కరెంట్‌ ‘కట్‌‘కట! | Coal Shortage: Major Indian States That Are Facing Long Power Cuts | Sakshi
Sakshi News home page

కరెంట్‌ ‘కట్‌‘కట!

Published Tue, Oct 12 2021 1:39 AM | Last Updated on Tue, Oct 12 2021 1:41 AM

Coal Shortage: Major Indian States That Are Facing Long Power Cuts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అనధికారికంగా విద్యుత్‌ కోతలు విధిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు విద్యుత్‌ డిమాండ్, సరఫరాలను పరిశీలిస్తే.. మొత్తంగా నెలకొన్న లోటులో 11.2 శాతం మేర గత ఏడెనిమిది రోజుల్లోనే నమోదవడం గమనార్హం. అంతర్జాతీయంగా, దేశీయంగా బొగ్గు కొరత తీరి.. థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి పునరుద్ధరించే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 

ఉత్తరాది రాష్ట్రాల్లో.. 
జాతీయస్థాయిలో గ్రిడ్‌ నిర్వహణను నియంత్రించే ‘పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌ (పొసోకో)’రోజువారీ నివేదికలను విశ్లేషిస్తే.. గత వారం, పదిరోజులుగా పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొంతమేర విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. బిహార్, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8–7 గంటలకు మించి విద్యుత్‌ సరఫరా ఉండడం లేదని జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

పొసోకో నివేదికల మేరకు.. జార్ఖండ్‌లో ఏకంగా 18–24 శాతం వరకు విద్యుత్‌ కొరత ఏర్పడగా, రాజస్థాన్‌లో 11 శాతం, బిహార్‌లో 6శాతం వరకు రోజువారీ విద్యుత్‌ కొరత తలెత్తుతోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్‌ కొరత ఎక్కువగా ఉండగా.. కర్ణాటకలో స్వల్పంగా కొరత కనిపిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌ తొలివారంలో దేశవ్యాప్తంగా నమోదైన విద్యుత్‌ లోటుతో పోల్చితే.. ఈసారి విద్యుత్‌ లోటు 21 రెట్లు ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వారం రోజులుగా దేశంలో రోజూ సగటున 3,880 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా.. 80–110 ఎంయూ వరకు కొరత నమోదవుతోంది. 

115 ప్లాంట్లలో 6 రోజులకే నిల్వలు.. 
‘సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)’తాజా నివేదిక ప్రకారం.. దేశంలో 1,65,066 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో.. సగటున కేవలం 4 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. సాధారణంగా థర్మల్‌ ప్లాంట్లలో కనీసం 15 నుంచి 30 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి.

కానీ 115 ప్లాంట్లలో 0–6 రోజులకు సరిపడానే నిల్వలు ఉన్నాయి. 16,430 మెగావాట్ల సామర్థ్యమున్న 17 ప్లాంట్లలో సోమవారం నాటికి బొగ్గునిల్వలు ఖాళీకావడంతో.. వాటిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అంతేగాకుండా చాలా థర్మల్‌ ప్లాంట్లు బొగ్గు కొరత కారణంగా సామర్థ్యం కన్నా తక్కువగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం 
కోవిడ్‌ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. దీనితో విద్యుత్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. బొగ్గుకు కొరత మొదలై.. ధరలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే చైనా వంటి దేశాలు సరిపడా బొగ్గు లేక విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనాలో పరిశ్రమలు మూతపడుతున్నాయి. మన దేశంలోనూ కొద్దిరోజులుగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది.

ఇదే సమయంలో దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడిన థర్మల్‌ ప్లాంట్లకు ఆర్థిక భారం పడింది. దేశీయంగా కోల్‌ ఇండియా, సింగరేణి బొగ్గు సరఫరాను పెంచి సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కాగా ఏపీలోనూ బొగ్గు కొరత ఉందని, వెంటనే సరఫరా పెంచాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement