Coal shortage
-
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?
ఒకపక్క నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే... మరో పక్క ఆ నష్టాలు అధికమయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే ద్రవరూప ఖనిజం (స్టీల్ మెటల్ లిక్విడ్) ఉత్పత్తికి విఘాతం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరత. అలాగే నిధుల లేమి, ముడి ఖనిజం కొరత అగ్నికి ఆజ్యం తోడైనట్లు పరిణమించాయి. ఆంధ్రుల హక్కైన ‘విశాఖ ఉక్కు’కు ఈ సమస్యలన్నీ ఉరితాళ్లలా పరిణమించాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో గోదావరి (బ్లాస్ట్ ఫర్నేస్–1), కృష్ణా (బ్లాస్ట్ ఫర్నేస్–2), అన్నపూర్ణ (బ్లాస్ట్ ఫర్నేస్–3) బ్లాస్ట్ ఫర్నేస్లది కీలక పాత్ర. అయితే వీటిలో రెండు మూలన పడ్డాయి. ఈ నెల 12న అన్నపూర్ణ (బీఎఫ్– 3) మూత పడింది. గోదావరి ఈ ఏడాది మార్చిలో ద్రవ ఖనిజ ఉత్పత్తిని ఆపేసింది. ఇక మిగిలింది కృష్ణా మాత్రమే. ఇందులోనూ ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణాకు అతి కొద్ది బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అన్న పూర్ణ సామర్థ్యానికి తగినంత బొగ్గు అందుబాటులో లేనందునే మూత పడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి 20 వేల టన్నుల ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలంటే 14 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 45 రోజులకు కావాల్సిన బొగ్గును ముందస్తుగానే సమకూర్చు కోవాలి. అంటే 6.3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందు బాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 20 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. దీని వినియోగం పూర్తయిన వెంటనే కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను ఆపేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. అన్నపూర్ణను మూసే స్తున్నట్లు కొద్ది రోజుల కిందటే అంతర్గతంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక మార్గదర్శకాలు, ముడి సరుకుల కొరతతో పాటు కీలకమైన బొగ్గు లభ్యత లేనందున నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవరూప ఉక్కు ఖనిజం ఉత్పత్తి కావాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ నాజిల్ వరకు బొగ్గు నింపి మండించే ప్రక్రియను చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు లేనందున మూసేస్తున్నామంటున్నారు. అన్నపూర్ణ నుంచి ఉత్పత్తి 2012లో ప్రారంభమైంది. అనతి కాలంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి దీన్ని విస్తరించారు. 23 నెలల కిందట అంటే జనవరి 2022 నుంచి డిసెంబరు 2023 మధ్య కాలంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. కారణం ముడి సరుకు అందుబాటులో లేకపోవడం. మరోవైపు కరోనా ప్రభావం దీనికి తోడైంది. ఈ ఏడాది జనవరిలో సవాళ్లను అధిగమించి పని ప్రారంభించింది.ఇకపై సమస్యలేవీ లేవనుకుంటున్న తరు ణంలో బొగ్గు కొరత రూపేణా పూడ్చలేని అవరోధం రావడంతో ఉక్కు ఉత్పత్తితో పాటు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి తగినంత ముడి బొగ్గును సర ఫరా చేయక పోతే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగి పోతుంది. ఇదే జరిగితే 1982లో ఉక్కు కర్మాగారం ఆవిర్భావం అనంతరం... మొట్ట మొదటి సారిగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి నిలిచే ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేటీకరణలో వెనక్కితగ్గేదే లేదంటూ దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు... అలా జరిగేదేమీ లేదంటూ స్థానిక కూటమి పాలకులు మరోవైపు భిన్న స్వరాలు వినిపిస్తున్న తతంగాన్ని ఆంధ్రులంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్ నిర్వహణ విషయమై ఇక్కడి పాలకులు కేంద్రానికి నివేదిస్తారా, లేదా ఏవో హామీలతో కాల యాపన చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.– తిరుమలరావు కరుకోల ‘ జర్నలిస్ట్, 98494 93833 -
Fact Check: ఆరుబయట ఉంటే తడవదా!?
సాక్షి,అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతోపాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా, ‘విద్యుత్ ఉత్పత్తి లేదు.. కోతలే!’ అంటూ సోమవారం ‘ఈనాడు’ మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా పెడచెవిన పెట్టి, విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కంలు, ఏపీ జెన్కో ‘సాక్షి’కి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు.. ‘కోత’ లేకుండా సరఫరా.. ఇక ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్‌లోకి నీరు రావడంవల్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేది. అలాగే, ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే, ఈ ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడ్రోజులు అక్కడక్కడా స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 91.097, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48.842, ఎస్పీడీసీఎల్ పరిధిలో 89.445 కలిపి మొత్తం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలేకుండా ఆ మేరకు విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కంలు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది డిమాండు ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది. అయినా, రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్‌కు అదనంగా బహిరంగ మార్కెట్లో రూ.30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోళ్లు చేస్తుండటంవల్లే కోతల్లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలిలా ఉంటే.. విద్యుత్ సరఫరా చేయకుండా డిస్కంలు చేతులెత్తేశాయని పచ్చ పత్రిక నానా యాగీచేసింది. వర్షాకాలంలో సర్వసాధారణం వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడే, ఈ ఏడాదే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాక్ ఉంచడంవల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. అంతమాత్రానికే ‘థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వచేయడంలో ఏపీ జెన్కో అధికారులు విఫలమయ్యారంటూ ‘ఈనాడు’ గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. అందువల్లే కేంద్ర ఇంధన, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో రెండు మూడ్రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్కో బొగ్గు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వీటీపీఎస్, ఆర్టీపీపీలో రెండ్రోజులు, కృష్ణపట్నంలో పది రోజులు, హిందూజాలో మూడ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. -
బొగ్గు కొరతతోనే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ బంద్
సాక్షి, హైదరాబాద్: బొగ్గు లభ్యత లేకనే ఛత్తీస్‌గఢ్ తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయడం లేదని తెలంగాణ ట్రాన్స్‌కో స్పష్టం చేసింది. బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాను నిలుపుదల చేయడంలో వాస్తవం లేదని పేర్కొంది. మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. ‘రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ కరెంట్ బంద్’ శీర్షికతో మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ట్రాన్స్‌కో యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘సొంత అవసరాల బొగ్గు గని (క్యాప్టివ్ మైన్) నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణాలో అడ్డంకుల నేపథ్యంలో రోడ్డుతోపాటు రైలు మార్గాన్ని ఛత్తీస్‌గఢ్ వినియోగిస్తోంది. ఇతర వనరుల నుంచి కూడా బొగ్గు కొరతను ఎదుర్కొంటోంది. ఆలస్యంగానైనా మార్వా థర్మల్ విద్యుత్ కేంద్రానికి కాప్టివ్ గని కేటాయింపులు జరగడంతో బొగ్గు లభ్యత చేకూరడంతోపాటు విద్యుత్ వేరియబుల్ ధర తగ్గింపునకు దోహదపడింది. దీంతో అధిక ధరలతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను నివారించినట్టు అయింది. తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులకు లోబడి ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సిన బకాయిలను అంగీకరించడం జరిగింది. లేట్ పేమెంట్ సర్‌చార్జీ రూల్స్–2022 కింద ఆర్ఈసీ/పీఎఫ్‌సీల ద్వారా పాత బకాయిల చెల్లింపునకు ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ స్థిర ధర (ఫిక్స్డ్ కాస్ట్) మినహా టారిఫ్ విషయంలో ఇతర తీవ్రమైన వివాదాలేమీ లేవు. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర ధరను ఢిల్లీలోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాం. ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదించిన స్థిర చార్జీలను పరిగణనలోకి తీసుకున్నా, షార్ట్ టర్మ్ మార్కెట్, ఎక్సే్ఛంజీల విద్యుత్ ధరలతో పోటీపడేలానే ఉంది. విద్యుత్ ధరలను ఛత్తీస్‌గఢ్ అసాధరణంగా పెంచేసిందనడం సరికాదు. ఎందుకంటే, ఈఆర్సీ ఖరారు చేసిన టారిఫ్‌ను మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది’అని ట్రాన్స్‌కో తెలిపింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా లేకున్నా, అందుకోసం బుక్ చేసుకున్న ట్రాన్స్మిషన్ లైన్లకు చార్జీలు చెల్లిస్తున్న అంశంపై సైతం ట్రాన్స్‌కో వివరణ ఇచ్చింది. పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోళ్లతోపాటు పవర్ బ్యాంకింగ్ అవసరాలకు ఈ లైన్లను వాడుకుంటున్నట్టు తెలిపింది. ట్రాన్స్‌కో, డిస్కంల భిన్న వాదనలు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై తెలంగాణ ఈఆర్సీకి రాష్ట్ర డిస్కంలు ఇచ్చిన వివరాలు, ‘సాక్షి’ కథనంపై తెలంగాణ ట్రాన్స్‌కో ఇచ్చిన వివరణ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. బొగ్గు కొరత వల్లే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా ఆగినట్టు ఈఆర్సీకి ఇచ్చిన వివరణలో డిస్కంలు ఎక్కడా పేర్కొనలేదు. ఛత్తీస్‌గఢ్‌కి ఇవ్వాల్సిన బిల్లుల బకాయిలతోపాటు మార్వా విద్యుత్ కేంద్రం పెట్టుబడి వ్యయంపై వివాదంతోనే సరఫరా జరగడం లేదని తెలిపాయి. బకాయిలిచ్చే వరకు సరఫరా చేయం: ఛత్తీస్‌గఢ్ ‘మాకు బకాయిపడిన దీర్ఘకాలిక బకాయిలను చెల్లించేవరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయం. తెలంగాణకు 2023–24లో ఎలాంటి విద్యుత్ సరఫరాను పరిగణనలోకి తీసుకోబోం’ అని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (సీఎస్పీడీసీఎల్).. ఆ రాష్ట్ర ఈఆర్సీకి తెలియజేసింది. ఈ విషయాన్ని తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)–2023–24లో పొందుపర్చింది. -
CM YS Jagan: బొగ్గు కొరత రానివ్వద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బొగ్గు కొరత రాకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, థర్మల్ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరతను అధిగమించడానికి సులియారీ బొగ్గు గని నుంచి ఉత్పత్తి పెంచడంతో పాటు సింగరేణి బొగ్గు గనుల యాజమాన్యంతోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా ఖర్చులు కలిసి రావడంతో పాటు, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుందని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని వారికి వివరించాలని సూచించారు. డిసెంబర్‌లోగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల టెండర్లు పూర్తి కావాలని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్న రోజుల్లో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని భారీగా విద్యుత్ కొనుగోలు చేశామని ఇంధన శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా, దానికి సరిపడా బొగ్గు సరఫరా కేంద్రం నుంచి ఉండటం లేదని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ (పీహెచ్‌ఎస్‌పీపీ)పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం అన్ని రకాలుగా ప్రయత్నం.. ► కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్ ప్లాంట్ ఉండటం వల్ల ఓడల ద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చూడాలి. సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి. కోల్ స్వాపింగ్ (ఇచ్చిపుచ్చుకోవడం) లాంటి వినూత్న ఆలోచనలు అమలు చేయాలి. ► విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్ ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. డిమాండ్ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. మీటర్ల ఏర్పాటుపై రైతులకు లేఖలు ► వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇందు కోసం రైతులకు లేఖలు రాయాలి. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో, దానివల్ల రైతులకు జరిగిన మేలేంటో కూడా వివరించాలి. అక్కడ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయిన విషయాన్ని రైతులకు తెలియాజేయాలి. ► మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని, విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటుందనే విషయాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి. ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పాడైనా వెంటనే రీప్లేస్ చేయాలి. ► ఈ సమావేశంలో ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్కాప్ ఎండీ ఎస్ రమణారెడ్డి, డిస్కంల సీఎండీలు కే సంతోషరావు, జే పద్మా జనార్ధనరెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్‌లోగా టెండర్లు ► పోలవరం విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ పనులపైనా సీఎం సమీక్షించారు. పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని 2024 ఏప్రిల్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామని అధికారులు తెలిపారు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్నారు. ► ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి డిసెంబర్‌లోగా టెండర్లు ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు(పీఎస్పీ)లపై సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. జగనన్న కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు. ► కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ యూనిట్–3 సెప్టెంబర్ నుంచి, విజయవాడ థర్మల్ ప్లాంట్ ఐదవ స్టేజ్ 2023 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్పారు. ఈ రెండు యూనిట్ల ద్వారా అదనంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. -
పరిశ్రమలపై తొలగనున్న ఆంక్షలు
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమలపై విధించిన ఆంక్షలను సాధ్యమైనంత త్వరగా తొలగించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి మీడియాకు వెల్లడించారు. విద్యుత్ సరఫరాపై పరిశ్రమలకు విధించిన కొద్దిపాటి ఆంక్షలను వీలైనంత త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. దీనిపై డిస్కంల సీఎండీలు స్పందిస్తూ.. బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అంతరాయాలు లేకుండా గృహాలకు నిరంతరం, వ్యవసాయానికి పగటిపూట 7గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డైరెక్టర్ ఏవీకే భాస్కర్, డిస్కంల సీఎండీలు సంతోషరావు, పద్మజనార్ధనరెడ్డి, హరనాథరావు పాల్గొన్నారు. -
ఇష్టానుసారంగా అమ్మితే కుదరదు!
సాక్షి, అమరావతి: బొగ్గు, విద్యుత్ కొరతను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. బహిరంగ మార్కెట్లో భారీ ధరలకు విద్యుత్‌ను అమ్మేస్తున్నాయి. దీనిపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) స్పందించింది. ఇకపై ఇష్టమొచ్చిన ధరలకు అమ్మడం కుదరదని స్పష్టం చేసింది. యూనిట్ రూ.12 లేదా అంతకంటే తక్కువకు మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు సరిపడా విద్యుత్ సమకూరే అవకాశం ఏర్పడింది. కొందామన్నా దొరకట్లేదు.. గతేడాది అక్టోబర్‌లో బొగ్గు సంక్షోభం తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధరలను విపరీతంగా పెంచేశాయి. దీన్ని అప్పట్లోనే గమనించిన కేంద్ర విద్యుత్ శాఖ యూనిట్ రూ.12 కంటే ఎక్కువ ధరకు విక్రయించొద్దని చెప్పింది. ఏప్రిల్ 2నుంచి ధరల సీలింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. కానీ ఉత్పత్తి సంస్థలు తెలివిగా వ్యవహరించడం మొదలుపెట్టాయి. మార్కెట్లను విడదీసి.. డిమాండ్ ఆధారంగా ధరలను అమలు చేయడం ప్రారంభించాయి. యూనిట్‌ను రూ.16 నుంచి రూ.20 వరకు కొనాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకైతే బహిరంగ మార్కెట్లో విద్యుత్ దొరకడమే కష్టంగా మారింది. ఏపీలో రోజుకు 200 మిలియన్ యూనిట్ల నుంచి 230 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉండటంతో.. రోజుకు దాదాపు రూ.40 కోట్లు వెచ్చించి మరీ విద్యుత్ కొంటున్నారు. అన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదేశాలు ఈ నేపథ్యంలో పవర్ ఎక్సే్చంజీల్లోని అన్ని సెగ్మెంట్లలో ఒకే విధమైన ధరల పరిమితి అవసరమని సీఈఆర్సీ గుర్తించింది. విద్యుత్ కంపెనీలు అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయని తేల్చింది. అత్యవసరం ఏర్పడినప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తుండటం వల్ల.. ఆ సమయంలో ధరలు భారీగా పెరుగుతున్నాయని కూడా గ్రహించింది. రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, మార్కెట్లో జరుగుతున్న పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న సీఈఆర్సీ సుమోటోగా తాజా ఆదేశాలిచ్చింది. జూన్ 30 వరకు ఇవే ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. -
కరెంటుకు కటకట
న్యూఢిల్లీ: మండే ఎండలతో ఓవైపు అల్లాడుతున్న జనానికి కరెంటు కోతలు చుక్కలు చూపిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, యూపీ సహా 16కి పైగా రాష్ట్రాల్లో డిమాండ్ పీక్స్‌కు చేరింది. సరిపడా కరెంటు పంపిణీ చేయలేకపోవడంతో గంటల తరబడి కోతలు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా కరెంటు వాడకం భారీగా పెరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు దేశ చరిత్రలోనే అత్యధికంగా 207.11 గిగావాట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ శాఖ ట్వీట్ చేసింది. కేంద్రం చేతగానితనమే విద్యుత్ సంక్షోభానికి కారణమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. ‘‘మోదీ జీ! దేశమన్నా, ప్రజలన్నా మీకు అస్సలు పట్టదా?’’ అంటూ నిలదీశారు. ఇకనైనా విద్వేషపు బుల్డోజర్లను ఆపి విద్యుత్కేంద్రాలను నిరంతరాయంగా నడపడంపై దృష్టి పెట్టాలన్నారు. ఢిల్లీలో ఒక్క రోజు బొగ్గు నిల్వలే థర్మల్ విద్యుత్‌పైనే అత్యధికంగా ఆధారపడ్డ నేపథ్యంలో విద్యుత్కేంద్రాలకు బొగ్గు సకాలంలో అందక సంక్షోభం ముంచుకొచ్చింది. ఢిల్లీలో ఒక్క రోజుకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. బొగ్గు అందకుంటే ఆస్పత్రులకు, మెట్రోకు కరెంటివ్వలేమని కేజ్రివాల్ ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇప్పటిదాకా ఎలాగోలా సర్దుబాటు చేశాం. పరిస్థితులు చెయ్యి దాటుతున్నాయి’’ అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. విద్యుత్కేంద్రాలకు బొగ్గు పంపిణీకి వీలుగా 657 పాసింజర్ రైళ్లను కేంద్రం నిరవధికంగా రద్దు చేసింది. వాటికి బదులు యుద్ధప్రాతిపదికన బొగ్గు వాగన్లను రవాణా చేస్తామని రైల్వే శాఖ పేర్కొంది. 165 థర్మల్ విద్యుత్కేంద్రాలకు గాను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రోజువారీ బొగ్గు నిల్వల నివేదిక ప్రకారం 56 కేంద్రాల్లో 10% బొగ్గు నిల్వలే ఉన్నాయి. 26 కేంద్రాల్లోనైతే 5% కంటే తక్కువకు పడిపోయాయి. బొగ్గు నిల్వలు 21 రోజులకు సరిపడా లేకుంటే నిరంతరాయ విద్యుత్ పంపిణీ వీలు పడదు. కేంద్రం వర్సెస్ కేజ్రివాల్ ఢిల్లీలో డిమాండ్ రోజుకు 6 వేల మెగావాట్లకు పెరగడంతో పంపిణీ కష్టంగా మారింది. బొగ్గు నిల్వలు ఒక్క రోజుకు సరిపడా మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం చెప్పగా, అదేమీ లేదంటూ ఎన్టీపీసీ ట్వీట్ చేసింది. ‘‘ఢిల్లీకి కరెంటు సరఫరా చేసే ఉంచహార్, దాద్రి విద్యుత్కేంద్రాలు 100% సామర్థ్యంతో పని చేస్తున్నాయి. బొగ్గు పంపిణీ సక్రమంగానే జరుగుతోంది. దాద్రిలో 1.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఉంచహార్లోని ఐదు యూనిట్లలో 95 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి’’ అని చెప్పింది. -
ఢిల్లీలో దంచికొడుతున్న ఎండలు.. కీలక వ్యవస్థలకు 24 గంటల కరెంట్ కష్టమే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ సంక్షోభం డేంజర్స్ బెల్స్ మోగిస్తోంది. హీట్ వేవ్ కారణంగా దేశరాజధానిలో విద్యుత్ డిమాండ్ తారాస్థాయికి చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మెట్రో, హాస్పిటల్స్ వంటి కీలక వ్యవస్థలకూ నిరంతర విద్యుత్ అందించడం సాధ్యంకాదని ప్రభుత్వం హెచ్చరించింది. బొగ్గు కొరత కారణంగా దాద్రీ-2, ఊంచహార్ పవర్ స్టేషన్స్ నుంచి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని... ఇది ఇలాగే కొనసాగితే, ఢిల్లీ మెట్రోతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర కార్యాలయాలకు 24 గంటలు విద్యుత్ అందించడం కుదరదని కేజ్రీవాల్ సర్కార్ స్పష్టంచేసింది. విద్యుత్ సంక్షోభాన్ని నివారించేందుకు బొగ్గు సరఫరా కోసం ఢిల్లీ సర్కార్ కేంద్రం తలుపు తట్టింది. తక్షణమే బొగ్గు సరఫరా పెంచాలంటూ ఈమేరకు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ విద్యుత్ అవసరాల్లో 25 నుంచి 30శాతం థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తోందని వివరించారు. కేజ్రీవాల్ ప్రభుత్వ వినతిమేరకు ఢిల్లీకి బొగ్గు సరఫరాను పెంచేందుకు కేంద్రం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా కొన్ని ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే వెల్లడించింది. చదవండి👉🏻పంజాబ్: శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు, వీడియోలు వైరల్ ఫుల్ డిమాండ్ ఏప్రిల్ నెలలో తొలిసారిగా రోజువారీ పవర్ డిమాండ్ 6వేల మెగావాట్ల మార్క్‌ను టచ్ చేసింది. తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో .. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే దాద్రీ -2 పవర్ స్టేషన్లో కేవలం ఒక్కరోజుకు సరిపడా బొగ్గు నిల్వలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దాద్రీ-2 నుంచి ఢిల్లీకి 1751 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. ఇక్కడ ఉత్పత్తి నిలిచిపోతే ఢిల్లీలో బ్లాకౌట్ కావడం ఖాయం అంటున్నారు నిపుణులు. చదవండి👉🏼 పెట్రోల్ ధరలు చాలా తక్కువ పెంచాం: కేంద్ర మంత్రి -
ప్యాసింజర్ రైళ్ల రద్దు.. ఆలస్యం! కారణం ఏంటంటే..
దేశవ్యాప్తంగా పలు ప్యాసింజర్ రైళ్లను అర్ధాంతరంగా ఇండియన్ రైల్వేస్ రద్దు చేస్తోంది. అంతేకాదు చాలావరకు ప్యాసింజర్ రైళ్లు విపరీతమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. ఈ పరిణామాలేవీ ఊహించని ప్రయాణికులు.. ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ఎందుకంటారా?.. తీవ్రమైన బొగ్గు కొరత. అవును.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కొనసాగుతోంది. వేసవి కావడం.. విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం తలెత్తే ఘటింకలు మోగుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. బొగ్గు సరఫరా కోసం మార్గం సుగమం చేసేందుకే ప్యాసింజర్ రైళ్లను రద్దుచేయడం, ఆలస్యంగా నడపడం చేస్తోంది రైల్వే శాఖ. అంతేకాదు గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతంగా బొగ్గు లోడ్‌ను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో 70 శాతం కరెంట్ బొగ్గు నుంచే ఉత్పత్తి అయ్యేది. అలాంటిది దేశంలో ప్రస్తుతం అనేక ప్రాంతాలు చాలా గంటలు కరెంట్ కోతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని పరిశ్రమలు అయితే ఈ శిలాజ ఇంధనం కొరత కారణంగా ఉత్పత్తిని తగ్గించేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఆజ్యం పోసిన అధిక ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కష్టపడుతున్న సమయంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మొత్తంగా 670 ప్యాసింజర్ ట్రిపులను మే 24వ తేదీవరకు రద్దు చేసినట్లు.. మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు నొటిఫై చేసింది రైల్వేస్. అయితే ఏయే రూట్లలో ప్రయాణాలు రద్దు అనేది ప్రయాణికులే గమనించాలని కోరింది. అలాగే ప్యాసింజర్ రైళ్ల అంతరాయం తాత్కాలికం మాత్రమేనని, అతిత్వరలోనే పరిస్థితి చక్కబడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్‌కృష్ణ బన్సాల్. ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరుతున్నారు. బొగ్గు సరఫరాలో అంతరాయాలకు భారతీయ రైల్వే తరచు విమర్శలు ఎదుర్కొనడం సహజంగా మారింది. సరిపడా క్యారేజీలు లేకపోవడం వల్ల ఎక్కువ దూరాలకు ఇంధనాన్ని తీసుకెళ్లడం కష్టంగా ఉంటోంది. అలాగే రద్దీగా ఉండే మార్గాల్లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు తమ తమ ప్రయాణాల కోసం తంటాలు పడుతుంటాయి. కొన్నిసార్లు సరుకులు ఆలస్యం అవుతాయి. అయినప్పటికీ, గనులకు దూరంగా ఉన్న వినియోగదారుల కోసం క్యారియర్ బొగ్గు రవాణా కొనసాగుతోంది. ఢిల్లీలో పరిస్థితి ఘోరం ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే బొగ్గు కొరత తీవ్రంగా మారుతోంది. దీంతో డిల్లీ సర్కార్.. కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఢిల్లీకి అవసరమయ్యే 30 శాతం పవర్‌ను దాద్రి-2, ఊంచహార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం వాటిలో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. అవి పని చేయడం ఆగిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మెట్రో రైళ్లతో పాటు ఆస్పత్రుల్లోనూ కరెంట్ సరఫరా నిలిచిపోతుందటూ ఢిల్లీ సర్కార్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. -
కాపాడండి మహాప్రభో..బొగ్గు కొరతపై మోదీకి విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: అనియంత్రిత రంగ సంస్థలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో సత్వరం జోక్యం చేసుకుని పరిష్కారమార్గం చూపాలని ప్రధాని నరేంద్ర మోదీకి పరిశ్రమ వర్గాలు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు కొరత వల్ల ఎక్ఛేంజీల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని పేర్కొన్నాయి. తయారీ, క్యాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై (సీపీపీ) ఆధారపడే సంస్థలు మొదలైన వాటికి సంబంధించిన 10 పరిశ్రమల అసోసియేషన్లు కలిసి ఈ మేరకు ప్రధానికి వినతిపత్రం సమర్పించాయి. బొగ్గు సరఫరా సుదీర్ఘ సమయంగా తగ్గిపోవడం వల్ల అల్యుమినియం, సిమెంటు, ఉక్కు తదితర పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. సీపీపీలు నిరుపయోగంగా పడి ఉండటంతో పాటు వాటిపై ఆధారపడిన సంస్థలు మార్కెట్ నుంచి విద్యుత్ కొనుక్కోవాల్సి వస్తోందని, దీనివల్ల మొత్తం వ్యవస్థ పనితీరు దెబ్బతింటోందని వినతిపత్రంలో పరిశ్రమలు వివరించాయి. చాలా మటుకు కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవడమో లేక మూసివేయడమో చేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపాయి. దీనితో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయి, అంతిమంగా వినియోగదారులపై భారం పడుతుందని పేర్కొన్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీపీలు, ఉక్కు, సిమెంటు, స్పాంజ్ ఐరన్ వంటి రంగాలకు బొగ్గు సరఫరా 32 శాతం వరకూ తగ్గిపోయింది. జనవరి–మార్చిలోనే విద్యుత్, విద్యుత్‌యేతర రంగాలకు సమానంగా బొగ్గు సరఫరా జరిపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని అవి తెలిపాయి. మరోవైపు, కోవిడ్–19 అనంతరం ఎకానమీలో డిమాండ్ ఒక్కసారిగా ఎగియడం, వేసవి మరికాస్త ముందుగానే రావడం, గ్యాస్ ధర .. దిగుమతి చేసుకున్న బొగ్గు రేటు పెరగడం, కోస్తా థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోవడం వంటి అంశాలు బొగ్గు కొరత.. విద్యుత్ డిమాండ్‌కు దారి తీశాయని బొగ్గు శాఖ కార్యదర్శి ఏకే జైన్ తెలిపారు. -
తగ్గుతున్న బొగ్గు నిల్వలు..పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలకు సమస్య ఏర్పడుతోందని.. ఇది పొంచి ఉన్న విద్యుత్ సంక్షోభాన్ని సూచిస్తున్నట్టు అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘రాష్ట్రాల్లో విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. థర్మల్ ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు లేకపోవడమే సమస్యకు కారణం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా రోజువారీ నివేదిక ప్రకారం చూస్తే.. దేశీ బొగ్గును వినియోగించే 150 థర్మల్ ప్లాంట్లకు గాను 81 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి క్లిష్టంగా ఉంది. 54 ప్రైవేటు ప్లాంట్లలో 28 చోట్ల బొగ్గు నిల్వల పరిస్థితి ఇంతే ఉంది’’అని ఏఐపీఈఎఫ్ అధికార ప్రతినిధి వీకే గుప్తా పేర్కొన్నారు. పెరిగిన బొగ్గు సరఫరా: సీఐఎల్ బొగ్గు ఉత్పత్తిలో అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియా (సీఐఎల్) బొగ్గు సరఫరా పెంచినట్టు మంగళవారం ప్రకటించింది. ప్రస్తుత నెల మొదటి 15 రోజుల్లో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను 14.2 శాతం అధికంగా సరఫరా చేసినట్టు తెలిపింది. ఈ కాలంలో సరఫరా రోజువారీ 1.6 మిలియన్ టన్నులుగా ఉందని.. 2021 ఏప్రిల్ మొదటి భాగంలో రోజువారీ సరఫరా 1.43 టన్నులుగానే ఉన్నట్టు వివరించింది. అయితే వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ డిమాండ్ పెరిగిపోయిందని, దీంతో పెరిగిన బొగ్గు సరఫరా ప్రభావం కనిపించడం లేదని పేర్కొంది. బొగ్గు, విద్యుత్, రైల్వే శాఖల మధ్య సమన్వయంతో విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచే చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. చదవండి: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..తగ్గనున్న వినియోగం..! -
నెలాఖరుకు నిశ్చింత!
సాక్షి, అమరావతి: విద్యుత్ కొరత తాత్కాలికమేనని, ఈ నెలాఖరు నాటికి సరఫరా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. కాగా ఈ నెల 18న విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి తొలి సమీక్ష నిర్వహించనున్నారు. ఇదీ పరిస్థితి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత కారణంగా డిమాండ్, సరఫరాలో అంతరం తలెత్తి పలు రాష్ట్రాలు విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నాయని ఇంధన శాఖ అధికారులు మంత్రి పెద్దిరెడ్డికి తెలియచేశారు. బొగ్గు కొరతతో మహారాష్ట్రలో 1375 మెగావాట్ల లోడ్ చొప్పున రోజూ 3 గంటల పాటు లోడ్ రిలీఫ్ విధిస్తుండగా గుజరాత్లో పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో గురువారం 208 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా ఏపీ జెన్కో నుంచి 71 ఎంయూ, కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థల నుంచి 40 ఎంయూ, జల విద్యుత్తుతో 6.6 ఎంయూ, సౌర విద్యుత్తుతో 24 ఎంయూ, పవన విద్యుత్ 16 ఎంయూ, హిందుజా 9.4 ఎంయూ, ఇతర ఉత్పత్తి కేంద్రాల ద్వారా 4 ఎంయూ, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి దారుల నుంచి 11 ఎంయూల చొప్పున మొత్తం 182 మిలియన్ యూనిట్లు సమకూరిందని వివరించారు. మరో 26 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నాటికి విద్యుత్ సరఫరా చాలావరకు మెరుగుపడుతుందని వెల్లడించారు. రాబోయే 25 ఏళ్ల పాటు వ్యవసాయ విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఇబ్బందుల్లోనూ నాణ్యమైన కరెంట్ బహిరంగ మార్కెట్లో కూడా తగినంత విద్యుత్ దొరకని పరిస్థితుల్లోనూ గృహ వినియోగదారులకు వీలైనంత మేర తక్కువ అంతరాయాలతో నాణ్యమైన కరెంట్ సరఫరా జరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మే 1నుంచి రైతులకు పగటిపూటే 9 గంటలు అందించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలను ఆదేశించారు. గృహ, వ్యవసాయ సర్వీసులకు విద్యుత్ సరఫరా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. నవరత్నాల అమల్లో భాగంగా విద్యుత్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్యుత్తు రంగాన్ని ఆదుకునేందుకు రెండున్నరేళ్లలో దాదాపు రూ.35 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత కారణంగా ఎదురవుతున్న కరెంట్ కోతల నుంచి ఈ నెలాఖరుకల్లా ఉపశమనం కలుగుతుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ తెలిపారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం, దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్‌తో ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితులు తాత్కాలికమేనని, త్వరలోనే విద్యుత్ అందుబాటులోకి వచ్చి, అంతా చక్కబడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ పరిస్థితిపై ‘సాక్షి ప్రతినిధి’కి శుక్రవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. బొగ్గు దొరకడంలేదు గతేడాది అక్టోబర్ నుంచి అంతర్జాతీయంగా చైనా వంటి దేశాలు తీసుకున్న నిర్ణయాలవల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం పెరిగి లభ్యత తగ్గిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసి రాష్ట్రాలకు కోటా నిర్ణయించి బొగ్గు కేటాయింపులు ప్రారంభించింది. మార్చిలో మళ్లీ బొగ్గు సంక్షోభం వస్తుందని, నిల్వలు పెట్టుకోమని సూచించింది. కానీ, దొరకడంలేదు. 5 లక్షల మెట్రిక్ టన్నుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచాం. రూ.6 వేలు ఉండే బొగ్గు టన్ను రూ.17 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుండటంతో ఆ ధరకు టెండరు ఇవ్వలేకపోతున్నాం. దీంతో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి జరగడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో విద్యుత్ కొనుగోలు ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ప్రతిరోజూ సింగరేణి కాలరీస్, మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి 10 నుంచి 12 ర్యాకులు వస్తోంది. ఇది ఏ రోజుకారోజు ఉత్పత్తికి సరిపోతోంది. నిల్వ చేసుకోవడం కుదరడంలేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు పోటీ పెరిగింది. కానీ, పవర్ ఎక్సే్ఛంజ్‌లో 14వేల మెగావాట్లు వరకూ అందుబాటులో ఉండే విద్యుత్ ప్రస్తుతం 2 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. దీనిని కొనేందుకు దేశంలోని డిస్కంలన్నీ పోటీపడుతున్నాయి. ఇక్కడ యూనిట్ ప్రస్తుతం రూ.12 వరకూ ఉంది. ఆ రేటుకి కొందామన్నా కూడా దొరకడంలేదు. మార్చిలో రూ.1,258 కోట్లతో 1,551 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాం. పల్లెల్లో గంట.. పట్టణాల్లో అరగంట.. గ్రిడ్ డిమాండ్ బాగా పెరిగినప్పుడు గృహాలకు గ్రామాల్లో ఒక గంట, పట్టణాల్లో అరగంట అధికారిక లోడ్ రిలీఫ్ అమలుచేయాల్సిందిగా డిస్కంలకు ఆదేశాలిచ్చాం. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రావడంతో పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెరగడంవల్ల విద్యుత్ వాడకం పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉంది. 2021తో పోలిస్తే 3.54 శాతం, 2020తో పోల్చితే 46 శాతం ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఏపీజెన్కో, ఏన్టీపీసీ నుంచి 120 మిలియన్ యూనిట్లు ధర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. జల, సౌర, పవన, న్యూక్లియర్ విద్యుత్ మొత్తం కలిపి 180 మిలియన్ యూనిట్ల వరకూ అందుబాటులో ఉండగా మరో 40–50 మిలియన్ యూనిట్లు కొనాల్సి వస్తోంది. పెరిగిన వ్యవసాయ వినియోగం 2019లో దాదాపు 17.3 లక్షల వ్యవసాయ సర్వీసుండగా, 2022కి వాటి సంఖ్య 18.5 లక్షలకు చేరింది. అంతేకాక.. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్ సరఫరా అందించడంవల్ల రైతులు ఏడాది పొడవునా మూడు, నాలుగు పంటలు వేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగింది. ఇలా 2018–19లో 10,832 మిలియన్ యూనిట్లు.. 2021–22లో 12,720 మిలియన్ యూనిట్లు జరిగింది. అంటే దాదాపు 20 శాతం పెరిగింది. అయినప్పటికీ రైతులకు ఇబ్బంది రాకుండా 9 గంటలు విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. నెలాఖరుకు కొరత తీరుతుంది పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని, వారాంతపు సెలవుకు అదనంగా మరోరోజు పవర్ హాలిడే విధించాలని ఆంక్షలు పెట్టాం. దీనివల్ల 15 నుంచి 20 మిలియన్ యూనిట్లు విద్యుత్ మిగులుతుంది. నెలాఖరుకల్లా పంట కోతలు పూర్తికానుండటంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దానివల్ల కనీసం 15 మిలియన్ యూనిట్లు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నాం. పవన విద్యుత్ మే, జూన్ నెలల్లో మరికొంత అందుబాటులోకి వస్తుంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం రూ.12 ఉన్న యూనిట్ ధర కూడా రూ.4లకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ నెలాఖరుకి విద్యుత్ కొరత సమస్య తీరుతుంది. ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు ఈ ఆదా తోడయితే విద్యుత్ కోతలు ఉండవని భావిస్తున్నాం. మొదలైన ‘పవర్ హాలిడే’ వ్యవసాయ, గృహ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు పరిశ్రమలకు ఇంధన శాఖ ఈ నెల 22 వరకు ప్రకటించిన ‘పవర్ హాలిడే’ శుక్రవారం నుంచి రాష్ట్రంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ (డిస్కం)లు తమ పరిధిలోని జిల్లాల వారీగా దీనిని అమలుచేస్తున్నాయి. పవర్ హాలిడే లేని రోజుల్లో పరిశ్రమలు ప్రతిరోజూ 50 శాతం విద్యుత్‌ను మాత్రమే వినియోగించాలని.. షాపింగ్ మాల్స్ తరహాలోని వాణిజ్య సముదాయాల్లో కూడా 50 శాతం మేరకు తగ్గించుకోవాలని.. ప్రకటనలకు సంబంధించిన సైన్ బోర్డులకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని, అలాగే ఏసీల వాడకాన్ని కూడా తగ్గించుకోవాలని డిస్కంల సీఎండీలు ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై వినియోగదారులు కాల్ సెంటర్ నంబరు 1912కు ఫోన్‌చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు సూచించారు. చదవండి: వాళ్ల కడుపు మంటకు మందే లేదు: సీఎం జగన్ -
ఏపీలో పెరిగిన సగటు విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. బొగ్గు సంక్షోభంలోనూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ అందిస్తూ రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయి. తీవ్ర బొగ్గు కొరత వల్ల అక్టోబర్‌లో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడినా.. ఏపీలో మాత్రం జాతీయ సగటు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదయ్యింది. సంక్షోభంలోనూ రికార్డు.. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి, వినియోగదారుల సంక్షేమానికి.. నిరంతరం విద్యుత్ సరఫరా అందించటం కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగినట్లే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇంధన శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జాతీయ సగటు విద్యుత్ వినియోగం అక్టోబర్‌లో 4.8 శాతం పెరిగితే, ఏపీలో ఏకంగా 17.2 శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 4,972 మిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో 5,828 మిలియన్ యూనిట్లకు చేరింది. దేశంలో గతేడాది అక్టోబర్‌లో 109.17 బిలియన్ యూనిట్లుగా నమోదు కాగా.. ఈ ఏడాది 114.37 బిలియన్ యూనిట్లకు చేరింది. ఇక గతేడాది అక్టోబర్ 31న రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ వినియోగం 8,820 మెగావాట్లుగా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్ 19న గరిష్ట విద్యుత్ వినియోగం 9,865 మెగావాట్లుగా నమోదైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాజీ లేదు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన, చౌక విద్యుత్ అందించే విషయంలో ప్రభుత్వం రాజీపడదని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్ డిమాండ్‌పై ఏపీ ట్రాన్స్‌కో, రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ విభాగాలతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. చౌక విద్యుత్ సరఫరాలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని సీఎం జగన్ లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. భవిష్యత్‌లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు వంద శాతం నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు అవసరమైన కృషి జరగాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి పృథ్వీతేజ్, బి.మల్లారెడ్డి, డైరెక్టర్ కె.ప్రవీణ్, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వినియోగదారులకు నాణ్యమైన చౌక విద్యుత్‌ను అందించేందుకు, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చేందుకు ఇంధన శాఖ అధికారులు చేస్తున్న కృషిని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
ముందస్తు వ్యూహంతో బొగ్గు కొరతను అధిగమించిన ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలో ఏర్పడ్డ బొగ్గు కొరత నుంచి పలు రాష్ట్రాలు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే ఉన్నాయి. ఎక్కడా ఆరు రోజులకు మించి నిల్వలు లేవు. రానున్న వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి ఈ సమస్య మరింత అధికమయ్యే అవకాశాలున్నట్టు విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ సేవలతో ముడిపడి ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సంస్థలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా పవర్ బ్యాకప్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించాయి. ఈ మేరకు తమ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఐటీ సంస్థలు ఈ–మెయిల్స్ పంపాయి. కరోనా నేపథ్యంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ అవకాశం కల్పించాయి. దాదాపుగా 90 శాతం ఐటీ నిపుణులు ఇంటినుంచే సేవలందిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు అనివార్యమైతే సమస్యలు తలెత్తి పని ఆగిపోకుండా ముందే జాగ్రత్త పడాలని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ముందస్తు వ్యూహంతో సమస్యను అధిగమించిన ఏపీ దేశవ్యాప్తంగా మొత్తం 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉండగా.. 83 కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వీటిలో 6 కేంద్రాల్లో అసలు బొగ్గు లేదు. 12 కేంద్రాల్లో ఒక రోజుకు, 17 కేంద్రాల్లో 2 రోజులకు, 17 కేంద్రాల్లో 3 రోజులకు, 8 కేంద్రాల్లో 4 రోజులకు, 13 కేంద్రాల్లో 5 రోజులకు, 10 కేంద్రాల్లో 6 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో బొగ్గు కొరతను అధిగమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 3 నుంచి 5 రోజులకు సరిపడా ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. శుక్రవారం నాటికి దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో మూడు రోజులకు సరిపడా 46,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో 49,100 మెట్రిక్ టన్నులు బొగ్గు ఉండగా.. రెండు రోజులకు సరిపోతుంది. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 89,300 మెట్రిక్ టన్నులు ఉండటంతో ఐదు రోజుల ఉత్పత్తికి ఢోకా లేదు. విద్యుత్, బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదని.. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా కోసం ఎక్కడ అందుబాటులో ఉన్నా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (ఎస్డీఎస్టీపీఎస్)లో భవిష్యత్ అవసరాల కోసం విదేశీ బొగ్గును ఏపీ జెన్కో సమీకరిస్తోంది. ఈ టెండర్ ప్రక్రియ పూర్తయితే 4 నెలల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ బొగ్గు కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎస్డీఎస్టీపీఎస్కు చేరుకుంటుంది. రాష్ట్రంలో ఇబ్బంది లేదు రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత లేదు. అవసరమైన మేరకు నిల్వలున్నాయి. భవిష్యత్‌లో తలెత్తే కొరతను ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాం. విదేశీ బొగ్గు కోసం ఈ నెల 20న టెండర్లు ఆహ్వానించాం. 28వ తేదీ వరకూ టెండర్ దాఖలుకు గడువు ఇచ్చాం. ఒకే టెండర్ రావడంతో ఆ గడువును సోమవారం వరకూ పొడిగించాం. – బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
రాష్ట్రంలో పెరిగిన బొగ్గు నిల్వలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు మెరుగుపడ్డాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 52,800 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 35,300 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక రోజుకే సరిపోతున్నప్పటికీ.. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 76 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండటంతో ఇక్కడ ఐదు రోజులపాటు విద్యుత్ ఉత్పత్తి ఆటంకం లేకుండా జరపవచ్చు. ప్రతిరోజూ దాదాపు 22 ర్యాకుల బొగ్గు రాష్ట్రానికి వస్తుండగా.. మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత చాలావరకూ తగ్గినట్టేనని ఏపీ జెన్కో అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి, ఇతర మార్గాల్లో భవిష్యత్ అవసరాల కోసం దాదాపు 10 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. ఏపీ జెన్కో భాగస్వామ్యం 36 శాతం 2020–21 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్ వినియోగం 62,080 మిలియన్ యూనిట్లు. అంటే రోజుకి సగటున 170 మిలియన్ యూనిట్లు. ఇందులో ఏపీ జెన్కో 35 శాతం విద్యుత్‌ను అందించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 71,252 మిలియన్ యూనిట్ల గ్రిడ్ డిమాండ్ ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ఇది రోజువారీగా చూస్తే సగటున 195 మిలియన్ యూనిట్లు. ఇందులో గత సెప్టెంబర్ వరకూ ఏపీ జెన్కో 90 మిలియన్ యూనిట్లు (46 శాతం) సమకూర్చేది. తరువాత బొగ్గు కొరత ఏర్పడి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో జెన్కో భాగస్వామ్యం తగ్గింది. ప్రస్తుతం 36 శాతం విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్కో అందించగలుగుతోందని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనూ మెరుగుపడుతోంది బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా మూతపడ్డ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్ ఉత్పతి రంగాలకు మినహా ఇతర అవసరాలకు ఇప్పటికే బొగ్గు సరఫరా నిలిపివేసిన కేంద్రం, పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఇంకా సరఫరా పునరుద్ధరించలేదు. మరోవైపు కోల్ ఇండియా లిమిడెడ్ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా మొదలుపెట్టడంతో పాటు విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖల కేంద్ర మంత్రులు స్వయంగా ప్రతిరోజూ థర్మల్ కేంద్రాలకు బొగ్గు కేటాయింపులు జరుపుతున్నారు. మొత్తం 135 థర్మల్ కేంద్రాల్లో 93 కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 14 కేంద్రాల్లో ఒక రోజు, 23 కేంద్రాల్లో రెండు రోజులు, 15 కేంద్రాల్లో 3 రోజులు, 16 కేంద్రాల్లో 4 రోజులు, 12 కేంద్రాల్లో 5 రోజులు, 12 కేంద్రాల్లో 6 రోజులు, ఒక కేంద్రంలో 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. 8 కేంద్రాలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అన్ని కేంద్రాలకు ఎంతోకొంత బొగ్గు అందించేలా కేంద్ర విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖ మంత్రులు నేరుగా పంపకాలు చేపడుతున్నట్టు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. సొంత బొగ్గు గనులున్న 16 కేంద్రాల్లో ప్రస్తుతానికి 6 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీటినుంచే ఇతర కేంద్రాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఎక్కడా ఆరేడు రోజులకు మించి నిల్వలు ఉండటం లేదు. గతంలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు దిగుమతి చేసుకుని నిల్వ ఉంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రస్తుతం ఆ అవకాశాన్ని కేంద్రం ఇవ్వడం లేదు. ఏడు రోజులకు మించి ఎక్కడైనా నిల్వలు ఉంటే వాటిని ఇతర ప్లాంట్లకు మంత్రుల సూచనలతో అధికారులు తరలిస్తున్నారు. -
నిర్మాణ రంగంపై డీజిల్, బొగ్గు దెబ్బ
సాక్షి, అమరామతి: పెద్ద నోట్ల రద్దు, ఆర్థిక సంక్షోభం, కోవిడ్ వంటి వరుస దెబ్బలను తట్టుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని డీజిల్ ధరలు, బొగ్గు కొరత మరోసారి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఏడాదిన్నరలో లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ.28 పెరగడంతో రవాణా వ్యయం భారీగా పెరిగింది. ఏడాదిన్నర కిందట లీటర్ డీజిల్ ధర రూ.78గా ఉండగా ఇప్పుడు అది రూ.106 దాటింది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత రావడంతో డిమాండ్ లేకున్నా ఉత్పత్తి తగ్గడం వల్ల స్టీల్, సిమెంట్, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్ వంటి అన్ని రకాల ఉత్పత్తుల ధరలు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగాయని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు కొరత ప్రభావం అధికంగా స్టీల్ రంగంపై పడింది. కొరత లేకముందు టన్ను స్టీల్ ధర రూ.40–45 వేల మధ్య ఉంటే.. ఇప్పుడది ఏకంగా రూ.65,000 మార్కును అధిగమించింది. సిమెంట్ బస్తా రూ.260 నుంచి రూ.370కి చేరింది. డీజిల్ ధరలు పెరగడంతో ఇసుక, కంకర, ఇటుక వంటి వస్తువుల రవాణా వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజాశ్రీనివాస్ చెప్పారు. ముడి సరుకుల వ్యయం భారీగా పెరగడంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం 20 శాతం వరకూ పెరుగుతోందన్నారు. దీంతో నూతన ప్రాజెక్టులు చేపట్టేందుకు బిల్డర్లు వెనుకాడుతున్నారు. ఇప్పటికే మొదలు పెట్టినవారు పని వేగాన్ని తగ్గించినట్టు క్రెడాయ్ వర్గాలు చెబుతున్నాయి. ఉన్నవాటిని వదిలించుకుందాం.. నిర్మాణ వ్యయం పెరిగినా ధరలు పెంచలేని పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఉందని ఏపీ క్రెడాయ్ ప్రెసిడెంట్ రాజా శ్రీనివాస్ చెప్పారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయన్న తరుణంలో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయిందని, దీంతో నూతన ప్రాజెక్టుల కంటే.. ఇప్పటికే నిర్మించిన వాటిని అమ్ముకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. కొత్త వెంచర్లు వేసేందుకు కూడా బిల్డర్లు వెనుకాడుతున్నారని వైజాగ్ క్రెడాయ్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. క్రెడాయ్ అంచనాల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 1.4 లక్షల ఫ్లాట్స్ నిర్మాణంలో ఉండగా, వాటిలో 56,000 ఫ్లాట్స్ గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని వరుస సంక్షోభాలు వెంటాడుతున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘కోల్’కుంటున్న విద్యుత్ కేంద్రాలు
సాక్షి, అమరావతి: బొగ్గు సంక్షోభం నుంచి దేశంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మెల్లగా కోలుకుంటున్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వారం రోజులుగా దేశవ్యాప్తంగా మూడు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తెరుచుకోవడంతో పాటు కొరత ఎదుర్కొంటున్న కేంద్రాల సంఖ్య తగ్గడం దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి బొగ్గు కొరత తీవ్రమైంది. ఈ నెల 12 నాటికి 116 కేంద్రాల్లో బొగ్గు నిల్వల సమస్య తలెత్తింది. 18 కేంద్రాలు మూతపడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికంటే ముందుగా స్పందించి బొగ్గు కొరత నివారణకు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) విద్యుత్ సంస్థలకు మినహా ఇతర అవసరాలకు బొగ్గు సరఫరా నిలిపివేసింది. ఫలితంగా బొగ్గు నిల్వల్లో పురోగతి మొదలైంది. సీఈఏ మంగళవారం నాటి నివేదిక ప్రకారం.. మూతపడ్డ కేంద్రాల్లో వారం రోజుల్లో మూడు కేంద్రాలు ఉత్పత్తి ప్రారంభించాయి. 15 కేంద్రాలు ఇంకా మూతపడే ఉన్నాయి. 22 కేంద్రాల్లో ఒక రోజుకు, 19 కేంద్రాల్లో రెండు రోజులకు, 18 కేంద్రాల్లో మూడు రోజులకు, 15 కేంద్రాల్లో నాలుగు రోజులకు, 10 కేంద్రాల్లో ఐదు రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. మొత్తంగా 1,30,184 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే 107 కేంద్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మూతబడ్డ 135 కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తే 1,65,066 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలో సాధారణ స్థాయికి.. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 48,100 మెట్రిక్ టన్నుల బొగ్గు నాలుగు రోజులకు సరిపోతుంది. డాక్టర్ నార్ల తాతారావు కేంద్రంలో ఉన్న 27 వేల మెట్రిక్ టన్నులు ఒక రోజుకు, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్న 58,800 మెట్రిక్ టన్నులు మూడు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు వివిధ మార్గాల ద్వారా గతంలో ప్రతిరోజూ వచ్చినట్టుగానే 14 ర్యాకుల బొగ్గు ప్రస్తుతం వస్తోంది. బొగ్గు కొరతను అధిగమించాం బొగ్గు కొరతను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు విజయవంతంగా అధిగమించిందని, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తోందని ఇంధన శాఖ వెల్లడించింది. సాంకేతిక కారణాల వల్ల విద్యుత్ సరఫరాలో ఆటంకాలు తలెత్తకుండా విద్యుత్ పంపిణీ సంస్థలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. అనేక రాష్ట్రాలు బొగ్గు కొరతతో బాధపడుతున్నప్పుడు కూడా రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి చేసిన ప్రయత్నాలతో వినియోగదారులు సంతృప్తి చెందారని పేర్కొంది. ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి స్వల్పకాలిక టెండర్లను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. -
విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతీరోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. తమ గనుల నుంచి లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షా 90 వేల టన్నుల బొ గ్గు రవాణా చేస్తున్నామని, నవంబర్ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రబొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డెరైక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. -
Andhra Pradesh: ఫుల్‌గా ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితులతో పాటు బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులతో దీనికి హాజరయ్యారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బొగ్గు తెప్పించేందుకు సరుకు రవాణా ఓడల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయన్నారు. అవసరమైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలని సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా.. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నాన్ పీక్ అవర్స్‌లో నీటిని వెనక్కి పంపేందుకు (రివర్స్ పంపింగ్) సౌర విద్యుత్ వాడుకుని అనంతరం ఆ నీటినే వినియోగించి విద్యుదుత్పత్తి చేసే ప్రతిపాదిత ప్రాజెక్టు తొలిదశలో 6,300 మెగావాట్ల ఉత్పత్తికి డీపీఆర్‌లు ఇప్పటికే తయారయ్యాయి. సోలార్‌తో రివర్స్ పంపింగ్‌కు యూనిట్ రూ.2.49 దాకా ఖర్చు కానుంది. అనంతరం డిమాండ్, అవసరాన్ని బట్టి పీక్ అవర్స్‌లో అదే నీటితో జలవిద్యుదుత్పత్తి చేస్తారు. దీనికి రూ.3 వరకు వ్యయం అవుతుంది. దీన్ని పీకింగ్ ప్లాంట్ అని వ్యవహరిస్తారు. పీక్ అవర్స్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొనుగోలుకు యూనిట్‌కు రూ.10 నుంచి రూ.12 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి లేకుండా రివర్స్ పంపింగ్ వల్ల అవసరాన్ని బట్టి చౌకగా విద్యుదుత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అవాంతరాలు లేకుండా సరఫరా రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 2 ర్యాక్‌ల బొగ్గు అదనంగా వచ్చిందని, రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుదుత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. -
బొగ్గు కొరత వెనుక కేంద్రం కుట్ర: ప్రొఫెసర్ నాగేశ్వర్
సీతంపేట (విశాఖ ఉత్తర): బొగ్గు కృత్రిమ కొరత వెనుక కోల్ ఇండియాను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. స్థానిక ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభం’ అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో నాగేశ్వర్ జూమ్ ద్వారా ప్రసంగించారు. కోల్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. బొగ్గు సంక్షోభం విద్యుత్ చార్జీలు పెరగడానికి దారి తీస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకపోవడం, కోల్ ఇండియాకు బొగ్గు బ్లాకులు కేటాయించకపోవడం వెనుక వాటిని అమ్మాలన్న ఆలోచన దాగుందన్నారు. బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న మన దేశంలో బొగ్గు సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోల్ ఇండియా విస్తరణ కంటే దాని నిర్వీర్యానికే చర్యలు చేపడుతున్నట్టు ఉందన్నారు. విశ్రాంత ఐఏఎస్ ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి ప్రణాళిక లేకపోవడమే బొగ్గు సమస్యకు కారణమన్నారు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ప్రోత్సహించి ఏపీ జెన్కో సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోందన్నారు. రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు ఒప్పందం ప్రకారం రాష్ట్రానికి విద్యుత్ కేటాయించకుండా.. ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్ముకుంటున్నా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం జరిమానా వేయకపోవడం విచారకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రైవేటు కంపెనీలు లాభపడేందుకు బొగ్గు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని విమర్శించారు. సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజ శర్మ పాల్గొన్నారు. -
AP: కరెంట్ కోతలంటూ కట్టుకథలు
సాక్షి, అమరావతి: అదిగో పులి.. ఇదిగో తోక లాంటి బెదిరింపులు, కట్టు కథలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై వదంతులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కోవిడ్ ప్రభావం తగ్గి పారిశ్రామిక విద్యుత్ వినియోగం పెరగడం, డిమాండ్ – సరఫరాలో వ్యత్యాసం తదితర పరిణామాలతో దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా విద్యుత్తు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసరంగా గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని ఊహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, బొగ్గు కొనుగోలుకు అత్యవసర నిధులను వెచ్చించడం, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడలేదు. కానీ దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా భారీగా విద్యుత్ కోతలుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గంటల తరబడి చీకట్లు తప్పవంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఈ తరహా వదంతులతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. రాత్రి సమయంలో విజయవాడ ఇలా.. లోటు.. లేదు విద్యుత్ కోతలంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, డిస్కమ్‌ల సీఎండీలు అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈనెల 10వతేదీ నుంచి 14 వరకు విద్యుత్ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ లోటు మన దగ్గర కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్ 14న ఏపీలో 0.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా జీరో అయ్యింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా డిస్కమ్ పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అత్యవసర నిధులతో తీరుతున్న బొగ్గు కొరత ఇంధనశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కోకు రూ.250 కోట్ల మేర అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తి మెరుగు పరచేందుకు రాష్ట్రానికి అదనంగా ఎనిమిది బొగ్గు రైళ్లు తరలి వస్తున్నాయి. వీటీపీఎస్‌లో 13,097 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండగా శనివారం 29,806 మెట్రిక్ టన్నులు వచ్చింది. దీనిలో 25,410 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 17,493 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. ఆర్టీపీఎస్లో 70,411 మెట్రిక్ టన్నుల బొగ్గుకు అదనంగా 19,457 మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఇందులో 12,925 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 76,943 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నంలో 68,459 మెట్రిక్ టన్నులు ఉండగా 8,533 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఇంకా 59,926 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఈ నిల్వలతో మరో మూడు నాలుగు రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. దీనికితోడు వచ్చే ఏడాది జూన్ వరకూ 400 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు శుక్రవారం రూ.20 నుంచి రూ.6.11కి పడిపోవడం గమనార్హం. ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. సాధారంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ఈ నెల 8వతేదీ తరువాత రూ.15 – రూ.20 వరకూ పెరిగినా తాజాగా తగ్గుముఖం పట్టింది. ఆర్టీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం ఏపీ జెన్కో యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని, థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఇంధనశాఖను ఆదేశించారు. థర్మల్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి 1,600 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి సింగరేణి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చించి సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లలో ఈనెల 15న అధికారులు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. నిరంతర పర్యవేక్షణ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ సరఫరాను సమీక్షిస్తూ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి సీఎండీ స్థాయి వరకూ అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోష్‌రావు, డైరెక్టర్/గ్రిడ్ – ట్రాన్స్మిషన్, కె.ప్రవీణ్‌కుమార్, సీఈ/గ్రిడ్, ఏవీ భాస్కర్లతో ఇంధన శాఖ కార్యదర్శి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. సీఎం సూచనల ప్రకారం.. రాష్ట్రంలో నిత్యం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా గత 16 రోజులుగా సగటున రోజుకు ఒక మిలియన్ యూనిట్ కంటే తక్కువగానే లోటు ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. పదహారు రోజులకు కేవలం పది మిలియన్ యూనిట్లు మాత్రమే లోటు నమోదైందన్నారు. దీంతో లోడ్ రిలీఫ్‌లు చాలా తక్కువగానే విధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, పవర్ యుటిలిటీల అద్భుత పనితీరుతో నాణ్యమైన సరఫరా జరుగుతోందన్నారు. బొగ్గు కొరతను అధిగమించి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సీఎం సూచనల ప్రకారం తగిన చర్యలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలాంటి విద్యుత్ కోతలను ఎదుర్కోవడం లేదని, రాబోయే రోజుల్లో కూడా కోతలు ఉండవని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వినియోగదారులకు రోజంతా నాణ్యమైన విద్యుత్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా గణనీయంగా పెరిగినట్లు ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ వివరించారు. నమ్మొద్దు.. మేమే చెబుతాం –విద్యుత్ పంపిణీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎలాంటి సమాచారానైన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వినియోగదారులకు అధికారికంగా తెలియచేస్తామని ప్రకటించాయి. -
సంక్షోభాన్ని అధిగమిస్తాం : మంత్రి బాలినేని
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగం గతంలోనూ అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పటికీ, ఎన్నడూ వెనకడుగు వేయలేదని, బొగ్గు సంక్షోభం తాత్కాలికమేనని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రభుత్వ సహకారంతో, వినియోగదారుల మద్దతుతో ఈ సంక్షోభాన్ని తప్పకుండా అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులు, విద్యుత్ రంగ ఉద్యోగులు, సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తీవ్ర బొగ్గు కొరత ఉన్నప్పటికీ తక్కువ అంతరాయాలతో, కొంత లోడ్ రిలీఫ్ చర్యలతో వినియోగదారులకు విద్యుత్‌ను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తున్న ఇంధన శాఖ అధికారులను మంత్రి అభినందించారు. -
కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: బొగ్గు కొరత నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనధికారిక కరెంటు కోతలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బ్లాక్ అవుట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను షట్‌డౌన్ చేశారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. దేశంలో 116 థర్మల్ విద్యుత్ కేంద్రాలకుగాను 18 కేంద్రాల్లో బొగ్గు లేదు. మిగతా వాటిలో బొగ్గు నిల్వలు ఒక రోజు నుంచి వారం రోజులకు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా 15 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొగ్గు సంక్షోభాన్ని అధిగమించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా కరెంటు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రానికి బొగ్గు సరఫరా కొంత మెరుగైంది. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు సెప్టెంబర్‌లో సగటున రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24 వేల టన్నుల వంతున సరఫరా అయింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఇటీవల అది 40 వేల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు రేక్‌లను కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడానికి అవసరమైన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు చేస్తున్నాయి. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు, బొగ్గు అనుసంధానం లేకుండానే అత్యవసర ప్రాతిపదికన నిలిచిపోయిన, పనిచేయని పిట్ హెడ్ బొగ్గు గనులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. బాగా పెరిగిన విద్యుత్ డిమాండ్ దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య తేడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో 5,010 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న ఏపీ జెన్కో ప్రస్తుతం 2,300 నుంచి 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆర్టీటీపీఎస్కి చెందిన కొన్ని యూనిట్లు షట్‌డౌన్ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ కూడా వాటి సామర్థ్యం కంటే తక్కువగానే విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ నెలలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజుకు 190 మిలియన్ యూనిట్లకు చేరింది. బుధవారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లు ఉంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈనెలలో రోజుకు సగటున 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎక్కువ వినియోగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 వరకు వెచ్చించి కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. సాధారణంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ధర భారీగా పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. -
ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం?
సాక్షి, ముంబై: రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా? రాష్ట్రంలో కరెంటు కోతలు విధించనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గత కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోని 13 విద్యుదుత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో 3,330 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ విద్యుత్ లోటు నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (మహావితరణ)కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ఆ సంస్థ విజ్ఞప్తిచేసింది. ముఖ్యంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల సమయాల్లో అదనపు డిమాండ్ తలెత్తకుండా, విద్యుత్ మౌలిక సదుపాయాలపై మరింత లోడ్ పడకుండా చూడాలని ఆ సంస్థ కోరింది. రానున్న రోజుల్లో బొగ్గు కొరతను అధిగమించలేకపోతే రాష్ట్రంలో కరెంటు కోతలు విధించాల్సిన పరిస్థితి వస్తుందని విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. రోజుకు 6 నుంచి 8 గంటలపాటు కరెంటు కోత విధించాల్సి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కరెంటు కోతల ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జలవిద్యుత్ కేంద్రాల నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. థర్మల్ విద్యుత్ లోటులో కొంత మేరనైనా ఇలా భర్తీ చేయాలని చూస్తోంది. నిజానికి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో విద్యుత్ డిమాండ్ కొంతమేర తగ్గింది. అయినప్పటికీ, రాష్ట్రంలో 3,330 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా, విద్యుత్ శాఖ వద్ద నిధుల లభ్యత లేనప్పటికీ, ఆ శాఖ విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. ఇటీవలే 800 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 13.60 చొప్పున, మరో 900 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 6.23 కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఒకవేళ చార్జీలు పెంచాల్సి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలపై మాత్రం పెనుభారం పడనుంది. ఇప్పటికే, రాష్ట్రంలో విద్యుత్ లోడ్‌ను తగ్గించేందుకు వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేసే విద్యుత్‌ను రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అదికూడా రాత్రి, పగలు షిఫ్టుల పద్ధతిలో సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఏ కేంద్రాలు మూతపడ్డాయంటే.. మహావితరణకు విద్యుత్ సరఫరా చేస్తున్న మహానిర్మితికి చెందిన చంద్రపూర్, భుసావల్, నాసిక్ ప్రాంతాలలోని 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లు మూడు విద్యుదుత్పత్తిని నిలిపేశాయి. పారస్లోని 250 మెగావాట్లు, భుసావల్, చంద్రాపూర్‌లోని 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఒక్కొక్కటి చొప్పున మూత పడ్డాయి. వీటితోపాటు కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్ (గుజరాత్)కు చెందిన 640 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లు, అమరావతిలోని రతన్ ఇండియా పవర్ లిమిటెడ్‌కు చెందిన 840 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు యూనిట్లలో కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ లభించడం లేదని మహావితరణ సంస్థ చెబుతోంది. తగ్గింది నిజమే.. బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి తగ్గిన మాట వాస్తవమేనని విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ అంగీకరించారు. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో అధిక ధర వెచ్చించైనా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో విద్యుదుత్పత్తి తగ్గుదల, విద్యుత్ లోటు తదితర అంశాలపై ఆయన మంత్రాలయలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ కంటే 3 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని అంగీకరించారు. ఈ లోటును పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే థర్మల్ విద్యుత్కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఈ అంశాలపై ఇప్పటికే కేంద్ర బొగ్గు గనల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మహావితరణ పిలుపునిచ్చిన మేరకు ఆయా సమయాల్లో విద్యుత్‌ను పొదుపు చేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు రాష్ట్రంలో నిల్వ ఉన్న 18 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగించాల్సి వచ్చిందన్నారు. కోల్ ఇండియా ప్రతిరోజు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉందని, కానీ వర్షాల కారణంగా 22 లక్షల మెట్రిక్ టన్నులే చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 27 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అవుతోందని వివరించారు. సరఫరాను మరింత మెరుగుపరిచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేసేలా కోల్ ఇండియాతో చర్చిస్తున్నట్లు నితిన్ రౌత్ వెల్లడించారు. గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కూడా సరిపడా గ్యాస్ సరఫరా ఉండటం లేదని తెలిపారు. దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్న సీజీపీఎల్, జేఎస్‌డబ్ల్యూ తదితర కంపెనీలు చౌక విద్యుత్ సరఫరాను నిలిపివేశాయన్నారు. దీంతో ఒక వేయి మెగావాట్ల విద్యుత్ సరఫరా తగ్గిందన్నారు. అందుకే సమస్య మరింత జఠిలమైందని నితిన్ రౌత్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – నితిన్ రౌత్