డాక్టర్ ఎన్టీటీపీఎస్ లో వాణిజ్య ఉత్పత్తికి సిద్ధం అవుతున్న 800 మెగావాట్ల యూనిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఏటా 8% విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టు అంచనాలకు మించి జెన్‌కో 45.38% విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతోంది. తత్ఫలితంగా ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది.
పెరుగుతున్న సామర్థ్యం..
నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో ఇటీవల 800 మెగావాట్ల 8వ యూనిట్‌లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి, గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరగనుంది.
మరోవైపు మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్‌కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇతర చిన్న జలవిద్యుత్ కేంద్రాల మాదిరి ఇది సీజన్‌లో పనిచేసేది కాదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది.
అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ (పీఎస్పీ) నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి జెన్‌కో అనుమతి తీసుకుంది. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనుంది.
సరికొత్త రికార్డులు..
రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండ్ గతేడాది మే నెలలో 5,947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్‌కో 1,989.37 మిలియన్ యూనిట్లు (33.45 శాతం) సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్‌కో 2,917.99 మిలియన్ యూనిట్ల (45.38 శాతం)ను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించింది.
గతేడాది కంటే 989.37 మిలియన్ యూనిట్లు (12 శాతం) అధికంగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన భారం నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు చార్జీల పెంపు భారం తప్పుతోంది.
ప్రభుత్వ సహకారం..
రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో అత్యధిక భాగం ఏపీ జెన్‌కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్దేశించారు. వారి మార్గదర్శకం మేరకు, ప్రభుత్వ సహకారంతో తక్షణమే 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం.
అదే విధంగా థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి జూలైలో శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో థర్మల్, హైడల్, సోలార్ కలిపి ఏపీ జెన్‌కో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,789.026 మెగావాట్లకు చేరుతుంది. – కేవీఎన్ చక్రధర్ బాబు, ఎండీ, ఏపీ జెన్‌కో
Comments
Please login to add a commentAdd a comment