమనం లభించనుందని విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.
ఈసారి కరెంట్ కోతలు లేనట్టే!
Published Mon, Apr 7 2014 10:50 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement