‘రామగుండం బీ–థర్మల్’పై రాజకీయ రగడ
గత నెల 4వ తేదీ నుంచి నిలిచిపోయిన విద్యుదుత్పత్తి
కాలం చెల్లిన 53 ఏళ్ల విద్యుత్ కేంద్రానికి మరమ్మతులు చేసినా వృథా అనే భావన
అక్కడి నుంచి ఇతర కేంద్రాలకు ఇంజనీర్లు, ఉద్యోగుల బదిలీకి జెన్‌కో ఆదేశం
ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో అమలు నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వు
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్‌కో వచ్చింది.
అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్‌స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్‌కో నిర్ణయం తీసుకుంది.
తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్‌లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది.
ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్‌కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్‌కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...
రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది.
62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది.
దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్‌కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది.
‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్‌కో అభ్యంతరం
రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్‌కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్‌కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు.
వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్‌కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్‌కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్‌కో ఉద్యోగులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment