త్వరలో మహిళా సంఘాలకు ‘సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ల స్థాపన బాధ్యత
64 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
మొత్తం రూ.192 కోట్ల పెట్టుబడి
ఒకటి, రెండు రోజుల్లో వర్క్ ఆర్డర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు.. సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లను ఒకటి, రెండురోజుల్లోనే అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. సచివాలయంలో మంగళవారం జరిగిన పీఆర్‌ఆర్డీ, ఆర్థిక శాఖ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు అనుగుణంగా.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహాయించి) 64 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బ్యాంకర్లతో చర్చలు పూర్తయి, ఒప్పందాలు, రుణాలు అందించే ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఒక్కొక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.3 కోట్ల వ్యయం కానుండగా.. దీనికి సంబంధించి ఇంకా బ్యాంకర్లతో ఒప్పందాలు, విధి విధానాలు పూర్తి కావలసి ఉంది. మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుదుత్పత్తిలో ఆలస్యం లేకుండా పీఆర్ ఆర్ డీ శాఖ చర్యలు చేపడుతోంది.
రుణాలు సమకూర్చనున్న ‘స్త్రీనిధి’
మొత్తంగా 64 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన రుణాలను స్త్రీనిధి సంస్థ సమకూర్చనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.192 కోట్ల పెట్టుబడి అవసరం కాగా, 10 శాతం అంటే రూ.30 కోట్లు.. విలేజ్ ఆర్గనైజేషన్లు అందించనున్నాయి.
స్త్రీనిధి ద్వారా మిగిలిన రూ.162 కోట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. మార్చి 8నాటికి బ్యాంకర్లతో రుణాలిప్పించి.. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు ప్రభుత్వవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment