గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు | Jagans government has laid great emphasis on the welfare of the Yadavs | Sakshi
Sakshi News home page

గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు

Published Sun, May 12 2024 6:14 AM | Last Updated on Sun, May 12 2024 6:28 AM

Jagans government has laid great emphasis on the welfare of the Yadavs

యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్‌ సర్కారు  

లక్ష మందికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు 

కేసీసీల ద్వారా రూ.2 లక్షల వరకూ రుణాలు 

2423 సొసైటీలకు చెందిన యాదవులకు సబ్సిడీ రుణాలు 

రూ.43.77 కోట్లతో 2150 గొర్రెల యూనిట్లు మంజూరు 

ఆర్బీకేల ద్వారా క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాలు 

ఎన్‌సీడీసీ ద్వారా 100 కుటుంబాలకు ఆర్థిక చేయూత 

ఎన్‌ఎల్‌ఎం స్కీమ్‌ ద్వారా 12 మందికి రూ.కోటి చొప్పున రుణాలు 

సమర్థవంతంగా వైఎస్సార్‌ పశు బీమా పథకం అమలు 

ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారా యాదవులకు ప్రత్యేక గుర్తింపు 

నవరత్నాల ద్వారా నూరు శాతం లబ్ధి పొందిన యాదవులు 

సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు..బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్‌ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.

ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్‌ చేస్తోంది. వైఎస్సార్‌ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.

సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం..  

ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్‌ 
వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు.   

ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్‌ సర్కార్‌ 
వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్‌ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. 

ఎన్‌సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్‌తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. 

ఆరోపణ: వైఎస్సార్‌సీపీ హయాంలో అందని రుణాలు 
వాస్తవం: జగన్‌ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్‌సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు.

 వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్‌ఎల్‌ఎం స్కీమ్‌ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు.  

ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం 
వాస్తవం: వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్‌ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్‌ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. 

దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్‌లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు.   

ఆరోపణ: కార్పొరేషన్‌తో పైసా మేలు జరగలేదు. 
వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్‌ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. 

ఆరోపణ: జగన్‌ హయాంలో ఏదీ పెద్దపీట?  
వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్‌ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.

మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. 

ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా 
మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్‌ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్‌ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement