కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం
హెచ్‌ఆర్ కమర్షియల్ సంస్థ, ఎక్సిక్యూడ్ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు
నిమిషాల వ్యవధిలోనే నేలమట్టం కానున్న 8 టవర్లు
పాల్వంచ: పాల్వంచలోని కాలం చెల్లిన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పాత ప్లాంట్(ఒఅండ్‌ఎం)లోని కూలింగ్ టవర్లు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక్కోటి చొప్పున మొత్తం 8 టవర్లు కూల్చివేయనున్నారు. పాత ప్లాంట్ తొలగింపు కాంట్రాక్ట్ దక్కించుకున్న హెచ్‌ఆర్ కమర్షియల్ సంస్థ.. టవర్ల కూల్చివేతను రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎక్సిక్యూడ్ కంపెనీకి అప్పగించింది. కంపెనీ డైరెక్టర్ ఆనంద్ శర్మ సారథ్యంలో ఇంప్లోషన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలేలా పేలుడు పదార్థాలను ఏర్పాటు చేశారు.
సోమవారం తెల్లవారుజామున ట్రాన్స్‌కో శాఖ నుంచి విద్యుత్ లైన్ల క్లియరెన్స్ రాగానే కూల్చివేతకు సిగ్నల్ ఇవ్వనున్నారు. ఆ వెంటనే నిమిషాల వ్యవధిలో ఎక్స్‌ప్లోజివ్స్ పేలి టవర్లు నేలమట్టం కానుండగా, ముందుగా ‘ఎ’స్టేషన్‌లోని నాలుగు టవర్లు, తర్వాత ‘బీ’స్టేషన్‌లోని రెండు, ‘సీ’స్టేషన్‌లలోని మరో రెండు టవర్లు కూల్చివేయనున్నారు. టవర్ల శకలాలు దూరంగా పడకుండా అక్కడే కుప్పకూలేలా పిల్లర్ల చుట్టూ ఐరన్ మెస్‌లను ఏర్పాటు చేసి, క్లాత్‌తో సీల్ చేశారు. దీంతో కూలే సమయంలో ఎక్కడా ప్రమాదాలు వాటిల్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కర్మాగారంలోని మిగతా విభాగాలను తుక్కుగా మార్చి తరలించడంతో చివరికి ఈ టవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదా?
జూలై 31వ తేదినే కూలింగ్ టవర్లను నేలమట్టం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పనులు చేసేందుకు అధికారులు సాహసించలేదని తెలుస్తోంది. అనుకోని ప్రమాదాలు జరిగితే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందని కూల్చివేతను నిలిపివేసినట్లు సమాచారం. కాగా ట్రాన్స్‌కో లైన్ల క్లియరెన్స్‌లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక నేడు ముహుర్తం ఖరారు చేశారు.
1965–78 ప్రాంతంలో నిర్మాణం..
పాల్వంచ అంటే కేటీపీఎస్, దానిలో టవర్లు ఆనవాళ్లుగా చెప్పవచ్చు. 115 మీటర్ల ఎత్తులో ఉన్న ఇవి కొన్ని మైళ్లదూరం వరకు కనిపిస్తాయి. 1965–78 సంవత్సరంలో జపాన్ టెక్నాలజీతో కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని నిర్మించారు. ఏ,బీ,సీ, స్టేషన్లలోని 60 మెగావాట్ల సామర్థ కలిగిన 1,2,3,4 యూనిట్లు, 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5,6,7,8 యూనిట్లు చేపట్టి... 720 మెగావాట్లతో రాష్ట్రానికి వెలుగులు పంచారు. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో కూలింగ్ టవర్ చొప్పున మొత్తం 8 నిర్మించారు. విద్యుదుత్పత్తి చేసే క్రమంలో నీరు, బొగ్గు మండించిన క్రమంలో వేడిని తగ్గించేందుకు కూలింగ్ టవర్లు ఉపయోగపడతాయి. నాణ్యతా ప్రమాణాలతో నిర్మిచడంతో ఇప్పటికీ చెక్కుచెదరక పోవడం విశేషం. కాగా పలువురు టవర్ల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో బైబై ఓల్డ్ ప్లాంట్.. కూలింగ్ టవర్లు అంటు పోస్ట్‌లు చేశారు. ఆది నుంచి వివాదాస్పదంగానే ఈ పనులు సాగుతుండగా, చిట్టచివరి అంకం కూడా పూర్తి కావొచ్చింది. కాగా టవర్ల కూల్చివేతపై సీఈ పి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో లేరు.
పటిష్ట భద్రత నడుమ..
కూలింగ్ టవర్ల కూల్చివేతపై కర్మాగారం చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ వినయ్‌కుమార్, ఎస్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎ. అప్పాజీ, ఇన్‌స్పెక్టర్ కిరణ్, జెన్‌కో విజిలెన్స్ డీఎస్పీ రమేష్, ఎస్‌ఈ కిరణ్‌కుమార్‌లు టవర్ల కూల్చివేత ప్రాంతాలను పరిశీలించారు. సోమవారం ఉదయం కరకవాగు, అల్లూరిసెంటర్, పాండురంగాపురం రోడ్‌లలో ఎవరూ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కర్మాగారంలోకి ఇతరులెవరూ రాకుండా అనుమతులు నిలిపివేశారు. కనీసం 200 మీటర్ల దూరం వరకు ఎవరూ వెళ్లొద్దని నిబంధనలు విధించారు. ఉదయం షిఫ్ట్ విధులకు వెళ్లే సిబ్బందిని కూడా నిలిపివేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment