NCP Crisis: Sharad Pawar Strong Reaction To Ajit's Retirement Comment - Sakshi
Sakshi News home page

ఎవరో ఏదో వాగుతుంటారు.. రిటైర్‌మెంట్‌ కామెంట్లపై శరద్‌ పవార్‌ తీవ్ర స్పందన

Published Thu, Jul 6 2023 7:40 PM | Last Updated on Thu, Jul 6 2023 8:02 PM

NCP Crisis: Sharad Pawar Strong Reaction To Ajit Retirement Comment - Sakshi

ముంబై: ఎన్సీపీని ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోనని.. తిరుగుబాటుతో కుదేలు అయిన పార్టీని పునర్నిర్మించి తీరతానని తోటి నేతలతో శరద్‌ పవార్‌ మరోమారు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో తన నివాసంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ చీలిక సంక్షోభం, భవిష్యత్‌ ప్రణాళిక గురించి పార్టీ నేతలతో చర్చించిన ఆయన.. తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని, ఇకపైనా పార్టీని ముందుండి నడిపిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ చేసిన రిటైర్‌మెంట్‌ వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. 

వయసు 82 అయితే ఏంటి.. 92 అయితే ఏంటి.. ఈ వయసులోనూ నేను ఇప్పటికీ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నా. పార్టీ కోసం పని చేస్తూనే ఉన్నా కదా అంటూ పవార్‌ సమావేశం అనంతరం మీడియా వద్ద ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని నేనే. పార్టీలో చీలిక తదితర పరిణామాల గురించి నేరుగా ఈసీ వద్దే తేల్చుకుంటామని చెప్పారాయన. 

‘‘ కొందరు తామే అసలైన ఎన్సీపీ నేతలమని.. పార్టీ అధినేత తానేనని చెప్పుకుంటున్నారు. ఎవరో ఏదో వాగుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా  ఆరోగ్యంగానే ఉండి.. పని చేస్తున్నా.  ఇక మీదట అధ్యక్ష పదవిలోనూ నేను ఉంటా. వయసు ఎంత మీద పడినా సరే.. పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటా. ఏం చెప్పాలనుకున్నా మనం ఎన్నికల సంఘం ముందే చెబుదాం. ఎవరికో ఏదో వివరణ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదూ అంటూ తోటి నేతలతో సమావేశంలో చెప్పారాయన. 

ఇదిలా ఉంటే.. శరద్‌ పవార్‌ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన కార్యవర్గ సమావేశం.. తిరుగుబాటు నేతలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో న్యాయపరంగా ఈ అంశాన్ని ఎలా ఎదుర్కోవాలనే సమాలోచనలు చేస్తోంది. ఒక ఎన్సీపీ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కీలక ప్రకటన చేసింది. శరద్‌ పవార్‌ నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశం చెల్లదని, అసలు అలాంటి భేటీ నిర్వహించేందుకు అధికారం.. అందులో నిర్ణయాలు తీసుకునేందుకు హక్కు లేదంటూ అజిత్‌పవార్‌ వర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. 

పవార్‌తో రాహుల్‌ భేటీ
ఇదిలా ఉంటే.. ఎన్సీపీ కార్యవర్గ సమావేశం తర్వాత జన్‌పథ్‌లోని తన అధికార నివాసానికి శరద్‌ పవార్‌ చేరుకున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. పవార్‌ నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. పార్టీ చీలిక సంక్షోభంపై వీళ్లు చర్చించినట్లు సమాచారం. 

ఇదీ చదవండి: బీజేపీతో పొత్తు కోసం యత్నించింది శరద్‌ పవారే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement