వెంటాడుతున్న బొగ్గు భయం | Severe shortage of Coal in 116 places of 135 thermal centers | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న బొగ్గు భయం

Published Wed, Oct 13 2021 5:20 AM | Last Updated on Wed, Oct 13 2021 5:20 AM

Severe shortage of Coal in 116 places of 135 thermal centers - Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ సహా దాదాపు 14 రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విద్యుత్‌ సంక్షోభంపై సోమవారం సమావేశం నిర్వహించగా ప్రధాని మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బొగ్గు సంక్షోభంపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ సీఎం వైఎస్‌ జగన్‌ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మిగులు విద్యుదుత్పత్తి కలిగిన రాష్ట్రాలు కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్‌ శాఖ మంగళవారం పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంక్షోభాన్ని పట్టించుకోకుండా మిగులు కరెంట్‌ను పవర్‌ ఎక్స్చేంజ్‌ల్లో విక్రయిస్తే ఆ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ స్టేషన్ల వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 15 శాతం కోటా నుంచి విద్యుత్‌ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 

దేశమంతా కటకట..
దేశవ్యాప్తంగా 1,65,066 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకి 18,70,400 మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఉన్న 73,16,600 మెట్రిక్‌ టన్నుల బొగ్గు సగటున నాలుగు రోజులకు సరిపోతుంది. నేషనల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 116 థర్మల్‌ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 15 కేంద్రాల్లో బొగ్గు అసలు లేదు. 27 కేంద్రాలలో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉంది. 20  కేంద్రాల్లో రెండు రోజులకు, 21 కేంద్రాల్లో మూడు రోజులకు, మరో 20 కేంద్రాల్లో నాలుగు రోజులకు, ఐదు కేంద్రాల్లో ఎనిమిది రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు మించి బొగ్గు చాలదు. దీంతో దేశవ్యాప్తంగా 1,42,054 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రాష్ట్రంలో పరిస్థితి ఇలా..
దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 48,600 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 26,900 మెట్రిక్‌ టన్నులు ఉండగా ఇది ఒక్క రోజుకే సరిపోతుంది. రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 69,700 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉన్నందున నాలుగు రోజులు విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. సింహాద్రిలో 13,900 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఒక్క రోజుకే సరిపోనుంది. వీటన్నిటి ఉత్పత్తి సామర్థ్యం 9,370 మెగావాట్లు కాగా ప్రస్తుతం బొగ్గు కొరతతో సగం కూడా విద్యుదుత్పత్తి జరగడం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement