రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల పవర్ ప్లాంట్
సింగరేణి, జెన్‌కోల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించేందుకు ప్రభుత్వ నిర్ణయం
డీపీఆర్ కోసం ప్లాంట్‌ను సందర్శించిన డిజిగ్ సంస్థ
76 శాతం కావాలంటున్న జెన్‌కో, 50 శాతం ఇవ్వాలంటున్న సింగరేణి
భాగస్వామ్యంపై లెక్కలు తేలితేనే శంకుస్థాపనకు అవకాశాలు
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని జీవితకాలం ముగిసిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల రామగుండంలో పర్యటించి ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు.
సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు నిర్ణయించారు. అయితే, జెన్‌కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో గణాంకాలు తేలకపోవడంతో ప్లాంట్ పనుల్లో జాప్యమవుతోందని ఉద్యోగులు అంటున్నారు.
డీపీఆర్ కోసం..
పెద్దమొత్తంలో పెట్టుబడి భరించే అవకాశం లేదని సింగరేణి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్‌కో) సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సింగరేణితో కలిసి వారంలోగా రూపొందించాలని జెన్‌కోకు రాష్ట్ర ఇంధనశాఖ గత సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీచేసింది.
సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను నెలలోగా తయారు చేయాలని జెన్‌కోకు సూచించింది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం డిజిగ్ అనే సంస్థ డీపీఆర్ తయారు చేసేందుకు ప్లాంట్‌ను సందర్శించింది. పాత విద్యుత్ కేంద్రాన్ని తొలగించేందుకు వివిధ విభాగాలకు చెందిన ఇంజనీర్లను జెన్‌కో ప్రత్యేకంగా నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.
1971 నుంచి బీ–థర్మల్‌లో విద్యుత్ ఉత్పత్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో రామగుండంలో 1965 జూలై 19న అప్పటి సీఎం కాసు బ్రçహ్మానందరెడ్డి 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 1971లో ఇది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.80 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం 1996 వరకే ఈ ప్లాంట్‌ను నడిపించాల్సి ఉంది.
కానీ, దాని జీవితకాలం పొడిగిస్తూ వచ్చారు. మరోవైపు కొన్నేళ్లుగా ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్స్ లీక్‌కావడం, మిల్స్, టర్బైన్ విభాగాల్లో తరచూ సమస్యలు తలెత్తడంతో గుదిబండగా మారింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.
తరచూ షట్‌డౌన్ కావడం, ఆ తర్వాత పునరుద్ధరించేందుకు ప్రతీసారి బాయిలర్ మండించేందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో నిర్వహణ భారమైంది. అంతేకాదు.. దాని జీవితకాలం ముగియటంతో ప్లాంట్‌ను మూసి వేశారు.
భాగస్వామ్యంపై పీటముడి
పాత ప్లాంట్ పరిధిలో 560 ఎకరాల స్థలం, అనుభవం కలిగిన ఇంజనీర్లు, శ్రామిక శక్తి ఉన్న జెన్‌కోను కాదని, సింగరేణి భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని జెన్‌కో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గతనెలలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. అయినా, ప్రభుత్వం సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు.. జెన్‌కో 76 శాతం, సింగరేణి 24 శాతం వాటాతో ప్లాంట్ నిర్మించేందుకు జెన్‌కో ఇంజనీర్లు సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.
అయితే, సింగరేణి సంస్థ తమకు 50 శాతం వాటా ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో పట్టుబట్టినట్టు సమాచారం. భాగస్వామ్యం లెక్కలు తేలి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరితేనే కొత్త ప్లాంట్ శంకుస్థాపనకు అవకాశం ఉంటుంది. అప్పుడే జెన్‌కో పాలకమండలి పాత ప్లాంట్‌ను మూసివేసినట్టుగా ఆమోదం తెలిపే అవకాశాలుంటాయని జెన్‌కో ఉద్యోగులు చెబుతున్నారు.
జెన్‌కో, సింగరేణి సీఎండీల మధ్య సయోధ్య కుదుర్చేంచేందుకు ఉపముఖ్యమంత్రి సాయంతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రయత్నాలు చేశారు. మధ్యేమార్గంగా నిర్ణయానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు సిద్ధమయ్యేలా చూడాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment