Thermal power station
-
ఊగిసలాటకు తెరపడేదెప్పుడో!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని జీవితకాలం ముగిసిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల రామగుండంలో పర్యటించి ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు నిర్ణయించారు. అయితే, జెన్కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో గణాంకాలు తేలకపోవడంతో ప్లాంట్ పనుల్లో జాప్యమవుతోందని ఉద్యోగులు అంటున్నారు.డీపీఆర్ కోసం..పెద్దమొత్తంలో పెట్టుబడి భరించే అవకాశం లేదని సింగరేణి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో) సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సింగరేణితో కలిసి వారంలోగా రూపొందించాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ గత సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీచేసింది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను నెలలోగా తయారు చేయాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం డిజిగ్ అనే సంస్థ డీపీఆర్ తయారు చేసేందుకు ప్లాంట్‌ను సందర్శించింది. పాత విద్యుత్ కేంద్రాన్ని తొలగించేందుకు వివిధ విభాగాలకు చెందిన ఇంజనీర్లను జెన్కో ప్రత్యేకంగా నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.1971 నుంచి బీ–థర్మల్‌లో విద్యుత్ ఉత్పత్తిఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో రామగుండంలో 1965 జూలై 19న అప్పటి సీఎం కాసు బ్రçహ్మానందరెడ్డి 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 1971లో ఇది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.80 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం 1996 వరకే ఈ ప్లాంట్‌ను నడిపించాల్సి ఉంది.కానీ, దాని జీవితకాలం పొడిగిస్తూ వచ్చారు. మరోవైపు కొన్నేళ్లుగా ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్స్ లీక్‌కావడం, మిల్స్, టర్బైన్ విభాగాల్లో తరచూ సమస్యలు తలెత్తడంతో గుదిబండగా మారింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తరచూ షట్‌డౌన్ కావడం, ఆ తర్వాత పునరుద్ధరించేందుకు ప్రతీసారి బాయిలర్ మండించేందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో నిర్వహణ భారమైంది. అంతేకాదు.. దాని జీవితకాలం ముగియటంతో ప్లాంట్‌ను మూసి వేశారు.భాగస్వామ్యంపై పీటముడిపాత ప్లాంట్ పరిధిలో 560 ఎకరాల స్థలం, అనుభవం కలిగిన ఇంజనీర్లు, శ్రామిక శక్తి ఉన్న జెన్కోను కాదని, సింగరేణి భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని జెన్కో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గతనెలలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. అయినా, ప్రభుత్వం సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు.. జెన్కో 76 శాతం, సింగరేణి 24 శాతం వాటాతో ప్లాంట్ నిర్మించేందుకు జెన్కో ఇంజనీర్లు సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, సింగరేణి సంస్థ తమకు 50 శాతం వాటా ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో పట్టుబట్టినట్టు సమాచారం. భాగస్వామ్యం లెక్కలు తేలి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరితేనే కొత్త ప్లాంట్ శంకుస్థాపనకు అవకాశం ఉంటుంది. అప్పుడే జెన్కో పాలకమండలి పాత ప్లాంట్‌ను మూసివేసినట్టుగా ఆమోదం తెలిపే అవకాశాలుంటాయని జెన్కో ఉద్యోగులు చెబుతున్నారు. జెన్కో, సింగరేణి సీఎండీల మధ్య సయోధ్య కుదుర్చేంచేందుకు ఉపముఖ్యమంత్రి సాయంతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రయత్నాలు చేశారు. మధ్యేమార్గంగా నిర్ణయానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు సిద్ధమయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో కృష్ణానది వెంట కొత్త పట్టణం నిర్మాణం కానున్నది. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలో రూ.928.52 కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 3న, ప్రైస్ బిడ్లను 7న తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. సంగమ క్షేత్రంలో కొత్త పట్టణం కృష్ణా నదిలో తుంగపాడు వాగు కలిసే చోట ఈ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయించారు. డిజై న్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్íÙప్ నిర్మాణం జరుగుతుంది. 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివా స గృహసముదాయాలతో లేఅవుట్‌ను తయా రు చేశారు. 75,185 చ.మీ.ల విస్తీర్ణంలో పార్కు లు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీ.ల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తారు.2025 మార్చి నాటికి 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మి కులు ఇక్కడ రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్‌షిప్‌ను జెన్కో నిర్మిస్తోంది. ఉన్నతాధికారుల కోసం ‘ఏ’–టైప్‌లో రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లను, ‘బీ’–టైప్‌లో 6 ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు ‘డీ’, ‘ఈ’టైప్ క్వా ర్టర్లను, కార్మి కులకు ‘ఎఫ్’టైప్ క్వార్టర్లను కేటాయిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు కలిపి మొత్తం 2,970 ఫ్లాట్లను నిర్మించనున్నారు. సకల సదుపాయాలు టౌన్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పిస్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆస్పత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెనెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజీ రిజర్వాయర్స్, సెప్టిక్ ట్యాంక్స్, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జీ, కాంపౌండ్ వాల్, టౌన్‌షిప్‌కు అప్రోచ్ రోడ్డును ఈ ప్రాజెక్టులో భాగంగా జెన్కో నిర్మిస్తోంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగునీటిని శుద్ధి చేయడానికి రోజుకు 1,000 కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)ను సైతం నిర్మిస్తోంది. కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించిన తర్వాత 30 నెలల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని టెండర్ నోటిఫికేషన్లో జెన్కో తెలిపింది. -
నేటితో నేలమట్టం
పాల్వంచ: పాల్వంచలోని కాలం చెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్(ఒఅండ్‌ఎం)లోని కూలింగ్ టవర్లు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక్కోటి చొప్పున మొత్తం 8 టవర్లు కూల్చివేయనున్నారు. పాత ప్లాంట్ తొలగింపు కాంట్రాక్ట్ దక్కించుకున్న హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ.. టవర్ల కూల్చివేతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎక్సిక్యూడ్ కంపెనీకి అప్పగించింది. కంపెనీ డైరెక్టర్ ఆనంద్ శర్మ సారథ్యంలో ఇంప్లోషన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలేలా పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజామున ట్రాన్స్‌కో శాఖ నుంచి విద్యుత్ లైన్ల క్లియరెన్స్ రాగానే కూల్చివేతకు సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆ వెంటనే నిమిషాల వ్యవధిలో ఎక్స్‌ప్లోజివ్స్ పేలి టవర్లు నేలమట్టం కానుండగా, ముందుగా ‘ఎ’స్టేషన్‌లోని నాలుగు టవర్లు, తర్వాత ‘బీ’స్టేషన్‌లోని రెండు, ‘సీ’స్టేషన్లలోని మరో రెండు టవర్లు కూల్చివేయనున్నారు. టవర్ల శకలాలు దూరంగా పడకుండా అక్కడే కుప్పకూలేలా పిల్లర్ల చుట్టూ ఐరన్ మెస్‌లను ఏర్పాటు చేసి, క్లాత్‌తో సీల్ చేశారు. దీంతో కూలే సమయంలో ఎక్కడా ప్రమాదాలు వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కర్మాగారంలోని మిగతా విభాగాలను తుక్కుగా మార్చి తరలించడంతో చివరికి ఈ టవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదా?జూలై 31వ తేదినే కూలింగ్ టవర్లను నేలమట్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు చేసేందుకు అధికారులు సాహసించలేదని తెలుస్తోంది. అనుకోని ప్రమాదాలు జరిగితే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని కూల్చివేతను నిలిపివేసినట్లు సమాచారం. కాగా ట్రాన్స్‌కో లైన్ల క్లియరెన్స్‌లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక నేడు ముహుర్తం ఖరారు చేశారు.1965–78 ప్రాంతంలో నిర్మాణం..పాల్వంచ అంటే కేటీపీఎస్, దానిలో టవర్లు ఆనవాళ్లుగా చెప్పవచ్చు. 115 మీటర్ల ఎత్తులో ఉన్న ఇవి కొన్ని మైళ్లదూరం వరకు కనిపిస్తాయి. 1965–78 సంవత్సరంలో జపాన్ టెక్నాలజీతో కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారాన్ని నిర్మించారు. ఏ,బీ,సీ, స్టేషన్లలోని 60 మెగావాట్ల సామర్థ కలిగిన 1,2,3,4 యూనిట్లు, 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5,6,7,8 యూనిట్లు చేపట్టి... 720 మెగావాట్లతో రాష్ట్రానికి వెలుగులు పంచారు. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో కూలింగ్ టవర్ చొప్పున మొత్తం 8 నిర్మించారు. విద్యుదుత్పత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించిన క్రమంలో వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపయోగపడతాయి. నాణ్యతా ప్రమాణాలతో నిర్మిచడంతో ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషం. కాగా పలువురు టవర్ల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో బైబై ఓల్డ్ ప్లాంట్.. కూలింగ్ టవర్లు అంటు పోస్ట్‌లు చేశారు. ఆది నుంచి వివాదాస్పదంగానే ఈ పనులు సాగుతుండగా, చిట్టచివరి అంకం కూడా పూర్తి కావొచ్చింది. కాగా టవర్ల కూల్చివేతపై సీఈ పి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.పటిష్ట భద్రత నడుమ..కూలింగ్ టవర్ల కూల్చివేతపై కర్మాగారం చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్‌కుమార్, ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎ. అప్పాజీ, ఇన్స్పెక్టర్ కిరణ్, జెన్కో విజిలెన్స్ డీఎస్పీ రమేష్, ఎస్ఈ కిరణ్‌కుమార్‌లు టవర్ల కూల్చివేత ప్రాంతాలను పరిశీలించారు. సోమవారం ఉదయం కరకవాగు, అల్లూరిసెంటర్, పాండురంగాపురం రోడ్లలో ఎవరూ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కర్మాగారంలోకి ఇతరులెవరూ రాకుండా అనుమతులు నిలిపివేశారు. కనీసం 200 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్లొద్దని నిబంధనలు విధించారు. ఉదయం షిఫ్ట్ విధులకు వెళ్లే సిబ్బందిని కూడా నిలిపివేయనున్నారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్‌స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్‌లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్‌కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
రాష్ట్రానికి ‘భద్రాద్రి’ గుదిబండే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం గుదిబండగా మారిందని విద్యుత్ రంగ నిపుణుడు ఎం.వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌కి వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించడం, కాలం చెల్లిన సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడమే దీనికి కారణమన్నారు. రూ.7,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించగా, వాస్తవ వ్యయం రూ.10 వేల కోట్లు దాటిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ముందు బుధవారం హాజరై తమ పిటిషన్లకు మద్దతుగా వాదనలు వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తికాక ముందే రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమైందని, విద్యుత్ కొరత తీర్చడంలో ఈ విద్యుత్ కేంద్రం పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. విద్యుత్ కొరతను అధిగమించే సాకుతో టెండర్లు లేకుండా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని తెలిపారు. 2017లో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాష్ట్రానికి వచ్చేనాటికే భూపాలపల్లిలో 800 మెగావాట్ల కేటీపీపీ, జైపూర్ (మంచిర్యాల జిల్లా)లో 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్‌తోపాటు జూరా లలో జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తిమ్మారెడ్డి కమిషన్‌కు వివరించారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ రాకున్నా విద్యుత్ లైన్ల కోసం రూ.630 కోట్లను చెల్లించారని తప్పుబట్టారు. యూనిట్‌కు రూ.3.90 ధరతో ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వస్తుందని ఒప్పందం చేసుకోగా, వాస్తవ ధర రూ.5.40కు పెరిగిందన్నారు. ఆ సమయంలో దేశంలో రూ.4.20కే కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా విద్యుత్ లభించిందని ఆధారాలను కమిషన్‌కు అందజేశారు. మూడేళ్ల తర్వాతే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ వచ్చింది.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం 2014లో జరిగితే మూడేళ్ల తర్వాత 2017–18 నుంచి సరఫరా ప్రారంభమైందని, 1000 మెగావాట్లకు గాను 75 శాతమే వచ్చిందని వేణుగోపాల్‌రావు అన్నారు. విద్యుత్ బిల్లుల వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.10–20 వరకు అధిక ధరతో రాష్ట్రం విద్యుత్ కొనాల్సి వచ్చిందన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా అయ్యేందుకు 1000 మెగావాట్ల పవర్ గ్రిడ్ లైన్లను బుక్ చేసుకోగా, పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోయినా రూ.650 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను బుక్ చేసుకొని రద్దు చేసుకోవడంతో రూ.261 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎలక్రి్టసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో పవర్‌గ్రిడ్ దావా వేసిందని పేర్కొన్నారు. ఒప్పందం మేరకు రావాల్సిన విద్యుత్ రాకున్నా ఛత్తీస్‌గఢ్‌కు రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. -
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘తాజా పర్యావరణ అనుమతులు’ జారీ చేయాలని సిఫారసు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ నిర్ణయం తీసుకుంది. 50 శాతం విదేశీ బొగ్గు, మరో 50శాతం స్వదేశీ బొగ్గుతో కలిపి(బ్లెండ్ చేసి) విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీ ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మిస్తామని గతంలో జెన్కో ప్రతిపాదించింది.ఈ ప్రతిపాదనల ఆధారంగా 2017 జూలై 25న కేంద్రం ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసింది. అయితే అనుమతులకు విరుద్ధంగా పూర్తిగా స్వదేశీ బొగ్గు ఆధారంగా విద్యుదుత్పత్తి జరిపే టెక్నాలజీతో యాదాద్రి ప్లాంట్‌ను జెన్కో నిర్మిస్తోందని కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. టెక్నాలజీ మారడంతో నీటి వినియోగం, బూడిద ఉత్పత్తి పెరుగుతుందని ఆరోపించారు.మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యా వరణ అనుమతులు పొందాల్సిందేనని 2022 సెపె్టంబర్లో ఎన్జీటీ తీర్పు ఇవ్వగా, జెన్కోకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో యాదాద్రి ప్లాంట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మళ్లీ పర్యావరణ అనుమతులు పొందేందుకు జెన్కో విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ నెల 8న సమావేశమైన కేంద్ర పర్యావరణశాఖ నిపుణుల మదింపు కమిటీ ఎట్టకేలకు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. కృష్ణానదిని కలుషితం చేయమని హామీ కృష్ణానదిలో కలిసే తుంగపాడు వాగు యాదా ద్రి ప్లాంట్ మధ్య నుంచి వెళుతుందని, దీని ప్ర వాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, వాగులో కనీస ప్రవాహం ఉండేలా చర్యలు తీసు కోవాలని నిపుణుల కమిటీ జెన్కోకు సూచించింది. వాగు పరిరక్షణకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, వాగుకు ఇరువైపులా 100 మీటర్ల వరకు అటవీశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం బదులిచ్చింది.తుంగపాడు వాగులో కనీస ప్రవాహం ఉండేలా ఎగువన ఉన్న పెద్దచెరువుల నుంచి నీటిని విడుదల చేస్తామని గతంలో నీటిపారుదల శాఖ సైతం హామీ ఇచ్చింది. తుంగపాడు వాగు, కృష్ణానది కలుషితం కాకుండా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జి సిస్టమ్ ఆధారంగా డిజైన్ చేశామని, ఇందుకు యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు జెన్కో సైతం ఈ నెల 12న లేఖ ద్వారా హామీ ఇచ్చింది.పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధికి ఆర్వో ఆధారిత ప్లాంట్‌తో పాటు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇలా శుద్ధి చేసిన జలాలను బూడిద, చెట్ల పెంపకం, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తామని జెన్కో తెలిసింది. తుంగపాడు వాగులో ఎలాంటి వ్యర్థాలు వదలని స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ షరతుల్లో కొన్ని.... ♦ విద్యుత్ కేంద్రం ప్రహరీ లోపలిభాగంలో స్థానిక అటవీ జాతుల మొక్కలను మూడు వరుసల్లో నాటే కార్యక్రమాన్ని జూన్ 2024లోగా పూర్తి చేయాలి. తుంగపాడు వాగుకు రెండువైపులా 100 మీటర్ల వరకు వచ్చే రెండేళ్లలోగా చెట్ట పెంపకం పూర్తి చేయాలి. విద్యుత్ ప్లాంట్ ప్రహరీ చుట్టూ 2 కి.మీల వరకు దట్టంగా చెట్లు పెంచాలి. స్థానికంగా ఉన్న పాఠశాలల చుట్టూ 10 కి.మీల వరకు చెట్లు పెంచాలి. ♦భూ నిర్వాసితులకు 2025 మార్చిలోగా పరిహార పంపిణీ పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో నిర్వాసితులైన కుటుంబాలు, ప్రభావితమైన కుటుంబాల్లోని వ్యక్తులకు ఇచ్చిన హామీ మేర కు శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించాలి. ♦బూడిద కోసం భవిష్యత్‌లో అదనపు భూమి కేటాయింపు ఉండదు. సిమెంట్, ఇటుకల తయారీకి 100శాతం బూడిదను వినియోగించుకోవాలి. రవాణాలో బూడిద పరిసర ప్రాంతాల్లో పడి కలుషితం చేయకుండా క్లోజ్డ్ బల్కర్స్లోనే తరలించాలి. ♦పర్యావరణ నిర్వహణ పణ్రాళిక (ఈఎంపీ)లో హామీ ఇచ్చిన మేరకు గడువులోగా రూ.5681.44 కోట్ల మూలధనం, రూ.430 కోట్ల రికరింగ్ నిధులతో పర్యావరణ ప్రణాళిక అమలు చేయాలి. ♦ప్రాజెక్టుకు చుట్టూ 5 కి.మీల పరిధిలో నివసించే జనాభాకు కనీసం రెండేళ్లకోసారి ఎపిడెమియోలాజికల్(అంటురోగాలు) స్టడీ నిర్వహించాలి. స్టడీలో తేలిన అంశాల ఆధారంగా వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. యూనిట్ల నిర్మాణ గడువూ పొడిగింపుతెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఆధ్వర్యంలో 4000(5్ఠ800) మెగావాట్ల సామర్థ్యంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం– వీరప్పగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని ఐదు యూనిట్ల నిర్మాణం విషయంలో గడువు పొడిగించినట్టు జెన్కో కేంద్ర పర్యావరణ శాఖకు తెలిపింది.. యూనిట్ గడువు యూనిట్– 1 15.10.2024 యూనిట్–2 15.10.2024 యూనిట్ –3 31.03.2025 యూనిట్–4 31.12.2024 యూనిట్–5 28.02.2025 -
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్‌ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్‌లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
రికార్డు స్థాయిలో కరెంట్ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగంతో ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 238.79 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి వినియోగం 166.97 కంటే 43.01 శాతం ఎక్కువ. రోజులో పీక్ డిమాండ్ 12,802 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 7,997 మెగావాట్లు మాత్రమే ఉంది. అంటే 60.09 శాతం పెరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా.. గత సంవత్సరం వేసవిలో మన రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందని అంచనా. దీనికి తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కృష్ణపట్నంలోని శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఇబ్రహింపట్నంలోని ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్–8లోనూ ఉత్పత్తి ముందుగానే ప్రారంభించారు. అలాగే వీటీపీఎస్‌లో రోజుకి 32,186 మెట్రిక్ టన్నులు, ఆర్టీపీపీలో 16,443 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నంలో 23,632 మెట్రిక్ టన్నులు, హిందూజాలో 14,277 మెట్రిక్ టన్నులు చొప్పున బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 91.081 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.920 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.269 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 35.925 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 32.213 మి.యూ, సోలార్ నుంచి 20.647 మి.యూ, విండ్ నుంచి 12.359 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. అయితే ఇది మాత్రమే సరిపోవడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్ నుంచి రోజుకు యూనిట్ సగటు రేటు రూ. 8.764 చొప్పున రూ. 35.253 కోట్లతో 40.224 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ విధంగా డిమాండ్‌ను అందుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జార్ఖండ్, ఉత్తరాఖండ్, బిహార్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మన దగ్గర కంటే తక్కువ విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ కొరత ఏర్పడింది. -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
కృష్ణపట్నానికి ‘మహానది’ బొగ్గు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్కో) చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా థర్మల్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన బొగ్గు సరఫరాను పెంచడానికి వివిధ సంస్థలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా.. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించింది. ఈ బొగ్గు సరఫరా సోమవారం నుంచి రైలుమార్గంలో మొదలైంది. ఫలించిన నిరంతర ప్రయత్నం.. ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు 5,811 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికోసం ఎంసీఎల్ నుంచి సంవత్సరానికి 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు రాష్ట్రంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. అయితే, కొంతకాలంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో సరఫరా కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కోటాను నిర్ణయించడం మొదలుపెట్టింది. మరోవైపు.. థర్మల్‌కు బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నిరంతర పర్యవేక్షణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌తో సంప్రదింపులు జరిపారు. దీంతో ఈ ఏడాది మార్చి 10 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల యూనిట్‌కు మే 1 నుంచి బొగ్గును కేటాయించడానికి ఎంసీఎల్ అంగీకరించింది. మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ యూనిట్‌తో రాష్ట్రంలోని రోజువారీ విద్యుత్ అవసరాలకు దాదాపు 16 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. మహానది నుంచి దీనికి బొగ్గును సరఫరా చేయడంవల్ల విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా అన్ని రంగాలకు ఎలాంటి లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్)లు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెరుగుతున్న స్టేట్ గ్రిడ్ డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
తుక్కు.. తక్కువేం కాదు.. టీఎస్ జెన్కోకు రూ.485 కోట్ల ఆదాయం
సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో కాలం చెల్లిన, ప్రస్తుతం వినియోగంలో లేని పాత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను తుక్కు కింద అమ్మేయడం ద్వారా టీఎస్ జెన్కోకు భారీగా ఆదాయం రానుంది. దీంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్థల లభ్యత పెరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశ పారిశ్రామిక, గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో 1966 సెప్టెంబర్ 4న పాల్వంచలో తొలి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 60 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి జపాన్ సాంకేతిక సహాయం అందించగా రూ.59.29 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత వరుసగా బీ, సీ యూనిట్ల నిర్మాణాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ చేపట్టింది. మొదటి నాలుగు ప్లాంటు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ మూడు ప్లాంట్లను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)గా పేర్కొనేవారు. పాత టెక్నాలజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువ పైగా కాలుష్యం ఎక్కువగా ఉండేది. దీంతో పాత ప్లాంట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా నిలిపేస్తూ వచ్చారు. అలా 2019 ఫిబ్రవరి నుంచి 2020 మార్చి నాటికి ఏ, బీ, సీ యూనిట్ల నుంచి విద్యుత్త్ ఉత్పత్తిని ఆపేశారు. తుక్కుకు రూ.485 కోట్లు కేటీపీఎస్‌లోని ఏ, బీ, సీ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన తర్వాత అప్పటి వరకు వినియోగిస్తూ వచ్చిన టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, కన్వేయర్ బెల్టులు, ఇతర యంత్ర సామగ్రి నిరుపయోగంగా మారాయి. దీంతో వాటిని తుక్కు కింద అమ్మేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది. దీంతో మరో కేంద్ర సంస్థ ఎంఎస్టీసీ రంగంలోకి దిగింది. ఏ, బీ, సీ ప్లాంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ లభించే ఐరన్, కాపర్, ఇతర యంత్ర విడిభాగాల విలువను మదింపు చేసింది. దీన్ని తుక్కు లెక్కన కొనేందుకు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం ఐదు కంపెనీలో పోటీ పడగా కేటీపీఎస్‌లోని పాత మూడు ప్లాంట్లను తుక్కు కింద రూ.485 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ ముందుకొచ్చింది. కేటీపీఎస్ ఓ అండ్ ఎంలో విడి భాగాలను తొలగిస్తున్న సిబ్బంది ముందుగా ‘ఏ’ ప్లాంటు తొలి దశలో ఏ ప్లాంటును పూర్తిగా తొలగించనున్నారు. ఇందుకుగాను హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థ రూ.144 కోట్లు చెల్లించి రంగంలోకి దిగింది. గత నెలలో పనులు ప్రారంభం కాగా, ప్రస్తుతం ప్లాంటులోకి బొగ్గు తీసుకొచ్చే కన్వేయర్ బెల్ట్ తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఎక్కడికక్కడ భారీ కటింగ్ యంత్రాలతో కన్వేయర్ బెల్ట్ లైన్‌ను ముక్కలుగా చేస్తున్నారు. దీనికి తగ్గట్టుగా పని జరిగే ప్రదేశంలో విద్యుత్ సరఫరా నిలిపేశారు. భారీ నిర్మాణాలను కటింగ్ చేసిన తర్వాత ఇనుము, ఇతర లోహాలను వేరు చేస్తున్నారు. ఇక్కడి నుంచి లారీల ద్వారా తుక్కును తరలిస్తున్నారు. జూన్ వరకు ఏ ప్లాంటు తొలగింపు పనులు సాగనున్నాయి. ఆ తర్వాత వరుసగా బీ, సీ ప్లాంట్లను తొలగిస్తారు. అనంతరం కూలింగ్ టవర్లు, చిమ్నీలను తొలగించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడేళ్లలో ఏ, బీ, సీ ప్లాంట్లను పూర్తిగా తొలగించడంతో పాటు నేల మొత్తాన్ని చదును చేసి జెన్కోకు అప్పగించాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో జెన్కోకు సుమారు 400 ఎకరాల స్థలం లభించనుంది. ఇవి కీలకం.. కేటీపీఎస్ పాత ప్లాంట్లను తొలగించే పనిలో అత్యంత కీలకమైనది వందల మీటర్ల ఎత్తుతో నిర్మించిన చిమ్నీలు, కూలింగ్ టవర్ల తొలగింపు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నాలుగు కూలింగ్ టవర్లు, ఒక చిమ్నీని తొలగించాల్సి ఉంటుంది. అయితే జెన్కో విధించిన షరతుల ప్రకారం ఈ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు పేలుడు పదార్థాలను వినియోగించడం నిషిద్ధం. దీంతో బ్లాస్టింగ్ లేకుండా భారీ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అనువుగా ఉన్న మార్గాలపై ఇటు జెన్కో, అటు హెచ్ఆర్ కమర్షియల్స్ సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో గతంలో చంద్రాపూర్‌లో ఉన్న పాత విద్యుత్ కేంద్రాన్ని తుక్కు కింద అమ్మేశారు. అక్కడ ఏ విధానం పాటించారనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించనున్నారు. -
థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో విషవాయువులకు చెక్!
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను కాలుష్యరహిత కేంద్రంగా తీర్చిదిద్దడానికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ సిద్ధమైంది. రూ. 696 కోట్ల వ్యయంతో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) అనే అనుబంధ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి గాలిలోకి విడుదలయ్యే సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ శాతం ప్రతి ఘనపు మీటర్‌కు 2000 మిల్లీగ్రాములులోపు ఉండాల్సి ఉండగా 200 మిల్లీగ్రాములకు తగ్గిస్తూ 2015లో కేంద్ర పర్యావరణ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఎఫ్‌జీడీల నిర్మాణం తప్పనిసరైంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న తొలి ఎఫ్‌జీడీ ప్లాంట్ ఇదే. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గును మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతతో నీటిని ఆవిరిగా మార్చి దానితో టర్బైన్లను తిప్పు తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించ డం ద్వారా బూడిద, విషవాయువులు విడుదలవుతాయి. బూడిదను శుద్ధి చేసేందుకు సింగరేణి థర్మ ల్ విద్యుత్ కేంద్రంలో ‘ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపిటే టర్స్’అనే అనుబంధ విభాగాన్ని వినియోగిస్తున్నా రు. సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ శుద్ధికి ఎఫ్‌జీడీ రానుంది. 20 శాతం పనులు పూర్తి... సింగరేణిలో ఎఫ్‌జీడీ నిర్మాణ పనులను పీఈఎస్ ఇంజనీర్స్ సంస్థకు అప్పగించగా ఇప్పటికే 20% ప నులను పూర్తి చేసింది. మొత్తం పనులను 2024 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఎఫ్‌జీడీ నిర్మాణంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఎఫ్‌జీడీ పనితీరు ఇలా... బొగ్గు మండించినప్పుడు వెలువడే వాయువుల్లోంచి సల్ఫర్, అనుబంధ వాయువులను ఎఫ్‌జీడీ ప్లాంట్ వేరు చేస్తుంది. దీనికోసం 150 మీటర్ల ఎత్తయిన ఒక చిమ్నీనీ ఏర్పాటు చేస్తారు. ఈ చిమ్నీలో కింది నుంచి పైకి వచ్చే వాయువుపై క్యాల్షియం కార్బొనేట్ (తడి సున్నం)ను పైనుంచి బలంగా పంపి స్తారు. దీంతో వాయువుల్లోని సల్ఫర్ డై ఆక్సైడ్తో తడి సున్నం రసాయనిక చర్యకు లోనవుతుంది. సల్ఫర్, అనుబంధ వాయువులన్నీ తడి సున్నంలో కలుస్తాయి. ఫలితంగా బయటకు విడుదలయ్యే వా యువుల్లో సల్ఫర్ అనుబంధ వాయువుల శాతం ఘ నపు మీటర్‌కు 200 మిల్లీగ్రాములకు తగ్గిపోతుంది. ఈ ప్రక్రియలో అంతిమంగా ఏర్పడే క్యాల్షియం సల్ఫేట్ (జిప్సం) అనే ఘన పదార్థాన్ని ఎరువులు, సిమెంట్, పేపర్, వస్త్ర పరిశ్రమ, నిర్మాణ రంగానికి సరఫరా చేయనున్నారు. జిప్సం అమ్మకాలతో థర్మల్ ప్లాంట్ నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. -
15న 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును ఈనెల 15న ప్రారంభించను న్నారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవా రం సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల కాలంలో 8 చోట్ల ఏర్పాటు చేసిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఇప్పటి వరకు 505 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో సంస్థకు రూ.300 కోట్లు ఆదా అయ్యాయి. మూడో దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రిజర్వాయర్‌పై 15 మెగావాట్ల సామ ర్థ్యంతో 2 ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మిస్తుండగా, అందులో సిద్ధమైన 5 మెగా వాట్ల ప్లాంట్లను సంక్రాంతి సందర్భంగా 15న ప్రారంభిస్తారు. తొలి, రెండు దశల్లో 219 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన సింగరేణి మూడో దశ కింద 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మిస్తోంది. -
ఇతర రాష్ట్రాలకూ విద్యుత్ ఎగుమతి
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను భారీ స్థాయిలో నెలకొల్పడం ద్వారా భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఏపీ చేరనుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం వర్చువల్ విధానంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం ద్వారా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్(ఎస్డీఎస్టీపీఎస్) కృష్ణపట్నం రెండో దశలో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి ఈ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(డాక్టర్ ఎన్టీటీపీఎస్) ఐదో దశలో మరో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకొస్తుందని మంత్రి వివరించారు. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక(పవన, సౌర, జల) ఇంధన ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దేశంలోనే ఇది వినూత్న ప్రయోగమన్నారు. ఇంత భారీ స్థాయిలో విద్యుదుత్పత్తి వల్ల మన రాష్ట్రం నుంచి విద్యుత్‌ను వాణిజ్య పరంగానూ ఎగుమతి చేయవచ్చని మంత్రి వివరించారు. అప్పులు, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చటం, ట్రూ అప్, ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్‌లోనూ పెద్ద ఎత్తున పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటిరోలోజీ ఇచ్చిన నివేదికను మంత్రి స్వాగతించారు. -
దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రామగుండం (ఎన్టీపీసీ)లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సౌర విద్యుత్ ప్లాంట్ శుక్రవారం నుంచి పూర్తి సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 80 మెగావాట్ల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తాజాగా మిగిలిన 20 మెగావాట్ల పనులను కూడా పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించారు. ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే జలాశయం (500 ఎకరాల విస్తీర్ణం)పై రూ.423 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సాధారణంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా భూమి అవసరం అవుతుంది. ఫ్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద మొత్తంలో భూసేకరణ ఖర్చు తగ్గుతుంది. అలలపై తేలియాడుతూ.. ఫ్లోటింగ్ ప్లాంట్ అంటే.. ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ (సౌర ఫలకాలు) మాత్రమే కాదు.. ఇన్వర్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, హెచ్‌టీ బ్రేకర్లు, స్కాడా వంటి పరికరాలతో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ అంతా నీటిపైనే తేలియాడుతూ ఉంటుంది. హైడెన్సిటీ పాలిథిలీన్ మెటీరియల్‌తో తయారైన ఫ్లోటర్స్‌పై సోలార్ ప్యానెల్స్‌ను బిగించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 40 బ్లాకులుగా (తేలియాడే వేదికలు) విభజించి దీన్ని నిర్మించారు. ప్రతి తేలియాడే వేదిక (ఫెర్రో సిమెంట్ ఫ్లోటింగ్ ప్లాట్ఫార్మ్)పై 11,200 సోలార్ ప్యానెల్స్‌తో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్‌టీ బ్రేకర్ ఉంటాయి. మొత్తం వ్యవస్థ నీటిపై తేలియాడుతూ ఒకేచోట ఉండేలా రిజర్వాయర్ అడుగున ఉన్న కాంక్రీట్ బ్లాకులకు లంగరు వేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దగ్గర్లోని స్విచ్‌యార్డ్‌కు సరఫరా చేస్తారు. ప్రయోజనాలెన్నో.. ►భారీ భూసేకరణ ఖర్చు తగ్గడంతో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అన్ని రకాలుగా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంటుంది. ►జలాశయంపై సౌర విద్యుత్ వ్యవస్థకు సంబం ధిం చిన బ్లాకులు తేలియాడుతూ ఉండడంతో జలాశ యంలో నీటి ఆవిరి నష్టాలు తగ్గుతాయి. అంటే ఇది జల సంరక్షణకు దోహదపడుతుందన్న మాట. ఏటా 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరి నష్టాలను నివారించవచ్చని ఎన్టీపీసీ అంచనా వేసింది. ►సోలార్ ప్యానెల్స్ కింద నీళ్లు ఉండడంతో వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. దీంతో వాటి పని సామర్థ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. ►థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుండడంతో ఏటా 1.65 లక్ష టన్నుల బొగ్గు వినియోగాన్ని, 2.1 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చు. దక్షిణాదిలో 217 మె.వా. ఫ్లోటింగ్ పవర్ రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో దక్షిణాదిలో తమ ఫ్లోటింగ్ ప్లాంట్ల సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగిందని ఎన్టీపీసీ ప్రాంతీయ సంచాలకులు (దక్షిణ) నరేష్ ఆనంద్ వెల్లడించారు. కాయంకులం (కేరళ)లో 92 మెగావాట్లు, సింహాద్రి (ఏపీ)లో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. -
విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతీరోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. తమ గనుల నుంచి లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షా 90 వేల టన్నుల బొ గ్గు రవాణా చేస్తున్నామని, నవంబర్ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రబొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డెరైక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. -
వెంటాడుతున్న బొగ్గు భయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం వెంటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ సహా దాదాపు 14 రాష్ట్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విద్యుత్ సంక్షోభంపై సోమవారం సమావేశం నిర్వహించగా ప్రధాని మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. బొగ్గు సంక్షోభంపై తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతూ సీఎం వైఎస్ జగన్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు మిగులు విద్యుదుత్పత్తి కలిగిన రాష్ట్రాలు కొరత ఉన్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంగళవారం పలు రాష్ట్రాలకు లేఖలు రాసింది. సంక్షోభాన్ని పట్టించుకోకుండా మిగులు కరెంట్‌ను పవర్ ఎక్స్చేంజ్ల్లో విక్రయిస్తే ఆ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఎవరికీ కేటాయించకుండా ఉన్న 15 శాతం కోటా నుంచి విద్యుత్‌ను వాడుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దేశమంతా కటకట.. దేశవ్యాప్తంగా 1,65,066 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకి 18,70,400 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుతం ఉన్న 73,16,600 మెట్రిక్ టన్నుల బొగ్గు సగటున నాలుగు రోజులకు సరిపోతుంది. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం మంగళవారం నాటికి 116 థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. వీటిలో 15 కేంద్రాల్లో బొగ్గు అసలు లేదు. 27 కేంద్రాలలో ఒక్క రోజుకు మాత్రమే సరిపడా ఉంది. 20 కేంద్రాల్లో రెండు రోజులకు, 21 కేంద్రాల్లో మూడు రోజులకు, మరో 20 కేంద్రాల్లో నాలుగు రోజులకు, ఐదు కేంద్రాల్లో ఎనిమిది రోజులకు, 8 కేంద్రాల్లో ఆరు రోజులకు మించి బొగ్గు చాలదు. దీంతో దేశవ్యాప్తంగా 1,42,054 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో ప్రస్తుతం నాలుగు రోజులకు సరిపడా 48,600 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 26,900 మెట్రిక్ టన్నులు ఉండగా ఇది ఒక్క రోజుకే సరిపోతుంది. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో 69,700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నందున నాలుగు రోజులు విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. సింహాద్రిలో 13,900 మెట్రిక్ టన్నుల బొగ్గు ఒక్క రోజుకే సరిపోనుంది. వీటన్నిటి ఉత్పత్తి సామర్థ్యం 9,370 మెగావాట్లు కాగా ప్రస్తుతం బొగ్గు కొరతతో సగం కూడా విద్యుదుత్పత్తి జరగడం లేదు. -
11 ‘విద్యుత్’ ఒప్పందాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల మధ్య జరిగిన 11 పాత, కొత్త విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సుమోటోగా ఆమోదించింది. జెన్కో కొత్తగా నిర్మించిన/నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల కేటీపీఎస్–7వ దశ, 600 మెగావాట్ల కేటీపీపీ–2, 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో సంస్థకు చెందిన ఇతర పాత విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ ఆవిర్భావం తర్వాత డిస్కంలు పీపీఏలను కుదుర్చుకున్నాయి. విద్యుత్ చట్టం–2003 నిబంధనల ప్రకారం ఈ పీపీఏలను ఈఆర్సీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీపీఏలపై బహిరంగ విచారణ నిర్వహించి వివిధ వర్గాల నుంచి సలహాలను ఈఆర్సీ స్వీకరించింది. అనంతరం పలు మార్పులతో పీపీఏలను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గడువు తీరిన పీపీఏల స్థానంలో కొత్త ఒప్పందాలు 1956 నుంచి 1998 మధ్య పాత థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లకు జరిగిన పీపీఏల వ్యవధి 2019లో ముగిసింది. దీంతో 400 మెగావాట్ల కేటీపీఎస్ ఏబీసీ, 500 మెగావాట్ల కేటీపీఎస్–5వ దశ, 62.5 మెగావాట్ల రామగుండం థర్మల్ స్టేషన్–బీ, 875.6 మెగావాట్ల నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం, 900 మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం, 54 మెగావాట్ల సింగూరు/పోచంపాడు/పాలేరు/నిజాంసాగర్ జలవిద్యుత్ కేంద్రాలు, 9.16 మెగావాట్ల పెద్దపల్లి జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కంలు జెన్కోతో కొత్త పీపీఏలు చేసుకున్నాయి. ఈ పీపీఏలను సైతం ఈఆర్సీ తాజాగా ఆమోదించింది. యాదాద్రి, భద్రాద్రి వ్యయంపై అభ్యంతరాలు నిర్మాణంలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం భారీగా పెరిగిపోతోంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణవ్యయం రూ. 30 వేల కోట్లకు పెరగనుందని జెన్కో అంచనా వేసింది. 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం సైతం రూ. 8,536 కోట్లకు పెరగనుందని ఈఆర్సీకి తెలిపింది. 800 మెగావాట్ల కేటీపీఎస్– 7వ దశ నిర్మాణానికి రూ. 5,548.44 కోట్లు, 600 మెగావాట్ల కేటీపీపీ–2కు రూ. 4,334 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణ వ్యయం అసాధారణంగా పెరగడంపట్ల వాటి పీపీఏలపై ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్‌రంగ నిపుణులు వేణుగోపాల్‌రావు, తిమ్మారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించిన పరిమితికి మించి ఖర్చు చేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం భూసేకరణ, పునరావాసం కోసం రూ. 845 కోట్లు, ప్రాజెక్టు ప్రదేశానికి యంత్ర పరికరాలను తరలించడం, అమర్చడం వంటి పనుల కోసం రూ. 1,617 కోట్లు, సివిల్ వర్క్స్ కోసం రూ. 5,057 కోట్లు, కంటిజెన్సి కింద రూ. 201 కోట్లను జెన్కో అనవసరంగా ఖర్చు చేసిందని, ఈ వ్యయాలను అనుమతించరాదని ఈఆర్సీని కోరారు. నిబంధనల మేరకే ఖర్చులు చేసినట్లు జెన్కో సమర్థించుకోగా విద్యుత్ కేంద్రాల నిర్మా ణం పూర్తయ్యాక రానున్న వాస్తవ వ్యయంపై నిర్ణయం తీసుకుంటామని ఈఆర్సీ పేర్కొంది. -
నైవేలీ విద్యుత్ ప్లాంట్‌లో పేలిన బాయిలర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో నైవేలీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 10మంది కార్మికులు గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలీ థర్మల్ ప్లాంట్ రెండో యూనిట్లో గురువారం సాయంత్రం ఒక బాయిలర్ అకస్మాత్తుగా పేలి, మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద స్థలి నుంచి గాయపడిన పది మందిని బయటకు తీసుకురాగా తీవ్రంగా గాయపడిన ఏడుగురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. లాక్డౌన్ కారణంగా కొన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపుతో తిరిగి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో ఉండగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేశారు. -
పవర్ ‘ఫుల్’
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లో నిర్వహిస్తున్న 1,200 (2 గీ600) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వి ద్యుత్ కేంద్రానికి సంబంధించిన 600 మెగావాట్ల రెండు యూనిట్లు గత ఫిబ్రవరిలో 100.18 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) సాధించాయి. విద్యుత్ కేంద్రం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంతో పోల్చితే ఓ నిర్దిష్ట కాలంలో జరిగిన వాస్తవ విద్యుదుత్పత్తిని సాంకేతిక పరిభాషలో పీఎల్ఎఫ్ అంటారు. ఫిబ్రవరిలో సింగరేణి విద్యుత్ కేంద్రం 836.70 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, అందులో ప్లాంట్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ పోను మిగిలిన 791.79 మిలియన్ యూ నిట్ల విద్యుత్‌ను గ్రిడ్ ద్వారా రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ప్లాంట్ ఇప్పటివరకూ 8,398 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా 7,895 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి సరఫరా చేసింది. కాగా, ఈ ఘనతపై సంస్థ సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఐదో స్థానం: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం గత రెండేళ్లలో మూడుసార్లు 100 శా తం పీఎల్ఎఫ్ సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2017–18లో జాతీయ స్థాయిలో అత్యధిక పీఎల్ఎఫ్ కలిగిన అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఐదో స్థానాన్ని సాధించింది. విడివిడిగా 15 సార్లు..: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని చెరో 600 మెగావాట్ల రెండు యూనిట్లు విడివిడిగా 15 సార్లు 100 శాతం పీఎల్ఎఫ్ సాధించాయి. 2వ యూనిట్ 9 సార్లు సాధించి అగ్రస్థానంలో ఉంది. 2017లో ఫిబ్రవరి, మే, నవంబర్, 2018లో జూలై, సెప్టెంబర్ అక్టోబర్, 2019లో జనవరి, ఫిబ్రవరి, 2020లో ఫిబ్రవరిలో రెండో యూనిట్ 100 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. -
వెలుగుల స్మృతి.. మసకబారింది
భాగ్యనగరంలో దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే ముందే విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అప్పట్లోనే ఇక్కడ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటైంది. 110 సంవత్సరాల క్రితమే సిటీలో విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సాక్షి సిటీబ్యూరో: డీజిల్ జనరేటర్లతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరఫరా నాటి నగర అవసరాలకు సరిపోని పరిస్థితి. దాంతో కొందరు పరిపాలనాధికారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పాలని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సూచించారు. దీంతో 1920లో హైదరాబాద్ పవర్ హౌస్ ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. అందులో నాలుగు యూనిట్లు నిరంతరం పనిచేసేవి. ఆ కట్టడంలో మొగలాయిల శైలి దర్శనమిచ్చేది. ‘హైదరాబాద్ పవర్ హౌస్ భవనం తాజ్‌మహల్ నిర్మాణమంత అందంగా ఉండేది’ అని ప్రముఖ చరిత్రకారులు అల్లమా ఏజాజ్ ఫారుఖీ తెలిపారు. అమెరికా నుంచి మిషనరీ.. మిషనరీని అమెరికా, యూరప్ దేశాల నుంచి తెప్పించారు. 22.5 మెగా ఓల్ట్‌ల సామర్థ్యం గల ప్లాంటులో రోజుకు 200 టన్నుల బొగ్గు వాడేవారు. తద్వారా జంట నగరాలతోపాటు ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని 18జిల్లాలకు విద్యుత్ సరఫరా అయ్యేది. గోదావరిఖని నుంచి బొగ్గును తరలించేందుకు ప్రత్యేక రైలు మార్గాన్ని కూడా నిర్మించారు. నాటి రైలు పట్టాల ఆనవాళ్లు ఖైరతాబాద్ గణపతి భవనం వెనుక భాగంలోని గల్లీలో నేటికీ దర్శనమిస్తాయి. జాడలేవి..! హైదరాబాద్ పవర్ హౌస్‌ను హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్‌గా పిలిచేవారు. తెలంగాణ చరిత్రలో ఘనమైన పాత్ర వహించిన ఆ కేంద్రం తాలూకూ జాడలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించవు. 1972లో రెండు ఉత్పత్తి యూనిట్లు మూతబడ్డాయి. మిగతా రెండు యూనిట్లూ నిరంతరాయంగా పనిచేసేవి. అనంతరం హైదరాబాద్ పవర్ హౌస్ 1992 నాటికి పూర్తిగా బంద్ అయింది. పవర్ హౌస్ ఓ జ్ఞాపకం.. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతేనేం.. ఆ ఆవరణలోని కట్టడాలను పరిరక్షించాలని కొందరు చరిత్ర అధ్యయనకారులు ప్రభుత్వానికి విన్నవించారు. వారసత్వ కట్టడమైన ఆ అందమైన భవన సముదాయాలను మ్యూజియంగా మార్చాలని సూచించినా పట్టించుకోలేదు. 1995లో పవర్ హౌస్ నిర్మాణాలను కూల్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, ప్రసాద్ ఐమ్యాక్స్ నిర్మాణాలున్న ప్రదేశంలోనే హైదరాబాద్ పవర్ హౌస్ ఉండేది. అంతర్జాతీయ ఖ్యాతి.. హైదరాబాద్ థర్మల్ విద్యుత్ కేంద్రంపై 1939లో ప్రఖ్యాత టైం మ్యాగజైన్ ప్రత్యేక కవర్‌పేజీ కథనాన్ని ప్రచురించింది. నిజాం రాజ్యంలో ఆధునిక, పారిశ్రామికాభివృద్థికి ప్రతీక హైదరాబాద్ పవర్ హౌస్ నిర్మాణమని ప్రశంసింది. దానిపై ప్రత్యేకంగా ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేయడాన్ని కూడా ప్రస్తావించింది. అలా అప్పుడే అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1930 నాటికి దేశంలోనే విద్యుద్ధీకరణ చెందిన నగరాల్లో హైదరాబాద్ ముందువరుసలో ఉందని ఆర్కాయిస్ రిటైర్డ్ సూపరిటెండెంట్ అబ్దుల్ నయీమ్ చెబుతున్నారు. 1924–25 మధ్య కాలానికి భాగ్యనగరం కేంద్రంగా 121 పరిశ్రమలు వెలిశాయి. కర్ణాటక స్ఫూర్తి.. దేశంలో చారిత్రక నేపథ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కర్ణాటకలోని శివనసమద్ర హైడ్రో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రత్యేకమైంది. 700కిలో ఓల్ట్‌ల సామర్థ్యం గత ఆ విద్యుత్తు ప్రాజెక్టును 1902లో మైసూరు మహారాజు నిర్మించారు. అది ప్రారంభమైన రెండేళ్లలోనే బెంగుళూరు నగరానికి విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కేంద్రాన్ని అక్కడి చరిత్రకారులు కాపాడుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ చారిత్రక ప్రాజెక్టుకు హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. అదే మన దగ్గర మాత్రం హైదరాబాద్ పవర్ హౌస్ ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. -
‘కొత్త’ వెలుగులు
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) సుదీర్ఘ ప్రస్థానంలో 7వ దశ మరో సరికొత్త మైలురాయి కానుంది. ఈ ప్లాంట్ ద్వారా మరో 800 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి వెలుగులు పంచనుంది. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం రాత్రి 7వ దశ ప్లాంట్ సీఓడీ (కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్) చేసి జాతికి అంకితం చేశారు. జూన్ 30న ఈ ప్లాంట్‌కు సంబంధించి సింక్రనైజేషన్ (మొదటిసారి విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేయడం) ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వివిధ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విద్యుదుత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. అనంతరం ఎన్నికలు రావడంతో సీఓడీ ప్రక్రియ ఆలస్యమైంది. 1966 జూలై 4 నుంచి వివిధ దశల్లో విస్తరిస్తూ వస్తున్న కేటీపీఎస్ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు ఇక్కడున్న 6 దశల ప్లాంట్ల ద్వారా (60 మెగావాట్ల సామర్థ్యం గల 3వ యూనిట్ మూతపడిన తర్వాత) 1,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 7వ దశ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర గ్రిడ్‌కు రోజూ 2,460 మెగావాట్ల విద్యుత్ సరఫరా కానుంది. అనేక అవాంతరాలను అధిగమిస్తూ.. 2015 జనవరిలో 7వ దశ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది అనేక అవాంతరాలను అధిగమిస్తూ తుది దశకు చేరుకుంది. 2017 సెప్టెంబర్ 27న హైడ్రాలిక్ టెస్ట్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్లో ట్రాక్ ఆర్డర్ వద్ద టీపీ–3 ట్రాన్స్ఫార్మర్ కుప్పకూలింది. ఆ తర్వాత సాంకేతిక లోపంతో స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇలాంటి పలు అవాంతరాలను అధిగమిస్తూ 7వ దశ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ పూర్తి చేసింది. 2017 డిసెంబర్ 31 నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణం ప్రారంభించారు. అయితే కొన్ని విభాగాల్లో పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాటు పలు అవాంతరాలతో కొంత ఆలస్యమైంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో.. కేటీపీఎస్‌లో ఇప్పటి వరకు ఉన్న 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లు సబ్ క్రిటికల్ టెక్నాలజీ పద్ధతిలో విద్యుదుత్పత్తి చేసేవే. ఈ నేపథ్యంలో 7వ దశ ప్లాంట్‌ను ఆధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. సబ్‌క్రిటికల్ టెక్నాలజీతో పోల్చుకుంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. 7వ దశలో భారీ నిర్మాణాలను బీహెచ్ఈఎల్ సంస్థ అనుకున్న సమయానికన్నా తక్కువ సమయంలోనే పూర్తి చేసింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాయిలర్‌ను నిర్మించేందుకు 42 నెలలు నిర్దేశించుకోగా, 24 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇక కూలింగ్ టవర్ నిర్మాణ పనులు ఏడాదిన్నర ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. దీంతో మిగిలిన నిర్మాణాలన్నీ ఆలస్యం అవుతాయని జెన్కో అధికారులు ఆందోళన చెందారు. 2016 జూలైలో ప్రారంభమైన కూలింగ్ టవర్ నిర్మాణం 2017 డిసెంబర్ నాటికి (18నెలల్లో) పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించినట్లు జెన్కో అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 275 మీటర్ల ఎత్తు గల చిమ్నీ(షెల్) నిర్మాణం పనులు 20 నెలల్లో విజయవంతంగా పూర్తి చేశారు. -
కొత్తగూడెంలో మరో విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు కానుంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల (ఎంవీ) సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నిర్ణయించింది. అధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్న కాలం చెల్లిన పాత విద్యుత్ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర విద్యుత్ శాఖ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్)లోని 720 మెగావాట్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఏబీసీ) ప్లాంట్‌ను ఈ ఏడాది చివరిలోగా మూసివేస్తామని జెన్కో హామీ ఇచ్చింది. సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారంగా నాలుగు 60 మెగావాట్ల యూనిట్లు, మరో నాలుగు 120 మెగావాట్ల యూనిట్లు కలిపి 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల కిందట దశల వారీగా జెన్కో నిర్మించింది. ఈ విద్యుత్ కేంద్రాల జీవిత కాలం ముగిసిపోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఈ ప్లాంట్లు బొగ్గును అధికంగా వినియోగించుకుని తక్కువ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మెగావాట్ల కేటీపీఎస్ 7వ దశ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి కానున్న నేపథ్యంలో కాలం చెల్లిన ఏబీసీ విద్యుత్ ప్లాంట్లను మూసివేసేందుకు జెన్కో సిద్ధమైంది. మరికొన్ని నెలల్లో ఏడో దశ విద్యుత్ ప్లాంట్ పనులు పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్ ప్లాంట్‌లోని ఎనిమిది యూనిట్లను మూసివేసి వాటి స్థానంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సహాయంతో కొత్తగా 800 మెగావాట్ల ఒకే యూనిట్ నిర్మించాలని జెన్కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో ఏడో దశ ప్లాంట్‌లో ఉత్పత్తి కేటీపీఎస్ 800 మెగావాట్ల ఏడో దశ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గత నెల చివరికి వి ద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్కో గడువు పెట్టుకు న్నా ఇంకా పూర్తి కాలేదు. జూన్ చివరికల్లా ఈ ప్లాంట్ సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి కానుందని, సెప్టెంబర్ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయని జెన్కో ప్రాజెక్ట్స్ అధికారులు తెలిపారు. కూల్చివేతకు ఏడాదిన్నర.. కొత్తగూడెం ఏబీసీ విద్యుత్ కేంద్రం మూసివేసి అదే స్థలంలో కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత జెన్కో చర్యలు ప్రారంభించనుంది. పాత విద్యుత్ ప్లాంట్‌లోని ఎనిమిది యూనిట్లను కూల్చివేసేందుకు దాదాపు ఏడాదిన్నర వరకు సమయం పట్టనుందని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు పాత విద్యుత్ కేంద్రాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త కేంద్రాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు సులువుగా, సత్వరంగా లభించనున్నాయి. మూసివేయనున్న విద్యుత్ ప్లాంట్‌కు సంబంధించిన స్థలం, నీటి వనరులు, బొగ్గు లింకేజీలనే కొత్త విద్యుత్ కేంద్రం అవసరాలకు వినియోగించనుండటంతో అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి కానుంది. -
‘కృష్ణపట్నం’ పనుల్లో అక్రమాలు ఇవిగో..
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘‘నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) పనుల్లో అనేక అక్రమాలు జరిగాయి. టెండర్లు పిలవకుండా పనులను బిట్లుబిట్లుగా విభజించి అడ్డగోలుగా నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ వారికి కట్టబెట్టారు. దీనివల్ల భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. దీనిపై హౌస్‌కమిటీ వేస్తే అక్రమాలను నిరూపిస్తా’’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ పనులను నామినేషన్ పద్ధతిపై ఇవ్వవచ్చా? అని గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. టెండర్ల ద్వారానే పనులు ఇచ్చామని, ఒక్క పని కూడా నామినేషన్‌పై ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమివ్వడాన్ని గోవర్ధన్‌రెడ్డి తప్పుబట్టారు. ‘‘ఆర్టీఐ కింద దరఖాస్తు చేస్తే మీ అధికారులే సమాచారం ఇచ్చారు. నామినేషన్ పద్ధతిపైనే పనులు ఇచ్చినట్లు ఇవిగో పక్కా ఆధారాలు (పత్రాలు చూపిస్తూ). మీరు నామినేషన్‌పై పనులు ఇవ్వలేదంటున్నారు. మీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా? ఈ సభ ద్వారా ప్రజలను మంత్రి తప్పుదోవ పట్టించవద్దు. హౌస్ కమిటీ వేయండి లేదా విచారణ జరిపించండి. అక్రమాలు నిరూపిస్తాం. సభకు ఆధారాలతో రావాలని గతంలో సీఎం అన్నారు. అందుకే ఆధారాలు సమర్పిస్తున్నాం.విచారించి చర్యలు తీసుకోండి’’ అని గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఆధారాలిస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మొత్తం ఆధారాలు స్పీకరుకు సమర్పిస్తున్నానని గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. -
మార్పు తప్పదు!
బీటీపీఎస్ నిర్మాణంపై నీలినీడలుముందుచూపు లేని టీఎస్ జెన్కోకేంద్రం సీరియస్ కావడంతోపునరాలోచన పనులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్ల గగ్గోలు మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎస్) నిర్మాణంపై అస్పష్టత నెలకొంది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులోని సాంబాయిగూడెం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సీతారాంపురం గ్రామాల వద్ద నిర్మించే ప్లాంటు, ఉత్పత్తికి సంబంధించి కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడమే కాక కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు ల శాఖ నుంచి ఎలాంటి పర్యావరణ అనుమతులు రాకుండానే హడావుడిగా బీహెచ్ఈఎల్ ద్వారా టీఎస్ జెన్కో నిర్మాణ పనులు మొదలుపెట్టి.. శరవేగంగా చేయిస్తుండడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గత ఏడాది సెప్టెంబర్ నుంచే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ఒక్కొక్కటి 270 యూనిట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్ల ద్వారా 1,080 మొగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో సుమారు 1100 ఎకరాల్లో ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి భూనిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో ప్యాకేజీలు చెల్లించకపోవడంతోపాటు ఉద్యోగాలు కోరుకున్న 371 మంది యువతకుఇప్పటికీ ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు మాత్రం శరవేగంగా జరిగాయి. 2016 డిసెంబర్ కల్లా మొదటి యూనిట్ నుంచి 270 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో యూనిట్ పనులతోపాటు స్విచ్‌యార్డ్, బాయిలర్, చిమ్నీ పనులు సైతం పునాది దశను దాటాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు మానవ హక్కుల వేదిక ద్వారా నేషనల్ ట్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పర్యావరణ అనుమతులు లేనందున భద్రాద్రి పనులు నిలిపేయాలని జెన్కోను ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలపై స్టే కోరుతూ టీఎస్ జెన్కో హైకోర్టును ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు లేనందున పనులెలా చేస్తారని హైకోర్టు సైతం జెన్కోను ప్రశ్నించింది. ఇందులో హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి వచ్చిన డిప్యూటీ డెరైక్టర్ కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ పనులను తనిఖీ చేసుకుని వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ సీరియస్‌గా పరిగణించడంతోపాటు హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ సైతం పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్న పనులపై ప్రశ్నించింది. దీంతో 20 రోజుల కిందట ప్లాంట్ పనులు పూర్తిగా నిలిపేశారు. తిరిగి పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయమై ఇప్పటివరకు స్పష్టత లేకుండా పోయింది. ఏ అధికారి సైతం ఈ విషయమై స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు సబ్ కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోగా, యంత్రాలు ఆపివేయడంతో అవి దెబ్బతింటాయని ఆందోళనకు గురవుతున్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవలంబిస్తేనే అనుమతులు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, విద్యుత్ శాఖల నిబంధనల ప్రకారం 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంకన్నా ఎక్కువగా ఉంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మిస్తున్నందున కాలుష్యం తక్కువగా వెదజల్లే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా కాలంచెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడుతుండడంతో కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయినప్పటికీ పనులు చేపట్టడంతో పరిస్థితి గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు వరకు వెళ్లింది. ప్రస్తుతం బంతి హైకోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మారడంతోపాటు దీనికి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ మారిస్తేనే పర్యావరణ అనుమతులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పటివరకు యుద్ధప్రాతిపదికన పనులు చేయడంతో జెన్కోపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీంతో టీఎస్ జెన్కో పునరాలోచనలో పడింది. మరోవైపు కాలం చెల్లిన మెటీరియల్ వదిలించుకునేందుకు బీహెచ్ఈఎల్ పనికిరాని పరికరాలను టీఎస్ జెన్కోకు అంటగట్టేందుకు ప్రయత్నించిందనే అనుమానాలను పలువురు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ టెక్నాలజీ, పరికరాలు మారిస్తేనే బీటీపీఎస్‌కు పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉంది.