
ఇప్పటికే రెండింటి కూల్చివేత
నేడో రేపో చివరి ఆర్చీ నేలమట్టం
రీడెవలప్‌మెంట్‌లో భాగంగా..
కొత్త స్టేషన్ నిర్మాణ పనులు వేగిరం
సికింద్రాబాద్ అనగానే గుర్తుకు వచ్చేది ఒకటి రైల్వేస్టేషన్.. మరొకటి క్లాక్‌టవర్. ఈ రెండూ నగరానికి ‘ఐ’ కాన్‌లుగా నిలుస్తున్నాయి. ఇందులో ఒకటైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిజాం ఆర్కిటెక్చర్ నిర్మాణాల్లో పేరెన్నికగన్న కట్టడం. కొద్ది రోజుల్లో ఈ కట్టడం మొత్తం కనుమరుగు కానుంది. సైనిక స్థావరాల నుంచి రూపాంతరం చెంది దేశ విదేశాల ప్రయాణికులు గుర్తెరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనం ఇక చరిత్ర పుటల్లో ఓ జ్ఞాపకం కానుంది.
ఎందరో ప్రయాణికులకు చక్కని ల్యాండ్ మార్క్‌గా చిరపరిచితమైన నీలిరంగు మేడ కాలగర్భంలో కలిసిపోనుంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొత్త భవనాల నిర్మాణాలకు ప్రధాని గతంలోనే శంకుస్థాపన చేసిన నేపథ్యంలో పనులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన రైల్వేస్టేషన్ నిర్మిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ మూడు ఆర్చ్ల్లో ఇప్పటికే రెండింటిని నేలమట్టం చేశారు. మరొకటి ఒకటి రెండు రోజుల్లో కనుమరుగు కానుంది.
నిజాం ప్రభుత్వ హయాంలో 1874లో సికింద్రాబాద్‌లో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో మూడు ప్లాట్‌ఫాంలతో కూడిన రైల్వేస్టేషన్‌కు సాధారణ భవనం ఉండేది. ఇండియన్ రైల్వేస్టేషన్‌లో భాగంగా మారిన రైల్వేస్టేషన్‌కు 1952లో మరో భవనాన్ని నిర్మించారు. మూడు ఆర్చీలతో కూడిన నిజాం ఆర్కిటెక్చర్ శైలిలో ఇక్కడ రైల్వేస్టేషన్ భవనాన్ని నిర్మించారు. క్రమేణా 10 ప్లాట్‌ఫాంలకు చేరింది. నిత్యం వందకుపైగా రైళ్లు, 1.60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలకు ఈ రైల్వేస్టేషన్ కేంద్రంగా మారింది.
మూడు ఆర్చ్ లు..
⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి మూడు ఆర్చ్ లు. ఈ మూడింటి ప్రవేశ ద్వారాల శిఖరాన మూడు భాషల్లో (తెలుగు, హిందీ, ఆంగ్లం) ఒక్కో దానిపై నిలిపిన సికింద్రాబాద్ అనే అక్షరాలు కిలో మీటర్ దూరం వరకు ప్రయాణికులకు కనిపించేవి. సెల్‌ఫోన్ల రాకకు ముందు కొత్తగా రైలు ప్రయాణాల ద్వారా నగరానికి చేరుకునే ప్రయాణికులకు రైల్వేస్టేషన్ ఆరీ్చలే కేరాఫ్ అడ్రస్‌లుగా ఉండేవి.
⇒ ఏ భాషలోని ఆర్చీ కింద నిల్చోవాలో ఇక్కడికి కొత్తగా వచ్చే ప్రయాణికులకు వారి బంధువులు చెబుతుండే వారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల అక్షరాలు కలిగిన ఆర్చీలు నేలమట్టమయ్యాయి. తెలుగు అక్షరాలు కలిగిన ఆర్చీని రెండు రోజుల్లో కనుమరుగు కానుంది.
వేగంగా నిర్మాణం పనులు..
⇒ ఏడాది కాలంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.720 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునికీకరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒకవైపు కూల్చివేత పనులు చేపడుతున్న అధికారులు, మరోవైపు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పనులు కొనసాగిస్తున్నారు.
⇒ రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు, మల్టీ లెవల్ పార్కింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ స్టాళ్లు, ఎస్కలేటర్ల తరహాలో వాకింగ్ ట్రాక్‌లు, లిఫ్ట్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక సందర్శకులకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపింపజేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment