సాక్షి, ముంబై: రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందా? రాష్ట్రంలో కరెంటు కోతలు విధించనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గత కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోని 13 విద్యుదుత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో 3,330 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ విద్యుత్ లోటు నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (మహావితరణ)కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ఆ సంస్థ విజ్ఞప్తిచేసింది.
ముఖ్యంగా విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల సమయాల్లో అదనపు డిమాండ్ తలెత్తకుండా, విద్యుత్ మౌలిక సదుపాయాలపై మరింత లోడ్ పడకుండా చూడాలని ఆ సంస్థ కోరింది. రానున్న రోజుల్లో బొగ్గు కొరతను అధిగమించలేకపోతే రాష్ట్రంలో కరెంటు కోతలు విధించాల్సిన పరిస్థితి వస్తుందని విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. రోజుకు 6 నుంచి 8 గంటలపాటు కరెంటు కోత విధించాల్సి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కరెంటు కోతల ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 12 జలవిద్యుత్ కేంద్రాల నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. థర్మల్ విద్యుత్ లోటులో కొంత మేరనైనా ఇలా భర్తీ చేయాలని చూస్తోంది.
నిజానికి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడటంతో విద్యుత్ డిమాండ్ కొంతమేర తగ్గింది. అయినప్పటికీ, రాష్ట్రంలో 3,330 మెగావాట్ల విద్యుత్ కొరత ఉంటోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా, విద్యుత్ శాఖ వద్ద నిధుల లభ్యత లేనప్పటికీ, ఆ శాఖ విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు. బహిరంగ మార్కెట్‌లో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. ఇటీవలే 800 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 13.60 చొప్పున, మరో 900 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 6.23 కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఇలానే కొనసాగితే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచినా ఆశ్చర్యపోనక్కర లేదు.
ఒకవేళ చార్జీలు పెంచాల్సి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలపై మాత్రం పెనుభారం పడనుంది. ఇప్పటికే, రాష్ట్రంలో విద్యుత్ లోడ్‌ను తగ్గించేందుకు వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా చేసే విద్యుత్‌ను రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అదికూడా రాత్రి, పగలు షిఫ్టుల పద్ధతిలో సరఫరా చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏ ఏ కేంద్రాలు మూతపడ్డాయంటే..
మహావితరణకు విద్యుత్ సరఫరా చేస్తున్న మహానిర్మితికి చెందిన చంద్రపూర్, భుసావల్, నాసిక్ ప్రాంతాలలోని 210 మెగావాట్ల విద్యుదుత్పత్తి యూనిట్లు మూడు విద్యుదుత్పత్తిని నిలిపేశాయి. పారస్‌లోని 250 మెగావాట్లు, భుసావల్, చంద్రాపూర్‌లోని 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఒక్కొక్కటి చొప్పున మూత పడ్డాయి.
వీటితోపాటు కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్ (గుజరాత్)కు చెందిన 640 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లు, అమరావతిలోని రతన్ ఇండియా పవర్ లిమిటెడ్‌కు చెందిన 840 మెగావాట్ల సామర్ధ్యం గల మూడు యూనిట్లలో కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ లభించడం లేదని మహావితరణ సంస్థ చెబుతోంది.
తగ్గింది నిజమే..
బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి తగ్గిన మాట వాస్తవమేనని విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రౌత్ అంగీకరించారు. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలు విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో అధిక ధర వెచ్చించైనా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. బొగ్గు కొరత, రాష్ట్రంలో విద్యుదుత్పత్తి తగ్గుదల, విద్యుత్ లోటు తదితర అంశాలపై ఆయన మంత్రాలయలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండ్ కంటే 3 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని అంగీకరించారు. ఈ లోటును పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే థర్మల్ విద్యుత్కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా అయ్యేలా చూస్తున్నామని చెప్పారు. ఈ అంశాలపై ఇప్పటికే కేంద్ర బొగ్గు గనల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు.
మహావితరణ పిలుపునిచ్చిన మేరకు ఆయా సమయాల్లో విద్యుత్‌ను పొదుపు చేసి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు రాష్ట్రంలో నిల్వ ఉన్న 18 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగించాల్సి వచ్చిందన్నారు. కోల్ ఇండియా ప్రతిరోజు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉందని, కానీ వర్షాల కారణంగా 22 లక్షల మెట్రిక్ టన్నులే చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 27 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా అవుతోందని వివరించారు. సరఫరాను మరింత మెరుగుపరిచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేసేలా కోల్ ఇండియాతో చర్చిస్తున్నట్లు నితిన్ రౌత్ వెల్లడించారు.
గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కూడా సరిపడా గ్యాస్ సరఫరా ఉండటం లేదని తెలిపారు. దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్న సీజీపీఎల్, జేఎస్‌డబ్ల్యూ తదితర కంపెనీలు చౌక విద్యుత్ సరఫరాను నిలిపివేశాయన్నారు. దీంతో ఒక వేయి మెగావాట్ల విద్యుత్ సరఫరా తగ్గిందన్నారు. అందుకే సమస్య మరింత జఠిలమైందని నితిన్ రౌత్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – నితిన్ రౌత్
Comments
Please login to add a commentAdd a comment