ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటు
జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పిలిచిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకుగాను ఎస్‌హెచ్‌జీల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన రుణ సహాయం కోసం ఎస్‌హెచ్‌జీలను బ్యాంకులతో సమన్వయం చేయాలని కోరారు.
ఎస్‌హెచ్‌జీల ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గతేడాది సెప్టెంబర్‌లో ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ కార్యక్రమం పురోగతిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి బుధవారం ప్రజాభవన్‌లో జిల్లా కలెక్టర్లతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకి 4 ఎకరాలు చొప్పున ప్రతిజిల్లాలో కనీసం 150 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు.
ఇందుకుగాను దేవాదాయ, నీటిపారుదల శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి పారిశ్రామికవాడల ఏర్పాటుకు భూములు సేకరించాలని భట్టి ఆదేశించారు. వీటితో ఎస్‌హెచ్‌జీలు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకి 4–5 ఎకరాల భూమి సరిపోతుందన్నారు.
అటవీ భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్న గుట్టలతో పాటు నగరాల్లో భారీ భవంతులపై సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గిరిజనులకు భూమి ఎక్కువగా ఉన్నా ఆదాయం తక్కువగా ఉంటుందని, అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరీవాహకంలోని భూములపై దృష్టిపెడితే వారికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, లోకేశ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment