కొత్తగూడెంలో మరో విద్యుత్‌ కేంద్రం | Another power center in the Kottagudem | Sakshi
Sakshi News home page

కొత్తగూడెంలో మరో విద్యుత్‌ కేంద్రం

Published Fri, May 4 2018 1:09 AM | Last Updated on Fri, May 4 2018 1:09 AM

Another power center in the Kottagudem - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానుంది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల (ఎంవీ) సామర్థ్యంతో సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్ణయించింది. అధిక కాలుష్యాన్ని విడుదల చేస్తున్న కాలం చెల్లిన పాత విద్యుత్‌ కేంద్రాలను మూసివేయాలని కేంద్ర విద్యుత్‌ శాఖ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కేటీపీఎస్‌)లోని 720 మెగావాట్ల ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఏబీసీ) ప్లాంట్‌ను ఈ ఏడాది చివరిలోగా మూసివేస్తామని జెన్‌కో హామీ ఇచ్చింది. సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఆధారంగా నాలుగు 60 మెగావాట్ల యూనిట్లు, మరో నాలుగు 120 మెగావాట్ల యూనిట్లు కలిపి 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్‌ కేంద్రాన్ని నాలుగు దశాబ్దాల కిందట దశల వారీగా జెన్‌కో నిర్మించింది.

ఈ విద్యుత్‌ కేంద్రాల జీవిత కాలం ముగిసిపోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఈ ప్లాంట్లు బొగ్గును అధికంగా వినియోగించుకుని తక్కువ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 800 మెగావాట్ల కేటీపీఎస్‌ 7వ దశ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం ఈ ఏడాది చివరిలోగా పూర్తి కానున్న నేపథ్యంలో కాలం చెల్లిన ఏబీసీ విద్యుత్‌ ప్లాంట్లను మూసివేసేందుకు జెన్‌కో సిద్ధమైంది. మరికొన్ని నెలల్లో ఏడో దశ విద్యుత్‌ ప్లాంట్‌ పనులు పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభం కానుంది. దీంతో 720 మెగావాట్ల ఏబీసీ విద్యుత్‌ ప్లాంట్‌లోని ఎనిమిది యూనిట్లను మూసివేసి వాటి స్థానంలో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ సహాయంతో కొత్తగా 800 మెగావాట్ల ఒకే యూనిట్‌ నిర్మించాలని జెన్‌కో యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 

సెప్టెంబర్‌లో ఏడో దశ ప్లాంట్‌లో ఉత్పత్తి 
కేటీపీఎస్‌ 800 మెగావాట్ల ఏడో దశ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి గత నెల చివరికి వి ద్యుదుత్పత్తి ప్రారంభించాలని జెన్‌కో గడువు పెట్టుకు న్నా ఇంకా పూర్తి కాలేదు. జూన్‌ చివరికల్లా ఈ ప్లాంట్‌ సింక్రనైజేషన్‌ ప్రక్రియ పూర్తి కానుందని, సెప్టెంబర్‌ నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయని జెన్‌కో ప్రాజెక్ట్స్‌ అధికారులు తెలిపారు.

కూల్చివేతకు ఏడాదిన్నర..
కొత్తగూడెం ఏబీసీ విద్యుత్‌ కేంద్రం మూసివేసి అదే స్థలంలో కొత్త విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత జెన్‌కో చర్యలు ప్రారంభించనుంది. పాత విద్యుత్‌ ప్లాంట్‌లోని ఎనిమిది యూనిట్లను కూల్చివేసేందుకు దాదాపు ఏడాదిన్నర వరకు సమయం పట్టనుందని జెన్‌కో అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు పాత విద్యుత్‌ కేంద్రాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త కేంద్రాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు సులువుగా, సత్వరంగా లభించనున్నాయి. మూసివేయనున్న విద్యుత్‌ ప్లాంట్‌కు సంబంధించిన స్థలం, నీటి వనరులు, బొగ్గు లింకేజీలనే కొత్త విద్యుత్‌ కేంద్రం అవసరాలకు వినియోగించనుండటంతో అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement