మహారాష్ట్రలో మహాయుతి కూటమి గ్రాండ్ విక్టరీ సాధించినప్పటికీ.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహారాష్ట్ర సింగిల్ డిజిట్ లార్డెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ..
సీఎం పదవికి, సంఖ్యా బలానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అంటున్నారు. కూర్చొని చర్చించి సీఎంను ఎంపిక చేస్తామని చెప్పారు. అదే టైంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రి ఛాయిస్‌గా బీజేపీ దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మరోవైపు.. మొదట సీఎం రేసులో ఉన్నట్లు కనిపించిన అజిత్ పవార్.. ఇప్పుడు బీజేపీకే మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో..
మహా సీఎం పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఫడ్నవిస్-షిండే-అజిత్ పవార్‌లు ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అమిత్ షాతో కీలక భేటీ జరగనుంది. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుత సీఎం షిండే రేపు రాజీనామా చేస్తారని.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన ప్రకటించింది. ఆ పార్టీ లెజిస్లేచర్ నేతగా షిండేను ఎన్నుకుంది కూడా. అయితే..
మహారాష్ట్ర అసెంబ్లీ గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆ లోగానే కొత్త అసెంబ్లీ కొలువుదీరాల్సి ఉంది. అంటే.. సీఎం ప్రమాణం జరగాలి. అలాంటిదేమీ జరగలేదు కాబట్టి.. పరిస్థితుల దృష్ట్యా కచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే.. మహారాష్ట్రలో వరుసగా రెండోసారి ఎన్నికల తర్వాత రాష్ట్రపతి పాలన విధించినట్లు అవుతుంది.
2019 ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్ఠంభన నెలకొనడంతో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు 33 రోజుల పాటు ఆ టైంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రతిష్టంభన కొనసాగింది.
ఇక.. 2014లోనూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కాంగ్రెస్ పార్టీతో 15 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ). మద్దతు ఉపసంహరించడంతో.. పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడడం, తదనంతరం సీఎం పదవికి చవాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇంతకు ముందులా లేదుగా..
..మహారాష్ట్రలో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ 105 సీట్లను బీజేపీ దక్కించుకుంది. నాడు ఉమ్మడి శివసేన 56 స్థానాలు గెలుచుకుని.. బీజేపీ కూటమిగా(161 సీట్లతో) సంపూర్ణ మెజారిటీ సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై ఉమ్మడి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే పేచీ పెట్టడంతో రాజకీయం మారిపోయింది. చెరో రెండున్నరేళ్ల సీఎం పదవి కోసం డిమాండ్ చేశారాయన. కుదరకపోవడంతో.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆపై కలిసొచ్చిన అవకాశం అందిపుచ్చుకుని కాంగ్రెస్, ఉమ్మడి ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. ఇక..
2022లో ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి.. బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. ఆ టైంలోనూ ఫడ్నవిస్ సీఎం పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగారు. మరోవైపు.. 2023లో ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్ వచ్చి చేరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఫడ్నవిస్ సీఎంగా ఉండి.. షిండే, పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా కొనసాగడమే సబబని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరి అందుకు షిండే అంగీకరిస్తారో లేదో? అనేది ఈ రాత్రికల్లా తేలిపోవాల్సి ఉంది. లేకుంటే.. రాష్ట్రపతి పాలన తప్పదు!.
Comments
Please login to add a commentAdd a comment