ముంబై: ఇంతకాలం నమ్మిన బంటుగా ఉన్న అజిత్ పవార్ మరోసారి ప్లేటు ఫిరాయించడంతో ఆత్మరక్షణలో పడింది ఎన్సీపీ నాయకత్వం. ఎన్సీపీలో ఎటువంటి చీలిక లేదంటూనే అజిత్ పవార్ ప్రఫుల్ పటేల్ వంటి కీలక నాయకులతో వెళ్లి షిండే ప్రభుత్వంలో చేరడంపై శరద్ పవార్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చాలా చూశానని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన అజిత్ పవార్ ఆదివారం 40 మంది ఎమ్మెల్యేలతో షిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో హుటాహుటిన ఒకచోట చేరిన ఎన్సీపీ వర్గాలు ప్రెస్ మీట్ నిర్వహించి పార్టీ ధిక్కరణకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.
నాకు ఇలాంటివి కొత్తేమీ కాదు. 1980లో కూడా ఇలాగే 58 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా పార్టీకి కొంతమంది వెన్నుపోటు పొడిచారు. ఆరోజు నాతో ఆరుగురు మాత్రమే మిగిలినప్పుడు కూడా నేను భయపడకుండా మళ్ళీ పార్టీని యధాస్థితికి తీసుకొచ్చాను. అప్పుడు నన్ను విడిచి వెళ్లిన వారంతా వారి నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని, పార్టీని కూడా పునర్నిర్మించుకుంటామని అన్నారు.
పార్టీని విడిచి వెళ్లిన వారిలో కొంతమందిపై బీజేపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ఆరోపించారు. అయితే నాతో పాటు చాలాకాలం కలిసి పనిచేసి, నేను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించిన ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే కూడా వారితో వెళ్లడమే నన్ను కొంచెం బాధించిందని అన్నారు.
ఇది కూడా చదవండి: ఇప్పటికీ మాది అదే పార్టీ.. ఆ గుర్తు పైనే పోటీ చేస్తాం: అజిత్‌పవార్
Comments
Please login to add a commentAdd a comment