Fact Check: బాబు ధ్యానంలో పడి ‘అధ్వాన’ రాతలు | The state government wants to make the state a horticultural hub | Sakshi
Sakshi News home page

Fact Check: బాబు ధ్యానంలో పడి ‘అధ్వాన’ రాతలు

Published Sun, Mar 10 2024 2:51 AM | Last Updated on Sun, Mar 10 2024 3:15 PM

The state government wants to make the state a horticultural hub - Sakshi

పెరుగుతున్న ఉద్యానాన్ని గుర్తించలేని గురివింద 

పంటల మార్పిడి ద్వారా అధికమైన దిగుబడులు 

ఎగుమతులకోసం ఏపీ నుంచి ప్రత్యేకంగా కిసాన్‌ రైళ్లు 

2018–19లో దిగుబడి 305.20 లక్షల టన్నులు 

2023–24లో 368.83 లక్షల టన్నులకు పెరుగుదల 

ఎప్పటి పంటకు అప్పుడే రైతులకు బిల్లులు చెల్లింపు

రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. పంటల మార్పిడి ద్వారా పెద్ద ఎత్తున దిగుబడి సాధించాలన్నది లక్ష్యం. ఆ దిశగానే నాలుగేళ్లుగా సాగుతోంది ప్రగతి ప్రయాణం. ఇప్పటికే దిగుబడి సాధనలో... ఎగుమతుల్లో పురోగతి సాధిస్తూనే ఉన్నాం. సకాలంలో రైతులకు బిల్లులు చెల్లిస్తూ వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. అయినా నిరంతరం బాబు ధ్యానంలోనే గడుపుతున్న రామోజీకి గానీ... ఆయన పచ్చకళ్లకు గానీ అవేవీ కనిపించడం లేదు.

ఇంకా ఆ మత్తులోనే జోగుతున్న ఈనాడు పత్రికలో నిత్యం అసత్యాలు వల్లెవేయడం అలవాటైంది. అడ్డగోలు కథనాలు వండివార్చడం నిత్యకృత్యమైంది. గత పాలనలో ఎంతగా వెనుకబడినా వారికి మాత్రం పచ్చగానే కనిపించింది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఇంకా అధ్వానంగానే ఆలోచిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యానాభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఏటా విస్తీర్ణంతో పాటు దిగుబడులు, ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ఈనాడు పత్రికలో ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేసింది. అందులో వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. – సాక్షి, అమరావతి 

ఆరోపణ: ప్రోత్సాహం కరువై...తగ్గిన తోటల విస్తీర్ణం 
వాస్తవం: ఉద్యాన పంటలు 2018–19లో 42.5 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ కృషి ఫలితంగా 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఐదేళ్లలో 7.49లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. వీటిలో 4.23లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, 3.25లక్షల ఎకరాల్లో కొత్తగా సాగవుతోంది.

ప్రధానంగా 1.69లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.26లక్షల ఎకరాల్లో మామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయిపంటలు కొత్తగా సాగవుతున్నాయి. 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23 నాటికి 368.89 లక్షల టన్నులకు చేరింది. 2018–19 నాటికి ఉద్యాన రంగానికి రూ.43,101 కోట్లు ఉన్న జీవీఏ  2022–23 నాటికి రూ.54,550కు పెరిగింది. సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం, జీవీఏలో 26 శాతం వృద్ధి రేటు సాధించింది.  

ఆరోపణ: గణనీయంగా తగ్గిన ఎగుమతులు 
వాస్తవం: టీడీపీ హయాంలోని ఐదేళ్లలో నాలుగైదు లక్షల టన్నులు కూడా ఎగుమతయ్యేవి కాదు. గడచిన ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 23.99 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయి. దేశంలోనే ప్రప్రథమంగా అరటి కోసం ప్రత్యేకంగా కిసాన్‌ రైళ్లను నడిపిన ఘనత ఈ ప్రభుత్వానిది. తాడిపత్రి నుంచి ముంబాయి ఓడరేవు ద్వారా ఏటా కిసాన్‌ రైళ్లు నడుపుతున్నారు. అక్కడి నుంచి విదేశాలకు అరటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు.

2014–18 మధ్య కేవలం 24 వేల టన్నుల అరటి ఎగుమతులు చేరగా, కేవలం నాలుగేళ్లలోనే 1.62 లక్షల టన్నుల అరటి ఎగుమతయ్యింది. మన రాష్ట్రం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలకు టమాటా ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఇంకా వంగ, బీర, సొర, దొండ, బెండ వంటి కూరగాయలు సైతం దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు.
 
