
రూ.13,360 కోట్లతో రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి అంచనాలు
డీపీఆర్‌ను ఆమోదించిన జెన్‌కో పాలక మండలి
దేశంలోనే అత్యధిక అంచనా వ్యయం అంటున్న అధికారవర్గాలు
సాక్షి, హైదరాబాద్: రామగుండంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) పాలక మండలి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి, జెన్‌కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా అధ్యక్షతన గురువారం విద్యుత్ సౌధలో సమావేశమైన జెన్‌కో పాలక మండలి.. ఈ మేరకు డీపీఆర్‌ను ఆమోదించింది. మెగావాట్‌కు రూ.16.7 కోట్ల చొప్పున 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించడానికి రూ.13,360 కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
రామగుండంలో జెన్‌కోకి చెందిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ స్టేషన్ కాలం చెల్లడంతో గతేడాది మూసేశారు. దీని స్థానంలోనే కొత్తగా 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని సింగరేణి, జెన్‌కో ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మిస్తామని గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించగా, పూర్తిగా జెన్‌కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తామని ఇటీవల భట్టి హామీ ఇచి్చనట్టు అధికారులు తెలిపారు.
యాదాద్రి, భద్రాద్రి కంటే ఎక్కువే..
రామగుండం విద్యుత్ కేంద్రం నిర్మాణానికి మెగావాట్‌కు రూ.16.7 కోట్లతో రూపొందించిన అంచనాలు దేశంలోనే ఇప్పటి వరకు అత్యధికమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాసనసభలో విద్యుత్‌పై పెట్టిన శ్వేతపత్రం ప్రకారం.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెగావాట్‌కు వ్యయం రూ.6.27 కోట్ల చొప్పున 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.25,009 కోట్లతో అంచనాలను సిద్ధం చేయగా, నిర్మాణ దశలో ఖర్చు మెగావాట్‌కి రూ.8.64 కోట్లకు పెరిగి మొత్తం వ్యయం రూ.34,543 కోట్లకు ఎగబాకింది.
ఇక మెగావాట్‌కి రూ.6.75 కోట్లు చొప్పున 1080 మెగావాట్ల భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డీపీఆర్‌ను సిద్ధం చేయగా, నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం మెగావాట్‌కి రూ.9.74 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రామగుండంలో నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం పూర్తయ్యే సరికి మెగావాట్‌కి రూ.20 కోట్లకు మించిపోవచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
దీని అంచనా వ్యయం ప్రాథమిక దశలోనే అసాధారణంగా ఉండడంతో నిర్మాణం పూర్తయ్యే సరికి మరింతగా పెరిగి ప్రజలపై భారం పడే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనిట్ విద్యుత్ ధర రూ.10కి మించితుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment