సాక్షి,అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతోపాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా, ‘విద్యుత్ ఉత్పత్తి లేదు.. కోతలే!’ అంటూ సోమవారం ‘ఈనాడు’ మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది.
వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా పెడచెవిన పెట్టి, విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కంలు, ఏపీ జెన్‌కో ‘సాక్షి’కి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు..
‘కోత’ లేకుండా సరఫరా..
ఇక ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్‌లోకి నీరు రావడంవల్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేది. అలాగే, ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే, ఈ ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడ్రోజులు అక్కడక్కడా స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి.
కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 91.097, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48.842, ఎస్పీడీసీఎల్ పరిధిలో 89.445 కలిపి మొత్తం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలేకుండా ఆ మేరకు విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కంలు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది డిమాండు ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది.
అయినా, రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్‌కు అదనంగా బహిరంగ మార్కెట్‌లో రూ.30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోళ్లు చేస్తుండటంవల్లే కోతల్లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలిలా ఉంటే.. విద్యుత్ సరఫరా చేయకుండా డిస్కంలు చేతులెత్తేశాయని పచ్చ పత్రిక నానా యాగీచేసింది.
వర్షాకాలంలో సర్వసాధారణం
వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడే, ఈ ఏడాదే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాక్ ఉంచడంవల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. అంతమాత్రానికే ‘థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వచేయడంలో ఏపీ జెన్‌కో అధికారులు విఫలమయ్యారంటూ ‘ఈనాడు’ గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది.
అందువల్లే కేంద్ర ఇంధన, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో రెండు మూడ్రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్‌కో బొగ్గు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వీటీపీఎస్, ఆర్టీపీపీలో రెండ్రోజులు, కృష్ణపట్నంలో పది రోజులు, హిందూజాలో మూడ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment