మీ కథనమే బోగస్‌  | Eenadu false news on ys jagan | Sakshi
Sakshi News home page

మీ కథనమే బోగస్‌ 

Published Thu, Apr 25 2024 6:54 PM | Last Updated on Thu, Apr 25 2024 6:57 PM

Eenadu false news on ys jagan - Sakshi

వాస్తవాలను కప్పెట్టిన గురివింద రామోజీ

రైతు రుణమాఫీ, అన్నదాతా సుఖీభవల ద్వారా బాబు ఇచ్చింది రూ.16,765 కోట్లు

ఈ ఐదేళ్లలో రైతు భరోసా కింద జగన్‌ చెల్లించింది రూ.34,288.17 కోట్లు

ప్రతీ స్కీమ్‌లోనూ బాబు కంటే మెరుగైన సాయం

బాబు ఎగ్గొట్టిన బకాయిలు సైతం చెల్లించిన ఘనత ఈ సర్కారుది

సాక్షి, అమరావతి : గురివింద రామోజీ మరోసారి తన మచ్చను కప్పెట్టేసుకున్నారు. కరోనా కష్టకాలంలో సైతం రైతులకు అండగా నిలిచి, బాబు ఎగ్గొట్టిన ఉచిత విద్యుత్, ఆక్వా విద్యుత్‌, విత్తన, సూక్ష్మ సేద్యం, ధాన్యం సేకరణ బకాయిలను జగన్‌ చెల్లించిన అంశాలను విస్మరించారు. ఈ ఐదేళ్లలో రూ.1.86 లక్షల కోట్ల సాయం అందించారు. బాబు ప్రయోజనాలే లక్ష్యంగా ‘ప్రోగ్రెస్‌ కాదు..అంతా బోగస్‌’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌పై విషం కక్కిన కథనంలో వాస్తవాలివీ.

ఆరోపణ: రైతు భరోసాకు కోత పెట్టేశారు
వాస్తవం: 2014 ఎన్నికల నాటికి ఉన్న రూ.87,612 కోట్ల రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత రూ.15 వేల కోట్లతో సరిపెట్టాడు. అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయం అందిస్తానంటూ ఏమార్చిన చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి రూ.1765.29 కోట్లతో మమ అనిపించాడు. ఇలా మొత్తం చెల్లించింది రూ.16,765 కోట్లే. జగన్‌ ప్రభుత్వం వచ్చాక హామీ కంటే మిన్నగా ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించారు.

ఆరోపణ: మూడు కోట్ల ఎకరాలకు పంటల బీమా పోయింది.
వాస్తవం: బాబు పాలనలో 30.9 లక్షల మందికి రూ.3411.20 కోట్ల బీమా పరిహారం మాత్రమే దక్కింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తూ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఈ ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు రక్షణ కల్పించారు. రైతుల వాటాతో కలిపి రూ.4406.86 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించారు. ఈ ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7802.08 కోట్ల పరిహారం అందించింది. గతం కంటే ఇది రూ.4390.88 కోట్లు అధికం.

ఆరోపణ : వడ్డీలేని పంట రుణాలు..తూచ్‌
వాస్తవం: ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మందికి రూ.2050.53 కోట్లు చెల్లించారు. ఇందులో బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్ల బకాయిలున్నాయి.

ఆరోపణ: కర్షకులను విపత్తులకు వదిలేశారు
వాస్తవం: సీఎంగా వైఎస్‌ జగన్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి ఆ సీజన్‌ చివర్లోనే పరిహారం అందిస్తున్నారు. తిత్లీ తుపాన్‌ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్లతో సహా ఈ ఐదేళ్లలో రూ.3261.60 కోట్ల పరిహారం చెల్లించారు. బాబు పాలనలో రూ.2558 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టారు.

ఆరోపణ: దోచుకునే వారికే మద్దతు
వాస్తవం: ఈ ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 37.73 లక్షల మంది రైతుల నుంచి 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65,313 కోట్లు చెల్లించింది. గోతాలు, కూలీలు, రవాణా ఖర్చులు(జీఎల్‌టీ) రూపంలో ఎమ్మెస్పీకి అదనంగా క్వింటాకు రూ.252 చెల్లిస్తోంది. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు పతనమైన ప్రతీసారి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేస్తోంది.

ఆరోపణ: బాధిత రైతు కుటుంబాలకు మోసం
వాస్తవం: బాబు జమానాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో తమ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే పరిహారం అందేది. అందులోనూ కోతలు, ఆంక్షలుండేవి. టీడీపీ ఐదేళ్లలో 924 మంది ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 450 మందికే పరిహారం అందింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరిహారాన్ని రూ.7లక్షలకు పెంచడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నేరుగా రైతు కుటుంబాలకు జమ చేస్తోంది. ఈ ఐదేళ్లలో బాబు ఎగ్గొట్టిన 474 మందితో కలిపి 1770 మందికి రూ.114.42 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించింది.

ఆరోపణ: పేరుకే వెలుగులు..రైతులకు కోతలు
వాస్తవం: రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది. అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.8845 కోట్ల బకాయిలను చెల్లించి, ఈ ఐదేళ్లలో ఉచిత విద్యుత్‌ కోసం రూ.43,744 కోట్లు ఖర్చు చేసింది.

ఆరోపణ: ఆక్వా కరెంట్‌..అంతే సంగతులు
వాస్తవం: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50 చొప్పున విద్యుత్‌ సరఫరా చేసింది. ఆక్వాజోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగు చేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఆయా జోన్ల పరిధిలో ఉన్న కనెక్షన్లలో 95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,497 కోట్లు ఆక్వా విద్యుత్తు సబ్సిడీ కింద ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఆరోపణ: పాడి రైతుకు బోనస్‌..తుస్‌
వాస్తవం: ‘జగనన్న పాల వెల్లువ’ (జేపీవీ)తో పాడి రైతుల జీవితాలకు భద్రత.. భరోసా కల్పిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులకు అదనంగా లబ్ధి చేకూరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4794 గ్రామాలకు చెందిన 4.19 లక్షల మందిపాడి రైతుల నుంచి 16.72 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.762.89 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మరొక వైపు మూతపడిన చిత్తూరు డెయిరీని రూ.385 కోట్ల అమూల్‌ పెట్టుబడులతో పునరుద్ధరిస్తున్నారు.

ఆరోపణ: అటకెక్కిన ఆహార శుద్ధి పరిశ్రమలు
వాస్తవం: పంటలకు అదనపు విలువ జోడించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా 940 కలెక్షన్‌ సెంటర్స్, 340 కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 478 కలెక్షన్‌ సెంటర్లు, 89 కోల్డ్‌ రూమ్స్‌తో పాటు 2,905 ప్యాక్‌ హౌస్‌ల ద్వారా అదనంగా 2.44 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతులకు వ్యక్తిగతంగా 1156, రైతు సంఘాలకు 164 ఫామ్‌ పాండ్స్‌ నిర్మించారు. రాయలసీమలో 217 సోలార్‌ డీహైడ్రేషన్‌ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరొక పక్క పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement