మణికొండలో హైడ్రా కూల్చివేతలు | Hydra Demolition Targets Illegal Construction in Neknampur | Sakshi
Sakshi News home page

మణికొండలో హైడ్రా కూల్చివేతలు

Published Fri, Jan 10 2025 8:55 AM | Last Updated on Fri, Jan 10 2025 12:19 PM

Hydra Demolition Targets Illegal Construction in Neknampur

సాక్షి,హైదరాబాద్‌: మణికొండలో హైడ్రా(​hydera) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. నెక్నాంపూర్‌లో కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌ అదేశాల‌ మేరకు నెక్నాంపూర్ (Neknampur Lake)చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగనున్నాయి. 

హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్‌ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది. 

హైడ్రా పోలీసు స్టేషన్‌..
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్‌లో బీ–బ్లాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉండనున్నారు. ఓఆర్‌ఆర్‌ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్‌ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్‌ కసరత్తు చేస్తున్నారు. 

 

దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. 
జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ (hydra commissioner ranganath) ప్రత్యేక పోలీసు స్టేషన్‌ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పీడీపీపీ కింద కేసులు! 
జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement