నష్టాల నుంచి డిస్కంలు గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ చర్యలతో ముందుకెళ్లాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: భారీ నష్టాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నా య చర్యలతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లోనూ సౌర విద్యుత్ ప్లాంట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాజస్తాన్‌లో భారీ ఎత్తున సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పా టు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన భూకేటాయింపుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.
అదే సమయంలో పీక్ అవర్స్‌లో రాష్ట్రం నుంచి దాదాపు 1,200 మెగావాట్ల థర్మల్ పవర్‌ను రాజస్తాన్‌కు విక్రయించే అంశంపైనా ఒప్పందం చేసుకోనుంది. మరోవైపు ఇటీవలే సింగరేణికి ఒడిశాలోని నైనిలో కేటాయించిన బొగ్గు బ్లాక్ పక్కనే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంతో స్థలం కోసం చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి.
అక్కడ ఏర్పాటు చేసే పిట్‌హెడ్ స్టేషన్ నుంచి ‘నాల్కో’కు 1,350 మెగావాట్ల విద్యుత్‌ను విక్రయించేందుకు సింగరేణి సంసిద్ధత వ్యక్తం చేసింది. అందుకోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకోవడానికి ‘నాల్కో’ముందుకొచ్చింది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుదుత్పాదన రంగంలోకి దిగిన సింగరేణి మరిన్ని పవర్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.
రాజస్తాన్‌లో..
రాజస్తాన్ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘సాక్షి’కి చెప్పారు. ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అధ్యయనం జరుగుతోందని.. సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమి ఇవ్వాలని ఆ ప్రభుత్వాన్ని కోరామన్నారు.
ఉదయం పూట సౌర విద్యుత్ వినియోగించుకుంటామని, పీక్ అవర్స్‌లో వారికి థర్మల్ విద్యుత్ అవసరం ఉన్నందున దాదాపు 1,200 మెగావాట్లు ఇవ్వడానికి కూడా తెలంగాణ జెన్‌కో సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు చెప్పారు. తక్కువ ధరకు బయట విద్యుత్ లభిస్తున్నప్పుడు థర్మల్ స్టేషన్లను బ్యాక్‌డౌన్ చేస్తున్నామని, పీక్‌టైమ్‌లో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తప్పనిసరి అని చెబుతున్నారు.
భారీగా సౌర విద్యుత్‌పైనే దృష్టి..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 4,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను రైతులకు, మహిళా సంఘాలకు కేటాయించి వాటి నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను పిలిచింది. ఇది కాకుండా రాష్ట్రంలో వివాదరహితంగా ఉన్న అన్ని దేవాలయ భూముల్లో సోలార్ పవర్ యూనిట్లు నెలకొల్పడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నీటిపారుదల శాఖకు సంబంధించి రిజర్వాయర్లు, కాలువల కో సం వేలాది ఎకరాలు సేకరించింది.
అందులో చాలా భూములు ఉపయోగించుకుండా ఖాళీగా ఉన్నాయి. అలా ఉన్న భూములన్నింటినీ అధికారులు సర్వే చేస్తున్నారని, వాటిల్లోనూ సోలార్ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. తద్వారా ఆయా భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతోపాటు ఆయా శాఖలకు ఆదాయం కూడా సమకూరుతుందన్నారు.
మధ్యతరహా నీటిపారుదల రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తి చేపట్టనున్నట్టు వివరించారు. ఇప్పటికే సింగరేణి ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్‌తో విద్యుత్ ఉత్పాదన చేస్తోందన్నారు.
సింగరేణిలోని ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో..
సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు తీసిన తర్వాత పెద్ద గుంతలుగా ఏర్పడిన వాటిలో భారీ వర్షాల కారణంగా అవి నీటితో నిండుతున్నాయి. అక్కడ పంప్డ్‌స్టోరేజీ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు.
మరోవైపు భాగ్యనగరంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురికాకుండా వాటికి పైకప్పు రూపంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. తద్వారా వీధిదీపాలకు అవసరమయ్యే విద్యుత్‌ను అందించడంతోపాటు పాదచారులకు నీడ కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రెండు మండలాల్లో పూర్తిగా సౌర విద్యుత్
ముఖ్యమంత్రి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లితోపాటు సీఎం నియోజకవర్గ(కొడంగల్) పరిధిలోని ఒక మండలం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం(మధిర)లోని బోనకల్ మండలంలో పూర్తిగా సౌరవిద్యుత్‌ను సరఫరా చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారు. ఈ రెండు మండలాలు పూర్తయిన తర్వాత మరిన్ని గ్రామాల్లో సౌర విద్యుత్ సరఫరా చేయడానికి సంకల్పించారు.
రాష్ట్రంలో పెద్దఎత్తున డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ఐటీ కంపెనీలు ముందుకొస్తున్న విషయం విదితమే. అయితే వీరు క్లీన్‌ఎనర్జీ కావాలని కోరుతున్నారని, తద్వారా వారికి కార్బన్ క్రెడిట్స్ రావడం వల్ల రాయితీలు లభిస్తాయని చెబుతున్నారు. అందుకే క్లీన్‌ఎనర్జీ వైపు దృష్టి సారించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment