ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ చీలికపై.. ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంక్షోభాలకు శరద్ పవార్ ఆద్యుడని ఆరోపించిన రాజ్ థాక్రే.. తాజా పరిణామాలకు కూడా శరద్ పవారే కారణమంటూ పేర్కొన్నారు.
మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాక్రే బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారాయన. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అసహ్యమైన రాజకీయం. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమే అని తీవ్రంగా స్పందించారాయన.
అసలు మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు మొదలుపట్టిందే శరద్ పవార్. 1978లో పులోద్(పురోగామి లోక్‌షాహీ దళ్) పేరుతో చీలిక రాజకీయాలను ప్రదర్శించారు. అప్పటిదాకా మరాఠా రాజకీయం అలాంటి పరిణామాలను చూడలేదు. ఇలాంటివి పవార్‌తోనే మొదలై.. ఆయనతోనే ముగిసేలా కనిపిస్తున్నాయి. కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులారా చేసుకున్నదే అని రాజ్ థాక్రే విమర్శించారు. అలాగే.. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్‌బల్‌లు అజిత్ పవార్ వెంట వెళ్లే వ్యక్తులు ఏమాత్రం కాదని.. వాళ్లకు కచ్చితంగా శరద్ పవార్ అండదండలు ఉంటాయని ఆరోపించారాయన.
ఆనాడు ఏం జరిగిందంటే..
1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(ఐ), యశ్వంత్‌రావు చవాన్ నేతృత్వంలో కాంగ్రెస్(యూ)గా ముందుకు వెళ్లాయి. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం శంకర్‌రావ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో వసంత్‌దాదా పాటిల్ సీఎం అయ్యారు.
అయితే.. శరద్ పవార్ అప్పటి పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. తన రాజకీయ గురువైన యశ్వంత్‌రావు చవాన్ పంచన చేరి కాంగ్రెస్(యూ)లో కొనసాగారు. అయితే.. అధికారం కోసం కాంగ్రెస్(యూ) నుంచి విడిపోయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీని సొంతంగా ఏర్పాటు చేశాడు శరద్ పవార్. ఆపై జనతా పార్టీ, పీడబ్ల్యూపీలతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి) లేదా పురోగామి లోక్‌షాహీ అగాఢి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 38 ఏళ్ల శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా.. 1978 జులై 18 పీడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రభుత్వం రద్దు అయ్యింది. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తిరిగి అధికారం కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: శరద్ పవార్‌కు షాక్
Comments
Please login to add a commentAdd a comment