ఆరోపణ: మాటల్లో తీపి.. రాయితీలకు కత్తెర 
వాస్తవం:2019–20 నుంచి ఇప్పటి వరకు రక్షిత సేద్యం కింద ప్రభుత్వం 15,490.53 హెక్టార్లకు రూ.41.30 కోట్లు సాయం అందించింది. కొత్తగా 29.83 ఎకరాల్లో అధిక విలువ కలిగిన కూరగాయల సాగుకోసం రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో అధిక విలువ కలిగిన పూల సాగు కోసం రూ.5.85 కోట్లు ఆరి్థక సాయం చేసింది. అలాగే 478 సేకరణ కేంద్రాలు, 91 శీతల గిడ్డంగుల నిర్మాణం ద్వారా 2.44 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం పెంచారు. వీటి ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, సబ్సిడీ రూపంలో రూ.138.56 కోట్లు వారి ఖాతాలకు జమ చేశారు. కొత్తగా 200 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసింది.
 
ఆరోపణ: ఉద్యాన రైతుకు కానరాని సాయం 
వాస్తవం: వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో 53.58లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయం అందించారు. దాంట్లో ఉద్యాన రైతులకు రూ.10వేల కోట్లకు పైగా అందించారు. పైసా భారం పడకుండా ఈ–క్రాప్‌ నమోదు ప్రామాణికంగా 2019 నుంచి ఇప్పటి వరకు 5,35,554 ఉద్యాన రైతులకు రూ.1,409.5 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. వైపరీత్యాల వేళ 2014–15 నుంచి 2018–19 మధ్య పంట నష్టపోయిన రైతులకు రూ.387 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో 4.92 లక్షల మందికి రూ.563.03 కోట్ల పెట్టుబడి రాయితీని జమ చేసింది.  

ఆరోపణ: సూక్ష్మసేద్యం, ఆయిల్‌పామ్‌ రైతులకు మొండి­చేయి 
వాస్తవం: బిందు, తుంపర సేద్య పరికరాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించడమే గాకుండా ఈ ఐదేళ్లలో 7.22 లక్షల ఎకరాల్లో కొత్తగా సూక్ష్మ సేద్యం అమలు చేసి 3.55లక్షల మంది రైతు­లకు సబ్సిడీ రూ.2,050 కోట్లు జమ చేశారు. ఫలితంగా 2023–24లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది.

జాతీయస్థాయిలో అత్యుత్తమ దిగుబడి సాధించిన 20 జిల్లాల్లో ఏపీకి చెందిన ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్య­సాయి జిల్లాలు ఉండటం విశేషం. గత ప్రభుత్వం రూ.162 కోట్లు ఖర్చు చేసి 83వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.171.87 కోట్లు ఖర్చు చేసి 1.02 లక్షల ఎకరాల్లో ప్రోత్సహించింది. ఓఈఆర్‌ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.80 కోట్లను జగన్‌ ప్రభుత్వం చెల్లించగా, 32వేల మంది రైతులు లబ్ధి పొందారు.

ఆరోపణ: ఉద్యాన రైతుకు చేయూత ఏదీ? 
వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా ఉద్యాన రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా ఐదేళ్లలో 8757 తోటబడుల ద్వారా 2.63లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్ఛింది. గత ఐదేళ్లలో రూ.2 కోట్ల రాయితీతో ఫ్రూట్‌ కవర్లను పండ్ల రైతులకు పంపిణీ చేసింది. దేశంలోనే ప్రప్రథమంగా ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. క్వింటా అరటికి రూ.800, పసుపునకు రూ.6,850, ఉల్లికి రూ.770, బత్తాయికి రూ.1,400, మిర్చికి రూ. 7.000 చొప్పున కనీస మద్దతు ధరలు ప్రకటించింది.

ఆరోపణ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలెక్కడ? 
వాస్తవం: టీడీపీ ఐదేళ్లలో 360 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పితే ఈ ఐదేళ్లలో రూ.460 కోట్లతో 3,843 మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రూ.3,600 కోట్లతో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేశారు. రూ.58.57 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్‌ యూనిట్‌తోపాటు జిల్లాకు ఒకటి చొప్పున రూ.57 కోట్లతో 13 మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి.

కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.12.05 కోట్లతో టమాటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నారు. రూ.15.50 కోట్లతో రాయలసీమ ప్రాంతంలో 20 ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, 20 పాలీ హౌస్‌లు, షేడ్‌నెట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. 500 టన్నుల సామర్థ్యంతో 3వేల టమాటా, ఉల్లి సోలార్‌ డీ హైడ్రేషన్‌ యూనిట్స్‌ ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే కర్నూలు జిల్లాలో 250 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి.

పులివెందులలో రూ.4 కోట్లతో బనానా క్లస్టర్, ఎల్‌.కోటలో రూ.2.5కోట్లతో నువ్వుల ఆయిల్, చిక్కీల క్లస్టర్‌ యూనిట్‌ ఏర్పాటయింది. రాజంపేటలో రూ.290 కోట్లతో, నంద్యాలలో రూ.165 కోట్లతో టమాటా, పండ్ల గుజ్జు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. జీఐఎస్‌–2023లో ఉద్యనవన రంగానికి సంబంధించి రూ.5,765 కోట్లతో 33 ఒప్పందాలు చేసుకోగా, ఇప్పటికే రూ.3,921 కోట్ల పెట్టుబడులు రాగా, మరో 455 కోట్ల పెట్టుబడులు పురోగతిలో ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement