సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు హైడ్రా చేపట్టిన చర్యలు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. రాంనగర్ చౌరస్తాలోని మనమ్మ బస్తీలో నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచే కూల్చివేతలు మొదలయ్యాయి.
ఆక్రమణకు గురైన చెరువులు, కాలువలు, పార్కుల గురించి హైడ్రాకు ప్రతిరోజూ కనీసం 60 నుంచి 70 ఫిర్యాదులు అందుతున్నాయి. రాంనగర్ లోని మల్లెమ్మ గల్లీలోని 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొనగా, ఈ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు స్థానికుల ఫిర్యాదులు అందాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఎవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆక్రమణలపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఈ రోజు కూల్చివేతలు మొదలయ్యాయి. నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన 24 గంటలకే చర్యలు ప్రారంభించింది. కూల్చివేతలను భవన యజమానులు అడ్డుకుంటున్నారు. స్థానిక పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీస్ బలగాలు భారీగా మొహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment